Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

         హైపర్‌సోనిక్‌(ధ్వనికంటే ఐదురెట్లు వేగంగా ప్రయాణించే) క్షిపణులను అడ్డుకోవటం ఎంతో కష్టం, అందువలన భారత్‌కు వందలాది ఉపగ్రహాలు అవసరం అని ఇస్రో మాజీ అధిపతి ఎస్‌ సోమనాథ్‌ వ్యాఖ్యానించారు. జూన్‌ పదవ తేదీన కొన్ని పత్రికల్లో పెద్ద ప్రాధాన్యత లేకుండా ఈ వార్త వచ్చింది. సోమనాథ్‌ మాటల సారం ఏమిటంటే పెద్ద సంఖ్యలో  ఉపగ్రహాలు లేకపోతే సంక్షోభాలు తలెత్తినపుడు దేశ సాయుధ దళాలకు ముప్పు. ఇటీవలి కొన్ని ఉదంతాల్లో ఇది ప్రదర్శితమైంది. ఉదాహరణకు ఉక్రెయిన్‌ పోరులో అది ఎంత కీలక పాత్ర పోషించిందో బాగా కనిపించింది, అంతేగాదు ఇటీవల భారత్‌కూ అది అనుభవమైంది. క్షిపణుల ప్రయోగాలను ముందుగానే పసిగట్టేందుకు హెచ్చరికలు చేయటంతో పాటు వాటికి ప్రతి చర్యలను సూచించేందుకు ఐదువందల ఉపగ్రహాల రాసి అవసరమని అమెరికా పథకం రూపొందించింది.ఈ స్థాయికి భారత్‌కూడా ఎదగాలి.ఒక ఉపగ్రహం 15 నిమిషాల లోపు మాత్రమే పరిశీలించగలదు, అది వెళ్లిపోగానే వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు మరొకటి రావాలి. ఆధునిక యుద్ధాలలో ఉపగ్రహాల అవసరం, ప్రయోజనం గురించి సోమనాథ్‌ చాలా స్పష్టంగా చెప్పారు. మన పాలకులు చెప్పినా చెప్పకపోయినా ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌ మిలిటరీ మన విమానాలను కొన్నింటిని కూల్చిందన్నది వాస్తవం, యుద్ధం అన్న తరువాత నష్టాలు లేకుండా ఉంటాయా అని మన మిలిటరీ అధికారులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

     అంతరిక్షంలో చైనా తీక్షణత కారణంగా కీలకమైన సాయం చేయగలిగిందని దాంతో పాకిస్తాన్‌ విజయవంతంగా అడ్డుకోగలిగాయని భారతీయ మిలిటరీ వర్గాలు చెప్పినట్లు డిఫెన్స్‌ సెక్యూరిటీ ఆసియా అనే వెబ్‌సైట్‌ జూన్‌7వ తేదీన ప్రచురించిన విశ్లేషణలో పేర్కొన్నది. చైనా తెరవెనుక పాత్ర కారణంగానే ఆరు భారతీయ యుద్ద విమానాలను కూల్చివేయగలిగింది. సమాచారాన్ని పంచుకోవటం, దానికి అనుగుణంగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవటం వలన భారత విమానాలను పసిగట్టగలిగింది.‘‘ వారి వైమానిక రాడార్‌ను అవసరానికి అనుగుణంగా మోహరించటానికి అది(చైనా) వారికి(పాకిస్తాన్‌) సాయపడిరది. అందువలన మన వైమానిక మార్గంలో చేసే చర్యలు వావారికి తెలిసిపోతుంది ’’ అని భారత రక్షణ శాఖ పర్యవేక్షణలో పని చేసే సెంటర్‌ ఫర్‌ జాయింట్‌ వార్‌ఫేర్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌ కుమార్‌ చేసిన ప్రకటనను ఆ వెబ్‌సైట్‌ విశ్లేషణ ఉటంకించింది. ఆపరేషన్‌ సిందూర్‌ ఘర్షణను కేవలం తన సన్నిహిత ప్రాంతీయ అనుయాయికి మద్దతు ఇచ్చే వ్యూహాత్మక అవకాశంగానే గాక  తను అధునాతన రక్షణ సాంకేతిక పరిజ్ఞానం ఆచరణలో ఎలా పని చేస్తుందో పరీక్షించటానికి కూడా చైనా వినియోగించుకుందని అశోక్‌ కుమార్‌ చెప్పారు.చైనా యావోగాన్‌ ఐఎస్‌ఆర్‌ ఉపగ్రహాలు భారత విమానాలు, మిలిటరీ జాడను కనిపెట్టటంలో నిర్ణయాత్మక పాత్రను పోషించాయని, పాకిస్తాన్‌ పైచేయి సాధించటానికి తోడ్పడినట్లు భారత రక్షణశాఖ వర్గాలు తెలిపినట్లు సదరు విశ్లేషణ పేర్కొన్నది. ఒక మేథావి, అధ్యయనవేత్తగా అశోక్‌ కుమార్‌ చెప్పిన ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎందుకు చెప్పలేకపోయిందన్నది సామాన్యులకు అంతుబట్టటం లేదు. .

     యావోగాన్‌ ఉపగ్రహాలు దక్షిణ చైనా సముద్రం నుంచి హిమాలయాల వరకు నిఘావేయగల వ్యవస్థలను కలిగి ఉన్నాయి.2023 డిసెంబరులో ప్రయోగించిన యావోగాన్‌ 41 ఉపగ్రహం ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా భారత ఉపఖండంపై కీలకమైన వైమానిక స్థావరాలు, ప్రాంతాల వివరాలను సేకరించినట్లు ఆరోపిస్తున్నారు. దీన్ని తాము వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల యాజమాన్యం కోసం దీన్ని ప్రయోగించినట్లు చైనా చెబుతోంది.  మిలిటరీ అవసరాలకూ వినియోగించవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చైనా ప్రస్తుతం లియో(లోఎర్త్‌ ఆర్బిట్‌), ఎంఇఓ(మీడియం ఎర్త్‌ ఆర్బిట్‌), జియో(జియో స్టేషనరీ అర్బిట్‌) అనే మూడు రకాల ఉపగ్రహాలు మొత్తం 5,330 కలిగి ఉందని, వీటిలో మిలిటరీ, ఇతర అవసరాలకు ఎన్నింటిని వినియోగిస్తున్నారన్నది వివరాలు తెలియకపోయినా, మనదేశానికి ఉన్న అన్నిరకాలు  218 ఉపగ్రహాలతో పోలిస్తే చైనా ఆధిపత్యం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వీటిలో ఎక్కువ భాగం పౌరఅవసరాల కోసం అంటున్నారు.2030 నాటికి మిలిటరీ అవసరాల కోసం 52 ఉపగ్రహాలను ప్రయోగించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది.     నిఘా,సమాచారం,లక్ష్యాల నిర్దేశానికి వీటిని వినియోగిస్తారు. మనదేశం ఎన్‌విఎస్‌ 02 రకం ఉపగ్రహాలతో మనదేశ సరిహద్దులకు పదిహేను వందల కిలోమీటర్ల పరిధిలో నిఘావేయగలదని, దాని ప్రయోగాలకు సిద్దం చేస్తున్నారు. ఇది అమెరికా జిపిఎస్‌, చైనా బెయిడౌ వ్యవస్థలతో సమానమైదని భావిస్తున్నారు. ఇస్రో మాజీ అధికారి మాధవన్‌కు ఇవన్నీ తెలిసినవే అయినప్పటికీ పెద్ద సంఖ్యలో ఉపగ్రహాల అవసరాల గురించి చెప్పిన మాటలను మన విధాన నిర్ణేతలు విస్మరించకూడదు. ఎవరో ఏదో చేస్తారని గాకపోయినా నేడున్న ప్రపంచ పరిస్థితులలో ఎవరి జాగ్రత్తలో వారుండటం అవసరం. పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి పాకిస్తాన్‌ దుర్మార్గాన్ని ప్రపంచానికి వివరించేందుకు మన పార్లమెంటరీ బృందాలు పర్యటించిన సంగతి తెలిసిందే.అమెరికా ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో రెండు దేశాలూ తమకు ముఖ్యమే అని చెప్పటమే కాదు, ఐరాసలో ఉగ్రవాద నిరోధ కమిటీ ఉపాధ్యక్ష పదవిని పాకిస్తాన్‌కు కట్టబెట్టటం, అన్నింటినీ మించి జి7 సమావేశం నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చి పాక్‌ ఫీల్డ్‌ మార్షల్‌ మునీర్‌ అసిమ్‌కు విందు ఏర్పాటు చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీరు మన పుండు మీద కారం రాసినట్లుగా ఉంది.

     సురక్షితమైన చేతుల్లో దేశం ఉందని ప్రధాని నరేంద్రమోడీ గురించి గొప్పగా ప్రచారం చేశారు.ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో మనలోపాలు వెల్లడయ్యాయి, వెంటనే వాటిని అధిగమించి పాక్‌ను దెబ్బతీశామని మన అధికారులు చెప్పారు. విదేశీ మీడియా సంస్థలు ఏ విషయాన్నీ దాచటం లేదు. రాఫెల్‌ విమానాలు కూలిపోయిన అంశాన్ని అధికారికంగా అంగీకరించనప్పటికీ దాని సామర్ధ్యం గురించి తలెత్తిన సమస్యల గురించి చర్చించేందుకు, దెబ్బతిన్న సంబంధాలను మరమ్మతు చేసేందుకు మనవిదేశాంగ మంత్రి జై శంకర్‌ ఫ్రాన్సు పర్యటించినట్లు డిఫెన్స్‌ సెక్యూరిటీ ఆసియా జూన్‌ పదిన రాసింది.తమ విమానాల కూల్చివేత గురించి భిన్నమైన వార్తలు వచ్చిన నేపధ్యంలో వాటిని విక్రయించిన దసాల్ట్‌ ఏవియేషన్‌ కంపెనీ భారత్‌లో ఉన్న తమ విమానాలను తనిఖీ చేసేందుకు ఒక స్వతంత్ర బృందాన్ని పంపుతామని ప్రతిపాదించగా మన దేశం తిరస్కరించినట్లు ఆ విశ్లేషణలో ఉంది.(ఒకసారి తనిఖీకి అనుమతిస్తే తమ విమానాలు ఎన్ని ఉన్నాయో వారికి తెలుస్తుంది, ఎన్ని లేకపోతే అన్ని కూలినట్లే, తరువాత అయినా ఆ వివరాలు వెల్లడైతే ఇబ్బంది గనుక మనదేశం తిరస్కరించి ఉండవచ్చు. తమ విమానాల గురించి అనుమానాలు పెరిగితే మార్కెట్‌లో పరువు పోతుంది, కొనుగోళ్లకు సందేహిస్తారన్నది దసోల్ట్‌ సమస్య)  తమ విమానాల్లో ఎలాంటి లోపం లేదని భారత వైమానిక దళంలోనే వ్యవస్థాపరమైన వైఫల్యాలు ఉన్నట్లు దసాల్ట్‌ భావిస్తోందట.అనవసరంగా తమ విమానాలను బదనాం చేశారని అది ఆగ్రహిస్తోందని వార్తలు.  మధ్యప్రాచ్యం, లిబియాల్లో తమ విమానాలు అద్భుతంగా పనిచేశాయని, తగినంత అనుభవం ఉన్న సిబ్బంది, సమన్వయం ఉంటే రాఫేల్‌కు తిరుగులేదని చెప్పుకుంటోంది.  అవసరమైన పైలట్లు కూడా భారత్‌లో లేరని కొరత, నిర్వహణ సమస్యలు ఉన్నట్లు వెబ్‌సైట్‌ విశ్లేషణలో పేర్కొన్నారు. పాక్‌తో ఇటీవలి వివాదానికి ముందు 2015లో 486 మంది ఉండగా తరువాత ఉన్న గణనీయంగా పెరిగినప్పటికీ ఇంకా 596 మంది పైలట్ల కొరత భారత వాయుసేనలో ఉన్నట్లు పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన కాగ్‌ నివేదికలో ఉన్నట్లు ఉటంకించారు.2016 నుంచి 2021 మధ్య ఏటా 222 మంది కొత్త పైలట్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ తక్కువ మందినే ఎంపిక చేసినట్లు పేర్కొన్నది. అవసరమైతే చైనా, పాకిస్తాన్‌లను ఎదుర్కొనేందుకు మన వాయుసేన 42 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలకు అనుమతి ఉండగా ప్రస్తుతం 31 మాత్రమే ఉన్నాయి. 2024 సెప్టెంబరు 19వ తేదీన వచ్చిన ఒక విశ్లేషణలో 30 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయని, 2025 చివరి నాటికి రెండు మిగ్‌`21 విమానాలతో కూడిన రెండు దళాలు సర్వీసు నుంచి తప్పుకుంటాయని పేర్కొన్నారు. ఒక స్క్వాడ్రన్‌ అంటే సంఖ్య ఎంత అనేదానిలో అన్ని చోట్లా ఒకే విధంగా లేవు. సాధారణంగా పన్నెండు నుంచి 24వరకు ఉంటాయి, కొన్ని  సందర్భాలలో అంతకంటే తక్కువతో కూడా ఉండవచ్చు.పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడుల తరువాత 2019లో నరేంద్రమోడీ దేశం సురక్షిత హస్తాల్లో ఉందని ఒక సభలో చెప్పారు. దీనికి రెండు రకాల భాష్యాలు చెప్పవచ్చు. ఒకటి మన మిలిటరీ, దాని గురించి వేరే చెప్పనవసరం లేదు,ప్రాణలను ఫణంగా పెట్టి పని చేస్తున్నది తెలిసిందే. రెండవది పరోక్షంగా నరేంద్రమోడీ గురించి. ఆయన భక్తులు రెండోదాన్నే ఎక్కువగా ప్రచారం చేశారు. పదకొండు సంవత్సరాలుగా రక్షణ రంగంలో తీరుతెన్నులను చూశాం గనుక వాస్తవం ఏమిటో వేరే చెప్పనవసరం లేదు.

   మిలిటరీ గూఢచర్యం, నిఘా వంటి అవసరాలకు స్వంత ఉపగ్రహాలు లేని కారణంగా విదేశీ సంస్థల మీద ఆధారపడుతున్నాం. వారిచ్చే సమాచారం ఒక్కోసారి మనలను తప్పుదారి పట్టించేదిగా ఉంటోంది.గాల్వన్‌ ఉదంతాలలో అదే జరిగిందని చెబుతారు.లండన్‌ కేంద్రంగా పని చేస్తున్న  మిలిటరీ బాలన్స్‌ 2024నివేదిక ప్రకారం చైనా 245 మిలిటరీ ఉపగ్రహాలను నిర్వహిస్తుండగా మనం 26 మాత్రమే కలిగి ఉన్నాం.రెండోసారి వినియోగించే అంతరిక్ష నౌక  కూడా చైనా వద్ద ఉంది. ప్రత్యర్ధులను అడ్డుకొనేందుకు అంతరిక్షంలో ఆధిపత్యాన్ని సాధించేందుకు చైనా ఆసక్తితో ఉందని ఆస్ట్రేలియన్‌ వ్యూహాత్మక విధాన సంస్ధ సీనియర్‌ విశ్లేషకుడు మాల్కమ్‌ డేవిస్‌ చెప్పాడు. అమెరికా దాని అనుబంధ ఉపగ్రహాలకు ప్రతిగా అంతరిక్ష సామర్ధ్యాలను అభివృద్ధి చేస్తున్నదని, ఏ విధంగా చూసినా అమెరికాను అధిగమించేందుకు పూనుకున్నదన్నారు.

      గూఢచర్యం, నిఘా, ముందుగా సర్వే చేసే శక్తి కలిగిన ఐఎస్‌ఆర్‌ రకం 290ఉపగ్రహాలను చైనా మిలిటరీ నిర్వహిస్తున్నదని, మొత్తం ప్రపంచంలో ఉన్నవాటిలో అవి సగమని అమెరికా రక్షణ శాఖ 2023లో పేర్కొన్నది. కొరియా ద్వీపకల్పం, దక్షిణ చైనా సముద్రం, హిందూమహాసముద్రాలను పరిశీలించేందుకు వీలుకలుగుతుందని కూడా చెప్పింది.క్వాంటమ్‌ సమాచార ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించిందని, ఎలాంటి అంతరాయం లేకుండా సమాచారాన్ని అందుకోగలదని కూడా అమెరికా నివేదిక చెప్పింది. అయితే మనదేశం, ఇతర దేశాలను భయపెట్టి తన అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా కొన్ని కల్పిత అంశాలను కూడా నివేదికల్లో పొందుపరుస్తుందని గమనించాలి. అమెరికా, నాటో కూటమి మిలిటరీలతో పోలుస్తూ ఆధునిక ధోరణులను అనుసరించటంలో చైనా మిలిటరీ ఎంతో వేగంగా పనిచేస్తుందని లండన్‌లోని సిటీ యూనివర్సిటీ ఫ్రొఫెసర్‌ డేవిస్‌ స్టుపుల్స్‌ చెప్పాడు. అమెరికాకు పోటీగా  ఐదు మీటర్ల సమీపం వరకు వెళ్లి సమాచారాన్ని పంపే స్వంత జిపిఎస్‌ వ్యవస్థలో చైనా 45ఉపగ్రహాలను కలిగి ఉంది. అంతే కాదు ఉపగ్రహాలను కూల్చివేయగల సామర్ధ్యాలను కూడా అది సమకూర్చుకుంటున్నది. అయితే ఇంతవరకు అలా కూల్చిన ఉదంతాలు లేవు గానీ అలాంటి సామర్ధ్యం తమకు ఉన్నట్లు వారు ప్రదర్శిస్తున్నారని డేవిస్‌ చెప్పాడు. ఉపరితలం నుంచి లేజర్‌ కిరణాల ద్వారా అంతరిక్షంలోని ఉపగ్రహాలు పనిచేయకుండా చేయటం, చిందరవందర చేయటం లేదా నష్టపరచగలదని అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ అనుమానిస్తున్నది.పని చేయని ఒక ఉపగ్రహాన్ని కూల్చివేసేందుకు చైనా 2007లో ఒక క్షిపణి ప్రయోగం చేసింది, తరువాత వాటిని కొనసాగిస్తున్నది, ఇది చాలా తీవ్ర విషయమని భావిస్తున్నారు.మనదేశం కూడా 2019లో అలాంటి ప్రయోగమే చేసింది. అమెరికా కూడా అదే పనిచేస్తున్నప్పటికీ దాన్ని పశ్చిమ దేశాలు తీవ్ర అంశంగా పరిగణించకపోవటం గమనించాల్సిన అంశం.  అమెరికాలోని ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ ప్రైవేటు రంగంలో ఉపగ్రహ ఇంటర్నెట్‌ రంగంలో ముందున్నది, దానికి ధీటుగా చైనా ప్రభుత్వ రంగ సంస్థ శాట్‌నెట్‌ పదమూడువేల ఉపగ్రహాలను ఇంటర్నెట్‌కోసం అనుసంధానం చేసేందుకు గువోవాంగ్‌ పేరుతో పని చేస్తున్నది.

     చంద్రయాన్‌ వంటి ప్రయోగాలతో మన ఇస్త్రో శాస్త్రవేత్తల కృషి కూడా తక్కువేమీ కాదు. చైనాతో పోల్చితే మన వేగం చాలా తక్కువగా ఉంది. ఇలా చెప్పటాన్ని కొందరు ఇస్రో కృషిని తక్కువ చేసి చూపటంగానూ, దేశద్రోహంగానూ చిత్రించేవారున్నారు. వాస్తవాన్ని దాచి జనాలను భ్రమల్లో ఉంచటం దేశభక్తా, వంచనా ? నైపుణ్య వృద్ధి పేరుతో వేలాది కోట్లు తగలేస్తున్నారు.ముందే చెప్పుకున్నట్లుగా ఇంత పెద్ద దేశంలో మన వాయుసేనకు అవసరమైన సంఖ్యలో శిక్షణ ఇవ్వటానికి పైలట్లుగా ఎవరూ దొరకలేదంటే నవ్విపోతారు.పరిశోధన మరియు అభివృద్దికి మన దేశం జిడిపిలో 0.7శాతానికి అటూ ఇటూగా ఖర్చు ఉంది, అదే చైనా 2.7శాతం వరకు ఖర్చు చేస్తున్నది. ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి అని చతికిల పడిన తరువాత నాలుగు లక్షల కోట్లు, జపాన్‌ అధిగమించామని చంకలు కొట్టుకోవటం కాదు, చేయాల్సిన చోట ఖర్చు చేయటం ముఖ్యం. ప్రభుత్వ రంగం అసమర్ధంగా ఉందని చిత్రించి 1990దశకం నుంచి పూర్తిగా ప్రైవేటు రంగానికి అప్పగించటమే కాదు ఉన్న ప్రభుత్వ రంగాన్ని మూసివేసి ఆస్తులను తెగనమ్ముతున్నారు. మూడున్నర దశాబ్దాల ప్రైవేటు రంగం సాధించిందేమిటి ? చైనాను అనుకరిస్తామని చెబుతారు, అక్కడేమీ ప్రభుత్వ రంగ ప్రాధాన్యతను తగ్గించలేదు, పెంచుతూనే ఉన్నారు.మన ప్రయివేటు రంగం అంత సమర్ధత కలిగితే ఎందుకని చైనా కంటే జిడిపిలో మనదేశం అంతవెనుక బడి ఉంది.

          మన దేశం ఇటీవల ఏడాదికి మూడు ఉపగ్రహప్రయోగాలు జరుపుతుండగా ఈ ఒక్క ఏడాదే చైనా వంద ప్రయోగాలకు ప్రణాళిక రూపొందించింది.చైనా నిఘా ఉపగ్రహాలు కక్ష్య నుంచి ఐదు వందల కిలోమీటర్ల వరకు యుద్ధాలు, ఉద్రిక్తతల సమయంలో ప్రత్యర్ధుల మిలిటరీ కదలికలను పసిగట్టటం, లక్ష్యాలను గురిచూడటం వంటి పనులు చేయగలవు. రష్యా, ఉక్రెయిన్‌ పోరులో పశ్చిమ దేశాలకు చెందిన ఇలాంటి ఉపగ్రహాలు ఇచ్చిన సమాచారంతోనే ఉక్రెయిన్‌ దాడులు చేయగలుగుతున్నట్లు చెబుతున్నారు. పశ్చిమ దేశాల ముఖ్యంగా అమెరికా ప్రైవేటు సంస్థలు టిటెట్‌ తదితర సరిహద్దు ప్రాంతాల్లో చైనా మోహరింపు గురించి మన దేశానికి సమాచారాన్ని అందచేస్తున్నాయి.ఇటీవల చైనా కూడా పాకిస్తాన్‌కు అలాంటి సాయమే చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మనం ఇతరుల మీద ఆధారపడుతుండగా చైనా స్వంతంగా సమకూర్చుకుంటోంది. పెట్రోలు, డీజిలుపై భారీ మొత్తం సెస్‌ విధించి వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నారు. ఎందుకు అని ప్రశ్నిస్తే దేశ రక్షణ అవసరాలకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. అదే నిజమైతే చైనా కంటే ఇంతగా ఎందుకు వెనుకబడి ఉన్నట్లు ?