Tags
China “young talent” K visa, china communist party, China vs US, Donald trump, global scientific talent China, STEM experts, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
అవును ఎవరు అవునన్నా కాదన్నా, మరొకటన్నా ఇది నిజం. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్లుగా మేథావులందరూ పశ్చిమదేశాలలోనే పుట్టారు, మిగతా దేశాల వారు అక్కడికే వెళతారు అన్నట్లుగా కొందరు చాలాకాలంగా జనాల మెదళ్లకు ఎక్కించారు. ఇప్పుడు చైనా కమ్యూనిస్టులు దాన్ని తలకిందులు చేస్తున్నారు. గత శతాబ్దిలో ప్రపంచాన్ని ఏలిన చమురుకు ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంది. అయితే అదే సర్వస్వం కాదని తేలిపోయింది. దాన్ని పక్కన పెట్టే ‘‘ ప్రతిభ ’’ ప్రత్యామ్నాయ హరిత ఇంథనం, క్వాంటమ్, కృత్రిమ మేథ వంటి రూపాల్లో ముందుకు వస్తున్నది. చమురుతో పని లేకుండా నడిచే విద్యుత్ వాహనాలు రోడ్లను ముంచెత్తటం తెలిసిందే. ఈ పూర్వరంగంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో 2035 నాటికి అమెరికాను అధిగమించేందుకు చైనా నడుంకట్టటం గురించి కొద్ది నెలలుగా మీడియాలో విశ్లేషణలు వెలువడుతున్నాయి, అవేవీ కమ్యూనిస్టులు నడిపేవి కాదు, చివరికి కరడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్ వాదుల పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక ‘‘స్వరాజ్య ’’లో 2025 జూన్ 27న అమిత్ మిశ్రా అనే విశ్లేషకుడు కూడా రాశారు.దాన్ని నవీకరించి ఆగస్టు మూడున తిరిగి ప్రచురించారు. ‘‘ మేథోవంతుల ఆకర్షణ : వేయి ప్రతిభల చైనా వ్యూహం దాని ఔన్నత్యాన్ని ఎలా ముందుకు నెడుతున్నది ’’ అనే శీర్షిక( కోర్టింగ్ జీనియసెస్ : హౌ చైనా స్ థౌసెండ్ టాలంట్స్ స్ట్రాటజీ ఈస్ ఫ్యూయలింగ్ ఇట్స్ ఎసెంట్)తో ఒక విశ్లేషణ వెలుండిరది. ఇక్కడ దీన్ని ప్రస్తావించటం అంటే చైనాకు మిత,మతవాదుల సర్టిఫికెట్ లేదా ప్రశంసల గురించి కాదు. చైనా ఎలా దూసుకుపోతున్నదో చూడండి అనే ఉక్రోషం, అసూయ ప్రదర్శన దాని వెనుక ఉందని చెప్పేందుకే.
ఇక సందర్భానికి వస్తే ఈ ఏడాది అక్టోబరు ఒకటి నుంచి అంటే విప్లవదినోత్సం రోజు నుంచి చైనా ప్రభుత్వం ప్రపంచంలోని యువ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కె రకం వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. ఎందుకు అంటే 2035నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగామి దేశంగా మారేందుకు అక్కడి కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. కొత్తగా పట్టా పుచ్చుకున్న స్వదేశీయులు లేదా విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వారు, ఇతర దేశాల్లో ఇప్పటికే ఆయా రంగాలలో పని చేస్తున్న వారిని ఆకర్షించేందుకు పూనుకుంది. ఇటీవలి కాలంలో చైనా విధాన నిర్ణయాలలో ఇది పెద్దదని భావిస్తున్నారు. తనకు ఎదురులేనంతవరకు చైనాను ఎదగనిచ్చిన అమెరికా ఎప్పుడైతే తన ఆధిపత్యానికి అన్ని రంగాలలో ప్రతిఘటన ఎదురవుతున్నదని గ్రహించిందో అప్పటి నుంచి అడ్డుకోవటం ప్రారంభించింది. వైట్‌హౌస్‌లో ఏ పార్టీ వారున్నా అదే చేస్తున్న పూర్వరంగంలో దానికి ధీటుగా చైనా కమ్యూనిస్టు పార్టీ చేసిన కసరత్తు నుంచి వెలువడిరదే తాజా నిర్ణయం. ప్రధాని లీ క్వియాంగ్ సంతకంతో అది చట్టంగా మారింది. స్టెమ్(సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) రంగాలలో ప్రతిభావంతులైన విదేశీ యువతను ఆకర్షించేందుకు సరికొత్త ‘‘ యువ ప్రతిభ ’’ కె వీసా ప్రత్యేకత ఏమంటే చైనాలో ఉన్న కంపెనీల యజమానులు లేదా సంస్థల నుంచి సిఫార్సులు అవసరం లేదు.నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రతిభావంతులైన యువశాస్త్రవేత్తల కార్యక్రమంలో వయస్సు గరిష్ట పరిమితి 45 సంవత్సరాలు, మరో పధకానికి 40 ఏండ్లు. దీనికి ఎలాంటి పరిమితి నిబంధన లేదు. ఇతర దేశాలతో పోటీ పడుతూ వేతనాలు, వసతి, బోనస్, పిల్లలకు విద్య వంటి ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.దేశ విధానానికి లోబడి పరిశోధనలో స్వేచ్చ ఉంటుంది. ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడులకు ఎలాంటి రాయితీలు ఇచ్చి ప్రోత్సహించారో ఇప్పుడు ప్రతిభావంతులైన వారిని ఆకర్షించేందుకు అలాంటి విధానాన్నే ముందుకు తెచ్చారని చెప్పవచ్చు. ఇలాంటి ప్రత్యేక వీసాలు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి.
అమెరికాలో చైనా సంతతికి చెందిన వారి మీద పెరుగుతున్న జాత్యహంకార వివక్ష, ఆంక్షలు, పరిశోధనలకు కేటాయింపుల కోత, గూఢచర్య ఆరోపణలతో వేధింపులు, రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల పూర్వరంగంలో అనేక మంది అక్కడి నుంచి బయటపడేందుకు చూస్తున్నారు. మంచి పండ్లను ఏరి దిగుమతి చేసుకున్నట్లుగా దశాబ్దాల తరబడి, అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మేథోవలసతో ఎంతగానో లబ్దిపొందాయి. ఇప్పుడు అటునుంచి వలసలకు చైనాతో నాంది పడిరదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇది ఒక్క రోజులో జరిగింది కాదు.చైనా కమ్యూనిస్టు పార్టీ నేత లి యువాన్‌చావో 2008లో ‘‘వేయి ప్రతిభావంతుల పథకాని(టిటిపి)కి రూపకల్పన చేశారు .విదేశాల్లో ఉన్న చైనా సంతతికి చెందిన వారిలో కనీసం రెండువేల మందిని స్వదేశానికి ఆహ్వానించి ఒక నవకల్పన సమాజంగా దేశాన్ని మార్చాలని తలపెట్టారు. 2011ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చినపుడు ఏటా 50 నుంచి వందమందిని పదేండ్ల పాటు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దానికి మించి ఇప్పటి వరకు ఏడువేల మంది శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు,వాణిజ్య,పారిశ్రామికవేత్తలు వచ్చారని అంచనా, వారిలో ఇతర దేశాలకు చెందినవారు కూడా ఉన్నారు. మరొక సమాచారం ప్రకారం 2010 నుంచి 2021 మధ్య కాలలో కనీసం 20వేల మంది చైనా జాతీయులు అమెరికా నుంచి స్వదేశానికి వెళ్లారు. ఇలాంటి వారు చూపుతున్న ప్రతిభను బట్టి మిలియన్ల యువాన్లను బోనస్, ఇతర రాయితీలను ప్రతిఫలంగా చెల్లించుతున్నారు. అమెరికా నుంచి వచ్చే వారు విద్రోహచర్యల నిమిత్తం వస్తున్నారా నిజంగానే పని చేసేందుకే అని నిర్ధారించుకొనేందుకు సునిశిత పరిశీలనలు కూడా చేశారని వార్తలు. ఈ పధకానికి చైనా పెద్ద ప్రచారం ఇవ్వలేదు గాని దాని తీరుతెన్నులు గమనించిన అమెరికా జాతీయ గూఢచార సంస్థ, ఎఫ్‌బిఐ గుండెలు బాదుకుంటూ నివేదికలు రూపొందించాయి. చైనా ఆర్థిక, మిలిటరీ రంగాలలో పురోగమించటానికి చట్టబద్దంగా, అక్రమ పద్దతుల్లో అమెరికా మేథో సంపదను చైనా కొల్లగొడుతున్నదని ఆరోపించారు. ఈ ప్రచారం పెరగటంతో చైనా కొత్త పద్దతుల్లో క్విమింగ్ పేరుతో ప్రతిభావంతులను ఆకర్షించేందుకు పూనుకుంది.2019 నుంచి 2023వరకు ఐదు వందలకు పైగా ప్రభుత్వ పత్రాలను పరిశీలించిన రాయిటర్స్ వార్తా సంస్థ చైనా ఇస్తున్న నగదు, ఇతర మొత్తాల గురించి పేర్కొన్నది.
దశాబ్దాలుగా భారత్, చైనా వంటి దేశాల నుంచి ఎందరో ప్రతిభావంతులు ఎక్కువగా అమెరికా, ఇతర పశ్చిమదేశాలకు వలస వెళ్లారు.వ్యక్తిగతంగా వారితో పాటు ఆయా దేశాల పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. ఆర్థికంగా నిలదొక్కుకొని ఎదగటం ప్రారంభమైన తరువాత మరింత ముందుకు పోవాలంటే అలాంటి అవసరం ఎంతో ఉందని చైనా కమ్యూనిస్టు పార్టీ గుర్తించింది.కమ్యూనిస్టులు ప్రతిభావంతుల మీద కూడా తమ సిద్దాంతాలను రుద్దుతారని, వారికి స్వేచ్చ ఇవ్వరని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.చైనా కమ్యూనిస్టులు దాన్ని కూడా గమనంలో ఉంచుకున్నారు. నూటనలభై కోట్ల జనాభా జీవితాలను ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దాన్లో భాగంగానే తమ దగ్గరలేని పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహ్వానించారు. అవి తమ నుంచి లబ్దిపొందుతాయని తెలిసినప్పటికీ దాని కంటే తాము ఎక్కువ ప్రయోజనం పొందుతామనే ముందు చూపు, ధైర్యంతో ఎన్ని విమర్శలు వచ్చినా సంస్కరణలకు తెరతీశారు, విజయం సాధించారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది గనుక అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రతిభావంతులను అక్కున చేర్చుకుంటున్నారు.దాని ఫలితాలు కనిపించాయి. సెమికండక్టర్లు, వైమానిక రంగం, 5జి, క్వాంటమ్ వంటి అనేక రంగాల్లో మరొకదాని వెనుక వెళ్లే పరిస్థితి నుంచి పోటీదారుగా మారింది. జీవశాస్త్రంలో అమెరికాను అధిగమించి 2017లోనే ఎక్కువగా పరిశోధక పత్రాలను చైనీయులు ప్రచురించారు.
గత నాలుగున్నర దశాబ్దాల సంస్కరణల ఫలితాలు, విధానాల గురించి కొంత మంది విమర్శలు చేయవచ్చు.ఇప్పుడు చైనా మరొకదశలో ప్రవేశించింది. అధికారాన్ని కార్మికవర్గం చేతిలో పెట్టటం ద్వారా విప్లవం చేయాల్సినపని చేసింది. సాధించిన అధికారం ఒక్కటే జన జీవితాలను మెరుగుపరచదని గుర్తించిన తరువాత తీసుకున్న చర్యలకు తగిన ఫలితాలు వచ్చాయి. వాటికి ఉన్న పరిమితులను గమనించి మరొక అడుగు ముందుకు వేస్తున్నది. విదేశీ పెట్టుబడులకు కొంత ప్రతిఫలాన్ని చెల్లించినట్లుగా, స్వదేశంలోనే సంస్థల పెరుగుదలకు వ్యక్తులను ప్రోత్షహించిన తీరు చూశాము. అలాగే ప్రతిభావంతులకు మిగతావారితో పోలిస్తే అధికమొత్తాలను ఇవ్వాల్సి ఉంటుందని గ్రహించింది. మరిన్ని పరిశోధనల ద్వారా జనకల్యాణానికి వినియోగించేందుకు పూనుకున్నది. ప్రపంచంలో ఉన్న ప్రతిభావంతులను చైనా ఆకర్షించటం అమెరికా మాదిరి కార్పొరేట్ల లాభాలకు కాదు, జనాల కోసం.ఈ ప్రయత్నం వెనుక వ్యూహాత్మక, రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి. నిజానికి ఇది చైనా కమ్యూనిస్టు పార్టీకి కత్తిమీద సామువంటిదే.వచ్చేవారు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి, శాస్త్ర రంగ నాయకత్వంతో పాటు రాజకీయ నాయకత్వంలో ఇమిడి పోయే విధంగా ఉండాలి. కమ్యూనిస్టుల గురించి అనేక తప్పుడు ప్రచారాలు జరిగిన నేపధ్యం,అన్యవర్గ ప్రభావంతో అలాంటి వారు ప్రతి చర్యనూ అనుమానంతో చూసే అవకాశం ఉంటుంది, సహజం. వీటన్నింటినీ గమనంలో ఉంచుకొనే చైనా కమ్యూనిస్టులు ఒక ప్రయోగం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటివరకు అది చేసిన వన్నీ మొత్తం మీద ఫలించాయి.
చైనాలో ప్రస్తుతం ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయాల పర్యావరణం నానాటికీ పెరుగుతున్నది.ప్రపంచ స్థాయి సంస్థలలో చైనా వాటికి చోటుదక్కుతున్నది. క్వాంటమ్ కంప్యూటింగ్, బయోమెడిసిన్, కృత్రిమ మేథ, ప్రత్యామ్నాయ ఇంథన రంగాలలో సాధించే పురోగతితో అగ్రగామిగా ఉన్న అమెరికాను అధిగమించాలన్నది కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన లక్ష్యం. ఇది ప్రారంభం మాత్రమే. ఈ క్రమంలో తలెత్తే మిత్రవైరుధ్యాలు ఎలా ఉంటాయి, వాటిని పార్టీ ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తి కలిగించే అంశం.మరోవైపున చూస్తే అమెరికా, ఇతర పెట్టుబడిదారీ ధనిక దేశాలు పరిశోధకులను, వారితో కలిగే లాభాలను కోల్పోతే చూస్తూ ఊరుకోవు. ప్రమాణాలకు గీటురాళ్లుగా ఇప్పటి వరకు కొనసాగిన అమెరికా విశ్వవిద్యాలయాలు ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటాయా ? ప్రతిభావంతులను ఆకర్షించేందుకు పోటీ పడటంలో కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, జర్మనీ, అరబ్ ఎమిరేట్స్ వంటివి కూడా ఉన్నాయన్నది మరచిపోరాదు. గుత్తాధిపత్యాన్ని దెబ్బకొట్టే విధంగా రానున్న రోజుల్లో పోటీ మరింత పెరగటం మంచిదే. వ్యక్తుల ప్రతిభకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది, అయితే అది పూర్తిగా వారి స్వంతం కాదు, సమాజం నేర్పినదానికి తమ సృజనాత్మకతను జోడిరపు మాత్రమే. ఉదాహరణకు విద్యుత్ బల్బ్‌ను చూస్తే, 1,799 సంవత్సరం నుంచి బల్బులు, బ్యాటరీల తయారీకి పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అనేక మంది చేసిన కృషి 1870, 80 దశకాల్లో పోటీ మరింత పెరిగింది.బ్రిటన్‌లో జోసెఫ్ స్వాన్, అమెరికాలో థామస్ ఎడిసన్ ఒకేసారి బల్బులను కనుగొన్నారు.స్వాన్ బల్బులు విలియమ్ స్టెయిట్ రూపొందించన నమూనాల ప్రకారం ఉన్నాయి. వాటి ఫిలమెంటు చాలా మందంగా ఉంది. ఎడిసన్ బల్బులో పలుచగా ఉండటంతో వాణిజ్య పరంగా అది విజయవంతమైంది. స్వాన్, ఎడిసన్ మధ్య పోటీ చివరకు వారిద్దరినీ ఒక దగ్గరకు చేర్చి ఎడిసన్ మరియు స్వాన్ ఎలక్ట్రిక్ లైట్ కంపెనీగా ఏర్పడి స్వాన్ రూపొందించిన ఫిలమెంట్‌తో మార్కెట్ చేశారు. కానీ పేరు ఎడిసన్‌కు వచ్చింది, దాని వెనుక ఎందరో ఉన్నారు. ఆ తరువాత బల్బుల్లో ఎన్ని మార్పులు, చేర్పులు జరిగాయో మనకు తెలిసిందే. అందువలన ప్రతి నవకల్పన సమాజానికి ఉపయోగపడుతుందా, కార్పొరేట్ల లాభాలకా అన్నదాన్ని బట్టి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల వర్గదృకృధం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. చైనా కార్మికవర్గ వైఖరితో ప్రతిభకు పట్టం కడుతున్నదని చెప్పవచ్చు.
