ధర్మకర్తృత్వం-దాతల బండారం-4
ఎం కోటేశ్వరరావు
వ్యాపారులు ఎక్కువగా దాన ధర్మాలు చేయాలా ? దాన ధర్మాల పేరుతో ఎక్కువ వ్యాపారం చేయాలా అన్న ప్రశ్న ఎదురైనపుడు గతంలో ఏం జరిగిందో చూస్తే ఫేస్‌బుక్ సిఇఓ మార్క్ జుకెర్‌బర్గ్ ధర్మ వ్యాపారం ఎలా చేయబోతున్నాడో ముందు ముందుగానీ తెలియదు. లాన్‌సెట్ అనే వైద్య పత్రిక 2009లో జరిపిన అధ్యయనంలో గేట్స్ ఫౌండేషన్ 1998-2007 మధ్య ఇచ్చిన గ్రాంట్లలో కేవలం 1.4శాతమే ప్రభుత్వ రంగ సంస్ధలలకు వెళ్లగా మిగతా మొత్తం 659 ప్రభుత్వేతర సంస్ధలు పొందాయి, వాటిలో 37శాతమే మధ్య లేదా అల్పాదాయ దేశాలలో ప్రధాన కార్యాలయాలను కలిగి వున్నాయి. బడా కార్పొరేట్లు ధర్మ ఫౌండేషన్లను ఏర్పాటు చేసిన కాలాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్దలు వ్యవస్తాగత సర్దుబాట్ల పేరుతో మెజారిటీ ప్రపంచ దేశాలకు ప్రయివేటీకరణ, విద్య, వైద్యం వంటి సేవారంగాల బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలని షరతులు విధించి అమలు జరిపిస్తున్న కాలంలో ధనికుల ఫౌండేషన్లు వునికిలోకి వచ్చాయి. ప్రజలు, ప్రభుత్వాల మధ్య ఏర్పడిన ఖాళీలో ప్రభుత్వ ఏతర(ఎన్‌జివో)లను ప్రవేశపెట్టారు. అంతే కాదు ప్రభుత్వాలు తమ జాతీయ ప్రాధాన్యతలను నిర్ణయించుకోవటంలోనూ, ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ఎన్‌జిఓలతో సమన్వయ పరుచుకోవటంలోనూ పొంతన కుదరక ఎద్దు-దున్న దున్నకం మాదిరి తయారైంది. ఎండ పెరిగే కొద్ది ఎద్దు నీడలోకి లాగ నీడ తగ్గేకొద్దీ దున్న ఎండలోకి లాగ అన్నట్లుగా తయారై వ్యవసాయం మూలనబడినట్లుగా అంతిమంగా జనం నష్టపోయారు. జాతీయ ప్రాధాన్యతలు వెనుక్కుపోయాయి. ఎయిడ్స్ హెచ్‌ఐవి సమాచారం మరియు నివారణ సంస్ధ ఐ బేస్ ప్రతినిధి పోలీ క్లేడన్ దీన్ని గురించి మాట్లాడుతూ మీకు హెచ్‌ఐవి వుండి వేరే వారు ప్రయోగదశలోవున్న ఔషధాలకు నిధులు చెల్లిస్తుంటే మీ సంరక్షణ సరిగా జరగకపోవచ్చు, వారికి ఈ ఏడాది ఈ ఆలోచన వచ్చి వచ్చే ఏడాది మరొకదానిమీదకు మళ్లితే మీ సంగతేమిటి అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు అలా చీటికి మాటికి ఏడాదికొక ప్రాధాన్యతలను మార్చుకోవు. దాతృత్వ సంస్ధల జోక్యం వలన ప్రజారోగ్య కార్యక్రమాలు అడ్డదిడ్డంగా తయారవుతాయి. కొన్ని సందర్భాలలో ఆయాదేశాల పౌరులకు అంతగా ప్రాధాన్యం కాని వాటికి ధనికులు నిధులు అందచేస్తారని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకురాలు దేవీ శ్రీధర్ హెచ్చరించారు.
ప్రయివేటు ఫౌండేషన్లు, ఎన్‌జీవోల భాగస్వామ్యం పెరగటంతో మరోవైపున ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రపంచ ఆరోగ్యానికి అందచేసే నిధులు 1990-2008 మధ్య 32 నుంచి 14శాతానికి తగ్గాయి. దీనివలన జరిగేదేమిటి? మూడు లోంచి ఒకటి తీసి వేసి మిగిలిన దానికి ఒకటి కలిపితే ఏమౌతుందో ప్రపంచ ఆరోగ్యానికి అదే జరిగింది. అవి కూడా పైన చెప్పుకున్నట్లు ఒక పద్దతి ప్రకారం కాకుండా అస్తవ్యస్తం అయ్యాయి. గేట్స్‌ఫౌండేషన్ ప్రపంచ ఆరోగ్య సభ సిఫార్సు చేసిన వాటికి గాక ముందుగా తాను అనుకున్న పధకాలకే ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధులు అందచేస్తున్నది. ప్రపంచ బ్యాంకు సంస్కరణలలో భాగంగా ప్రభుత్వాలు వైద్య సేవరంగం నుంచి వైదొలగాలన్నది ఒక షరతు. దానిని అమలు జరపటానికి తెల్లవారే సరికి ఆసుపత్రులను మూసివేస్తే రాజకీయంగా అధికారంలో వున్న పార్టీలు, ప్రభుత్వాలకు ఇబ్బందులు వస్తాయి. అందువలన పొమ్మనకుండా పొగ పెట్టినట్లు మొదటి దశలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు తగిన వైద్యులు, సిబ్బంది, పరికరాలు లేకుండా వాటిని పడకేయించారు. మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లటం కంటే నేరుగా నరకానికి పోవటం మంచిది అనుకొనే విధంగా ఆసుపత్రులను తయారు చేశారా లేదా ? పర్యవసానం ఏమైంది? కార్పొరేట్ ఆసుపత్రులు మహానగరాల నుంచి మామూలు పట్టణాలకు చేరాయి. రైతులు, వ్యవసాయ కార్మికులు రుణగ్రస్తులెందుకు అవుతున్నారంటే ఆసుపత్రులకు వెళ్లేందుకు చేస్తున్న అప్పులు కూడా తోడు అవుతున్నాయన్నది అనేక పరిశోధనల్లో తేలింది. కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి బీమా లేకుండా అప్పులు పాలు కాకుండా బయటకు వచ్చిన సామాన్యులెవరైనా వుంటే గుండెమీద చేయి వేసుకొని చెప్పమనండి. ఇప్పుడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో మొదలు పెట్టి క్రమంగా ఆసుపత్రులను ప్రయివేటు వైద్యులకు , ఎన్‌జిఓలకు అప్పగించేందుకు ముందుకు పోతున్నారు.
ఒక ధనవంతుడికి జనమంతా తన మాదిరి చేపలు తింటే మంచిది కదా అన్న ఆలోచన వచ్చిందట. రాగానే ఒక లారీలో చేపలు తీసుకు వెళ్లి దగ్గరుండి మరీ పంపిణీ చేయించాడట. అందరూ ఎగబడి తీసుకుంటుంటే అక్కడున్న జనంలోని ఒక యువకుడు అలాగే నిలబడి పోవటం ఆ ధనికుడికి ఆశ్చర్యం కలిగించింది. ఏం నీకు చేపలు అవసరం లేదా తీసుకోవటం లేదు. అనగానే నీవంటి దాతలు నాకు దయా ధర్మంగా ఇచ్చే చేపలను తినటానికి నాకు సిగ్గుగా వుంది. నాకు జాలితో మీరిచ్చే చేపలు కాదు ప్రభుత్వం ఇచ్చే వల కావాలి అన్నాడట. పిచ్చివాడా వెంటనే తినేందుకు అవసరమైన చేపలు ఇస్తుంటే వల అడుగుతావేమిటి అని ధనవంతుడు అడిగాడు. మీకు ఈ రోజు బుద్ది పుట్టింది గనుక చేపలు ఇచ్చారు. రేపు మనస్సు మారినా మీ దగ్గర లేకపోయినా మా పరిస్ధితి ఏమిటి అని ప్రశ్నించిన యువకుడు తానే సమాధానం చెబుతూ మీరు వుండొచ్చు లేకపోవచ్చు, శాశ్వతంగా వుండే ప్రభుత్వం వలలను సమకూర్చితే జీవితాంతం మేము చేపలు పట్టుకొని నాలుగు డబ్బులు సంపాదించుకుంటాము, మేము తింటాము అందుకే వల అడిగాను అన్నాడట.
అంతిమంగా ఆరోగ్య సమస్యలను జవాబుదారీగలిగిన ప్రభుత్వాలే పరిష్కరించాలి తప్ప స్వచ్చంద సంస్ధలు పరిష్కరించలేవు. ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేసిన ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని గాలికి వదలి వేసి కార్పొరేట్ ఆసుపత్రులకు ఏటా వందల కోట్ల రూపాయలను ఎలా కట్టబెడుతున్నాయో చూస్తున్నాము. ఆరోగ్యశ్రీ వలన పేదలకు వుపయోగం జరుగుతోందా లేదా అంటే జరుగుతోంది. అందుకయ్యే ఖర్చులో సగం సొమ్ముతో ప్రభుత్వ ఆసుపత్రులలో అదే రకం వైద్యం చేయవచ్చు. మిగిలిన మొత్తాన్ని మరొక ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయాలి తప్ప కార్పొరేట్ల పరంచేయటం ఏమిటి. ఈ కార్పొరేట్ ఆసుపత్రులన్నింటా అంతర్జాతీయ జలగల పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. ధనికులు మరింతగా ముందుకు వచ్చి దానధర్మాలు చేయాలని, వారికి అలాంటి మంచి మనస్సు కలిగేలా చూడాలని కొందరు ప్రార్ధనలు జరుపుతున్నారు. దీని అర్ధం ఏమిటి? కార్పొరేట్లు మరింతగా పెరగాలని, వారు చేసే ధర్మాలు కూడా పెరగాలనే కదా? దీన్నే మరోవిధంగా చెప్పాలంటే ఇప్పుడున్న దోపిడీ ఇలాగే కొనసాగాలి, కావాలంటే పేదలకు ఎంతో కొంత సొమ్ముదానంగా ఇస్తాం అని చెప్పటమే. ప్రపంచ ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఇది అసలు పరిష్కారమే కాదు అంటున్నారు ఎందరో. అన్నింటికీ మించి అటువంటి బిలియనీర్లను పెంచే వ్యవస్ధను కొనసాగనివ్వటం ఎందుకు ? విరాళాలు ఇమ్మని అడగటం ఎందుకు ? ఇది సమస్యను పక్కదారి పట్టించటమే కదా !
