Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

ప్రపంచం మీద తాను రుద్దిన వాణిజ్య పోరు డోనాల్డ్‌ ట్రంప్‌ పదవికి గండం తేనుందా ? దాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్లు సహిస్తారా ? ఈ పోరులో చైనా గెలిస్తే అమెరికా పరిస్థితి ఏమిటి ? ఇలా పరిపరి ఆలోచనలు ప్రారంభమయ్యాయి. రెండు దిగ్గజాల మధ్య కేంద్రీకృతమైన వివాదాన్ని ఆసరా చేసుకొని లబ్దిపొందాలని కొన్ని దేశాలు చూస్తున్నాయి. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఒప్పందాలు కుదుర్చుకుంటే అలాంటి దేశాలపై తాము గట్టి ప్రతి చర్యలు తీసుకుంటామని సోమవారం నాడు చైనా హెచ్చరించింది. వాణిజ్య పోరులో విజేతలు ఉండరన్నది సాధారణ అభిప్రాయం, అది నిజమేనా ? ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి ? మన దేశం బ్రిటీష్‌ వలస పాలనలోకి వెళ్లక ముందు చేనేత వస్త్రాలకు ఎంతో ప్రసిద్ధి. బ్రిటన్‌తో సహా అనేక దేశాలకు అవి ఎగుమతి అయ్యేవి. అలాంటి వాటిని బ్రిటన్‌ పారిశ్రామిక విప్లవం మింగేసింది. ఇప్పుడు ట్రంప్‌ దిగుమతి పన్ను విధించినట్లుగా మన చేనేత వస్త్రాల మీద నాటి బ్రిటన్‌ కూడా పన్ను విధించి అడ్డుకుంది, చౌకగా తయారయ్యే తన మిల్లు వస్త్రాలను మనదేశంలో కుమ్మరించింది. మన మార్కెట్‌ను ఆక్రమించింది. పత్తి ఎగుమతి దేశంగా మార్చింది. నాడు భారత్‌ పరాధీన దేశం, వ్యతిరేకించిన వారు లేరు. ఇప్పుడు అమెరికా పన్నులతో చైనా వస్తువులను అడ్డుకోవాలని చూస్తోంది. చైనా సర్వసత్తాక స్వతంత్ర దేశం, అమెరికాను ఢీ అంటే ఢీ అనే స్థితిలో ఉంది, ఆట కట్టించాలని చూస్తోంది.చిత్రం ఏమిటంటే అసలైన దేశభక్తులం అని చెప్పుకుంటున్న మన పాలకులు మా ఆయుధాలు, వస్తువులు కొంటారా లేదా అని అమెరికా కొరడా రaళిపిస్తే కంటి చూపులేదు, నోట మాట లేదు.ఏం జరుగుతోంది మహాత్మా ఓ మహాత్మా !


డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఒప్పందాలు చేసుకొనే దేశాల మీద చర్యలు తప్పవని చైనా తీవ్ర హెచ్చరిక చేసింది.తమతో వాణిజ్యం చేసే దేశాలు చైనా మీద ఆంక్షలు విధించాలని, దానికి ప్రతిగా అలాంటి వాటికి పన్నులను మినహాయిస్తామని అమెరికా చెబుతున్నదని, సంతుష్టీకరణ శాంతిని, రాజీ గౌరవాన్ని తీసుకురాదని చైనా పేర్కొన్నది.అమెరికా చర్యలు చర్మం ఇమ్మని పులిని కోరటంగా వర్ణించింది. ప్రస్తుతం జపాన్‌, దక్షిణ కొరియా, భారత్‌ మరికొన్ని దేశాలు ట్రంప్‌ యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నాయి. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ ప్రస్తుతం ఢల్లీి పర్యటనలో ఉన్నాడు. చైనా వస్తువులపై 145శాతంగా విధించిన పన్ను, కొన్ని వస్తువులపై 245శాతం వరకు పెంచుతామని అమెరికా బెదిరించింది. తమ మీద విధించిన పన్నుల కారణంగా తీసుకోలేమంటూ అమెరికా కంపెనీ బోయింగ్‌ జెట్‌ను చైనా తిప్పి పంపింది. అమెరికాతో కలసి చైనాను దెబ్బతీయాలని మనదేశంలో కొందరు యాంకీల ఏజంట్లు నూరిపోస్తున్నారు.చైనా సరఫరా గొలుసులో మనం చేరి దాని స్థానాన్ని ఆక్రమించాలని కొందరు చెబుతున్నారు. నిజానికి స్వంత సత్తాతో ఆస్థాయికి చేరాలని ఎవరైనా కోరుకోవటం తప్పు కాదు. కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదలేరు, అలాగే అమెరికా వెంట నడచిన ఏ దేశమూ చరిత్రలో బాగుపడిన దాఖలా లేదు. కాసేపు దీని గురించి పక్కన పెట్టి వాణిజ్య పోరు గురించి జరుగుతున్న మధనం ఎలా ఉందో చూద్దాం. అమెరికా తాను చేస్తున్న ప్రతిదీ సరైనదే అనుకుటుంది కానీ సమస్య ఏమిటంటే ట్రంప్‌ ప్రతినిర్ణయం తప్పుగా తేలుతోంది.ఏప్రిల్‌ ఐదున జనం 20లక్షల మంది వీధుల్లోకి రాగా 19వ తేదీన మరోసారి పెద్ద ఎత్తున రాజరికం లేదు, రాజులేడు అంటూ నినదించారు. రెండువందల యాభై సంవత్సరాల క్రితం 1775 ఏప్రిల్‌ 19న బ్రిటన్‌ రాజరికానికి వ్యతిరేకంగా అమెరికన్లు పోరు ప్రారంభించిన రోజది. చైనా కమ్యూనిస్టులను అణచివేయాలని చూసింది అమెరికా. అయితే లాభాల కోసం అదే చైనా మార్కెట్‌ను ఉపయోగించుకోవాలనే ఎత్తుగడతో కమ్యూనిస్టు చైనాను భద్రతా మండలిలో శాశ్వత దేశంగా ఆమోదించింది.తరువాత కూడా ఒక వైపు లాభాలు పొందుతూనే మరోవైపు చైనా ఎదగకుండా కేవలం తనమీదే ఆధారపడే ఒక ఎగుమతిదేశంగా పరిమితం కావాలని చూసింది. తియన్మెస్‌ మైదానంలో విద్యార్ధుల ప్రదర్శనలు, హాంకాంగ్‌లో స్వాంత్య్రం పేరుతో జరిగిన ప్రదర్శనలు, తైవాన్‌ వేర్పాటు వాదం వెనుక దాని హస్తం గురించి తెలిసిందే. మొత్తంగా చెప్పాలంటే గత ఐదు దశాబ్దాలలో అమెరికా అనుసరించిన ప్రతిప్రతికూల విధానమూ చైనాను మరింతగా పటిష్టపరిచాయి తప్ప బలహీనపరచలేదు, దీని అర్ధం కొన్ని తాత్కాలిక సమస్యలూ, ఎదురుదెబ్బలూ లేవని కాదు. డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలతో భౌగోళిక రాజనీతిలో చైనా స్థాయి మరింత బలపడుతుందని అమెరికాను ఆర్థికంగానూ, రాజకీయంగా దాటిపోతుందని కమ్యూనిస్టు వ్యతిరేకులు వాపోతున్నారంటే అతిశయోక్తి కాదు.


చిత్రం ఏమిటంటే అమెరికన్లు, వారి చెప్పుల్లో కాళ్లు పెట్టి నడవాలని చూసే కాషాయ తాలిబాన్ల ఆలోచన ఒకే విధంగా ఉంది. గాల్వన్‌ ఉదంతం జరిగినపుడు మనం గనుక చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే డ్రాగన్‌ మన కాళ్ల దగ్గరకు వస్తుందని చెప్పినట్లే ఇప్పుడు ట్రంప్‌ గాంగ్‌ అంటోంది. చైనా మనకు చేసే ఎగుమతులతో పోల్చితే మనం చైనాకు ఐదోవంతు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం, అందువలన మన దిగుమతులు ఆగిపోతే నష్టం వారికే అని అమెరికా విత్తమంత్రి స్కాట్‌ బెసెంట్‌ చెప్పాడు. అమెరికా దిగుమతులు దాని పెద్ద బలహీనత తప్ప బలం కాదు.2018లో ఇదే ట్రంప్‌ చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు.వారి వస్తువుల మీద ఆధారపడటం నిలిపివేయాలన్నాడు. జరిగిందేమిటి ? గత ఏడు సంవత్సరాల్లో అమెరికాకు చైనా ఎగుమతులు 19.2 నుంచి 14.7శాతానికి మాత్రమే తగ్గాయి.పూర్తిగా నిలిపివేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు.జి 7 దేశాలకు చైనా ఎగుమతులు 2000 సంవత్సరంలో 48శాతం జరగ్గా 2024లో 30శాతానికి తగ్గాయి. ఇంత జరిగినా గత పదేండ్లలో ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 13 నుంచి 14శాతానికి పెరిగింది. దీని అర్ధం ఏమిటి ? చైనా తన సరకులకు ఎప్పటి నుంచో ప్రత్నామ్నాయ మార్కెట్లను వెతుక్కుంటోంది.చైనా అనే చెరువు మీద అమెరికా అలిగితే ఎండిపోయేది అమెరికన్లకే.ఎందుకంటే ప్రస్తుతం అది దిగుమతి చేసుకుంటున్న వస్తువులను తయారు చేసుకోవాలంటే దశాబ్దాలుగాకపోయినా సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. అప్పటిదాకా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న టాయిలెట్‌ పేపర్‌ వంటి వాటి దిగుమతి ఆపివేస్తారా ? ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే సరఫరా చేసే స్థితిలో ఎన్ని ఉన్నాయి ? అమెరికా బోయింగ్‌ జెట్‌ విమానాలు గాకపోతే చైనా ఐరోపా ఎయిర్‌బస్‌లను దిగుమతి చేసుకుంటుంది, లేదూ స్వయంగా తానే పూర్తిగా సమకూర్చుకొనేందుకు ఇప్పటికే ప్రారంభించిన కార్యక్రమాన్ని మరింతవేగవంతం చేస్తుంది. ఇతర వస్తువులను వేరే దేశాల నుంచి తెచ్చుకుంటుంది. మిషిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జాసన్‌ మిలెర్‌ పోగుచేసిన సమాచారం ప్రకారం ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే లిథియమ్‌ బ్యాటరీలు, ఎయిర్‌ కండీషనర్లు, వంటపాత్రల్లో 70, స్మార్ట్‌ ఫోన్లు, వంటగది పరికరాలు, బొమ్మల్లో 80, సూర్యరశ్మి పలకల్లో 90శాతాల చొప్పున చైనా తయారు చేస్తున్నది. కార్లు, ఫోన్లు, అనేక మిలిటరీ పరికరాలకు కీలకంగా అవసరమైన అపురూప ఖనిజాలు, లోహాలు కూడా చైనా దగ్గర గణనీయంగా ఉన్నాయి.

సకల దేశాలూ తన వస్తువులనే కొనాలని చైనా ఎవరినీ దేబిరించే స్థితిలో లేదు. విదేశాలకు అవసరమైన వాటిని కావాలనుకున్నవారికి ఉత్పత్తి చేస్తున్నది, మార్కెట్‌లేకపోతే నిలిపివేస్తుంది, నూటనలభై కోట్ల తనజనాభాకు అవసరమైన వాటి మీద కేంద్రీకరిస్తుంది.ఇప్పటికే ఆప్రక్రియ ప్రారంభమైంది. ఏండ్ల తరబడి సంపాదించిన వాణిజ్య మిగులులో కొంత భాగం సబ్సీడీగా ఇస్తే అంతర్గత మార్కెట్‌ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సోయా,జొన్నలు, మొక్క జొన్నలను ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకోవచ్చు.పశ్చిమ దేశాల మీద ఆధారపడే రంగాలను గుర్తించి స్వయం పోషకత్వం సాధించేందుకు బీజింగ్‌ పూనుకుంది. దాన్లో భాగంగానే హరిత ఇంథనం, వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం, సెమీకండక్టర్ల రంగాలలో భారీ మొత్తాలను ఖర్చు చేస్తున్నది. విపరీత పరిస్థితులలో కూడా జాతీయ ఆర్థిక రంగం సాధారణ కార్యకలాపాలను సాగించే విధంగా చూడాలని అధ్యక్షుడు షీ జింపింగ్‌ విధాన నిర్ణేతలను కోరాడు. యుద్ధం అన్న తరువాత ఓడిన వారికే కాదు విజేతలకూ దెబ్బలు తగులుతాయి, నష్టాలు సంభవిస్తాయి, వాణిజ్య యుద్ధమూ అంతే.


ఎదురుదాడిలో భాగంగా అమెరికాకు ఎగుమతి అవుతున్న అపురూప ఖనిజాల ఎగుమతులను చైనా నిషేధించింది. అవి జలాంతర్గాములు, ఫైటర్‌ జెట్ల తయారీలో కీలకంగా ఉంటాయి.తన అంబుల పొదిలో ఉన్న అస్త్రాలను అవసరాన్ని బట్టి బయటకు తీస్తున్నది.ఇప్పటికే బోయింగ్‌ విమానాల కొనుగోలు నిలిపివేసింది, కొన్ని కంపెనీలను నిషేధిత జాబితాలో చేర్చింది.యాపిల్‌,గూగుల్‌, డ్యూపాంట్‌్‌, టెస్లా వంటి కంపెనీలు తరువాత వరుసలో ఉన్నాయి.జపాన్‌ తరువాత భారీ మొత్తంలో డాలర్ల నిల్వలున్న దేశం చైనా. వాటి నుంచి అమెరికాకు 760 బిలియన్‌ డాలర్ల మేర అప్పులిచ్చింది. ట్రంప్‌ పిచ్చిపనులు కొనసాగిస్తే ఆ బాండ్లను ఒక్కసారిగా విక్రయిస్తే అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల, ద్రవ్య సంక్షోభానికి దారి తీస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఇలాంటి ఆర్థిక పరమైన దెబ్బతీసే పద్దతులను చైనా పరిశీలిస్తున్నది.అమెరికా దగ్గర కూడా కొన్ని ఆయుధాలు లేకపోలేదు. ఐరోపా, ఆసియాలో తన మిత్రదేశాలను చైనాపైకి ఉసిగొల్పేందుకు పూనుకుంది. అయితే ప్రతికూల పన్నుల విధింపులో ఏ దేశాన్నీ వదలని కారణంగా అవన్నీ జతకట్టటం సందేహమే. తమ కోసం అన్ని దేశాలూ కాస్త నొప్పి భరించాల్సిందే అంటున్నాడు ట్రంప్‌. ఎవరి సంగతి వారు చూసుకోవాలనే రక్షణాత్మక వైఖరులు పెరుగుతున్న తరుణంలో ఎంత మేరకు ఇతర దేశాలు అంగీకరిస్తాయో తెలియదు. అయినప్పటికీ ముందే చెప్పుకున్నట్లు ఇతర దేశాలను చైనా సోమవారం నాడు ముందస్తుగా హెచ్చరించింది. మారిన పరిస్థితులను ట్రంప్‌ గమనిస్తున్నట్లు లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిపిన సర్వేల్లో మెక్సికో, కెనడా, ఐరోపా దేశాల మీద పన్నులు విధించటాన్ని వ్యతిరేకించినప్పటికీ చైనా మీద దాడిని 56శాతం మంది సమర్ధించినట్లు సిబిఎస్‌ తెలిపింది.కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎక్కించుకున్న వారు సహజంగానే చైనా మీద దాడిని అంగీకరిస్తారు. కానీ అదే ట్రంప్‌ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేమిటి ?ద్రవ్యోల్బణం, ధరలను, పన్నుల భారం తగ్గిస్తానని చెప్పాడు. గద్దె నెక్కగానే విముక్తి పేరుతో ఎడాపెడా పన్నులు విధింపు ప్రకటన చేయగానే అమల్లోకి రాక ముందే ధరలు పెరిగి జనం కొనుగోళ్లకు ఎగబడ్డారా లేదా ? కొత్తగా అన్న వస్త్రాలు వస్తాయనుకుంటే ఉన్న వస్త్రాలను ఊడగొట్టినట్లుగా భరించలేని భారాలను మోపితే జనం సహిస్తారా ? ఇప్పటికే రెండుసార్లు లక్షలాది మంది వీధుల్లో ప్రదర్శనలు చేశారు. అందుకే తేడా వచ్చేట్లు ఉందని ఆలోచించుకోవటానికి మూడు నెలల పాటు పన్నుల పెంపుదల పదిశాతానికే పరిమితం చేసి మిగతా వాటిని వాయిదా వేయాల్సి వచ్చింది. గతంలో మాదిరి ధరలు, నిరుద్యోగం పెరుగుదల సంభవించవచ్చనే హెచ్చరికలు వెలువడ్డాయి.ట్రంప్‌ మొరటుగా ముందుకు పోతాడా తెలివి తెచ్చుకొని వెనక్కు తగ్గుతాడా అన్నది చూద్దాం !