Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

హమ్మయ్య ఒక పనైపోయింది. తెలుగువారి కళారూపాల్లో ఒకటైన ఏక పాత్రాభినయం గురించి తెలిసిందే. డోనాల్డ్‌ ట్రంప్‌ తన పట్టాభిషేకానికి నన్నెందుకు ఆహ్వానించలేదు, నన్ను పక్కన పెడితే పెట్టారు, చైనా నేత షీ జింపింగ్‌కు పెద్ద పీటవేయనేల, అతగాడు రాడని తెలిసి కూడా ఆహ్వానమేల, పోనీ వచ్చేందుకు తిరస్కరించిన తరువాత కూడా నన్ను పిలవాలని తట్టలేదా ? గత ఆలింగనాలు, చెట్టపట్టాలు గుర్తుకు రాలేదా ? అంతలా మర్చిపోతారా ? విదేశాంగ మంత్రి జై శంకర్‌ వెళ్లి చేసిన నిర్వాకం ఏమిటి ? పరిపరి విధాల ఇలాంటి స్థితిలో ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీకి ట్రంప్‌ నుంచి ఆహ్వానం వచ్చింది. ఫిబ్రవరి 13,14 తేదీలలో వెళ్లారు. ట్రంప్‌తో కరచాలనాలు, ఆలింగనాల తరువాత భేటీ జరిగింది. పరస్పరం పొగడ్తలకు ఎలాంటి లోటు జరగలేదు. అసలే 56 అంగుళాల ఛాతీ అంటారు, ట్రంప్‌ మర్యాదలతో అది మరింతగా పొంగిన స్థితిలో మోడీ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇంటి పెద్ద ఏదైనా ప్రయాణం చేసి వచ్చినపుడు కుటుంబంలోని వారు తమకేమి తెచ్చారా అని ఎదురు చూడటం సహజం. ఇప్పుడు మన మోడీ ఏం తెచ్చారని మన జనం ఆసక్తి కనపరుస్తున్నారు. మోడీ తిరిగి రాకముందే వచ్చిన వార్త ఏమింటే సుంకాల విధింపులో తగ్గేదేలేదు, భారత్‌ అయినా మరొకరైనా మా మీద విధిస్తే మేమూ అంతే చేస్తాం అన్న ప్రకటన పతాక శీర్షికల్లో వచ్చింది.పరస్పర వడ్డింపులు అందరికీ వర్తిస్తాయి, ఎవ్వరికీ మినహాయింపులేదు.వాణిజ్యం విషయంలో మా శత్రుదేశాల కంటే మిత్ర దేశాలు అధ్వాన్నంగా ఉన్నాయి. భారత్‌ పెద్ద మొత్తంలో పన్నులు విధిస్తున్నది. ఆ కారణంగా హార్లే డేవిడ్స్‌న్‌ తమ మోటారు సైకిళ్లను అమ్ముకోలేకపోయిందని నాకు గుర్తువస్తున్నది. తమ జరిమానాలను తప్పించుకోవాలంటే ఇతర దేశాలు తమ పన్నులు ఎత్తివేయాలి లేదా తగ్గించాల్సిందే అని ట్రంప్‌ చెప్పాడు. తాను తీసుకొనే చర్యలు అంతిమంగా అమెరికా కంపెనీలకు మేలు చేస్తాయన్నాడు. 2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్‌ డాలర్లకు పెంచుతామని, రక్షణ రంగంలో సహకారం, పౌర అణుఒప్పందంలో అమెరికా కంపెనీలకు అనుకూలమైన నిర్ణయాలు, ఇతర అనేక అంశాల గురించి మరో సందర్భంలో చర్చించుకోవచ్చు, పరిమితంగా కొన్ని అంశాలను చూద్దాం.

మోడీ పర్యటన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే డోనాల్డ్‌ ట్రంప్‌కు భారీగా సమర్పించుకొని వచ్చారు తప్ప అక్కడి నుంచి తెచ్చిందేమీ లేదంటే కొందరు నొచ్చుకోవచ్చుగానీ అది మింగలేని నిజం. అంత తొందరగా నిర్ణయానికి రావటమెందుకు తరువాత ఫలితాలు వస్తాయోమో అనే వాళ్లను నిరుత్సాహపరచటం లేదు. ట్రంప్‌ ఏం చెప్పాడు ? భారత్‌అమెరికా వాణిజ్యంలో మేం లోటులో ఉన్నాం, ఆ మేరకు మా దగ్గర నుంచి సరకులు కొనుగోలు చేయాలి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ముడి చమురు మా దగ్గర ఉంది, భారత్‌కు అది అవసరం, మా నుంచి కొనుగోలు చేయాలి. మా వస్తువుల మీద దిగుమతి పన్ను తగ్గించాలి, వాటిని దిగుమతి చేసుకోవాలి అని నిర్మొహమాటంగా చెబితే, సరే ఇంకేం చేస్తాం అంటూ మోడీ తలూపి వచ్చారు. ఇతర దేశాల కంటే ఎక్కువగా అమెరికా నుంచి ముడిచమురు, గ్యాస్‌ కొనుగోలు చేస్తామని అంగీకరించి వచ్చారు.మన దేశానికి అమెరికా ఐదవతరం ఎఫ్‌35 యుద్ధ విమానాలు విక్రయిస్తామని ట్రంప్‌ చెప్పాడు. ఇంకేముంది చైనాను నిలువరించేందుకు వచ్చేసినట్లే అన్నట్లుగా మీడియాలో కొందరు చిత్రించారు. నిజానికి ఆలూలేదూ చూలూ లేదు. అసలు ఒప్పందమే లేదు. ఎప్పుడో చేసుకున్న ఒప్పందాల ప్రకారం మనకు అవసరమైన పాతతరం ఇంజన్లు సరఫరా చేసేందుకే అమెరికా జాప్యం చేస్తున్నది.

మన దేశం తేలిక రకం తేజాస్‌ యుద్ధ విమానాలను తయారు చేసే క్రమంలో ఉంది.వాటిని సాంకేతికంగా ఉన్నతీకరిస్తున్నారు. ఎంకె1ఏ రకం విమానానికి అవసరమైన ఇంజన్ల కోసం సందేహాలున్నప్పటికీ అమెరికా జిఇ కంపెనీతో మన హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ 2021లో ఎఫ్‌404రకం 99 ఇంజన్ల సరఫరా, నిర్వహణ ఒప్పందం చేసుకుంది. సరఫరా గడువు దాటింది, ఒప్పందం ప్రకారం అపరాధ రుసుం వేసినప్పటికీ ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఇంజన్‌ కూడా మనకు రాలేదు. అవే రాలేదనుకుంటే నరేంద్రమోడీ 2023లో అమెరికా వెళ్లినపుడు ఎల్‌సిఏ ఎంకె2కు అవసరమైన జిఇ 414 ఇంజన్ల సరఫరా ఒప్పందం కూడా చేసుకున్నారు. మొదటిదానికే దిక్కులేదు. ఎందుకు సరఫరా చేయటం లేదు అంటే దానికి అవసరమైన విడిభాగాలను సరఫరా చేసే దక్షిణ కొరియా కంపెనీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని సాకు చెబుతున్నారు. అలాంటిది ఆధునిక ఎఫ్‌35 యుద్ద విమానాలను మనకు విక్రయిస్తుందా ? అంతే కాదు అమెరికా తయారు చేసిన ఎఫ్‌16 యుద్ద విమానం ఇప్పుడు పాతబడిపోయింది.దానికి రంగులు మార్చి లేదా పరిమితమైన మార్పులు చేసి ఎఫ్‌21పేరుతో మనకు విక్రయించేందుకు లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ చూస్తున్నదని వార్తలు. అది ఐదవతరం ఎఫ్‌22 రాప్టర్‌కు ఒక అడుగు మాత్రమే వెనుక ఉన్నట్లు కూడా చెప్పారు. ట్రంప్‌మోడీ ఏమోయ్‌ అంటే ఏమోయ్‌ అనుకునేట్లుగా ఉన్న సమయంలోనే పాకిస్తాన్‌కు అమెరికా ఎఫ్‌16 విమానాలను అందచేసిందని, 2019 ఫిబ్రవరి 27న మన వైమానిక దళం వాటిలో ఒకదాన్ని కూల్చి వేసిందని గుర్తుకు తెచ్చుకోవాలి.


మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ – మాగా (అమెరికాను మరోసారి గొప్పదానిగా చేయాలి) అన్నది ట్రంప్‌ నినాదం. దానికి అడ్డువచ్చే వారిని ఎవరినీ సహించడు అని వేరే చెప్పాల్సిన పనిలేదు. అన్ని రంగాల్లో సవాలు విసురుతున్న చైనా ఒక వైపు ఉంటే భారత్‌ కూడా అలాగే తయారవుతానంటే అంగీకరిస్తాడా ? కానీ నరేంద్రమోడీ గారు మాగాకు పోటీగా మిగా అని ఎక్స్‌ చేశారు. వికసిత భారత్‌ లక్ష్యాన్ని మేక్‌ ఇండియా గ్రేట్‌ ఎగైన్‌ అని మేం కూడా అనొచ్చు అన్నారు. అమెరికా అంటే గతంలో అన్ని రంగాల్లో ముందున్నది, ప్రాసకోసం తప్ప వస్తు తయారీలో మనం ఎప్పుడు ముందున్నాం ? పదేండ్ల క్రితం ఉన్న జిడిపిలో ఉన్న స్థాయిలో కూడా నేడు మన తయారీ రంగం లేదన్నది దాస్తే దాగుతుందా ? గత చరిత్ర మొత్తం అమెరికా మనలను అడ్డుకున్నదే.తొలిసారిగా 1962లో మన దేశం చైనాతో యుద్ధానికి దిగినపుడు ఫైటర్‌ జెట్లు కావాలని నాటి ప్రభుత్వం కోరితే వాటికి బదులు రవాణా విమానాలు, రాడార్లను ఇచ్చిందట. తరువాత పాకిస్తాన్‌కు 12 సూపర్‌ సోనిక్‌ ఫైటర్‌జెట్లను ఇస్తే వాటిని 1965లో మన మీద ప్రయోగించారు. ఆ తరువాతే మనం సోవియట్‌ యూనియన్‌ నుంచి మిగ్‌ 21 విమానాలను కొనుగోలు చేశాము.1998లో మన దేశం అణుపరీక్షలు జరిపితే అమెరికా మనలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అనేక ఆంక్షలను విధించింది. అక్రమచొరబాటుదార్లను గుర్తించేందుకు ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలు కావాలని కోరితే అమెరికా నిరాకరించింది. తరువాత మనమే సొంతంగా రూపొందించుకున్నాం. గాల్వన్‌లోయలో జరిగిన ఉదంతాల వెనుక అమెరికా ఇచ్చిన తప్పుడు సమాచారం ఉందని కూడా చెబుతారు. తరువాత అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా అక్రమంగా గ్రామాల నిర్మాణం చేస్తోందంటూ కూడా ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని మన మిలిటరీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. వారి ప్రాంతంలో ఎప్పుడో నిర్మించి పాతబడిన వాటిని తిరిగి నిర్మిస్తున్నది తప్ప కొత్తవి కాదని ప్రకటించారు.

ఇల్లలక గానే పండగ కాదన్నట్లుగా నరేంద్రమోడీ డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య కుదిరిన అవగాహనలేమిటో, వాటి పరిణామాలు, పర్యవసానాలను చూడాల్సి ఉంది. నమస్కార బాణం వేసినట్లు ముందుగానే మన వైపు నుంచి అమెరికా వస్తువులకు కొన్ని రాయితీలు ఇవ్వటానికి సిద్దం అనే సంకేతాలు ఇచ్చాము.అయితే ట్రంప్‌కు అవి సంతృప్తి కలగలేదు గనుకనే భారత్‌ ఎంత సుంకం విధిస్తుందో మేమూ అంతే వేస్తాం అంటూ కరాఖండితంగా ముందే చెప్పాడు. తమ వస్తువులను మనదేశంలో కుమ్మరించేందుకు తొలిసారి అధికారానికి వచ్చినపుడే ట్రంప్‌ ఎత్తుగడ వేశాడు.ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్లు తాము చేసినదానికి ప్రతిగా భారత్‌ రాయితీలు ఇవ్వలేదంటూ 2019లో ప్రత్యేక వాణిజ్య భాగస్వామిగా మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల మీద ఇస్తున్న ప్రాధాన్యత (జిఎస్‌పిాజనరలైజ్‌డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ఫ్రిఫరెన్సు)ను రద్దు చేసి సుంకాలు విధించాడు. దానికి ప్రతిగా మన దేశం కూడా పన్నులు విధించింది. ఎక్కడైనా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా మోడీ పర్యటన సందర్భంగా ట్రంప్‌ ఎన్ని మెచ్చుకోలు మాటలు చెప్పినా తాను తీసుకున్న చర్యను వెనక్కు తీసుకోవటం గురించి ఒక్క మాటా లేదు. మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్‌ మా యింటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగానే ఉంది.

ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే అమెరికా వస్తువులపై మనం విధించే పన్నుల గురించి ట్రంప్‌ గుర్రుగా ఉన్నాడు. పన్నుల రారాజు అంటూ మన దేశాన్ని గతంలో వర్ణించాడు. నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా కూడా తన అంతరంగాన్ని దాచుకోలేదు. అమెరికన్‌ కార్ల వంటి వాటి మీద 70శాతం పన్ను విధిస్తున్నారని, ఇది పెద్ద సమస్య అన్నాడు. అనేక వస్తువుల మీద 30,40,60 చివరికి 70శాతం పన్ను కూడా భారత్‌ విధిస్తున్నది, వాటిని తగ్గిస్తామని మోడీ చెప్పారు. 70శాతం పన్ను ఉంటే అమెరికా కార్లను ఆమ్ముకోలేం, భారత్‌తో దాదాపు వంద బిలియన్‌ డాలర్ల మేర తమకు లోటు ఉంది అన్నాడు. మా దగ్గర ఏ దేశంలోనూ లేనంతగా ఉన్న చమురు, గ్యాస్‌ను విక్రయించి ఆలోటును పూడ్చాలనుకుంటున్నాం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఇటీవలి అంతర్జాతీయ పరిణామాల కారణంగా రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం.2024 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఎనిమిది మాసాలలో మన దేశం దిగుమతి చేసుకున్న ముడిచమురులో రష్యా వాటా 37.6, ఇరాక్‌ 19.9, సౌదీ అరేబియా 13.3,యుఏయి 9.1 అమెరికా 4.3, ఇతర దేశాల నుంచి 16.4శాతం వాటా ఉంది. ఆ తరువాత రష్యా నుంచి చమురు రవాణా చేసే నౌకల మీద కూడా అమెరికా ఆంక్షలు విధించటంతో ఈ ఏడాది, ఫిబ్రవరి, మార్చి నుంచి పెద్ద మొత్తంలో తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు రష్యా స్థానాన్ని అమెరికా ఆక్రమిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే చమురు ధరలో ఎలాంటి రాయితీ ఉండదు, దూరం గనుక రవాణా ఖర్చులు పెరుగుతాయి, సమయమూ ఎక్కువ పడుతుంది. ఆ భారం మొత్తం వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. దీనికి తోడు అమెరికా రకం ముడి చమురును శుద్ది చేయాలంటే మన రిఫైనరీలలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని, అది కంపెనీల మీద అదనపు భారం మోపుతుందని చెబుతున్నారు. అమెరికా బెదిరింపులకు లొంగి ఇప్పటికే ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. ఇప్పుడు రష్యా, ఇతర దేశాల నుంచి కూడా నిలిపివేసి ఒక్క అమెరికా మీదనే ఆధారపడితే మన జుట్టును దాని చేతికి ఇచ్చినట్లే అవుతుంది. అదే జరిగితే మన ఇంథన భద్రతకే ముప్పు వస్తుంది. వ్యూహాత్మకంగా కావచ్చు లేదా మరొక కారణంతో గానీ ట్రంప్‌`మోడీ భేటీలో చైనా ప్రస్తావన పెద్దగా రాలేదు. గతంలో ట్రంపు అధికారంలో ఉండగానే చైనాతో సరిహద్దులోని గాల్వన్‌లోయలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఇరుదేశాలు ఆ ఉదంత పూర్వపు స్థాయికి సంబంధాలను నెలకొల్పుకొనేందుకు ఇటీవలనే ఒప్పందం చేసుకొని ముందుకు పోతున్నాయి. కావాలంటే సరిహద్దు సమస్యలో సాయం చేసేందుకు నేను సిద్దం అని మోడీతో ట్రంప్‌ అన్నట్లు వార్తలు వచ్చాయి. సాయం సంగతి దేవుడెరుగు తంపులు పెట్టకుండా ఉంటే చాలు. ఇరుగు పొరుగు దేశాలతో సమస్యలను పరిష్కరించుకోలేనంత అసమర్ధంగా మనదేశం లేదు.