Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


తమ కరెన్సీ డాలరును పక్కన పెట్టి ప్రత్యామ్నాయ కరెన్సీతో వాణిజ్యం జరిపేందుకు బ్రిక్స్‌ కూటమి దేశాలు పూనుకుంటే వందశాతం పన్ను విధిస్తామని జనవరి 20న పదవీ బాధ్యతలు చేపట్టనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు.బ్రిక్స్‌ దేశాలని, వేరే కరెన్సీ అని చెప్పినప్పటికీ స్థానిక కరెన్సీలతో లావాదేవీలు జరిపే అన్ని దేశాలకూ వర్తింపచేస్తామనే హెచ్చరిక దీని వెనుక ఉంది.ప్రస్తుతం బ్రిక్స్‌లో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాన్‌,ఈజిప్టు, ఇథియోపియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యుఏయి) ఉన్నాయి.మరో 34 దేశాలు చేరేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. వాటిని నిరుత్సాహపరిచేందుకు కూడా ట్రంప్‌ ఈ ప్రకటన చేశాడు. నిజానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మార్చి నెలలోనే దీని గురించి చెప్పాడు. ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ దువ్వూరు సుబ్బారావు వంటి వారు ట్రంప్‌ మాటలు ఊకదంపుడేనా, నిజంగా అమలు జరుగుతాయా, అమెరికా చట్టాలు అందుకు అనుమతిస్తాయా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. చైనా వస్తువుల మీద పదిశాతం, కెనడా, మెక్సికోల నుంచి వచ్చే వాటి మీద 25శాతం పన్ను విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. చర్యకు ప్రతిచర్య ఉంటుంది, అది ఏ రూపంలో అన్నది చూడాల్సిఉంది.


మొదటి ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచ మారకపు కరెన్సీగా బ్రిటీష్‌ పౌండు ఉన్నది.1920దశకం నుంచి డాలరు క్రమంగా పెరిగి పౌండ్‌ను వెనక్కు నెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధ ముగింపులో ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్థల ఏర్పాటు తరువాత పూర్తిగా డాలరు పెత్తనం ప్రారంభమైంది. గతంలో ఒక ఔన్సు(28.35 గ్రాములు) బంగారం 35 డాలర్లకు సమానమైనదిగా మారకపు విలువ నిర్ణయించారు. 2024 డిసెంబరు రెండవ తేదీన ఒక ఔన్సు బంగారం ధర 2,626 డాలర్లు ఉంది. 1971లో డాలరుబంగారం బంధాన్ని తెంచిన తరువాత డాలరుకు ఎదురులేకుండా పోయింది. దాన్ని అడ్డుకొనేందుకు ఐరోపా ధనికదేశాలు యూరో కరెన్సీని ముందుకు తెచ్చినా డాలరుకు ప్రత్యామ్నాయం కాలేకపోయింది. గత పదిహేను సంవత్సరాలుగా డాలరు ప్రభావం క్రమంగా తగ్గుతోంది.రాజకీయంగా తమ పెత్తనానికి ఎదురు దెబ్బలు తగులుతున్న పూర్వరంగంలో ఆర్థికంగా నిలిచి ప్రపంచ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని అమెరికా చూస్తున్నది, అదే ట్రంప్‌ అజెండా, దానికి అనుగుణంగా ప్రకటనలు ఉన్నాయి.అయితే అది జరిగేనా ?

డాలరుకు ప్రత్యామ్నాయ కరెన్సీని ముందుకు తేవాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డిసిల్వా 2023లో ప్రతిపాదించాడు. అంతకు ముందు నుంచే దీని గురించి చర్చ ఉంది. డాలరును ఉపయోగించవద్దని ఏ దేశం మీద కూడా వత్తిడి తేవద్దని, బ్రిక్స్‌ మద్దతు ఇచ్చే కరెన్సీలో చెల్లింపులు పెరగాలని, దుర్బలత్వాలను తగ్గించుకోవాలని లూలా అన్నాడు. తనకు నచ్చని దేశాల మీద డాలరును అమెరికా ఆయుధంగా ఉపయోగిస్తున్నది. ఇరాన్‌తో లావాదేవీలపై అమెరికా నిషేధం విధించిన కారణంగా మనదేశం అక్కడి నుంచి చమురుకొనుగోలు నిలిపివేసింది. ఉక్రెయిన్‌ సంక్షోభానికి రష్యా ఒక్కదాన్నే బాధ్యురాలిగా చేస్తూ దాని మీద కూడ అమెరికా తీవ్రమైన ఆంక్షలు విధించింది. అక్కడి నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు మన ప్రభుత్వం ఇతర కరెన్సీలతో కొనుగోలు చేయాల్సి వచ్చింది.మరోవైపు మన కరెన్సీని అంగీకరించే విధంగా 23 దేశాలతో ఇప్పటికే అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే. రూపాయితో లావాదేవీలు జరిగితే ఎగుమతి, దిగుమతిదార్లకు కరెన్సీ మారకపు విలువ హెచ్చు తగ్గుల ముప్పు ఉండదు. మన విదేశీ వాణిజ్యంలో మూడోవంతు ఈ దేశాలతోనే జరుగుతున్నది.అమెరికాతో ఉన్న రాజకీయ బంధం, డాలరుతో తెగతెంపులు చేసుకోవటం పూర్తిగా ఇష్టం లేని కారణంగా మనదేశం ఇరకాటవస్థలో ఉంది.తామెన్నడూ డాలరును దెబ్బతీసేందుకు లక్ష్యంగా చేసుకోలేదని మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ చెప్పారు. కొన్ని సందర్భాలలో తమ వాణిజ్య భాగస్వాములకు డాలర్లు ఉండటం లేదని, ఆ కారణంగా ప్రత్యామ్నాయాలను చూస్తున్నాం తప్ప ఎలాంటి దురుద్ధేశ్యాలు లేవని చెప్పారు.చైనాతో మన వాణిజ్యం లోటులో ఉండగా అమెరికాతో మిగులులో ఉంది. ఈ కారణంగానే దానితో సంబంధాల విషయంలో మనదేశం ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉమ్మడి కరెన్సీ పథకాలకు దూరంగా ఉంటోంది. కొన్ని లావాదేవీల్లో డాలర్లకు ఆటంకాలు ఉన్నందున స్థానిక కరెన్సీలతో ఏర్పాట్లు చేసుకుంటున్నది.డాలరుతో తెగతెంపులు చేసుకొనేందుకు, తద్వారా అమెరికా మార్కెట్‌ను కోల్పోయేందుకు మనదేశంలోని ఐటి, దాని అనుబంధ, సేవారంగాలలో, ఔషధ, వస్త్ర పరిశ్రమల కార్పొరేట్లు అంగీకరించే అవకాశం లేదు.

కార్పొరేట్‌ శక్తులు పశ్చిమదేశాల మార్కెట్‌ మీద కేంద్రీకరించిన కారణం కూడా విస్మరించరానిదే.మనదేశం డాలర్‌ పెట్టుబడులను ఆశిస్తున్నందున దాన్ని దెబ్బతీసేందుకు ముందుకు పోదన్నది అభిప్రాయం. బ్రిక్స్‌ కూటమి జిడిపిలో 70శాతం వాటా చైనాదే. ప్రత్యామ్నాయ కరెన్సీ రూపొందితే దానిలో ఆధిపత్యం ఉండే అవకాశం ఉంది, రాజకీయంగా దాన్ని ఎదుర్కోవాలని కోరుతున్న మనదేశంలోని చైనా వ్యతిరేకశక్తులు అంగీకరించే అవకాశం కూడా లేదు. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలరుకు బదులు మరొక కరెన్సీని వినియోగించే అవకాశం లేదని, ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తే అమెరికాకు వీడ్కోలు చెప్పాల్సి ఉంటుంది, బ్రిక్స్‌ దేశాలు డాలరుకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుండటాన్ని మేము గమనించటం ముగిసిందని, అద్బుతమైన అమెరికా ఆర్థిక వ్యవస్థలో తమ వస్తువులను అమ్ముకోవటానికి స్వస్థి పలకాల్సి ఉంటుందని ట్రంప్‌ బెదిరించాడు. ప్రస్తుతం డాలర్‌దే ఆధిపత్యమైనా అన్ని దేశాలూ తమ విదేశీమారక ద్రవ్యంలో ఒక్క డాలరు మీదే ఆధారపడటం లేదు. ఇతర కరెన్సీలను కూడా నిల్వచేసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఎటుబోయి ఎటువస్తుందో అన్నట్లుగా బంగారం నిల్వలను కూడా పెంచుకుంటున్నాయి.ఇరాన్‌, రష్యా దేశాలపై ఆంక్షలు విధించి తన స్వంత చట్టాలను రుద్దుతోంది. దానిలో భాగంగా అంతర్జాతీయ అంతర బ్యాంకుల ద్రవ్య లావాదేవీల టెలికమ్యూనికేషన్‌ సమాజ (స్విఫ్ట్‌) వ్యవస్థ నుంచి వాటిని ఏకపక్షంగా తొలగించింది. రేపు తనకు నచ్చని లేదా లొంగని ఏ దేశం మీదనైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవచ్చుగనుక గత కొద్ది సంవత్సరాలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కరెన్సీల గురించి ఆలోచిస్తున్నాయి. బ్రిక్స్‌ దేశాలు ప్రపంచ వాణిజ్యంలో 23శాతం కలిగి ఉన్నాయి. ఇవి నూతన కరెన్సీని సృష్టించటం లేదా డాలరును పక్కన పెట్టే మరొక కరెన్సీకి మద్దతు ఇవ్వబోమని తమకు హామీ ఇవ్వాలని డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశాడు. మహావృక్షం వంటి డాలరుకు బదులు మరొక పిలక కోసం ప్రయత్నించినా ఫలితం ఉండదన్నాడు. సార్వభౌత్వం కలిగిన ఏ దేశమూ ఇలాంటి హామీ ఇవ్వదు. అమెరికా నాయకత్వంలోని జి7 కూటమిని ఎదుర్కోవాలంటే బ్రెజిల్‌,రష్యా,భారత్‌,చైనా చేతులు కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని గోల్డ్‌మన్‌ శాచస్‌ ప్రధాన ఆర్థికవేత్త జిమ్‌ ఓ నెయిల్‌ 2001లో ప్రతిపాదించాడు. తరువాత అది నిజంగానే 2011లో ఉనికిలోకి వచ్చింది. డాలరును తాము ఏకపక్షంగా తిరస్కరించటం లేదని, డాలరు లావాదేవీలపై పరిమితులు విధిస్తున్నందున ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సి వస్తోందని ఆంక్షలకు గురైన రష్యా అధినేత పుతిన్‌ ఇటీవల జరిగిన కజాన్‌ బ్రిక్స్‌ సమావేశాల్లో చెప్పాడు. ఇప్పటికే ఈ కూటమి ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌మెంట్‌ బాంక్‌(ఎన్‌డిబి)ని మరింతగా విస్తరించాలని కూడా నిర్ణయించారు.

ప్రస్తుతం అమెరికా ఖండాల్లో వాణిజ్యంలో 96శాతం, ఆసియాపసిఫిక్‌ ప్రాంతంలో 74, ఇతర చోట్ల 74శాతం డాలరు వినియోగంలో ఉంది. ఐరోపాలో మాత్రం 66శాతం యూరో ఆక్రమించింది. ప్రపంచ దేశాల విదేశీ మారకద్రవ్య నిల్వల్లో 60శాతం డాలర్ల రూపంలో, మిగిలింది ఇతర కరెన్సీలు, బంగారం రూపంలో ఉంటుంది. ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 1960దశకంలో ప్రపంచ జిడిపిలో అమెరికా వాటా 40శాతం కాగా 2023లో 26శాతానికి పడిపోయింది.చైనాను చూస్తే 2000 సంవత్సరంలో 3.6శాతంగా ఉన్నది 16.9శాతానికి పెరిగింది. మన జిడిపి ఇదే కాలంలో 1.4 నుంచి 3.4శాతానికి మాత్రమే పెరిగింది. దేశాల రిజర్వుబ్యాంకులు తమ వద్ద నిల్వ ఉంచుకొనే విదేశీ కరెన్సీలలో డాలరు వాటా 2002లో 70శాతం ఉండగా 2024 మార్చి ఆఖరులో 59శాతం ఉంది. ఇదే సమయంలో యూరో, ఎన్‌, పౌండ్‌ తప్ప ఇతర కరెన్సీల వాటా 1.8 నుంచి 10.9శాతానికి పెరిగింది. అనేక దేశాలు డాలరును క్రమంగా వదిలించుకుంటున్నాయి. ఎప్పుడు ఎలాంటి అస్థిరతకు గురికావాల్సి వస్తుందో అన్న భయంతో ఇటీవలి కాలంలో బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచుతున్నాయి.దేశాల రిజర్వుబాంకులు 2010లో 79.15 టన్నుల బంగారం కొనుగోలు చేయగా 2015లో 579.6 టన్నులు, 2023లో 1,037.1టన్ను కొనుగోలు చేశాయి. మన విషయానికి వస్తే ఆర్‌బిఐ ప్రతినెలా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నది.జనవరి నుంచి 43 టన్నులు కొనుగోలు చేయగా మొత్తం నిల్వ 846 టన్నులకు పెరిగింది. చైనా రిజర్వుబాంకు వద్ద అక్టోబరు ఆఖరులో 2,264 టన్నుల బంగారం ఉంది. గతేడాది అన్ని దేశాల కేంద్ర బాంకులు కొనుగోలు చేసిన 1,037 టన్నుల్లో 30శాతం చైనా పీపుల్స్‌ బాంకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది అంతకు మించి కొనుగోలు చేయనున్నట్లు జనవరిమార్చినెలల్లో లావాదేవీలు వెల్లడిరచాయి. ఎందుకు ఈ విధంగా కొనుగోలు చేస్తున్నదంటే డాలరుకు ప్రత్యామ్నాయంగా కరెన్సీని ముందుకు తెచ్చేందుకే అని పరిశీలకులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయా దేశాల్లో విదేశీమారక నిల్వల్లో పోర్చుగల్‌లో బంగారం వాటా 72శాతం, అమెరికా 70,జర్మనీ 69, ఫ్రాన్సు 67, ఇటలీ 66, నెదర్లాండ్స్‌ 58, టర్కీ 30, రష్యా 26శాతం భారత్‌ 9, చైనా నాలుగుశాతం మాత్రమే కలిగి ఉన్నాయి. శాతం రీత్యా చూస్తే మనం ఎగువన ఉన్నప్పటికీ విలువలో చూస్తే చైనాతో ఎంత తేడా ఉందో పైన పేర్కొన్న అంకెలు వెల్లడిస్తాయి.

మొత్తంగా బ్రిక్స్‌ దేశాల మీద ట్రంప్‌ దాడి ఉన్నప్పటికీ కేంద్రీకరణ అంతా చైనా మీదనే అన్నది స్పష్టం.అక్కడి మార్కెట్‌లో తన వస్తువుల విక్రయాలకే ఈ వత్తిడి. ఎవరు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ దాడి తీవ్రత పెరగవచ్చని ఊహించిన చైనా ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు గత ఆరు సంవత్సరాలుగా ప్రత్నామ్నాయ మార్గాలను వెతుకుతున్నది. దాని అమ్ముల పొదిలో కూడా అమెరికాను దెబ్బతీసే కొన్నిఅస్త్రాలు ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఉదాహరణకు చైనా వద్ద అమెరికా తీసుకున్న రుణం 734 బిలియన్‌ డాలర్లు ఉంది.2017 నుంచి క్రమంగా ఈ మొత్తాలను తగ్గిస్తున్నది. దాన్ని ఇతర దేశాలకు చైనా విక్రయిస్తే ప్రపంచ మార్కెట్ల మీద ప్రతికూల ప్రభావం, అమెరికా బాండ్ల మీద వచ్చే రాబడి తగ్గి ఆకర్షణ కోల్పోతుంది. తన దగ్గర ఉన్న 3.38లక్షల కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వదిలించుకుంటే చైనాకూ సమస్యలు వస్తాయి.అమెరికాను దెబ్బతీయాలంటే తన కరెన్సీ యువాన్‌ విలువ తగ్గింపు ఒక ఆయుధం. దానితో లాభంనష్టం రెండూ ఉన్నాయి. సెమీకండక్టర్లు, విద్యుత్‌ బాటరీలకు ఉపయోగించే అరుదైన ఖనిజాల ఎగుమతులు నిలిపివేయవచ్చు. తమ మార్కెట్లో ఆపిల్‌, టెస్లా వంటి అమెరికా కార్పొరేట్‌ కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించి దెబ్బతీయవచ్చు.అయితే వాటిని ప్రయోగిస్తుందా లేదా అన్నది చెప్పలేము.