డాక్టర్ కొల్లా రాజమోహన్,
గత రెండు మూడు సంవత్సరాలు బర్లీ పొగాకు రేటు లాభసాటిగా ఉండటంతో బర్లీ పొగాకు వైపు రైతులు మళ్లారు. గత సంవత్సరం అడుగు ఆకు కూడా క్వింటాలు పదివేల రూపాయలకు అమ్ముడు పోయింది. ఈ సంవత్సరం అడుగు ఆకు నాలుగైదు వేల రూపాయలకు మించలేదు. కంపెనీలు బాండు ఇచ్చినా పొగాకు కొనటం మందంగా ఉంది. 30-40 వేల రూపాయలకు ఒక ఎకరం పొలం కౌలుకు తీసుకొని, బర్లీ పొగాకు పంటను వేసిన రైతులున్నారు.2023-24 సంవత్సరంలో భారతదేశ పొగాకు ఎగుమతులు రూ.12,006 కోట్లు. 2022-23లో భారతదేశంలో పొగాకు అమ్మకాల ద్వారా వచ్చిన ఎక్సైజ్ ఆదాయం రూ.72,788 కోట్లు. ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తున్నా రైతులకు ఆశ, నిరాశలను చూపిస్తూ ప్రభుత్వం, కంపెనీలు రైతులతో ఆడుకుంటున్నాయి.
పొగాకు బోర్డు
పొగాకు రైతులకు న్యాయమైన, లాభదాయకమైన ధరలు లభించేలా చూడటం, ఎగుమతులను ప్రోత్సహించటం బోర్డు ప్రాథమిక కర్తవ్యం. అయితే పొగాకు బోర్డు ఒక్క ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా పొగాకు (ఎఫ్.సి.టి) గురించి మాత్రమే పట్టించుకుంటుందట. బర్లీ పొగాకు, నాటు పొగాకు లాంటివి తమ పరిధిలో లేవని తప్పుకుంటోంది. పొగాకు పండించే రైతులందరి ప్రయోజనాలను కాపాడవలసిన పొగాకు బోర్డు…బర్లీ పొగాకు పండించిన రైతులను కంపెనీల దయా దాక్షిణ్యాలకు వదిలేసింది.
బర్లీ పొగాకుకు విదేశాలలో ఎక్కువ డిమాండ్ వుంది. అమెరికా, బ్రిటన్‌లో తయారయ్యే సిగరెట్లలో బర్లీ పొగాకు ప్రధాన స్థానాన్ని పొందింది. సిగరెట్‌లో మంచి ఫ్లేవర్ కోసం, ఘాటుగా వుండటం కోసం బర్లీ పొగాకును సిగరెట్ తయారీలో తప్పనిసరిగా వాడతున్నారు. ఇదివరకు అమెరికా లోని కెంటకీ రాష్ట్రంలో బర్లీ పొగాకును ఎక్కువగా సాగు చేసేవారు. అక్కడ బర్లీ పొగాకు సాగు తగ్గింది. దేశ, విదేశీ అవసరాలకు 100 మిలియన్ కేజీల బర్లీ పొగాకు అవసరం వుంటుందని అంచనా.
పొగాకు పరిశోధనా సంస్ధ
తూర్పు గోదావరి జిల్లాలో కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ సి.టి.ఆర్.ఐ 75 సంవత్సరాల నుండి రాజమండ్రిలో పనిచేస్తున్నది. దక్షిణ ప్రాంతపు తేలిక నేలలు ఉన్న ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలలో సాగు చేసే బర్లీ పొగాకు నూతన విత్తనాలను ‘విజేత’ పేరున విడుదల చేశారు.ఇదివరకు పది వేల మిలియన్ కేజీల ఎగుమతి ఉన్న బర్లీ పొగాకు ఇప్పుడు 45 వేల మిలియన్ కేజీలకు పెరిగిందని ఆ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు అన్నారు.ప్రత్యామ్నాయ పంటలైన మిర్చి, శనగ, మొక్కజొన్న, సుబాబుల్, జామాయిల్, పామాయిల్ పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కానీ ప్రత్యామ్నాయ పంటల ధరలకు గ్యారంటీ లేదు. కనీస మద్దతు ధరలు అమలు పరచే యంత్రాంగం లేదు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లేదు. కచ్చితంగా కొంటారనే గ్యారంటీ లేదు. వ్యవసాయ ఖర్చులు-ఎరువులు, పురుగు మందులు, కౌలు, కూలీ రేట్లు భారీగా పెరిగాయి. ఇటువంటి పరిస్ధితులలో పొగాకు ధరలు గత రెండు సంవత్సరాలుగా ఆశాజనకంగా వున్నాయి. గతంలో పొగాకు సాగును ఆపేసిన పాత గుంటూరు జిల్లా రైతులు మళ్లీ పొగాకు పంట వైపు మళ్ళారు. పొగాకు సాగు గణనీయంగా పెరిగింది.
పొగాకు బోర్డు పరిధిలో బర్లీ పొగాకు ఎందుకు లేదు? ప్రభుత్వం స్పందించాలి!
ఇండియన్ టొబాకో కంపెనీ, గాడ్ ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్, దక్కన్ టుబాకో, పోలిశెట్టి కంపెనీ, పి.టి.పి, ఎం.ఎల్ మరియు అలియన్స్ వన్ కంపెనీలు బర్లీ పొగాకు సాగును ప్రోత్సహించాయి. కొందరు విత్తనాలిచ్చారు. కొందరు హామీలిచ్చారు. పొగాకు నారును సప్లరు చేశారు. కచ్చితంగా కొంటామని కొన్నిచోట్ల బాండ్లు ఇచ్చారు. పొగాకు బోర్డు పరిధిలో బర్లీ పొగాకు లేకపోవడంతో రైతులకు నష్టం జరుగుతుంది. బేరన్ పొగాకు / వర్జీనియా పొగాకు సాగు చేస్తున్నటువంటి రైతులకు టుబాకో బోర్డు కొన్ని రక్షణలు కల్పిస్తున్నది. టుబాకో బోర్డు కల్పిస్తున్న రక్షణలు, ప్రయోజనాలు బర్లీ పొగాకు పండించే రైతులకు లేవు. గత సంవత్సరం ధరలు కూడా రావటం లేదు. గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, ఏ ప్రాంతంలో ఏరకమైన పొగాకు, ఎంత మొత్తంలో సాగు చేశారనేది ప్రభుత్వం దగ్గర అంచనాలు ఉన్నాయో లేదో తెలియనటువంటి పరిస్థితి. పొగాకు మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మరెవరు జోక్యం చేసుకుంటారు? పొగాకు బోర్డు తన పరిధిలో లేదంటుంటే ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు నిలువెత్తున మునిగిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా?
పంటలకు న్యాయమైన ధరలను సాధించుకోగల శక్తి రైతుల చేతుల్లోనే ప్రపంచంలోని పొగాకు ధరలు, సిగరెట్ల ధరలు, ఐ.టి.సి, బ్రిటిష్ అమెరికన్ టుబాకో కంపెనీ, ఫిలిప్ మోరిస్ లాంటి బహుళజాతి సంస్ధల (యం.యన్.సి) చేతిలో వున్నాయి. వారి లాభాలకు అంతులేదు. వారి నుండి పంటలకు న్యాయమైన ధరలను సాధించుకోగల శక్తి రైతుల చేతులలోనే వుంది. ప్రజా ఉద్యమాలతోనే తమ న్యాయమైన వాటాను సాధించకోగలరు. కార్పొరేట్ కంపెనీల చేతులలో కీలు బొమ్మలైన ప్రభుత్వాలు రైతుల ప్రయోజనాలను కాపాడ లేవు. బహుళజాతి సంస్ధలు రైతుల సంక్షేమం కోసం ఏర్పడలేదు. గిట్టుబాటు ధరలు కల్పించితే వారి లాభాలు తగ్గిపోతాయి. నీతి, జాతి లేనటువంటి యం.యన్.సి.లు, వారితో పోషింపబడుతున్న ప్రభుత్వాధిపతులు రైతులను కాపాడతారనుకుంటే, గొర్రె కసాయివాడిని నమ్మినట్లవుతుంది. లాభసాటి ధర కావాలంటే రైతులు నిలబడాలి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించి అమలు పరచమని పోరాడాలి.
