Tags
Amezon, BSNL, Donald trump, Elon Musk, India Protectionism, India Tariffs, Jio, Mukesh Ambani, Narendra Modi Failures, Starlink, Tariff King, Tariff War, TRADE WAR
ఎం కోటేశ్వరరావు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ అని యావత్ ప్రపంచం అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ గురించి పాడుకుంటోందంటే అతిశయోక్తి కాదు. ఆ పెద్దమనిషి తీరు చూస్తుంటే అసలు సిసలు భారతీయులం అని చెప్పుకుంటున్న సంఘపరివార్‌కు, అది ముందుకు తెచ్చిన ప్రధాని నరేంద్రమోడీకి అగ్నిపరీక్ష పెట్టినట్లు కనిపిస్తోంది. పదే పదే ప్రతి సుంకాలు, ఆంక్షల గురించి మాట్లాడుతున్నాడు. అమెరికా వస్తువులపై దిగుమతి పన్నులు తగ్గించేందుకు భారత్ అంగీకరించిందని శుక్రవారం నాడు చెప్పాడు.వారు చేస్తున్నదానిని చివరకు ఎవరో ఒకరు బహిర్గత పరిచారు అని తన గురించి తానే చెప్పుకుంటూ మనదేశం గురించి మాట్లాడాడు. అయితే సుంకాల తగ్గింపు గురించి ఒప్పుకోలేరుచెప్పుకోలేరు అన్నట్లుగా మన పాలకుల స్థితి ఉంది. అంగీకరించినట్లు మన విదేశాంగశాఖ నిర్ధారించలేదు గానీ వాటి గురించి సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పినట్లు వార్తా సంస్థ ఒకటి పేర్కొన్నది.ట్రంప్ చెప్పిన దాని గురించి నేను మాట్లాడను గానీ, ఇవన్నీ సంప్రదింపులలో ఉన్న అంశాలు గనుక వాటి గురించి చెప్పకూడదని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వ్యాఖ్యానించారు.ఇటీవల జరిగిన అనేక వాణిజ్య ఒప్పందాలలో సుంకాల సరళీకరణ మౌలిక అంశంగా ఉన్న సంగతి తెలిసిందే అని కూడా చెప్పారు. ట్రంప్‌కు లేని మర్యాద మనకు అవసరమా ? ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలన్నింటీని రద్దు చేసుకొని ఆదరాబాదరా మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ వాషింగ్టన్ వెళ్లారు. అక్కడ చర్చలు జరుపుతుండగానే ఏప్రిల్ రెండు నుంచి పన్నులు విధిస్తామని ట్రంప్ చెప్పాడు. మంత్రి ఇంకా అక్కడ ఉండగానే సుంకాలు తగ్గించేందుకు అంగీకరించినట్లు కూడా అదే నోటితో ప్రకటించటం గమనించాల్సిన అంశం. దీనిలో రెండు కోణాలు ఉన్నాయి. ఇలా ప్రకటించి మనదేశాన్ని ఇరికించేందుకు చూడటం ఒకటి. లేదా మనమంత్రి ఒక స్పష్టమైన హామీ ఇచ్చి ఉండాలి. మన నిర్వాకం గురించి ముందుగా ఇతరుల ద్వారానే మనం తెలుసుకోవాలి మరి. ఇది కూడా మోడీ విదేశాల్లో పెంచినట్లు చెప్పిన దేశ ప్రతిష్టలో భాగమేనా ! అసలు మనమంత్రి అలా వెళ్లాల్సిన అవసరం ఏమిటి ? ట్రంప్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడా ? మోడీ విధానాల గురించి రాహుల్ గాంధీ విదేశాల్లో విమర్శలు చేయటం ఏమిటని ప్రశ్నించేవారు, ట్రంప్ చేసిన ప్రకటన మీద నోటికి తాళం వేసుకోవటం ఏమిటి ?
అబద్దాలు చెప్పటం ట్రంప్‌కు, నిజాలు చెప్పకపోవటం మన కేంద్ర పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. గాజాలోని పాలస్తీనియన్లకు శాశ్వత ఆశ్రయం కల్పించేందుకు జోర్డాన్ అంగీకరించిందని, ఆ దేశ రాజు అబ్దుల్లాతో కలసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో చెప్పాడు. అది వాస్తవం కాదని, తాము అంగీకరించేది లేదని తరువాత అదే అబ్దుల్లా ప్రకటించాడు. ఉక్రెయిన్ భద్రతకు ఎలాంటి హామీ ఇవ్వకుండా విలువైన ఖనిజాల ఒప్పందం మీద సంతకాలు చేయించి కొట్టేసేందుకు ట్రంప్ ఇదే ఎత్తుగడ అనుసరించాడు. అయితే జెలెనెస్కీ అడ్డం తిరగటంతో ఓవల్ ఆఫీసు పత్రికా గోష్టిలో పదినిమిషాల రచ్చ, జెలెనెస్కీ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ట్రంప్ టీవీ ప్రసంగంలో చేసిన ప్రకటన గురించి ఆదివారం నాడు ఇది రాసిన సమయానికి మనదేశం నుంచి ఎలాంటి స్పందన, వివరణ వెలువడలేదు. ఎలన్ మస్క్ ఇండియాలో వ్యాపారం చేయాలని అనుకుంటున్నట్లు నేను భావిస్తున్నాను అని నరేంద్రమోడీతో భేటీ అయినపుడు ట్రంప్ నిర్మొహమాటంగా చెప్పినట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనా ? యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉన్నా భయమా ? తెరవెనుక ఏదో జరిగింది అనుకోవాలా ….? పార్లమెంటు సమావేశాల్లో ఉండగా అక్కడ చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకొని నిజంగానే ట్రంప్‌కు చెబితే మనల్ని మనమే అవమానించుకున్నట్లు, ప్రజాస్వామ్యం, ప్రజాప్రతినిధులను కించపరిచినట్లు, రాజ్యాంగ వ్యవస్థలను దిగజార్జినట్లు కాదా ?
మన విశ్వగురువు నరేంద్రమోడీ తీరేవేరు, మరొకరు సాటి రారు. ట్రంప్ చేస్తున్న ప్రకటనల గురించి కెనడా,మెక్సికో,చైనా స్పందన, ప్రతిస్పందన చూశాము. మన మోడీ ఎందుకు మాట్లాడటం లేదని 140 కోట్ల మంది జనం మల్లగుల్లాలు పడుతున్నారు.అలాంటి చిన్న విషయాలు అసలు పట్టించుకోనవసరం లేదన్నట్లు కనిపిస్తోంది.వాటి బదులు దేశంలో 2050 నాటికి 44 కోట్ల మందికి ఊబకాయం వస్తుందని జాతిని హెచ్చరిస్తున్నారు. టెలికాం శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రిపబ్లిక్ టీవీ సభలో మాట్లాడుతూ విదేశీ టెలికాం కంపెనీలకు ఎలాంటి ఆంక్షలను విధించేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ ప్రసారాలకు తలుపులు బార్లా తెరిచినట్లు స్పష్టమైంది.మనదేశ టెలికాం రంగం ఎంతో నిబ్బరంతో ఉందని, ప్రపంచ సంస్థలను ఆహ్వానించేందుకు సిద్దంగా ఉందని , భారత్ ఎవరినీ చూసీ భయపడటం లేదని చెప్పారు.తనకు దేశ పౌరులు అత్యంత ముఖ్యమని, ప్రపంచంలో అందుబాటులో ఉన్నవాటిలో వారు దేన్ని కోరుకుంటే దాన్ని తెచ్చి ఇవ్వటం మంత్రిగా తన విధి, వసుధైక కుటుంబంలో తనకు విశ్వాసం ఉందన్నారు.
జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఎలన్ మస్క్ మనదేశ ఇంటర్నెట్, విద్యుత్ వాహనాల రంగంలోకి పెద్ద అడుగువేయనున్నట్లు కనిపిస్తోంది. యుపిఏ హయాంలో స్పెక్ట్రమ్‌ను అనుకూలురకు కేటాయించి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించిన నరేంద్రమోడీ తాను వేలం పద్దతిలో కేటాయించనున్నట్లు చెబితే, నిజంగానే అనేక మంది అభినందించారు. ఇప్పుడు ఎలన్ మస్క్ విషయానికి వస్తే ఉపగ్రహ స్పెక్ట్రమ్ వేలానికి బదులు అధికార కేటాయింపులకు ఎందుకు పాల్పడుతున్నట్లు ? ఇది మరో స్పెక్ట్రం కుంభకోణం కాదా ! అడిగితే దేశద్రోహులు అంటారేమో, అడిగితే ఏమిటి ముకేష్ అంబానీగారు ఇప్పటికే అడిగేశారు. అదేదో సినిమాలో వినపడలా అన్న చెవిటి పాత్ర డైలాగ్‌ను గుర్తుకు తెచ్చుకుందాం. నిజానికి వినపడకపోవటం కాదు, కావాలని చేసిందే. రెండు రకాల కేటాయింపు విధానాలెందుకు ? 2023 డిసెంబరులో చేసిన టెలికాం చట్ట ప్రకారం భూ సంబంధ స్పెక్ట్రమ్ వేలం ద్వారా, ఉపగ్రహ స్పెక్ట్రమ్‌ను అధికారయంత్రాంగం ద్వారా ఒక ఫీజు నిర్ణయించి కేటాయించేట్లు నిర్ణయించారు. ఎలన్ మస్క్ మన మార్కెట్ మీద ఎప్పటి నుంచో కన్నేసి ఉన్నకారణంగా అందుకు అనుగుణంగా మోడీ సర్కార్ పావులు కదిపిందని వేరే చెప్పనవసరం లేదు. మస్క్ కంపెనీ స్టార్‌లింక్ దరఖాస్తు కేంద్రం ముందు ఉంది. న్యాయమైన పోటీ విధానాన్ని ఎందుకు అనుసరించరని దిగ్గజ కంపెనీలైన అంబానీ రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కేంద్రాన్ని అడిగాయి. ప్రభుత్వ విధానం మార్కెట్‌లో అసమాన పోటీకి దారి తీస్తుందని స్పష్టం చేశాయి. రక్షణ, సముద్రయానం,ప్రకృతి విపత్తుల అవసరాల వంటి వ్యవస్థలకు ప్రభుత్వాలు కేటాయింపులు జరపవచ్చని, వాణిజ్య అవసరాలకు వేలం వేయాల్సిందేనని అవి పేర్కొన్నాయి. ఎలన్ మస్క్ దరఖాస్తు మీద ఇంకా అంతిమ నిర్ణయం తీసుకోలేదు. తీసుకుంటే మాత్రం నరేంద్రమోడీతో జియో,ఎయిర్‌టెల్,ఇతర కంపెనీలు లడాయికి దిగటం ఖాయం. భూ సంబంధ స్ప్రెక్ట్రమ్‌ను ఒకరికి కేటాయించినదానిని మరొకరు వినియోగించలేరని, కానీ ఉపగ్రహస్రెక్ట్రమ్‌ను ఎవరైనా పంచుకోవచ్చని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వాదించారు. మంత్రికి తెలిసిన మాత్రం జియో, ఎయిర్‌టెల్ యాజమాన్యాలకు తెలియకుండానే వేలం గురించి మాట్లాడాయనుకోవాలా ?
అమెరికాలో స్టార్‌లింక్ కనెక్షన్ తీసుకోవాలంటే 120 డాలర్లు చెల్లించాల్సి ఉండగా ఆఫ్రికాలో మార్కెట్‌ను స్వంతం చేసుకొనేందుకు కేవలం పదిడాలర్లకు అందచేస్తున్నది. మనదేశంలో కూడా అదే విధంగా పోటీ పడితే ప్రపంచ ధనికుడు ఎలన్‌మస్క్‌తో ఆసియా ధనికుడు ముకేష్ అంబానీ తట్టుకోగలరా ? ఇలా అంటున్నానంటే అంబానీ పట్ల సానుభూతి ఉండి కాదు, ఎందుకంటే మన బిఎస్‌ఎన్‌ఎల్‌ను దెబ్బతీసిన వారిలో ఆ పెద్దమనిషి కూడా ఉన్నందున అనుభవించాల్సిందే కదా ! ముకేష్ అంబానీ రిటైల్ స్టోర్ల నిర్వహణలో తనకు పోటీగా వచ్చిన అమెజాన్ కంపెనీని నరేంద్రమోడీ సహకారంతో తాత్కాలికంగా వెనక్కు నెట్టారు, కానీ మరోసారి పెద్ద ఎత్తున అమెజాన్ రంగంలో దిగేందుకు చూస్తున్నది. ట్రంప్ మద్దతు దానికి ఉంటుంది. రెండు కంపెనీలు పోటీ పడనున్నాయి. ఏఏ రంగాలలో తలపడేదీ ముందు ముందు తెలుస్తుంది.అమెజాన్ ఉపగ్రహ ఇంటర్నెట్ కుయిపర్ కూడా అనుమతి కోసం చూస్తున్నది.ముకేష్ అంబానీ జియో కంపెనీ స్టార్ ఇండియా, డిస్నీతో చేతులు కలిపేందుకు నిర్ణయించారు. రానున్న రోజుల్లో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, సోనీలతో పోటీకి సిద్దపడుతున్నాయి.
ఇక ఎలన్ మస్క్, అతగాడిని భుజాల మీద మోస్తున్న డోనాల్డ్ ట్రంప్ మన దేశంలో టెస్లా విద్యుత్ కార్లను విక్రయించటానికి 110శాతం దిగుమతి పన్ను ఆటంకంగా ఉంది. స్టార్‌లింక్ మనదేశంలో కార్యకలాపాలు ప్రారంభిస్తే లైసన్సు ఫీజు నామమాత్రం గనుక తక్కువ ధరలకే కనెక్షన్లు ఇస్తుందని వేరే చెప్పనవసరం లేదు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లుగా ఇతర కంపెనీలను దెబ్బతీసేందుకు జియో చూసినట్లుగానే మస్క్ వస్తే దానితో పాటు, ఇతర కంపెనీల ఖాతాదారులందరూ మారిపోయే అవకాశం ఉంది.అలాగే కార్ల రంగంలో రారాజుగా ఉన్న టాటా, చిన్న కంపెనీలైన ఎంజి, కోటక్‌లకు ఎసరు వస్తుందని భావిస్తున్నారు. విదేశీ కార్ల మీద పన్ను తగ్గిస్తే సదరు అవకాశాన్ని ఒక్క టెస్లా మాత్రమే కాదు, చైనా, ఇతర దేశాల కంపెనీలు కూడా వినియోగించుకుంటాయి. వినియోగదారులు లబ్ది పొందుతారు. మన పరిశ్రమలు, ఉపాధి సంగతేమిటన్నదే ప్రశ్న. ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ను దెబ్బతీస్తుంటే కొంత మేరకు అడ్డుకొనేందుకు పోరాడిన ఉద్యోగులు ఓడిపోయారు. కానీ తమను దెబ్బతీసే చర్యలకు అనుమతిస్తే మన బడాకార్పొరేట్లు చూస్తూ ఊరుకుంటాయా ? పదేండ్లుగా ఇస్తున్న మాదిరే బిజెపికి నిధులు ఇస్తాయా ? వాటి ఆధీనంలో ఉన్న మీడియా సంస్థలు సానుకూల భజన కొనసాగిస్తాయా ? తమకు అనుకూలమైన పార్టీ, శక్తులను రంగంలోకి తెచ్చేందుకు చూడకుండా ఉంటాయా ? ఇలా ఎన్నో ప్రశ్నలు.
కార్లు లేదా సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులుగానీ ఎక్కడెక్కడో తయారు చేసిన విడి భాగాలను తీసుకు వచ్చి వాటికి ఒక రూపు(అసెంబ్లింగ్) ఇచ్చి తమ బ్రాండ్లు వేసుకొని అమ్ముతున్నారు. అలాంటి కార్ల ఫ్యాక్టరీకి మూడు సంవత్సరాల్లో 50 కోట్ల డాలర్లు పెట్టుబడి పెడితే ఎనిమిదివేల వాహనాలను దిగుమతి చేసుకొనేందుకు అనుమతి, వాటికి కేవలం 15శాతమే పన్ను విధిస్తామని కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించింది. అది ఒక్క టెస్లాకే కాదు, చైనాతో సహా ఎవరికైనా వర్తిస్తుంది.ఇలాగాక నేరుగా దిగుమతి చేసుకొంటే వాటి మీద 110శాతం పన్ను విధిస్తున్నారు. ఇప్పటికే చైనాలో ఫ్యాక్టరీ పెట్టిన టెస్లా అక్కడ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. పోటీదార్లను దెబ్బతీసేందుకు ధరలను తగ్గించి మార్కెట్‌ను సొంతం చేసుకోవటం కంపెనీల ఎత్తుగడ. ఆ పోటీలో చైనా ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు స్థానిక ప్రైవేటు కంపెనీ అయిన బివైడి వంటి వాటికి కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి నిలుపుతున్నది. అక్కడి సంస్థలు ఇంజన్లతో సహా కార్లకు అవసరమైన అన్ని భాగాలను తయారు చేస్తాయి, అటు వంటి పరిస్థితి టెస్లాకు గానీ మనదేశంలో ఉన్న సంస్థలకు గానీ లేవు. అందువలన చైనా కంపెనీలు కూడా మనదేశం వస్తే పరిస్థితి ఏమిటన్నది సమస్య.అయితే విద్యుత్ కార్ల ధరల విషయానికి వస్తే ప్రారంభ రకాల ధర టెస్లాతో పోల్చితే మన దేశంలో తయారవుతున్నవి తక్కువ వెలకే లభ్యమౌతున్నాయి. అందువలన అంతకంటే తక్కువ అయితేనే విదేశీ కంపెనీలు నిలదొక్కుకుంటాయి. 1990దశకం వరకు మన ప్రైవేటు రంగానికి ఎంతో రక్షణ ఉంది. తరువాత సరళీకరణలో భాగంగా విదేశీ కంపెనీలకు ద్వారాలు తెరవటంతో వాటితో చేతులు కలిపారు. ఇండోసుజుకీ, స్వరాజ్‌మజ్డా ఇంకా అలాంటివే ఎన్నో. తరువాత కూడా రక్షణలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరింతగా మార్కెట్‌ను తెరవటంతో తెగబలిసిన స్వదేశీ కార్పొరేట్లకు పెద్ద సవాలు ఎదురుకానుంది. వాటికి ప్రాతినిధ్యం వహించే బాంబే క్లబ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆర్థిక రంగంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయ రంగంలో పర్యవసానాలకు దారి తీస్తాయన్నది ప్రపంచ అనుభవం. దానికి మనదేశం అతీతంగా ఉంటుందా ! నరేంద్రమోడీ పీఠం కదలకుండా ఉంటుందా !! కరవమంటే కప్పకు`విడవ మంటే పాముకు కోపం, ఏం జరుగుతుందో చూద్దాం !!!
