Tags

, , , , ,

డాక్టర్ కొల్లా రాజమోహన్

దశాబ్దాల నాటి 1966 విత్తనాల చట్టాన్ని, సీడ్ కంట్రోల్ ఆర్డర్, 1983 బదులుగా 2025 విత్తనాల ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టబోయే ముందుఒక నెలలోపున ప్రజల అభిప్రాయం కోరుతూ ఈ ముసాయిదా బిల్లును ప్రకటించింది. డిసెంబర్ 11 లోగా సూచనలు సమర్పించాలని ప్రజలను కోరారు.

రైతులకు అధిక నాణ్యత గల మంచి విత్తనాల లభ్యతను పెంచడం మరియు నకిలీ విత్తనాలు, నాణ్యత లేని విత్తనాల అమ్మకాలను అరికట్టడం లక్ష్యాలుగా ముసాయిదా బిల్లు నిర్ధారిస్తున్నది. మార్కెట్లో విక్రయించబడే అన్ని విత్తన వెరైటీస్ కి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తున్నది.. రైతులు సంప్రదాయంగా వాడుకునే వెరైటీలు మినహాయిస్తానంటున్నది. దీనివలన విత్తనాలనాణ్యత, పనితీరు గురించి ప్రభుత్వమువద్ద అధికార సమాచారం ఉంటుందని అంటుంది.

ఎవరికోసం

జన్యుమార్పిడి విత్తనాలను , కొత్త హైబ్రిడ్ విత్తనాలనుకార్పొరేట్ కంపెనీల నుంచి తేలికగా దిగుమతి చేసుకోవడానికి చట్టాలను సవరిస్తున్నారు. జన్యుమార్పిడి విత్తనాలు, దిగుమతి చేసుకునే విత్తనాల సాగుకు  పురుగు మందులు, ఎరువులు, నీళ్ళు ఎక్కువ అవసరం. మనం కార్పొరేట్ కంపెనీ వ్యవసాయ ఉచ్చులో చిక్కుకుంటున్నాము. ఈ బిల్లు కార్పొరేటర్లకు అనుకూలంగా ఉన్నది. చిన్న రైతులను నాశనం చేసేటట్లు గా ఉంది . తరతరాలుగా జాగ్రత్తగా చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని పురాతన విత్తన రకాల వెరైటీస్ ని రక్షించుకోవడానికి ఏమాత్రం సహాయం చేసే పరిస్థితి లేదు. సాధారణ రైతులకు, ముఖ్యంగా సాంప్రదాయ విత్తనాలను తయారుచేస్తున్న రైతుల ప్రయోజనాలకు. నష్టం కలుగుతుంది.

కేంద్రీకృత అనుమతి (Centralised Clearance):

 ఒక కంపెనీ కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు (Accreditation) పొందితే, అది దేశంలోని అన్ని రాష్ట్రాలలో విత్తనాలను విక్రయించడానికి అనుమతి పొందినట్లే. బహుళ రాష్ట్రాల నియంత్రణ లేనందున కార్పొరేట్ కంపెనీల వ్యాపార విస్తరణను వేగవంతం చేస్తుంది. రాష్ట్రాలపై కేంద్ర పెత్తనాన్ని సుస్ధిర పరుస్తున్నారు. 

కంపెనీలు ప్రతి రాష్ట్రంలో వేర్వేరు అనుమతులు పొందాల్సిన అవసరం ఉండదు. నియంత్రణల సరళీకరణ పేరున (Deregulated Control) అపరిమితమైన స్వేచ్ఛ లభిస్తుంది. కంపెనీల ఉల్లంఘనలపై నేరారోపణలను తొలగించారు లేదా శిక్షలను తగ్గించినందువలన  కంపెనీల అధికారులు జైలుకు వెళ్లాల్సిన భయం తప్పుతుంది. మైనర్ నేరాలుగా భావించమంటున్నారు.

విత్తనాల డీలర్లు, పంపిణీ దారులు విత్తనాలను విక్రయించడానికి, దిగుమతి చేసుకోవడానికి, ఎగుమతి చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. క్యూ ఆర్ కోడ్ ద్వారా పక్కా నియంత్రణ వుంటుంది. చిన్న వ్యాపారస్తులు పోటీ లో నిలబడలేరు. పెద్ద కార్పొరేట్ కంపెనీల కు కేంద్రీకృత అనుమతి వలన వ్యాపారం సులభమవుతుంది.

నకిలీ విత్తనాలు

వ్యవసాయ మంత్రిత్వ శాఖ చాలా కాలంగా నకిలీ విత్తనాల గురించి మాట్లాడుతుంది. కార్పొరేట్ కంపెనీలు నకిలీ విత్తనాలు అమ్మితే కఠినమైన జరిమానా విధించబడుతుందనే అభిప్రాయాన్ని కలిగించింది .అయితే ప్రస్తుత బిల్లులో ఎటువంటి కఠినమైన నిబంధనలను ప్రతిపాదించలేదు. ముసాయిదాలో ఫేక్ సీడ్స్ నకిలీ విత్తనాలు అనే పదం లేదు. 

ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఖరీఫ్ రబీ సీజన్లో నకిలీ , నాణ్యతలేని నాసిరకం విత్తనాల అమ్మకాల కారణంగా రైతులు భారీగా నష్టాలు చవిచూస్తున్నారు. విత్తనాలు అమ్మిన కంపెనీలు ముందు ఒకరకంగా వాగ్దానాలిస్తున్నారు. మొలక శాతానికి, దిగుబడులకు మాదే గ్యారంటీ అంటూన్నారు. అమ్ముకున్నతరువాత సమస్య వచ్చినపుడు ముఖం చాటేస్తున్నారు.

విత్తన సరఫరా గొలుసులో పారదర్శకత , జవాబుదారితనం నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్న బిల్లు ఏమి చెప్తున్నదో చూడండి.

“సెక్షన్ 31కింద నియమించబడిన సీడ్ ఇన్స్పెక్టర్ కు విషేష అధికారాలను ఇచ్చారు. అనుమానం వచ్చిన విత్తనాల సాంపుల్స్ ను ఆ ప్రాంత అనలిస్ట్ దగ్గరకు పంపి , స్టాక్ ను సీజ్ చేయాలి. సీడ్ ఇన్స్పెక్టర్ కు అనుమానం వచ్చినప్పుడు ఇంటి తలుపులు పగలకొట్టైనా అనుమానం వున్న విత్తనాలను స్వాధీనం చేసుకునే అధికారాలను ఇచ్చారు.అపరిమితమైన అధికారాలను సీడ్ ఇన్స్పెక్టర్క ను కట్టబెట్టారు.

రైతులు, విత్తన కంపెనీలను అనవసరంగా కోర్టు కేసుల లోకి లాగుతున్నారట—- కొంతమంది స్వార్థ ప్రయోజనాలు కలిగినటువంటి రైతులు కంపెనీలను అనవసరంగా కోర్టుకులాగుతున్నందున కంపెనీల ను  రక్షించాలని ప్రభుత్వం వాదించింది.  25 నాటికి భారత విత్తన మార్కెట్ విలువ దాదాపు 3.8 2 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా మరియు 2030 నాటికి దాదాపు 5.5% వార్షిక వృద్ధిరేటుతో దాదాపు 5 బిలియన్ డాలర్లు పెరుగుతుందని అంచనా వేయబడింది. ఇంత భారీ మార్కెట్ పై బేయర్స్, మాన్సాంటో , సింజెంటా లాంటి కార్పొరేట్ కంపెనీలు కన్ను వేశాయి.  పెద్ద కంపెనీలు తప్పులు చేయరంటున్నారు. వలస పాలకులు తమ  సహాయకులు రక్షించేందుకు ఉపయోగించిన Good Faith క్లాజును విత్తన చట్టం లో కూడా ప్రయోగిస్తున్నారు. 

చట్టాలను అతిక్రమించే కార్పోరేట్ కంపెనీల కు వెసులుబాటు ఇలా వుంటుందట. 

మొదటి తప్పు, రెండవ తప్పు లకు పెనాల్టీ లేదు,

ప్రధమ తప్పు -రెండవ తప్పు -మూడు సంవత్సరాలు అదే తప్పు చేస్తూవుంటే , అపుడు 2 లక్షల రూపాయలు పెనాల్టీ విధించవచ్చు.

కేంద్ర ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వం అవసరాన్ని బట్టి పెనాల్టీని నిర్ణయించటానికి సెక్షన్ 34 ప్రకారం ఒక నోటిఫికేషన్ ద్వారా ఒక ఆఫీసర్ ను  నిర్ణయించవచ్చు. ప్రభుత్వం నియమించిన ఆఫీసరు పెనాల్టీని నిర్ణయిస్తాడు. ఆ ఆఫీసురు సెక్షన్ 31 ప్రకారం ప్రధమ తప్పు అని భావిస్తే కంపెనీని శిక్ష లేకుండా వదిలేయొచ్చు.

లేకపోతే 50 వేల పెనాల్టీని, చిన్న తప్పు కింద విధించవచ్చు . మూడు సంవత్సరాల వరకు అదే తప్పులు మరలా చేస్తూ ఉంటే రెండు లక్షల పెనాల్టీ వరకు విధించవచ్చు. పెద్ద తప్పు అని భావిస్తే పది లక్షల పెనాల్టీ జరిమానా కూడా విధించవచ్చు. మరలా  ఐదు సంవత్సరాలు తర్వాత కూడా అదే పని చేస్తూ ఉంటే 30 లక్షలు వరకు కూడా పెనాల్టీ విధించడానికి, డీలర్ షిప్ ని క్యాన్సిల్ చేయడానికి, ఒక మూడు సంవత్సరాల జైలు ఖైదు విధించడానికి ఈ బిల్ అవకాశమిస్తున్నది. ప్రభుత్వ నిర్ణయించిన దాని కంటే ఎక్కువ ధరలకు అమ్మడం, రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన తర్వాత ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం విత్తన వ్యాపారాన్ని కొనసాగించటం, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను ప్రదర్శించకపోవడం, విత్తన ప్యాకెట్ పైన లేబుల్ అతికించబోవటం ఇలాంటివన్నీ కూడా చిన్న తప్పులు కింద భావిస్తారు,

విత్తనం మొలకెత్తివరకు కంపెనీలను బాధ్యత వహించేలా బిల్లు నిర్దేశించాలి. విత్తనాలు మొలకెత్తినప్పటికీ పంట దిగుబడి ఇవ్వకపోతే ఏమి చేయాలి ? విత్తన నష్టానికి గరిష్ట పరిహారంపై పరిమితి ఉండకూడదనిరైతు నాయకులు కోరుతున్నారు.

నకిలీ విత్తనాలు తరచుగా ఒకేలాంటి 

బ్రాండ్ కింద అమ్ముడు అవుతాయి , తరచుగా మొలకెత్తడంలో లేదా వాగ్దానం చేసిన దిగుబడిని అందించడంలో విఫలమవుతాయి. దీనివలన రైతుల అప్పుల భారం పెరుగుతుంది.  ఒక్క సంవత్సరంలో ఒక్క పంట నష్ట పోయినా దెబ్బ నుంచి కోలుకోలేరు. 25 లో 24 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల విత్తన తనిఖీదారులు సేకరించిన మొత్తం 2.5.లక్షల విత్తన నమూనాలలో 32,525 నమూనాలు నాణ్యత లేనివిగా తేలిందన్నారు

.

విత్తన దిగుమతులు

విత్తన ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం మూడో స్థానంలో ఉంది మొదటి స్థానాల్లో అమెరికా , చైనా , తర్వాత భారతదేశం ఉంది. భారతదేశంలో కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉత్పత్తిలో ముందున్నాయి. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన స్థానిక విత్తనాలను భద్రపరిచే తిరిగి వాడుకునే సాంప్రదాయ ప్రక్రియకు ప్రమాదం ఏర్పడింది . పేటెంట్ ఉన్న బ్రాండెడ్ పంపిణీ విత్తనాలను మాత్రమే వాడాలనే దుష్ట సాంప్రదాయాన్ని ఈ ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్టాలలో లక్షల ఎకరాల్లో విత్తనాలను తయారుచేస్తున్నారు. విత్తనాలను తయారుచేస్తున్న కర్నూలు, మహబూబ్ నగర్, నూజివీడు రైతుల రక్షణ గురించి బిల్లు ఏమీ మాట్లాడలేదు. అమెరికా , యూరప్ దేశాల పేటెంట్లతో రైతులు విత్తన స్వాతంత్రాన్ని ,స్వేచ్ఛను కోల్పోనున్నారు . భారత సంప్రదాయ వ్యవసాయం లోని మంచి లక్షణాలను కూడా విస్మరిస్తున్నందున వ్యవసాయం ప్రమాదంలో పడుతున్నది. ఈ బిల్లు విత్తన దిగుమతులను సరళీకరించి, కార్పొరేట్ కంపెనీలకు లాభాలను కూడపెట్టడం ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నట్లున్నది. 

  ప్రపంచ వెరైటీలను భారత దేశంలోకి విచక్షణారహితంగా అనుమతించటంద్వారా దేశీయ విత్తనాభివృథిని శాశ్వతంగా దెబ్బగొడ్తున్నారు. రైతుల సృజనాత్మక చొరవను పెంచే గ్రామీణ విత్తన కేంద్రాల అభివృధి నినాదంగానే మిగిలిపోయింది. రైతు విత్తనాలను స్వంతంగా తయారు చేసుకునే హక్కు పై దాడి  చేస్తున్నారు. భారతదేశ విత్తన సంపదను కాపాడవలసిన అవసరం గురించి మౌనం వహించారు. రైతు విత్తన హక్కు గురించి విత్తన స్వావలంబన అందుబాటులోకి తీసుకురావడం, విత్తన సరఫరా లో పారదర్శక మరియు జవాబుదారీతనం పెంచటం ద్వారా రైతు హక్కులను కాపాడటం లక్ష్యంగా పెట్టుకోవటం విస్మరించారు. 

విత్తనాలను రైతులు సాగు చేస్తున్నారు రైతులు తయారు చేసినటువంటి విత్తనాలు ఏదో ఒక కంపెనీ కొనుక్కుని బ్రాండ్ వేసుకొని మార్కెట్లో అమ్ముకుంటున్నారు. మన రైతుల శక్తిని విస్మరించి,కార్పొరేట్ వత్తిడికి లొంగి మన విత్తన స్వాతంత్ర్యాన్ని తాకట్టు పెడుతున్నారు. 

రైతులకు నష్టపరిహారం విధానం మరింత కష్టం.

1. న్యాయం పొందడంలో సమస్యలు (Issues in Seeking Justice)

• నాసిరకం లేదా నకిలీ విత్తనాల వల్ల పంట నష్టం సంభవించిన రైతులకు తప్పనిసరిగా, సులభంగా నష్ట పరిహారం చెల్లించడానికి బిల్లులో స్పష్టమైన, సరళమైన నిబంధనలు ఏమీ లేవు.

నష్ట పరిహారం క్లెయిమ్ చేసుకోవడానికి అవసరమైన ప్రక్రియ క్లిష్టంగా వున్నది. సాంపుల్ సేకరణ, లాబోరేటరీ పరీక్షలు, విచారణలు అన్నీచాలా క్లిష్టంగా మరియు ఖరీదైనదిగా ఉన్నాయి. ఇది చిన్న రైతులు న్యాయం పొందకుండా నిరోధిస్తుంది. స్పష్టమైన నిబంధన లేకపోవడం: నాసిరకం విత్తనాల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు తప్పనిసరిగా, సులభంగా పరిహారం చెల్లించేందుకు ఒక స్పష్టమైన మరియు సరళమైన నిబంధన బిల్లులో లేదు. 

• క్లిష్టమైన ప్రక్రియ: నష్టపరిహారం పొందే ప్రక్రియ క్లిష్టంగా, సాంకేతికంగా, మరియు సుదీర్ఘంగా ఉంటుందని, ఇది చిన్న రైతులు అనుసరించడానికి అనుకూలంగా ఉండదని అభిప్రాయపడుతున్నారు. నమూనాల సేకరణ, ప్రయోగశాల పరీక్షలు, విచారణ వంటి సుదీర్ఘ పద్ధతులపై అధికారులు మరియు కోర్టుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

• కోర్టుల ప్రమేయం: విత్తన లోపం వల్ల పంట నష్టం జరిగితే, రైతులు ఇప్పటికీ పెద్ద కంపెనీలతో న్యాయస్థానాలలో పోరాడవలసి వస్తుంది, ఇది ఆర్థికంగా, సమయం పరంగా చిన్న రైతులకు భారం అవుతుందని నిపుణులు హెచ్చరించారు.

కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడే ప్రధాన అంశాలు (Provisions Protecting Corporate Interests)

ముసాయిదా బిల్లులో కంపెనీల పరిశోధన (R&D) మరియు మార్కెట్ విస్తరణకు దోహదపడే అంశాలు, అలాగే నియంత్రణ భారాన్ని తగ్గించే నిబంధనలు ఉన్నాయి:

2. రైతు హక్కులపై పరిమితులు(Limitation of Farmer Rights)

• సంప్రదాయ విత్తనాలను సేవ్ చేసుకోవడం, మార్చుకోవడం లేదా అమ్మడంపై రైతులకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ, బిల్లులోని కొన్ని నిబంధనలు భవిష్యత్తులో ఈ హక్కులకు పరిమితులు విధించవచ్చని ఆందోళనగావున్నది. భారత దేశ జన్యు వారసత్వాన్ని రక్షించేందుకు తీసుకున్న చర్యలు చట్టం లో లేవు.

• రిజిస్ట్రేషన్ భారం: అన్ని విత్తన రకాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడం వలన, రైతులు తమ సంప్రదాయ వెరైటీల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు పడతారు.

3. మార్కెట్ మరియు ధరలపై ప్రభావం (Impact on Market and Prices)

• విత్తన ధరల పెరుగుదల: విత్తన పరిశ్రమపై ప్రభుత్వం యొక్క నియంత్రణ తగ్గి, కేంద్రీకృత గుర్తింపు వ్యవస్థ కారణంగా పెద్ద కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యం పెరుగుతుంది. విత్తన ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. 

• పోటీ లేమి: చిన్న విత్తన కంపెనీలు మరియు స్థానిక తయారీదారులు కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థను ఎదుర్కొనే శక్తి లేక మార్కెట్ నుండి నిష్క్రమించక తప్పదు. దీనివల్ల పోటీ తగ్గి, పెద్ద కంపెనీల గుత్తాధిపత్యం (monopoly) పెరుగుతుంది.

4. ప్రభుత్వ నిబంధనల ఉపసంహరణ (Withdrawal of Government Regulations)

• ప్రభుత్వ పాత్ర తగ్గింపు: బిల్లులో విత్తన ధృవీకరణ (certification) మరియు పరీక్షల్లో ప్రభుత్వ పాత్రను తగ్గించి, ప్రైవేట్ సంస్థలకు ఎక్కువ అధికారం కల్పించడంపై ఆందోళన ఉంది. దీనివల్ల నాణ్యత పర్యవేక్షణ ప్రమాణాలు తగ్గే అవకాశం ఉంది. 

కార్పొరేట్ కంపెనీల ప్రయోజన పరిరక్షణ (Protection of Corporate Interests)

ఈ ముసాయిదా బిల్లు విత్తన పరిశ్రమలో  కార్పొరేట్ కంపెనీల వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని (Ease of Doing Business) పెంచడం ద్వారా మరియు వారి పరిశోధన (R&D) పెట్టుబడులకు రక్షణ కల్పించడం ద్వారా కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

1. కంపెనీలపాలనాపరమైన భారం తగ్గింపు (Reduced Regulatory Burden)

• మైనర్ నేరాల డీక్రిమినలైజేషన్ (Decriminalisation of Minor Offences):

• చిన్నపాటి నియమ ఉల్లంఘనలకు లేదా సాధారణ తప్పులకు శిక్షలను తగ్గించడం లేదా వాటిని నేరాల జాబితా నుండి తొలగించడం జరిగింది. దీనివల్ల కంపెనీలపై ఉండే న్యాయపరమైన మరియు పాలనాపరమైన ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది.

• కేంద్రీకృత గుర్తింపు వ్యవస్థ (Centralised Accreditation System):

• విత్తన కంపెనీలు కేంద్ర స్థాయిలో గుర్తింపు పొందితే, రాష్ట్రాల స్థాయిలో మళ్లీ అనుమతులు/గుర్తింపులు పొందాల్సిన అవసరం ఉండదు. బహుళ రాష్ట్రాల్లో వ్యాపారం చేసే పెద్ద కంపెనీలకు ఇది ప్రక్రియను చాలా సులభతరం చేస్తుంది.

2. మార్కెట్ విస్తరణ మరియు R&D ప్రోత్సాహం (Market Expansion and R&D Incentive)

• విత్తన దిగుమతుల సరళీకరణ (Liberalised Seed Imports):

. కొత్త విత్తనాలను, ముఖ్యంగా పరిశోధన ఆధారిత జన్యు మార్పిడి విత్తనాలను, భారతదేశంలోకి సులభంగా దిగుమతి చేసుకునేందుకు నిబంధనలను సరళీకరించారు. ఇది వినూత్న విత్తనాలను అందించే పెద్ద కంపెనీల మార్కెట్ విస్తరణకు సహాయపడుతుంది. మన దేశ పరిస్థితులకు సంబంధం లేని పరిశోధనలు మన వ్యవసాయానికి ఉపయోగపడవు. కార్పోరేట్ కంపెనీల కు దండిగా లాభాలను సమకూరుస్తాయి.

• పరీక్షల ప్రక్రియ సరళీకరణ (Streamlined Trial Process):

• నూతన విత్తన వంగడాల ధృవీకరణ మరియు వినియోగ విలువ (Value for Cultivation and Use – VCU) పరీక్షల నియంత్రణలను కొంతవరకు సడలించడం జరిగింది. దీనివల్ల ప్రైవేట్ కంపెనీలు తమ నూతన వంగడాలను మార్కెట్‌లోకి వేగంగా విడుదల చేయగలుగుతాయి, తద్వారా పెట్టుబడిపై రాబడి పెరిగి కంపెనీల లాభాలు పెరుగుతాయి. (Return on Investment) 

3. నకిలీ విత్తనాల నియంత్రణ పేరున ట్రేసబిలిటీ (Traceability) మరియు పారదర్శకత: క్యూఆర్ కోడ్‌లు (QR Codes) మరియు SATHI పోర్టల్ ద్వారా ప్రతి విత్తనం యొక్క మూలాన్ని (Source) సులభంగా గుర్తించవచ్చు. ఇది బ్రాండెడ్ మరియు నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసే పెద్ద కంపెనీల ఉత్పత్తులకు రక్షణ కల్పిస్తుంది. దేశీ విత్తనాలను మార్కెట్‌లోకి తీసుకువచ్చే చిన్న వ్యాపారులను నియంత్రించడానికి వీలు కల్పిస్తుంది.

ఈ నిబంధనలన్నీ కలిసి, పెద్ద కార్పొరేట్ కంపెనీలు భారతదేశ విత్తన మార్కెట్‌లో మరింత స్వేచ్ఛగా మరియు వేగంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది. కార్పొరేట్ కంపెనీల కు అనుకూలంగా, రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా వున్న ఈ బిల్లు ను తిప్పికొట్టాలి. 

డాక్టర్ కొల్లా రాజమోహన్,. నల్లమడ రైతు సంఘం, గుంటూరు. 

9000657799