ఎం కోటేశ్వరరావు
నీ స్నేహితులను చూస్తే నువ్వెలాంటి వాడివో తెలుస్తుందన్నది ఒక లోకోక్తి.అనేక దేశాల నేతలు డోనాల్డ్ ట్రంప్ తమ జిగినీ దోస్తు అని చెప్పుకోవటం, చెట్టపట్టాల్ వేసుకొని తిరగటం తెలిసిందే.ట్రంప్ దాదాపు ప్రతి రోజూ ఎక్కడో అక్కడ మీడియాతో మాట్లాడితే, నోరు విప్పేది లేదని మోడీ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్ పచ్చి అబద్దాల కోరు అని చైనా తాజాగా చెబుతోంది, ఒక్క చైనాయే కాదు, అమెరికా మీడియా సైతం గతంలో, ఇప్పుడూ అదే చెబుతోంది.రోజూ ఎన్ని అసత్యాలు, తప్పుడు సమాచారం చెబుతున్నదీ లెక్కలు తీయటం ఒక పనిగా మారింది. తాజా అబద్దం ఏమిటంటే చైనా అధ్యక్షుడు తనతో మాట్లాడినట్లు ట్రంప్ చెప్పాడు.ఎప్పుడు అంటే అవన్నీ మీకెందుకు మూడు నాలుగు వారాల్లో పన్నుల మీద అమెరికా ఒప్పందం చేసుకుంటుంది అన్నాడు. పన్నుల నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు చైనా సంకేతం పంపింది, పూర్తి విజయం నాదే అని కూడా చెప్పుకున్నాడు. టైమ్ పత్రికకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ అతను ఫోన్ చేశాడు,అది అతనివైపు నుంచి ఉన్న బలహీనతగా నేను భావించటం లేదు ’’ అన్నాడు.మరోవైపు చైనా ఎలాంటి ఆర్భాట ప్రకటనలు లేకుండా వాణిజ్య యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆర్థిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకుపోవాలో రోజువారీ సమీక్షలు చేస్తున్నది. స్వయంగా అధ్యక్షుడు షీ జింపింగ్ రంగంలోకి దిగాడు. ఆర్థిక వ్యవస్థలో సానుకూల అంశాలున్నప్పటికీ విదేశీ కుదుపుల ప్రభావం పెరుగుతున్నదని పొలిట్‌బ్యూరో సమావేశం తరువాత చైనా వార్తా సంస్థ సిన్హువా పేర్కొన్నది. అంతర్గతత ఆర్థిక వ్యవస్థకు శక్తినిచ్చేందుకు సమస్యలను ఎదుర్కొంటున్న వాణిజ్యాలకు ఊతమిచ్చేందుకు, గృహనిర్మాణాలు, పట్టణ పునరుద్దరణ పధకాలు వేగంగా పూర్తి, నిరుద్యోగులకు చెల్లించే భృతి పెంపుదల,తక్కువ, మధ్య తరగతి ఆదాయాన్ని పెంచటం,సేవారంగ విస్తరణ, వినిమయ ఖర్చు పెంపుదలను ప్రోత్సహించటం వంటి చర్యలు తీసుకుంటున్నది.
పన్నుల గురించి అమెరికాతో ఎలాంటి సంప్రదింపులు, చర్చలు జరగటం లేదని చైనా విదేశాంగ, వాణిజ్యమంత్రిత్వశాఖలు స్పష్టం చేశాయి. అమెరికా జనాలను తప్పుదారి పట్టిస్తున్నదని విమర్శించాయి. ఇక ట్రంప్ అసత్యాలు, వక్రీకరణల విషయానికి వస్తే రెండోసారి పదవీ స్వీకారం చేసిన రోజే 20 అబద్దాలు చెప్పినట్లు మీడియా విశ్లేషించింది. తొలి నాలుగేండ్ల పదవీ కాలంలో 30,573 అబద్దాలు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక వెల్లడిరచింది. తొలి వందరోజుల్లోనే 492, 2020లో ఓటింగ్‌కు ముందు నవంబరు రెండవ తేదీన ఒక్క రోజే 503 అవాస్తవాలు చెప్పి ఓటర్లను ఆకట్టుకొనేందుకు చూసినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. నిజంగా ఒక రాజకీయనేత అలా మాట్లాడతారా అన్న అనుమానం ఉంటే ట్రంప్, అతగాడి స్నేహితులను చూడాల్సిందే. ట్రంప్ నోటి నుంచి సగటున రోజుకు 21తప్పుడు సమాచారం లేదా అబద్దాలు వెలువడినట్లు తేలింది. తొలి ఏడాదిలో రోజుకు సగటున ఆరు,రెండో ఏడాది 14, మూడో ఏడు 22, నాలుగో సంవత్సరం 39 చొప్పున, అంటే పదవీ కాలం ముగిసే వ్యవధి దగ్గరపడిన కొద్దీ అబద్దాలు పెరిగాయి. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని జర్నలిజం సంస్థ ఏకంగా ట్రంప్ అబద్దాల సమాచార కేంద్రాన్నే ఏర్పాటు చేసింది. రెండోసారి తొలి రోజే రెండు ప్రసంగాలలో 20 అబద్దాలతో ప్రారంభం అయిన తీరు చూస్తే నాలుగేండ్లలో గత రికార్డును బద్దలు కొట్టేందుకు ఎంతో కాలం పట్టదనిపిస్తోంది. ఒక ప్రధానిగా నరేంద్రమోడీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎవరికైనా అభినందనలు తెలపటం ఒక సంప్రదాయం, కానీ అబద్దాల కోరు ట్రంప్‌ను నా స్నేహితుడు అంటూ మోడీ సందేశాలు పంపారు, వివిధ సందర్భాలలో వర్ణించారు. రాజకీయాల పుట్టుకతోనే అబద్దాలు కూడా వెంటవచ్చాయి గానీ ఇటీవలి కాలంలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా వాటికి డోనాల్డ్ ట్రంప్, అతగాడి బాటలో నడిచే వారు నిష్ణాతులుగా మారారు, అతగాడిని చూసి ఉత్తేజం, ఉత్సాహం పొంది ప్రపంచంలో అనేక దేశాల అధ్యక్షులు లేదా ప్రధానులు కూడా సిగ్గూ ఎగ్గూ లేకుండా అవాస్తవాలు, అసత్యాలు, వక్రీకరణలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ నాయకుడంటే ఒపీనియన్స్(అభిప్రాయాలు) మారుస్తూ ఉండాలని మహాకవి గురజాడ చురక అంటించారు, ఆయనే ఇప్పుడు బతికి ఉంటే అబద్దాలు చెప్పని వాడు రాజకీయ నేత కానేకాడని గిరీశం చేత చెప్పించి ఉండేవారు. జర్నలిస్టులు వార్తలను సేకరించే పనిలో భాగంగా నేతల మాటల్లో అబద్దాలు ఎన్ని ఉన్నాయో ఎత్తి చూపే పని భారం వారి మీద పడిరదంటే అతిశయోక్తి కాదు. ఫాక్ట్‌చెక్ పేరుతో కొన్ని సంస్థలు ప్రత్యేకంగా సిబ్బందినే నియమించాయి.
ట్రంప్ రెండవ సారి జనవరి 20న పదవిని చేపట్టి వందవ రోజు పూర్తి చేసుకొనేందుకు ముందుకు పోతున్నాడు.ఈ లోగానే మీడియాను అణచివేసేందుకు కూడా పూనుకున్నాడు. సరిహద్దులు లేని రిపోర్టర్లు అనే సంస్థ పత్రికా స్వేచ్చ మీద రాజ్యాంగేతర దాడి ఎలా జరుగుతున్నదో వివరించింది.ఆరోగ్యం, నేరాల వంటి సమాచారం తెలుసుకొనేందుకు వీలు కల్పించే ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్ల నుంచి ఎనిమిదివేల పేజీలను ప్రభుత్వం తొలగించింది. జనాలు, మీడియాకు సమాచారం అందకుండా చేయటం తప్ప ఇది మరొకటి కాదు. ప్రభుత్వం నిర్వహించే 180 రేడియో స్టేషన్లను మూసివేసేందుకు గాను వాటికి అందచేస్తున్న 110 కోట్ల డాలర్ల నిధులు నిలిపివేయాలని పార్లమెంట్‌ను కోరాడు.దీని వలన గ్రామీణ, సుదూర ప్రాంతాల వారికి వాటి సేవలు నిలిచిపోతాయి. ప్రభుత్వ రంగంలోని మీడియాకు ప్రతి ఏటా సగటున ఒక పౌరుడు చెల్లిస్తున్న మొత్తం కేవలం 1.6 డాలర్లు మాత్రమే. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అధ్యక్ష భవన వార్తలను సేకరించకుండా అసోసియేటెడ్ ప్రెస్(ఏపి) సంస్థ విలేకర్లను నిషేధించారు. మెక్సికో గల్ఫ్ పేరును అమెరికా గల్ఫ్ అని మార్చినప్పటికీ ఆ సంస్థ తన వార్తలో పాత పేరునే వినియోగిస్తుండటమే దీనికి కారణం.ఏప్రిల్ 9న ఒక కోర్టు ఈ నిషేధం ఎత్తివేయాలని ఆదేశించినప్పటికీ ఖాతరు చేయటం లేదు.తన స్వంత సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా 64సార్లు మీడియా మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు.2021 జనవరి ఆరున కాపిటోల్ వద్ద జర్నలిస్టులపై దాడి చేసిన కేసులో శిక్షలు పడిన తన అనుచరులైన 13 మంది గూండాలను క్షమాభిక్ష పేరుతో విడుదల చేశాడు.మీడియా సంస్థలను వేధించేందుకు ఆరు కంపెనీలపై విచారణకు ఆదేశించాడు. ప్రాజెక్టు 2025 పేరుతో ట్రంప్ అజెండాకు రూపకల్పన చేసిన బ్రెండన్ కార్, మీడియా నియంత్రణ కమిషన్ చైర్మన్ను చేసిన తరువాత ట్రంప్ గురించి విమర్శనాత్మక వార్తలను అందించే సిబిఎస్, ఎబిసి, ఎన్‌బిసి, ఎన్‌పిఆర్, పిబిఎస్, కాలిఫోర్నియా టెలివిజన్‌లపై విచారణ పేరుతో వేధింపులకు పూనుకున్నాడు. నాలుగు సంస్థలపై ట్రంఫ్ వ్యక్తిగతంగా పరువు నష్టం కేసులు వేశాడు.
ఇక కమ్యూనిజానికి, తమను వ్యతిరేకించే దేశాల గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు అమెరికా ప్రభుత్వం యుఎస్ ఏజన్సీ ఫర్ గ్లోబల్ మీడియా అనే సంస్థను దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేసింది. తరువాత మీడియా పెద్ద ఎత్తున విస్తరించి అలాంటి ప్రచారం చేసేందుకు వాటితో పెద్దగా అవసరం లేకపోయింది. అందుకే అది నిర్వహించే రేడియో, టీవీ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం నిధులను నిలిపివేసింది, విలేకర్లను సెలవుపై వెళ్లాలని కోరారు. ఈ సంస్థద్వారా నిర్వహించే వాయిస్ ఆఫ్ అమెరికా, రేడియో ఫ్రీ ఆసియా, యూరోప్, లిబర్టీ వంటి వాటిలో కమ్యూనిస్టు, ప్రజాస్వామ్య వ్యతిరేక వార్తలను ప్రచారం చేస్తున్నారు. అవి ఎంతగా రెచ్చగొట్టినా అమెరికా పాలకవర్గానికి వచ్చిన మేలేమీ లేకపోవటంతో ట్రంప్ వాటిని అజాగళస్థనాలుగా భావించి నిధులు నిలిపివేశాడు.ఈ చర్య వలన మూడున్నరవేల మందికి పైగా జర్నలిస్టులు, ఇతర సిబ్బంది ఉపాధి కోల్పోనున్నారు. ఈ సంస్థలలో పని చేస్తూ తప్పుడు వార్తలను ప్రచారం చేసిన జర్నలిస్టులలో విదేశాలకు చెందిన 84 మందిని స్వదేశాలకు పంపాలని నిర్ణయించింది, అయితే వారిలో అనేక మందిని ఆయా దేశాలు కేసులు పెట్టి జైలు పాలు చేసే అవకాశం ఉందట. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేసేందుకు వివిధ దేశాలలో ప్రయివేటు టీవీలు, పత్రికలకు, కొందరు జర్నలిస్టులకు సిఐఏ, ఇతర సంస్థల ద్వారా పెద్ద ఎత్తున నిధులు అందచేస్తున్న సంగతి తెలిసిందే.
