Tags

, , ,

డాక్టర్ కొల్లా రాజమోహన్

ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ యం. యస్. స్వామినాథన్ గారి మరణం భారత దేశ రైతాంగానికి తీవ్రమైన విషాదం కలిగించింది. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి విత్తనాలను అభివృద్ధిచేసి వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర వహించిన డాక్టర్ స్వామినాధన్, భారత దేశం గర్వించ దగ్గ వ్యవసాయ శాస్త్రవేత్త. ఇంటర్నేషనల్ బోర్డ్ ఫర్ జెనిటిక్ రీసెర్చ్, ఇక్రిసాట్ రూపకల్పన, యం. యస్. స్వామినాధన్ రీసెర్చ్ ఫౌండేషన్ లను స్థాపించారు. ఫిలిప్పీన్స్ లో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్ధ ను రాక్ ఫెల్లర్, ఫోర్డ్ ఫౌండేషన్ల సహాయంతోస్ధాపించి, అధిక దిగుబడి వరి వంగడాలను కనుగొన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 1987 లోనే ప్రప్రధమంగా అందుకున్నారు. ఆ ప్రైజ్ మనీ 2 లక్షల డాలర్లను భావితరాల పరిశోధనకు యం.యస్.స్వామినాధన్ రీసర్చి ఫౌండేషన్ కి ఇచ్చారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, రామన్ మెగసెసే అవార్డ్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ప్రపంచ సైన్స్ అవార్డ్, ఇందిరాగాంధీ శాంతి బహుమతి, ఇందిరా గాంధీ సమైక్యతా పురస్కారాలను అందుకున్నారు.

వరి, గోధుమ పంటలపై ఆయన చేసిన పరిశోధనల మూలంగా భారత దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. హరిత విప్లవంగా పిలిచే గ్రీన్ రివల్యూషన్ సృష్టికర్త స్వామినాధన్. అమెరికా షరతులను ఒప్పుకుని, పీ యల్ 480 నిధులద్వారా గోధుమలను దిగుమతి చేసుకున్న భారతదేశాన్ని, ఆహారాన్ని ఎగుమతి చేసే దేశంగా తీర్చిదిద్దారు.జాతీయ రైతు కమిషన్ అధ్యక్షులుగా, భారత వ్యవసాయాన్ని పరిశోధించి 5 సంపుటాలను భారత జాతికి అంకితమిచ్చారు. రైతు అభివృధికి కొన్ని ఫార్ములాలు రూపొందించి సిఫార్సులను చేశారు. అందులో మొట్టమొదటిది భూసంస్కరణలు.  తర్వాత ప్రాధాన్యత నీరు.  రైతు శ్రమ, రైతు పెట్టుబడి, భూమికౌలు, సమగ్ర వ్యవసాయ ఖర్చులు అన్నీ కలిపి దానికి 50 శాతం చేర్చి, కనీస మద్దతు ధర వుండాలని C2+50 ఫార్ములా రూపొందించారు. దీనిని అన్ని రాజకీయపార్టీలు, రైతుసంఘాలు ఆహ్వానించాయి. దీనికై ఢిల్లీ సరిహద్దలలో సంవత్సరం పైగా చారిత్రాత్మకంగా ఆందోళనలు చేశారు . కానీ ఇప్పటికీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించనందున రైతాంగ పోరాటం కొనసాగుతోంది.

వ్యవసాయం లో ఉత్పత్తిని పెంచుకుంటూ, వాతావరణాన్నికాపాడుకుంటూ, వ్యవసాయ విప్లవం నిరంతరం సాగాలన్నారు. దానికి “ ఎవర్ గ్రీన్ రివల్యూషన్ ” అని పేరుపెట్టారు. వ్యవసాయ టెక్నాలజీని రైతులకు అందించి ఆకలిని దూరంచేయటమే కాకుండా రైతుల స్ధితిగతులను అభివృద్ధిచేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రైతుల ఆదాయాలు పెరగాలన్నారు. చిన్న ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం కన్నా రైతుల ఆదాయం తక్కువగావున్న విషయాన్ని నిరసించారు. బ్రిటిష్ ప్రభుత్వ వలస విధాన ఒత్తిడి వలన ఆహార పంటలకు బదులుగా నీలి మందు, తేయాకు, పొగాకు లాంటి వ్యాపారపంటలను రైతులు బలవంతంగా సాగు చేశారు. వలసపాలన వలన పండించిన పంటలకు సరైన ధర లేదు. పెరుగుతున్న భారత దేశ జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగలేదు. స్వాతంత్ర్యం వచ్చే సమయానికి మన దేశంలో ఏటా 60 లక్షల టన్నుల గోధుమలు మాత్రమే పండేవి. 1960 లో గోధుమల ఉత్పత్తి కోటి టన్నులు మాత్రమే. 1965, 66 రెండు సంవత్సరాలు వరసగా వర్షాభావం వలన సంభవించిన కరువు కారణంగా కోటి టన్నుల గోధుమలను అమెరికా షరతులకు లోబడి దిగుమతి చేసుకోవలసి వచ్చింది. “షిప్ టు మౌత్” అంటే ఓడ లో ఆహారధాన్యాలు వస్తేనే మన నోట్లోకి ముద్ద దిగని పరిస్ధితి. 1960 కి ముందు హెక్టారుకు 2 టన్నులున్న వరి దిగుబడి స్వామినాధన్ గారి నూతన విత్తనాల వలన రెట్టింపయింది. 21 వ శతాబ్దం నాటికి 300 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి ఎగుమతి చేయగలుగుతున్నాము.

మన దేశం క్లిష్ట సమయంలో వుండటానికి ప్రధాన కారణం వ్యవసాయ సంక్షోభం అని నమ్మిన మేధావులలో స్వామినాధన్ గారు ముఖ్యులు. వ్యవసాయంలో ఆయన శాస్త్రజ్ఞుడిగా అపారమైన కృషి చేసి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించి దేశానికి ఆహార భధ్రత కల్పించారు.

జాతీయ రైతు కమిషన్ (National commission on Farmers) 

భారత ప్రభుత్వం నవంబరు 18, 2004 న నియమించిన జాతీయ రైతు కమిషన్ (NCF) ప్రొఫెసర్ MS స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటైంది. కమిటీ లో రైతు నాయకులు అతుల్ కుమార్ అంజన్ తో సహా 8 మంది సభ్యులున్నారు. NCF వరుసగా డిసెంబర్ 2004, ఆగస్టు 2005, డిసెంబర్ 2005 మరియు ఏప్రిల్ 2006లో నాలుగు నివేదికలను సమర్పించింది. సిఫారుసులతో కూడిన 5 వ రిపోర్టును అక్టోబర్ 4 2006 న సమర్పించింది.

జాతీయ రైతు కమిషన్ (NCF) అధ్యయనానికి ప్రభుత్వం చేసిన సూచనలు.

1. ప్రధాన వ్యవసాయ పంటల ఉత్పాదకత, లాభదాయకత పెంపొందించడం; 2. ఆహార భద్రత, పోషకాహార భద్రత  వ్యూహం; 3.  రైతుల ఋణాలను పెంచడానికి విధాన సంస్కరణలు; 4.  ట్ట ప్రాంతాలు, నిస్సార భూములు, పోడు భూములు, కొండ, తీర ప్రాంతాల్లోని రైతులకు  వ్యవసాయం కోసం ప్రత్యేక కార్యక్రమాలు; 5. వ్యవసాయ వస్తువుల నాణ్యత పెంచి, ధరలలో పోటీతత్వాన్ని పెంపొందించి , తద్వారా వాటిని ప్రపంచవ్యాప్త పోటీగా మార్చడం; 6.  అంతర్జాతీయ ధరలు బాగా పడిపోయినప్పుడు దిగుమతుల నుండి రైతులను రక్షించడం; 7. స్థిరమైన వ్యవసాయం కోసం, పర్యావరణ పరిరక్షణకు, ఎన్నికైన స్థానిక సంస్థలకు అధికారం ఇవ్వడం;

జాతీయ రైతు కమిషన్ (NCF) అభిప్రాయాలు మరియు కీలక సిఫార్సులు.

రైతుల కష్టాలు – ఆత్మహత్యలకు కారణాలు

జాతీయ రైతు వ్యవసాయ కమీషన్ ( NCF ) కు స్వామినాధన్ గారే ఛైర్మన్. రైతుల కష్టాలకు, ఆత్మహత్యల పెరుగుదలకు కారణాలపై దృష్టి సారించి పరిష్కారాలను సూచించారు. వాటిలో మొదటిది భూ సంస్కరణల అసంపూర్తి కార్యక్రమం. తరువాత నీటిపారుదల అసౌకర్యాలు, అందుబాటు లో లేని వ్యవసాయ సాంకేతికత, సరైన సమయంలో అందని  సంస్థాగత ఋణాలు,  ప్రతికూల వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలు.  భీమా, సాంకేతిక పరిజ్ఞానం. మార్కెట్‌లతో సహా ప్రాథమిక వనరులపై రైతులకు భరోసా, నియంత్రణ ఉండాలన్నారు. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో “వ్యవసాయం” చేర్చాలని NCF సిఫార్సు చేసింది.

భూమి గురించి 1) దేశంలోని మొత్తం భూయాజమాన్యంలో దిగువన వున్న 50 శాతం గ్రామీణ కుటుంబాల వాటా కేవలం 3 శాతం మాత్రమే అని,  ఎగువన వున్న 10 శాతం మంది చేతిలో54 శాతం భూమి వున్నదన్న గణాంకాలను రిపోర్టులో ఎత్తి చూపించారు. వ్యవసాయ సంక్షోభ పరిష్కారానికి భూసంస్కరణలే కీలకమన్నారు. మిగులు భూముల, బంజరు భూముల పంపిణీనే పరిష్కార మన్నారు. 2) ప్రధాన వ్యవసాయ భూములను, అటవీ భూములను కార్పొరేట్ రంగానికి మళ్ళించటాన్ని నిరోధించాలన్నారు. 3) అడవి లో వున్న గిరిజనుల అటవీ హక్కులను రక్షించాలన్నారు. 4) భూమిని , వాతావరణాన్ని రక్షించటానికి జాతీయ భూమి వినియోగ కమిషన్ ను ఏర్పరచమన్నారు.  భూమి, నీరు, జీవన వనరులు, రైతుల ఆదాయం మరియు భీమా, సాంకేతిక విజ్ఞాన నిర్వహణ, మార్కెట్ తో సహా ప్రాధమిక వనరులపై జాతీయ భూమి వినియోగ కమిషన్ కు నియంత్రణ వుండాలన్నారు. 5) వ్యవసాయ భూమి పరిమాణం, వినియోగం, కొనుగోలుదారుల వర్గాన్ని బట్టి భూమి విక్రయం నియంత్రించాలన్నారు.

డా.స్వామినాదన్  చేసిన ప్రధాన సిఫారసు అయిన భూసంస్కరణల సంగతి ఎత్తిన వారే లేకపోవటం, వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్ధలకు కట్టపెట్టటాన్ని ఎదుర్కోలేక పోవటం దేశ దౌర్భాగ్యానికి పట్టిన దుర్గతికి తార్కాణం. భూమి గురించి వ్యవసాయ కమీషన్ చేసిన సిఫారసులను రైతు సంఘాలు, జాతీయ పార్టీలు విస్మరించాయి. వ్యవసాయ రంగం అభివృధి చెందటానికి కీలకం భూసంస్కరణలు అని స్వామినాధన్ కమీషన్ రిపోర్టు మొదటి రికమండేషన్ గా పేర్కొంది. తెలిసి చేసినా తెలియక చేసినా, భూసంస్కరణల ఎజెండాను పక్కన పెట్టడం తీవ్రమైన పొరపాటు. పాలక వర్గ పార్టీల అవినీతి వ్యవహారాలన్నీ భూమి చుట్టూ తిరుగుతున్న విషయాన్ని గ్రహించాలి. భూసంస్కరణలకు భూమి ఎక్కడుందంటూనే వేల ఎకరాలను కార్పోరేట్లకు అప్పగిస్తున్నారు.

భూమి వ్యాపార వస్తువై ధనవంతుల స్పెక్యులేషన్ లో ఆటవస్తువైపోతున్నది. వ్యవసాయం చేసేవారి చేతిలో భూమి లేదు. అమెరికాలోనో, హైదరాబాద్ లోనో వున్న వారికే  గ్రామాలలో భూములు ఎక్కువగా వుంటున్నాయి.  భూమి కోసం పోరాటాలు చేయలేమని, పోరాటాలు చేసినా పాలక వర్గాలు అంగీకరించవని, ప్రజలు రావటం లేదని, ప్రస్తుత ఉద్యమ కారుల వాదన. సోవియట్ పతనం తరువాత కమ్యూనిస్టు పార్టీ చీలికలయినా  ఉద్యమకారులలో ఆశయాలపట్ల ఆరాధన తగ్గలేదు. కానీ ఆచరణ గణనీయంగా తగ్గింది.

ఎరువులు-పురుగు మందులు-కలుపు మందులు

భూ సారాన్ని గమనించకుండా, భూమిని తీవ్రంగా సాగు చేయటంవలన భూమి ఎడారిగా మారుతుందన్నారు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు విచక్షణారహితంగా వాడటంవలన ఆహార పదార్ధాలలో వాటి అవశేషాలు కేన్సర్ జబ్బులకు కారణమౌతాయన్నారు. భూగర్భ జలాలను అశాస్త్రీయంగా ట్యాపింగ్ చేయటం వలన అద్భుతమైన భూజల వనరు అంతమౌతుందన్నారు.ఇరిగేషన్, డ్రైనేజ్ కు పెట్టుబడిని గణనీయంగా పెంచాలని కమిషన్ చెప్పింది. సాయిల్ టెస్టింగ్, భూమి లో  సూక్ష్మపోషకాల పరీక్షకు ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలన్నారు.

ఋణం , భీమా . ప్రాధమిక అవసరాలకు సరైన సమయంలో సరిపోను ఋణాలను 4శాతం సాధారణ వడ్డీకి ప్రభుత్వం అందించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలలో, రైతులు నష్టాలలో వున్నపుడు తాత్కాలికంగా రైతుల పరిస్ధితి మెరుగయ్యేంతవరకూ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్ధల అప్పు వసూళ్ళను నిలిపివేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల నష్టాన్ని తట్టుకోవటానికి ఒక నిధిని ప్రభుత్వం ఏర్పరచాలన్నారు. రైతుల ఆరోగ్యానికి, అప్పులకు, పంటకు, పశువులకు, ఒకటే భీమా ప్యాకేజీ ని ఏర్పాటు చేయాలన్నారు. స్వయం సహకార సంఘాలను ఏర్పాటు చేసి మానవ వనరులను అభివృధి చేసి ఆర్ధిక సేవలు, మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ అందరికి అందించాలన్నారు.

ఆహార భద్రత. 2400 కేలరీల కన్నా తక్కువ ఆహారం తీసుకునే పేదలు గ్రామీణ ప్రాంతాలలో 77 శాతం మంది వున్నారన్నారు. పేదరికం, సరైన ఆహారం లేకపోవటం గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ ప్రాంతాలలో  కేంద్రీకృతమై వుందన్నారు. సార్వత్రిక పంపిణీవ్యవస్ధను అమలు చేసి, జాతీయ ఆహార పధకాలను అమలుపరచుటకు జీడీపీ లో 1 శాతం నిధులు సరిపోతాయన్నారు. పనికి ఆహార పధకం వలన పేదలకు ఉపాధి, ఆహారం లభిస్తాయన్నారు.

ఎక్కువ రిస్క్ తో కూడిన బీ టీ కాటన్ లాంటి పంటలకు దూరంగా వుంటూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చే పంటలను సాగుచేయాలన్నారు.దిగుమతి సుంకాలను విధించి ఇతర దేశాల దిగుమతుల పోటీ నుండి రైతులను రక్షించాలన్నారు. రైతులకు వినియోగదారులకు మధ్య అనుసంధాన్ని పెంచి దళారులులేని మార్కెట్ ను ఏర్పాటుచేయాలన్నారు.

కనీస మద్దతు ధర

వ్యవసాయ ఖర్చులకు 50 శాతం కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయించాలన్నారు. C2+50 ఫార్ములా ను రూపొందించారు. C2 అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కు (సమగ్ర వ్యవసాయ ఖర్చులకు) 50 శాతం కలపాలన్నారు.వరి, గోధుమ లతోపాటు జొన్న, పప్పుధాన్యాలు లాంటి పంటలన్నిటికీ కనీస మద్దతు ధర నిర్ణయించి ఆ ధరకు కొనేటట్లు గా చట్టం చేయాలన్నారు.రైతుల నికర ఆదాయం ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయంతో పోల్చదగినదిగా వుండాలన్నారు.రైతు పండించిన పంటకు మద్దతు ధర C2+50 అమలుపరచటమే కీలక సమస్యగా రైతు సంఘాలు  ముందుకు తెచ్చాయి. కనీస మద్దతు ధర పై చట్టం చేయటమే ముఖ్య డిమాండ్ గా రైతుల ఐక్యత ను సాధించి, ప్రశంసనీయమైన చారిత్రాత్మక మహోద్యమాన్ని నడిపారు. భారత రాజకీయ ఎజెండాలో కనీసమద్దతు ధర పై చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కానీ అమలు కానందున ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

డాక్టర్ స్వామినాధన్ చేసిన రికమండేషన్లు అన్నిటినీ అమలు చేసినపుడే వారి కృషికి సార్ధకత చేకూరుతుంది. రైతుకు భద్రత- దేశానికి ఆహార భద్రత లభిస్తుంది. భూసంస్కరణలు, నీటి వనరులు, కనీసమద్దతు ధరకు చట్టబధతతో సహా అన్ని సిఫారసులను అమలు చేయటమే వారికి సరైన నివాళి. రైతు కమీషన్ సిఫారసులన్నిటినీ అమలు చేయాలని రైతులు పోరాడాలి.

డాక్టర్ కొల్లా రాజమోహన్, నల్లమడ రైతు సంఘం, ఫోన్ నెం. 9000657799.