ఎం కోటేశ్వరరావు
అమెరికా అధ్యక్ష, పార్లమెంటు ఉభయ సభల మధ్యంతర ఎన్నికలు నవంబరు ఐదున జరిగాయి.అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టరల్ కాలేజీలో డోనాల్డ్ ట్రంప్ 312, కమలా హారిస్ 226 స్థానాలు తెచ్చుకున్నారు. ప్రజాప్రతినిధుల సభ సభ్యుల సంఖ్య 435కాగా మెజారిటీ 218, రిపబ్లికన్లు 217, డెమోక్రాట్లు 209స్థానాల్లో ముందంజ లేదా గెలిచారు. ఎన్నికలకు ముందు రిపబ్లికన్లు 222,డెమోక్రాట్లు 213 స్థానాలు కలిగి ఉన్నారు. ఎగువ సభ సెనేట్‌లో మెజారిటీకి 51స్థానాలు అవసరం కాగా రిపబ్లికన్లకు 53, డెమోక్రాట్లకు 45, ఇతరులు రెండు సీట్లు గెలుచుకున్నారు. గతంలో డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చిన ఇద్దరు స్వతంత్ర సెనెటర్లు ఈ సారి ఎన్నికల్లో పాల్గొనలేదు. ఆ స్థానాలను రిపబ్లికన్లు గెలుచుకున్నారు. ఇక రాష్ట్రాల వారీగా డెమోక్రాట్లు 23, రిపబ్లికన్లు 27 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ముందుకు వచ్చిన కొన్ని అంశాలను చూద్దాం.ఎన్నికల పండితులు చెప్పిన జోశ్యాలు నిజం కాలేదు.కృత్రిమ మేథను ఉపయోగించి కొందరు రూపొందించిన అంచనాలు కూడా తప్పాయి.ఈ పండితులంతా గతంతో పోల్చితే మా అంచనాలు దగ్గరగా ఉన్నాయనే కొత్త వాదనను ముందుకు తీసుకువచ్చారు.
సర్వేల అంచనాలకు భిన్నంగా ట్రంప్ గెలవటం గురించి మధనం జరుగుతున్నది. అతగాడు గెలిచినప్పటికీ ఓటింగ్ సరళిని చూసినపుడు కార్మికుల హక్కులు, అబార్షన్లకు వ్యతిరేకంగా, ఇతర పురోగామి విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా పరిగణించాల్సిన అవసరం లేదన్నది ఒక అభిప్రాయం.గత ఎన్నికల్లో జోబైడెన్‌కు 8.128కోట్ల ఓట్లు (51.3శాతం) రాగా ట్రంప్‌కు 7.422 కోట్లు(46.8శాతం) వచ్చాయి.ఈసారి 95శాతం లెక్కింపు పూర్తయ్యే సమయానికి ట్రంప్‌కు 7.54కోట్లు(50.2శాతం), కమలకు 7.23కోట్ల ఓట్లు(48.2శాతం) వచ్చాయి. గతంలో వచ్చిన వాటిలో కోటి ఓట్లను డెమోక్రటిక్ పార్టీ కోల్పోయింది. కార్మికులకు ప్రాధాన్యత, జాతి, లింగవివక్షకు వ్యతిరేకమైన విధానాలకు ఓటర్లు స్పష్టమైన ధోరణి, మద్దతు కనపరిచారని వివిధ రాష్ట్రాల ఓటింగ్ తీరుతెన్నులను విశ్లేషించిన ఎకనమిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ విశ్లేషణ పేర్కొన్నది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు విధానాలను రూపొందించే క్రమంలో ఈ ధోరణి ముఖ్యపాత్ర వహిస్తుందని చెప్పింది. ఐదు రాష్ట్రాలు వేతన సంబంధిత సమస్యల మీద ఓట్లు వేశాయి. 2009 నుంచి జాతీయ స్థాయిలో కనీసవేతనాలు పెంచకపోయినా 30 రాష్ట్రాలు, 63 స్థానిక సంస్థలు తమ ప్రాంతాల్లో కనీసవేతనాలను పెంచాయి. తాజా ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలలో కనీసవేతనం గంటకు 15డాలర్లు ఉండాలన్న వైఖరికి మద్దతు తెలిపారు. మహిళల్లో ఉన్న వాంఛలను ప్రతిబింబిస్తూ ఏడు రాష్ట్రాలు తమ రాజ్యాంగాల్లో అబార్షన్ హక్కును పొందుపరిచాయి. ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగాలని, తలిదండ్రులకు ఓచర్ల రూపంలో డబ్బులిచ్చి బాధ్యతను వదిలించుకోవాలని చూస్తున్న ధోరణులను మూడు రాష్ట్రాలలో తిరస్కరించారు. కార్మిక సంఘాల ఏర్పాటులో కంపెనీల జోక్యం ఉండకూడదని కోరేవారు విజయాలు సాధించటం కార్మికుల వైఖరిని వెల్లడిరచింది.
కొన్ని వైరుధ్యాలు కూడా ఈ ఎన్నికల్లో వెల్లడయ్యాయి.అబార్షన్ హక్కు లేదని సుప్రీం కోర్టు చెప్పినదానిని ట్రంప్ తలకెత్తుకున్నప్పటికీ మహిళలు ఓటు వేయటం, గంటకు కనీస వేతనంగా ఉన్న 7.5డాలర్లను స్వల్పంగా అయినా పెంచుతారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ట్రంప్ నిరాకరించినా కార్మికులు కొంత మంది మద్దతు ఇవ్వటం వంటి అంశాలు ఉన్నాయి. గతంలో పురోగామి విధానాలకు ఓటు వేసిన చోట కూడా ఈ సారి డెమోక్రాట్లను కాదని ట్రంప్‌కు వేశారని తేలింది. ఎలక్టరల్ కాలేజీ వ్యవస్థ కారణంగా స్వింగ్ స్టేట్స్‌ను తమవైపు తిప్పుకొనేందుకే డెమోక్రాట్లు కేంద్రీకరించటం, రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న రాష్ట్రాలను పెద్దగా పట్టించుకోలేదని తేలింది. అదే సమయంలో ట్రంప్ తనకు వ్యతిరేకంగా డెమోక్రాట్లు బలంగా ఉన్న రాష్ట్రాలను 2022లో, తాజాగా కూడా వదల్లేదు, దాంతో ప్రజాప్రతినిధుల సభలో కొన్ని స్థానాలను అక్కడ గెలిచినట్లు ఫలితాలు వెల్లడిరచాయి.ఈ రాష్ట్రాలలో గెలిచిన స్థానాలతో దిగువ సభలో మెజారిటీ సాధిస్తే అది డెమోక్రాట్ల లోపంగానే చెప్పాల్సి ఉంటుంది. ఈసారి కార్పొరేట్లు భారీ ఎత్తున ట్రంప్‌కు మద్దతుగా డబ్బు సంచులను దింపాయి. రాష్ట్రాల కార్మిక చట్టాల నుంచి తమ డ్రైవర్లను మినహాయించాలంటూ ఉబెర్,లిప్ట్ కంపెనీలు కాలిఫోర్నియాలో కోట్లాది డాలర్లను ఖర్చు చేశాయి. డబ్బు, సోషల్ మీడియా, టీవీలు, పత్రికలు పెద్ద ఎత్తున చేసిన ప్రచారానికి కూడా డెమాక్రాటిక్ పార్టీ మద్దతుదార్లుగా ఉన్న ఓటర్లు ప్రభావితమై కొందరైనా ట్రంప్‌కు ఓట్లు వేశారు. మరొక అభిప్రాయం ప్రకారం తమను విస్మరించిన డెమోక్రాట్లకు గుణపాఠం చెప్పేందుకు కసితో ట్రంప్‌కు మద్దతు ఇచ్చినట్లు చెబుతున్నారు.ఈ వ్యతిరేకతను గుర్తించటంలో ఆ పార్టీ నాయకత్వం విఫలమైంది. రిపబ్లికన్ పార్టీ నాయకత్వం పచ్చిమితవాదంతో, కార్మిక వ్యతిరేక వైఖరితో ఉంటుంది. ఎలాగైనా గెలవాలని అనుకున్న ట్రంప్ తన ఎత్తుగడలను మార్చాడు. ఒకవైపు అబార్షన్ల హక్కును సుప్రీం కోర్టు తిరస్కరించటాన్ని సమర్ధిస్తూనే మరో వైపు తాను అధికారానికి వస్తే ఫెడరల్ ప్రభుత్వం తరఫున అబార్షన్లపై నిషేధం విధించనని ప్రకటించి కొందరు మహిళలను ఆకట్టుకున్నాడు. అయితే అధికారానికి వచ్చిన తరువాత అతగాడి నిజస్వరూపం వెల్లడి అవుతుంది.మరోసారి పోటీ చేసే అవకాశం లేదు గనుక నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఎంతగా అణచివేస్తే అంతగా కార్మికవర్గం ప్రతిఘటిస్తుంది. డెమోక్రాట్లు కాడిపడవేసినంత మాత్రాన కార్మికవర్గం నీరుగారిపోతుందని అనుకుంటే పొరపాటు. అవసరమైతే కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంటారు, కార్మికుల తరఫున రాజీలేకుండా పోరాడేశక్తులను ముందుకు తెస్తారు. అంతర్గత విధానాలు, విదేశీ విధానాలను జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాతే ట్రంప్ ప్రకటిస్తాడు. అప్పటి వరకు వివిధ దృశ్యాలను ఊహించుకుంటూ సాగించే విశ్లేషణలే వెలువడతాయి.
అమెరికా ఎన్నికల గురించి సర్వేలు ఎందుకు విఫలమయ్యాయి అనే చర్చ కూడా ప్రారంభమైంది.పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుందని, ఓడిపోతే కేసులు దాఖలు చేసేందుకు ట్రంప్ మద్దతుదారులు అన్నీ సిద్దం చేసుకున్నారని చెప్పారు, తీరా చూస్తే ట్రంప్ తిరుగులేని మెజారిటీతో నెగ్గాడు. సర్వేలు, పండితులు అతగాడిని ఎందుకు తక్కువ అంచనా వేశారంటూ ఇప్పుడు మరో చర్చ మొదలైంది. ఎందుకు తప్పుడు ఫలితాలు వచ్చాయంటే సర్వేల్లో డెమోక్రాట్లు ఎక్కువగా పాల్గొన్నందున అని ఒక సాకు చెబుతున్నారు. సర్వేలన్నీ పోటాపోటీ ఉందని, స్వల్ప మెజారిటీతో కమలాహారిస్ గెలుస్తారని, పోటీ తీవ్రంగా ఉన్న స్వింగ్ స్టేట్స్‌లో కూడా నాలుగింట ఆమెకే మెజారిటీ ఉందని కొద్ది గంటల్లో ఓటింగ్ ప్రారంభానికి ముందు కూడా చెప్పాయి. ఈ సారే కాదు, 2016, 2020,2022 ఎన్నికల్లో కూడా అంచనాలు తప్పాయి.కోల్పోయిన తమ విశ్వసనీయతను పునరుద్దరించుకొనేందుకు ఈ సారి తమ పద్దతులను సవరించుకొని కచ్చితంగా ఉండేట్లు చూస్తామని సర్వే సంస్థలు ప్రకటించాయి. ఆచరణలో అదేమీ కనిపించలేదు. అన్ని స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ ఆధిక్యతలో ఉన్నాడు.ఒక విశ్వవిద్యాలయంలో చరిత్రకారుడిగా పనిచేస్తున్న అలాన్ లిచ్‌మన్ తాను 13అంశాలను పరిగణనలోకి తీసుకొని గత పన్నెండు అధ్యక్ష ఎన్నికల గురించి చెప్పిన జోశ్యాల్లో 11సార్లు నిజమైందని ఈ సారి కమలాహారిస్ గెలుస్తారని తాను చెప్పింది తిరగబడిరదని అంగీకరించాడు. తన పద్దతి గురించి మరోసారి సరిచూసుకుంటానని చెప్పాడు. రెండు వారాల క్రితం ట్రంప్ గెలుస్తాడని చెప్పిన 538 సంస్థ అధిపతి సిల్వర్ అనే మరో ఎన్నికల పండితుడు ఎన్నికలకు కొద్ది గంటల ముందు స్వల్పతేడాతో కమల గెలుస్తారని చెప్పాడు. అమెరికా ఎన్నికల్లో బెట్టింగ్ బంగార్రాజులు కాసిన పందేల విలువ 360కోట్ల డాలర్లని ఒక అంచనా. ఇవి బహిరంగంగా ప్రకటించిన మేరకు వచ్చిన వివరాలు మాత్రమే, ఇంకా ఇంతకంటే భారీ మొత్తాల్లోనే పందాలు ఉన్నాయి. వెల్లడైన సమాచారం మేరకు ఎక్కువ మంది ట్రంప్ గెలుపు మీదనే పందాలు కాశారు. అంటే ఎన్నికల పండితుల కంటే జూదగాండ్లే జనం నాడిని బాగా పసిగట్టినట్లు తేలింది. ఎన్నికల రోజున ఐదు జూద కంపెనీలు ట్రంప్ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేల్చాయి. ఓటింగ్ ముగిసిన తరువాత ట్రంప్ మీద పందాలు విపరీతంగా పెరిగాయి.
ఎన్నికల పండితులు, కృత్రిమ మేథకంటే ఒక పిల్ల హిప్పోపోటోమస్ ఎన్నికల ఫలితాన్ని కచ్చితంగా చూపిందని సామాజిక మాధ్యమంలో సందేశాలు వెల్లువెత్తాయి. థాయ్‌లాండ్‌లోని ఒక జంతు ప్రదర్శనశాలలో ఉన్న మూ డెంగ్ అనే పిల్ల హిప్పోపోటోమస్‌కు భవిష్యత్‌ను చెప్పే అద్భుతశక్తులు ఉన్నట్లు ప్రచారం జరిగింది. అమెరికా ఎన్నికల్లో గెలిచేది ఎవరో తేల్చాలంటూ దాని ముందు రెండు పళ్లాలలో కేకుతోపాటు పుచ్చకాయలు పెట్టి ఒకదాని మీద కమల హారిస్, మరొకదానికి మీద డోనాల్డ్ ట్రంప్‌పేరు రాసి పెట్టారట.ఏ పళ్లంలోని కేకును తింటే ఆ పేరుగల అభ్యర్థిగెలుస్తారన్న నమ్మకం దాని వెనుక ఉంది. పెద్దగా ఆలోచించకుండా ట్రంప్ పేరు రాసిన పుచ్చకాయ కేకును మూ డెంగ్ తినటంతో ట్రంప్ గెలుస్తాడంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పిల్ల హిప్పోపోటోమస్ తల్లి మాత్రం కమల పేరున్న పుచ్చకాయ తిన్నదట. పిచ్చి ఎంత పతాకస్థాయికి చేరిందంటే ఆ పిల్ల జంతువును చూసేందుకు ఒక అమెరికన్ మహిళ 20గంటలు ప్రయాణించి ఆ జంతు ప్రదర్శనశాలకు వచ్చి పులకించిపోయిందట. దరిద్రం ఏమిటంటే తమ నాయకురాలి పేరున్న ప్లేట్‌వైపు చూడనందుకు మూ డెంగ్ గురించి డెమోక్రటిక్ పార్టీ మద్దతుదార్లు పెద్ద ఎత్తున ప్రతికూల ప్రచారం చేశారట. మరొక పిచ్చి చర్య ఏమంటే కృత్రిమ మేథతో పనిచేసే చాట్ జిపిటిని ఎవరు గెలుస్తారని అడిగితే ట్రంప్ లేదా కమల ఇద్దరూ అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టరని చెప్పిందట. మూడవ పక్షం కింగ్ మేకర్ అవుతుందని కూడా సెలవిచ్చింది. ఆన్‌లైన్ ఒరాకిల్ అయితే పట్టణాల్లో హింసాకాండ చెలరేగుతుందని జోశ్యం చెప్పింది.
అమెరికాలో ఎన్నికల జోశ్యాలు 1880దశకం నుంచి ప్రారంభమయ్యాయి.ఎక్కువ భాగం వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో బోల్తాపడ్డాయి.2016లో హిల్లరీ క్లింటన్‌కు ఓట్లు ఎక్కువగా వస్తాయని, ఆమేరకు ఎలక్టరల్ కాలేజీలో కూడా మెజారిటీ తెచ్చుకుంటారని సర్వే సంస్థలన్నీ చెప్పాయి. మొదటిది మాత్రమే నిజమైంది, రెండవదానిలో అంచనాలు తప్పాయి. డోనాల్డ్ ట్రంప్‌కు ఓట్లు తక్కువ, ఎలక్టరల్ కాలేజీలో గెలుపుకు అవసరమైన ఓట్లు ఎక్కువ వచ్చాయి. 2020 ఎన్నికల్లో జో బైడెన్ గెలుస్తాడని చెప్పినప్పటికీ అసాధారణ మెజారిటీ తెచ్చుకుంటారని చెప్పిన జోశ్యాలు తప్పాయి.2022లో జరిగిన పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఉభయ సభల్లోనూ రిపబ్లికన్లు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారని చెప్పినప్పటికీ అలా జరగలేదు.సాధారణ మెజారిటీ 2018 కాగా రిపబ్లికన్లకు 222 మాత్రమే వచ్చాయి. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో డెమోక్రాట్లు సెనెట్‌ను 5149 మెజారిటీతో గెలుచుకున్నారు. మరింత శాస్త్రీయ పద్దతిలో సర్వేలు నిర్వహించాలని అనేక మంది చెప్పారు, రానున్న రోజుల్లో ఏ పద్దతిని అనుసరిస్తారో చూడాల్సి ఉంది.
