Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌(ఎన్‌పిపి) కూటమి నేత అనుర కుమార దిశనాయకే సోమవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం నాడు అదే కూటమికి చెందిన మేథావుల సంస్థ నాయకురాలు హరిణి అమర సూర్య ప్రధానిగా నియమితులయ్యారు. పార్లమెంటును రద్దు చేశారు. నవంబరు 24న ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల దామాషా ప్రాతిపదికన సభ్యులను ఎన్నుకుంటారు.1948లో బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన లంకలో ఒక కమ్యూనిస్టు పాలనాబాధ్యతలు చేపట్టటం చరిత్రలో మరో అధ్యాయ ప్రారంభం. ఐదు సంవత్సరాల క్రితం కేవలం 3.16శాతం ఓట్లు తెచ్చుకున్న వామపక్ష నేత 42.3శాతం ఓట్లతో ప్రధమ స్థానంలో నిలవటం, రెండవ ప్రాధాన్యతా ఓట్లలెక్కింపులో 55.89శాతం ఓట్లతో విజయం సాధించటం చిన్న విషయమేమీ కాదు. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల పతనం తరువాత ప్రపంచంలో కమ్యూనిస్టులకు ఎదురుగాలి వీచిందన్నది వాస్తవం. కమ్యూనిస్టులపై ప్రచ్చన్న యుద్ధంలో విజేతలం తామే అని ప్రకటించుకున్న వారి కలలు కల్లలే అని తరువాత జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వాటిలో తాజాగా శ్రీలంక చరిత్రకెక్కింది. అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు పేర్లు మార్చుకున్నాయి, కొన్ని చోట్ల దుకాణాలను మూసివేసి వేరే పార్టీల్లో చేరిపోయారు. వీటన్నింటిని చూసి అనేక మంది ఇంకేముంది కమ్యూనిస్టులు, వామపక్ష శక్తులపని అయిపోయింది, తిరిగి కోలుకునే అవకాశం లేదంటూ నిస్తేజంగా ఉన్న వారిని శ్రీలంకలో అరుణోదయం మేల్కొలిపింది.

తాజా ఎన్నికలలో ఎన్‌పిపి అభ్యర్థి తొలిరౌండ్‌లో 42.3శాతం ఓట్లతో ప్రధమ స్థానంలో దిశనాయకే, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ ఎస్‌ఎల్‌పి అభ్యర్థి సాజిత్‌ ప్రేమదాస 32.76శాతం,ప్రస్తుత అధ్యక్షుడు రానిల్‌ విక్రమ సింఘే 17.27శాతం ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. మిగిలిన ఓట్లను 35 మంది ఇతర అభ్యర్థులు తెచ్చుకున్నారు. అక్కడి విధానం ప్రకారం ప్రతి ఓటరూ ముగ్గురికి ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయవచ్చు.సగానికిపైగా ఓట్లు తెచ్చుకున్నవారినే విజేతగా ప్రకటిస్తారు. అలా రాని పక్షంలో మొదటి ఇద్దరిని మినహాయించి మిగిలిన వారిని పోటీ నుంచి తొలగిస్తారు. వారికి వచ్చిన ఓట్లలో రెండవ ప్రాధాన్యతా ఓట్లు ఎవరికి వేశారో వారికి కలిపి 50శాతంపైగా తెచ్చుకున్నవారిని విజేతగా నిర్ధారిస్తారు. ఆ ప్రకారం వామపక్ష నేతకు 55.89 శాతం రావటంతో ఎన్నికైనట్లు ప్రకటించారు. శ్రీలంక నూతన రాజ్యాంగం ప్రకారం 1982 తరువాత జరిగిన ఎన్నికలన్నింటిలో గెలిచిన వారందరూ మొదటి రౌండులోనే గెలిచారు. తొలిసారిగా ఈ దఫా రెండవ ప్రాధాన్యత ఓటును పరిగణనలోకి తీసుకొని విజేతను నిర్ణయించారు.

ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటున్నపుడు ప్రతిదీ మార్పుకు గురవుతుందన్నది నమ్మకం కాదు, ఒక శాస్త్రీయ భౌతిక వాస్తవం. ఎక్కడైతే కమ్యూనిజం విఫలమైందని విజయగీతాలాపన చేశారో అదే అమెరికాలో, ఇతర అలాంటి దేశాల్లో ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందని వినిపిస్తోంది. అందుకే ప్రత్యామ్నాయంగా సోషలిజం గురించి ఆసక్తి వ్యక్తమౌతున్నది. కమ్యూనిస్టు అంటేనే ఒకనాడు ఎయిడ్స్‌ రోగి మాదిరిగా చూసిన అమెరికాలో ఇప్పుడు కోట్లాది మంది యువత మేం సోషలిస్టులం అని సగర్వంగా చెప్పుకొనే పరిస్థితి ఉంది. అనేక భావజాలాలు కలిగిన వారందరికీ అవకాశం ఇచ్చిన జనం తగిన సమయం వచ్చినపుడు వామపక్ష శక్తులకు మాత్రం ఎందుకు ఇవ్వరు అంటూ అనేక మంది తగిలిన ఎదురుదెబ్బలను తట్టుకొని అరుణపతాకను అలాగే సమున్నతంగా ఎగరేస్తూ అచంచల విశ్వాసంతో అనేక మంది ఉన్నారు. అలాంటి వామపక్ష శక్తులు లంకలో జన సమ్మతిని పొందాయి.అనేక రకాలుగా విష ప్రచారం చేస్తున్నప్పటికీ లాటిన్‌ అమెరికా దేశాల్లో అనేక చోట్ల వామపక్ష శక్తుల మీద జనం విశ్వాసం ఉంచారు. దక్షిణాఫ్రికా అధికార కూటమిలో కమ్యూనిస్టులు ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. నేపాల్లో తిరుగులేని శక్తిగా వామపక్షాల ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన శ్రీలంక చేరింది. దాని గురించి ఇరుగుపొరుగుదేశాలన్నింటా ముఖ్యంగా మనదేశంలో దీని గురించి చర్చ జరగటం అనివార్యం.

తప్పుడు విధానాలు అనుసరించి శ్రీలంకను దివాలా తీయించిన పాలకులను రెండు సంవత్సరాల క్రితం లంకేయులు తరిమికొట్టారు. ఆ పరిణామాల గురించి ఎంతో చర్చ జరిగింది. అలాంటి చోట కమ్యూనిస్టులను ఎలా ఎన్నుకున్నారబ్బా అని అదేమాదిరి జనం ఇప్పుడు ఆలోచిస్తారు. అలాంటి మధనం మనదేశంతో సహా ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రతిదేశ పాలకుల్లో వణుకు పుట్టించటం అనివార్యం. మార్క్సిజంలెనినిజం ఒక శాస్త్రీయ సిద్దాంతం. దాన్ని అన్ని చోట్లా రూళ్ల కర్రలా ఒకే మాదిరి వర్తింపచేయాలని చూసిన కొన్ని పార్టీలకు ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రతిదేశ విప్లవం తనదైన పద్దతిలో ఉంటుంది తప్ప ఏదో ఒకనమూనాలో జరగదు. చైనా మార్గంలోనో రష్యా మాదిరో వస్తుందని భావించిన వారు దుందుడుకు, మితవాద చర్యలకు పాల్పడటంతో అనేక చోట్ల ఉద్యమం దెబ్బతిన్నది. అలాంటి దేశాలలో శ్రీలంక ఒకటి. యూనిఫాం అంటే ఏకరూపం ఉండాలి తప్ప అందరికీ ఒకే కొలతలని కాదు. అలాగే మార్క్సిస్టు శాస్త్రీయ సిద్దాంతాన్ని కమ్యూనిస్టు పార్టీలు తమ దేశాలు, పరిస్థితులకు అన్వయించుకోవాల్సి ఉంది. ఆ అవగాహనపై వచ్చిన తేడాలే పలు కమ్యూనిస్టు, వామపక్ష పార్టీల ఏర్పాటుకు దారితీశాయి. అలాంటిదే శ్రీలంకలో జనతా విముక్తి పెరుమన(సంఘటన). దానితో పాటు మరో 27 వామపక్ష పార్టీలు, సంస్థలు, ప్రజాసంఘాలు కలసి నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పిపి) పేరుతో ఒక కూటమిగా పోటీ చేశాయి.


ఏడున్నరదశాబ్దాలుగా వివిధ పార్టీలను చూసిన జనం వాటి మీద విశ్వాసం కోల్పోయి వామపక్ష అభ్యర్థికి ఓట్లు వేశారు. గతంలో తుపాకి చేతపట్టి విప్లవాన్ని తీసుకువచ్చేందుకు రెండుసార్లు జనతా విముక్తి పెరుమున విఫలయత్నం చేసింది. ఇప్పుడు బాలట్‌ద్వారా అధికారాన్ని పొందింది. తాజా విజయం దాని చరిత్రలో ఒక ప్రధాన మలుపు.శ్రీలంకలో కమ్యూనిస్టు ఉద్యమ తీరుతెన్నులను క్లుప్తంగా చూద్దాం. బ్రిటీష్‌ పాలనా కాలంలో 1935లో తొలి వామపక్ష లంక సమ సమాజ పార్టీ(ఎల్‌ఎస్‌ఎస్‌పి) ఏర్పడిరది.1943లో దీని నుంచి విడివడిన వారు శ్రీలంక కమ్యూనిస్టు పార్టీ(సిపిఎస్‌ఎల్‌)గా ఏర్పడ్డారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన సైద్దాంతిక సమస్యల కారణంగా 1960దశకంలో సోవియట్‌,చైనా మార్గాలను అనుసరించే పార్టీలుగా విడిపోయాయి. సోవియట్‌ను అనుసరించే పార్టీ, ఎల్‌ఎస్‌ఎస్‌పి రెండూ 1964లో సిరిమావో బండారు నాయకే మంత్రివర్గంలో చేరాయి. తరువాత వాటి బలం క్రమంగా క్షీణించింది.చైనా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పుకున్న పార్టీలో తరువాత సైద్దాంతిక విబేధాలు తలెత్తటంతో కొంత మంది కొత్త పార్టీ ఏర్పాటుకు పూనుకున్నారు. ఆక్రమంలో ఉద్బవించిందే జనతా విముక్తి పెరుమన(జెవిపి). అది పార్టీ రూపం సంతరించుకోక ముందే (మన దేశంలో నక్సల్స్‌ మాదిరి) విద్యార్థులు, కార్మికులు, ఇతర తరగతుల్లో పనిచేయటం ప్రారంభించింది. 1970 మే నెలలో లంక ఫ్రీడమ్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది, దానిలో కమ్యూనిస్టు పార్టీ భాగస్వామిగా ఉంది. అదే నెల 12న తరువాత కాలంలో జెవిపి నేతగా ఎన్నికైన రోహన్‌ విజెవీర అరెస్టయ్యాడు. వీరి కార్యకలాపాలను నాటి ప్రభుత్వం చేగువేరా ఉద్యమంగా వర్ణించి అణచివేసేందుకు పూనుకుంది. జూలై 9న విజెవీర విడుదలయ్యాడు. ఆగస్టు పదిన కొలంబోలో నిర్వహించిన తొలి ప్రదర్శన సభలో జెవిపి ఏర్పాటును ప్రకటించారు.


1971 మార్చి ఆరున నాడు అధికారంలో ఉన్న పార్టీల కొందరు మద్దతుదారులు వియత్నాంలో అమెరికా జరుపుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా రాయబార కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు. ఆ సందర్భంగా ప్రదర్శకులలో ఒకడు రాయబార కార్యాలయ ప్రాంగణంలోకి ఒక పెట్రోలు బాంబు విసిరాడు. వెంటనే దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఈ ఉదంతం వెనుక జెవిపి ఉందంటూ ఆ పార్టీ నేత విజెవీరను పదమూడవ తేదీన అరెస్టు చేశారు. తరువాత మరో ఐదువందల మందిని అరెస్టు చేసి వివిధ జైళ్లలో నిర్బంధించారు. ఏప్రిల్‌ ఒకటవ తేదీన జెవిపి నాయకత్వం సమావేశమై ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ ఐదున దాదాపు వంద పోలీస్‌ స్టేషన్ల మీద దాడులు చేసింది. అయితే ఒక నెలలోనే ప్రభుత్వం తిరుగుబాటును అణచివేసింది. దాదాపు పదివేల మంది జెవిపి సభ్యులు, మద్దతుదార్లను చంపివేసినట్లు తేలింది. మరో ఇరవైవేల మందిని అరెస్టు చేసింది. అణచివేత చర్యలకు 14దేశాలు మద్దతు తెలిపాయని, భారత్‌ తన వైమానికదళ పైలట్లు, మిగ్‌ విమానాలను పంపినట్లు జెవిపి ప్రకటించింది. నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత 1976లో చట్టబద్ద రాజకీయ పార్టీగా బహిరంగ కార్యకలాపాలను ప్రారంభించింది.1978లో తొలి జాతీయ మహాసభ నిర్వహించింది.తరువాత ఎన్నికల్లో పాల్గొన్నది.1987లో శ్రీలంక`భారత్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని జెవిపి వ్యతిరేకించింది.లంక సార్వభౌమత్వాన్ని రక్షించాలంటూ మరోసారి పెద్ద ఎత్తున సాయుధ పోరాటానికి దిగింది.ఈ పోరులో దాదాపు 60వేల మంది మరణించారు. జెవిపి కేంద్ర నాయకత్వంలో ఒకరు తప్ప మిగతావారందరినీ అరెస్టు లేదా చంపివేయటమో జరిగింది. తప్పించుకున్న పొలిట్‌బ్యూరో సభ్యుడు అమరసింఘ విదేశాల్లో తలదాచుకొని రహస్యంగా పార్టీ నిర్మాణానికి కృషి చేశాడు. మరోసారి చట్టబద్ద పార్టీగా ముందుకు వచ్చి 1994 ఎన్నికల్లో పోటీచేసింది. మరుసటి ఏడాది మహాసభ జరిపి కొత్త కేంద్ర కమిటీని ఎన్నుకుంది.2004లో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా చేరింది.కొంతకాలం తరువాత బయటకు వచ్చింది. 1968లో జన్మించిన అనుర కుమార దిశనాయకే విద్యార్ధి దశలోనే జెవిపి కార్యకలాపాల్లో పాల్గొన్నారు. 1987 తిరుగుబాటు సమయంలో విశ్వవిద్యాలయ విద్యార్ధిగా ఉన్నారు. తరువాత 1995లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2000 సంవత్సరం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. 2004లో చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఉగ్రవాద సంస్థ ఎల్‌టిటిఇని వ్యతిరేకించిన కారణంగా కొంత మంది జెవిపిని తమిళ వ్యతిరేక పార్టీగా, సింహళజాతీయవాద పార్టీగా ఆరోపిస్తారు.


అధ్యక్షపదవిలో కొలువు దీరిన వామపక్ష కూటమి పార్లమెంటులో కూడా ఆధిక్యతను సంపాదించాల్సి ఉంది.లాటిన్‌ అమెరికాలో అధికారానికి వచ్చిన వామపక్షాలు అధ్యక్ష, ప్రధాని పదవులు పొందుతున్నప్పటికీ పార్లమెంట్లలో మెజారిటీ తెచ్చుకోలేని కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అంతకు ముందున్న వ్యవస్థపునాదుల మీదనే అవి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అయితే వాటికి ఉన్న పరిమితుల కారణంగా కొన్ని చోట్ల ఎన్నికల్లో ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. వాటి నుంచి లంక వామపక్ష ఎన్‌పిపి తగిన పాఠాలు తీసుకోవాలి.2022లో అధికారానికి వచ్చిన ప్రభుత్వం ఐఎంఎఫ్‌, ఇతర అంతర్జాతీయ సంస్థల షరతులన్నింటికీ తలవూపి రుణాలు తీసుకుంది. దాని వలన పౌర సంక్షేమానికి నిధుల కోత ఒకటైతే భారాలు మరొకటి. ఐఎంఎఫ్‌ ఒప్పందాల నుంచి తక్షణమే వైదొలిగితే మరోసారి లంక చెల్లింపులతో పాటు ఇతర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. దాని షరతుల నుంచి ఉపశమనం కలిగించకపోతే జనంలో అసంతృత్తి తలెత్తటం అనివార్యం. ఈ పరిస్థితిని వామపక్ష ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.మనదేశంలో బిజెపి రెండు సీట్ల నుంచి మూడువందలకు పైగా సీట్లతో అధికారం పొందామని గర్వంగా, ఘనతగా చెప్పుకుంటుంది. దానికి ఆ పార్టీకి మూడు దశాబ్దాలు పట్టింది, జెవిపి ఐదేండ్లలోనే అలాంటి అధికారాన్ని పొందింది. రాజకీయాల్లో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయి.సింహళ హృదయ సామ్రాట్టులుగా పేరు తెచ్చుకున్న రాజపక్సే సోదరులు 2019 ఎన్నికల్లో 52.25శాతం ఓట్లు తెచ్చుకున్నారు. వారిని 2022లో జనం ఇండ్ల నుంచి తరిమికొట్టారు. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 2.57శాతమే. అందువలన జనానికి దూరమైతే ఎవరికైనా ఇదే గతి అని లంక జనాలు చెప్పారు. మన దేశంలోని పార్టీలు దీన్ని గుణపాఠంగా తీసుకుంటాయా ?