Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


వర్తమాన సమాజం సాంకేతిక పరిజ్ఞాన మీద ఎంతగా ఆధారపడి ఉందో, దానికి చిన్నపాటి అంతరాయం కలిగినా ఎన్ని ఇబ్బందులు, ఎంత నష్టం జరుగుతుందో 2024 జూలై 19న తలెత్తిన ఒక చిన్న సాంకేతిక సమస్య లేదా జరిగిన తప్పిదం ప్రపంచానికి వెల్లడించింది. ఆకస్మికంగా ఐదువేలకుపైగా విమానాల రద్దు ప్రకటన, ఎందుకో, ఎప్పుడు పునరుద్దరణ అవుతాయో చెప్పే నాధుడు లేడు. ప్రయాణీకుల్లో గందరగోళం. ఆసుపత్రులలో ఆపరేషన్లు నిలిపివేశారు.బ్యాంకు ఖాతాలు పనిచేయలేదు. రైలు టికెట్లు జారీ కాలేదు.వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. ఇదంతా క్రౌడ్‌ స్ట్రయిక్‌ అనే సైబర్‌ భద్రతా సంస్థ వైరస్‌లను కనుగొనేందుకు అందచేసిన ఒక లోపభూయిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను మైక్రోసాఫ్ట్‌ సర్వర్లు, కంప్యూటర్లకు అందచేసిన ఫలితమే. నిత్య జీవితంలో ఎంత ఎక్కువగా ఇంటర్నెట్‌ను, కంప్యూటర్లను వినియోగిస్తారో, ప్రత్యేకించి మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ పరికరాలను వినియోగిస్తారో అక్కడల్లా ప్రపంచమంతటా కొన్ని గంటల పాటు ఇవే దృశ్యాలు.( ఆపిల్‌ మాక్‌ కంప్యూటర్లకు ఎలాంటి అంతరాయం కలగలేదు.) నీలి రంగు తెరతో దర్మనమిచ్చిన కంప్యూటర్లు పదే పదే వాటంతట అవే మూతబడ్డాయి, అదే మాదిరి తెరుచుకున్నాయి, తప్పపనిచేయలేదు. దీన్నే నీలిరంగు తెర మృత్యువు అన్నారు గానీ నిజానికి అది చావు బతుకుల మధ్యకొట్టుకోవటం. ఆపరేటర్లకు ఎందుకలా జరిగిందో అర్ధం కాదు, ఏం చేయాలో అసలే తెలియలేదు.ఎలాగైతేనేం పరిస్థితి చక్కబడింది. ఇప్పుడు తీరికగా జరిగిన నష్టం ఎంత అనే లెక్కల్లో మునిగారు. కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం ఉంటే ఇదే జరుగుతుందనే హెచ్చరికలు వెలువడ్డాయి. కొందరు ఇదే మంచి తరుణం మించిపోవును మీ కంప్యూటర్‌ వ్యవస్థలకు బీమా చేయించండి అంటూ సలహాలిస్తుంటే ఇదొక ఆముదమా అంటూ యజమానులు పెదవి విరుస్తున్నారు. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లను కనిపెట్టినవారే వాటిని దెబ్బతీసే వైరస్‌లను సృష్టిస్తారు, వాటిని నిరోధించే లేదా సంహరించే భద్రత అంటూ మరొక సాఫ్ట్‌వేర్లను అంటగట్టటం తెలిసిందే. తమ కంప్యూటర్లలో తాము సూచించిన సాఫ్ట్‌వేర్లనే వాడాలనే నిబంధనల గురించి తెలిసిందే.మూడింట రెండు వంతుల క్లౌడ్‌ సదుపాయాల వ్యవస్థలను మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, గూగుల్‌ సంస్థలే సమకూర్చుతున్నాయి. ఏదీ ఊరికే రాదు, ప్రతిదీ లాభం కోసమే కదా ! గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా వచ్చిన ప్రతిపాదనలను గతంలో మైక్రోసాఫ్ట్‌ వమ్ముచేసిందనే విమర్శలు ఉన్నాయి.


ఎనభైమూడు బిలియన్‌ డాలర్ల విలువగల క్రౌడ్‌ స్ట్రయిక్‌ అనే సైబర్‌ భద్రతా ఉత్పత్తుల సంస్థకు ప్రపంచవ్యాపితంగా ఇరవై వేల మంది ఖాతాదారులున్నారు,మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ వాటిలో ఉన్నాయి. విండోస్‌కు అందచేసిన తమ ఉత్పత్తి ఫాల్కన్‌ సెన్సర్‌ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపం కారణంగా మైక్రోసాఫ్ట్‌ వినియోగదారులందరూ ఇబ్బంది పడినట్లు అది ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ అప్రదిష్ట కారణంగా ఈ కంపెనీ వాటాల ధరలు పదకొడుశాతం పడిపోయాయి. సైబర్‌ దాడి జరిగితే వేరు, తాజా ఉదంతం బాధ్యతా రహితంగా వ్యవహరించిన తీరుతో జరిగింది. ముందస్తు పరీక్షలు జరపకుండా, సరి చూసుకోకుండా నేరుగా ప్రయోగించిన లోప భూయిష్టమైన సాఫ్ట్‌వేర్‌ దెబ్బకు ఒక్క దేశం, చైనా తప్ప ప్రపంచం మొత్తం విలవిల్లాడింది. ప్రపంచ వ్యాపితంగా అంతరాయం కలిగినప్పటికీ ఒక్క చైనా దాన్నుంచి తప్పించుకున్నట్లు హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది.రాజధాని బీజింగ్‌, ఆర్థిక కేంద్రం షాంఘై వంటి చోట్ల ఉన్న విమానాశ్రయాలు సాధారణంగా నడుస్తున్నట్లు తెలిపింది. తరువాత ఇతర దేశాల మీడియా కూడా అవే కథనాలను ఇచ్చాయి. చైనా పౌరులు మైక్రోసాఫ్ట్‌ గురించి సామాజిక మాధ్యమం వెయిబోలో జోకులే జోకులు పేల్చారు.తమకు ఒక పూట సెలవు ఇచ్చినట్లు కొందరు చెప్పగా మా కంపెనీ వెంటనే మరోకంప్యూటర్‌కు మారినందున మాకు అది కూడా దక్కలేదని కొందరు చమత్కరించారు.


ఇప్పటికీ నల్లమందు భాయీలంటూ నిందించేవారు, చౌకరకం వస్తువులను తయారు చేయటం తప్ప ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వారి దగ్గర లేదంటూ చైనాను వర్ణించేవారికి ఒక్కసారిగా బుర్రలు పనిచేయటం నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్‌ దెబ్బకు జరిగిన నష్టం విలువ ఎంతో ఇంకా తేలలేదు, దాన్నుంచి బయటపడేందుకు ఎంత సమయం తీసుకుంటుందో తెలియదని చెబుతున్నారు. ఇక చైనాను చూసి పనిచేయటం ఆగిపోయిన వారి బుర్రలు ఎప్పటికీ సాధారణ స్థితికి వస్తాయో తెలియదు.అఫ్‌ కోర్స్‌ , చైనా వ్యతిరేక వైరస్‌ సోకిన వారికి చికిత్సలేదనుకోండి. అయితే చైనాలో అసలేమీ ప్రభావితం కాలేదా ? అక్కడ మైక్రోసాఫ్ట్‌ సేవలు లేవా ? ఉన్నాయి, కొన్ని ప్రభావితమయ్యాయి. మైక్రోసాఫ్ట్‌తో పనిచేసే అక్కడి విదేశీ సంస్థలు తప్ప చైనా స్వంత విమానాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాలు మామూలుగానే పనిచేశాయి. బహుశా ప్రపంచంలో సాంకేతిక అంతరాయం ఇంత పెద్ద ఎత్తున ఏర్పడటం ఇదే ప్రధమం. తిరుగులేని సంస్థగా పేరున్న మైక్రోసాఫ్ట్‌కూ ఇది కోలుకోలేని దెబ్బ. దాని మీద ఆధారపడిన విమానాశ్రయాలు, సంస్థలు, బాంకులు, మీడియా సంస్థల కార్యకలాపాలకూ అంతరాయం కలిగింది. రక్షణ సాఫ్ట్‌వేర్‌ దెబ్బకు దాన్ని తయారు చేసిన కంపెనీతో పాటు మైక్రోసాఫ్ట్‌ కూడా పేరుతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోయాయి.వాటి ఖాతాదారులకు జరిగిన నష్టం గురించి అంచనాలు వేస్తున్నారు. ఇవి 24వందల కోట్ల నుంచి లక్షల కోట్ల డాలర్ల వరకు ఉంటుందని, కొన్ని వారాల వరకు అంతరాయ పర్యవసానాలు ఉంటాయని చెబుతున్నారు. అమెరికాలో ప్రొవైడెన్స్‌ హెల్త్‌ అనే సంస్థకు ఏడు రాష్ట్రాలలో 52 ఆసుపత్రులున్నాయి.నలభైవేల సర్వర్లకు గాను పదిహేను వేలు, లక్షా 50వేల కంప్యూటర్లు పనిచేయలేదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.ప్రపంచ వ్యాపితంగా ఉన్న కంప్యూటర్లలో ఒకశాతానికి అటూ ఇటుగా అంటే 85లక్షల విండోస్‌ కంప్యూటర్లు ప్రభావితమయ్యాయి.2017లో వాన్నాక్రై సైబర్‌దాడిలో 150దేశాల్లో మూడులక్షల కంప్యూటర్లు దెబ్బతిన్నాయి.ఇలాంటి పెద్ద దాడులేగాక చిన్న చిన్నవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కానీ శుక్రవారం నాటి అంతరాయం చారిత్రాత్మకమైనదిగా నమోదైంది. ఈ ఉదంతం తరువాత జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి.నకిలీ ఇమెయిల్స్‌,ఫోన్లలో పిలుపులు, నకిలీ వెబ్‌సైట్లు వస్తాయని, వాటిని తెరవ కూడదని చెప్పారు.


ఇంతకూ చైనా ఎందుకు ప్రభావితం కాలేదు.కమ్యూనిస్టు చైనా ఉద్బవించినప్పటి నుంచి దాన్ని నాశనం చేసేందుకు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అందువలన ప్రతి దశలో అక్కడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలను తీసుకొంటూ ఆ కుట్రలను వమ్ము చేస్తున్నది. సంస్కరణల్లో భాగంగా విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించినప్పటికీ సమాంతరంగా తన స్వంత పరి శోధనలను కొనసాగిస్తున్నది. దీని గురించి తెలిసినా తెలియనట్లు, అబ్బే అదంతా ఉత్తిదే అనే ప్రచారం జరుగుతోంది. దాన్ని పట్టించుకోని చైనీయులు తమపని తాము చేసుకుపోతున్నారు. పూర్తిగా విదేశీ కంపెనీలు, దేశాలకు తమ జుట్టు అందించకుండా షరతులతో జాగ్రత్త పడ్డారు. అదే దాని బహిరంగ రహస్యం.చైనాలో మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సర్వీసులు అందించే కంపెనీలు సదరు సంస్థ ప్రపంచ మౌలిక వ్యవస్థతో నిమిత్తం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నది ప్రభుత్వ షరతు. దీన్నినా గట్టిగా అమలు చేస్తున్న కారణంగా చైనాలో మైక్ట్రోసాఫ్ట్‌ సేవలు, వాటికి రక్షణ ఇతర దేశాలకు భిన్నంగా ఉంటుంది.స్వంత హార్డ్‌వేర్‌, 360 వంటి భద్రతా సాప్ట్‌వేర్‌లతో అవి పని చేస్తాయి.మిగతా ప్రపంచం మాదిరి చైనా సంస్థలు మైక్రోసాఫ్ట్‌కు బదులు తమ స్వంత అలీబాబా, టెన్సెంట్‌,హువెరు వంటి సంస్థల సేవలనే వినియోగించుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్‌తో పనిచేసే అంతర్జాతీయ గ్రూపు హౌటళ్లను నిర్వహిస్తున్న షెరటన్‌, మారియట్‌, హయత్‌ వంటి సంస్థల నుంచి వివరాలు తెలుసుకొనేందుకు చూస్తే వీలు కాలేదని చైనా నెటిజన్లు చెప్పారు.ఇటీవలి కాలంలో చైనాలో విదేశీ ఐటి వ్యవస్థలను వదిలించుకొని దేశీయ నెట్‌వర్క్‌లను వినియోగించుకోవటం పెరుగుతోంది.సమాంతర వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా ఉత్పత్తుల మీద ఆధారపడటం లేదు. క్రౌడ్‌ స్ట్రయిక్‌ ఉత్పత్తులను అక్కడ వాడటం లేదు గనుక తప్పించుకుంది. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఇతర దేశాలన్నీ అమెరికా కంపెనీల మీద ఆధారపడిన కారణంగా దెబ్బతిన్నాయి. ఒక వేళ వాటి ఉత్పత్తుల కారణంగా నష్టం జరిగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నది తాజా ఉదంతం నేర్పిన పాఠం. ఇటీవలఅమెరికాతో సహా కొన్ని దేశాలు సైబర్‌దాడులకు సిద్దం అవుతున్నాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలతన్నేవాడు వస్తాడని వేరే చెప్పనవసరం లేదు.