Tags
CAG Telangana, Congress' 6 poll guarantees, New Telangana CM, Revanth Reddy, rythu bandhu beneficiaries, Telangana finances
ఎం కోటేశ్వరరావు
తెలంగాణా మూడవ శాసనసభ డిసెంబరు తొమ్మిదవ తేదీన ప్రారంభమైంది. మంత్రులకూ శాఖలు కేటాయించారు.వారింకా కొలువు తీరలేదు.శాసనసభ్యులు ప్రమాణస్వీకారాలు చేసిన తరువాత పద్నాలుగవ తేదీకి అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. మూడు రోజుల పాటు సభ జరుగుతుందని, ఆ సందర్భంగా కొన్ని శ్వేత పత్రాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం పూనుకున్నట్లు చెబుతున్నారు. కాలిగోళ్లపుడే కాపురం చేసే కళ తెలుస్తుందన్నట్లు బిజెపి తనదైన మతరాజకీయాలను ప్రోటెం స్పీకర్ నియామకంతోనే ముందుకు తెచ్చింది. మజ్లిస్-కాంగ్రెస్ బంధానికి తెరలేచినట్లు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. భక్తులు తమదైవం రాముడి కంటే రావణుడినే ఎక్కువగా తలచుకుంటారన్నట్లుగా బిజెపినేతలకు మజ్లిస్ పేరు పలకకుండా నోట మాటరావటం లేదు. పాతబస్తీలో మజ్లిస్ పోటీ పెట్టని గోషామహల్ నియోజకవర్గం ఒక్కదానిలోనే బిజెపి గెలిచింది. వారి మధ్య ఉన్న తెరచాటు బాగోతాలకు ఇది నిదర్శనమని ఎన్నికలకు ముందే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.మజ్లిస్ పార్టీ ఎంఎల్‌ఏ అక్బరుద్దీన్ ప్రోటెం స్పీకర్‌గా ఉన్నందున ప్రమాణ స్వీకారం చేసేది లేదని పార్టీ నేతలతో చర్చించకుండా అక్కడ గెలిచిన రాజాసింగ్ ప్రకటించటంతో అంతేకదా అంతేకదా అన్నట్లుగా బిజెపి ఆమోదించింది. ప్రోటెంస్పీకర్‌గా సీనియర్‌గా ఉన్న కెసిఆర్ సభకు రాలేని స్థితిలో అర్హత ఉన్నవారిలో ఎవరినైనా ఎంచుకొనే స్వేచ్చ ఉందని కాంగ్రెస్ సమర్ధించుకుంది. ఏ ప్రయోజనమూ లేకుండా ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని భావించలేము. ఎవరు అధికారంలో ఉంటే వారికి దగ్గరగా మజ్లిస్ ఉంటుందన్న అభిప్రాయాల పూర్వరంగంలో ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. బిఆర్‌ఎస్ నేత, మాజీ సిఎం కె చంద్రశేఖరరావు తన వ్యవసాయ క్షేత్రంలోని స్నానాల గదిలో జారిపడి ఆసుపత్రిపాలయ్యారు.దీనికి కెసిఆర్ వయస్సు,బాత్ రూం స్థితి కంటే అసలు కారకులు జ్యోతిష్కులంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు. ఎందుకంటే వారిలో ఏ ఒక్కరూ ఎన్నికల తరువాత బాత్ రూం గండం ఉంటుందని చెప్పకపోవటమే కారణమని, చెప్పి ఉంటే కెసిఆర్ అసలు వెళ్లి ఉండేవారు కాదని అంటున్నారు. మూడోసారి సిఎం కావటం ఖాయమంటూ చెప్పిన వారి జోశ్యాలు తలకిందులు కావటంతో బాత్రూంలో పడకముందే బహిరంగంగా కెసిఆర్ నోట మాటరాలేదు.
ఎనుముల రేవంత్ రెడ్డి సింఎంగా ప్రమాణస్వీకారం చేయగానే తీసుకున్న చర్యలను చూసి కొందరు ఎంతదూకుడుగా ఉన్నారో చూడండని వ్యాఖ్యలు చేశారు.మహలక్ష్మి పధకంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని సాకారం చేశారు.ఆరోగ్య శ్రీ పధక మొత్తాన్ని పది లక్షల రూపాయలకు పెంచారు. ఆర్‌టిసి ప్రభుత్వానిదే కనుక వెంటనే అమల్లోకి వచ్చింది.గత ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పధకం కింద పెద్ద మొత్తంలో బకాయి పడినందున ప్రయివేటు ఆసుపత్రులు అమలు జరిపేందుకు మొరాయించిన సంగతి తెలిసిందే. బకాయిలు ఎంత ఉన్నదీ వెల్లడికావాల్సి ఉంది. ఎక్కడన్నా బావే కానీ వంగతోటదగ్గర కాదన్నట్లుగా కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం ఏదైనా ఒకటే. బకాయిలను వెంటనే చెల్లిస్తుందా లేదా అన్నదే గీటురాయి.చెల్లిస్తేనే పధకం అమలు జరుగుతుంది. ఈ రెండింటికీ వెంటనే నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉండదు. అందుకే వెంటనే ప్రకటించారన్నది స్పష్టం. ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీవీలలో చర్చలు మొదలయ్యాయి.రైతుబంధు నిధులు విడుదల నిలిచిపోవటానికి కాంగ్రెసే కారణమంటే కాదు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు ఎన్నికల ప్రచార నియమావళి ఉల్లంఘనే కారణమని ఎన్నికలకు ముందు ఆయా పార్టీల వారు వాదించారు. ఎన్నికల కమిషన్ కూడా ఉల్లంఘన కారణాన్ని చూపే నిలిపివేయించింది. ఏడవ తేదీన రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత, తొమ్మిదవ తేదీ సోనియాగాంధీ జన్మదినం వచ్చినా ఇంకా విడుదల ఎందుకు కాలేదో చెప్పాలని బిఆర్‌ఎస్, బిజెపి ప్రతినిధులు నిలదీస్తున్నారు. ప్రతిపక్షాలుగా వాటికి ఉన్న ప్రశ్నించే హక్కును ఎవరూ కాదనటం లేదు. ఒకటవ తేదీ నాటికి అనేక మంది ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపులు జరగలేదు. ప్రకటించినట్లుగా వెంటనే రైతుబంధు నిధులను ఎందుకు విడుదల చేయలేదన్న సందేహం కాంగ్రెస్ ప్రతినిధుల్లో ఉన్నప్పటికీ బయటకు చెప్పలేని స్థితి.అధికారానికి వచ్చి రెండు రోజులేగా తొందరేముంది అని రాకూడని మాట మంత్రి సీతక్క నోటి నుంచి వచ్చింది.రేవంత రెడ్డి దూకుడుతో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నందున దానికి సంతోషిస్తున్న మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. అనర్హులను తొలగించే కసరత్తు జరపటంలో తప్పులేదు గానీ అది పూర్తైన తరువాతే నిధులు ఇస్త్తామంటే కుదరదు.ఈ విడత గతం మాదిరే కానిచ్చి తరువాత నుంచి ఆ పని చేయవచ్చు.
ఎన్నికలను గమనంలో ఉంచుకొని ఏడాది మొత్తానికి చేయాల్సిన అప్పులలో ముందుగానే సింహభాగం తీసుకొని గత ప్రభుత్వం ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వం ప్రకటించే శ్వేత పత్రంలో వెల్లడవుతాయని ఆశిద్దాం. రెండు వాగ్దానాలను వెంటనే అమలు చేసిన రేవంతరెడ్డి రైతు బంధు నిధులు విడుదల చేయకపోవటానికి ఖజానా ఖాళీగా ఉండటం తప్ప మరొక కారణం కనిపించటం లేదు. తాము దిగిపోయేనాటికి నగదు నిల్వ ఎంత ఉందో మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడిస్తే అసలు రంగు బయటపడుతుంది. శ్వేత పత్రంతో నిమిత్తం లేకుండా ఈ పథకానికి నిధులు ఉన్నదీ లేనిదీ ప్రభుత్వం వెంటనే ప్రకటించి ఉంటే జనంలో అనుమానాలు తలెత్తి ఉండేవి కాదు.ప్రతిపక్షాలకు అడిగే అవకాశం వచ్చి ఉండేది కాదు. ఆరు హామీల అమలు అంత తేలిక కాదు. వర్తమాన బడ్జెట్ కేటాయింపులు వచ్చే ఏడాది మార్చి వరకు నూతన ప్రభుత్వానికి కాళ్లు చేతులను కట్టిపడవేశాయి. భూముల అమ్మకం, ఔటర్ రింగ్‌రోడ్ టోల్ కాంటాక్టు సొమ్ము వంటి వాటిని ఖర్చుచేశారు. ఒకటో తేదీకి వేతనాలు, పెన్షన్లే చెల్లించలేని స్థితిలో కొత్త వాగ్దానాల అమలు అంత తేలికకాదు. ప్రగతి భవన్ గేట్లు బద్దలు చేయించినంత వేగం, సులభమూ ఆర్థిక అంశాల్లో సాధ్యం కాదు. కాగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం 2023-24 సంవత్సరానికి ప్రభుత్వ రుణ సేకరణ లక్ష్యం రు.38,234 కోట్లలో అక్టోబరు నాటికే 87.3శాతం అంటే రు.33,378 కోట్లు తీసుకొని ఖర్చు కూడా చేశారు. మరో ఐదు నెలల కాలానికి తీసుకోగలిగింది రు.4,856 కోట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన నిధులు కూడా వెంటనే రావన్నది తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కొన్ని రోజులు ఆలశ్యం చేసినా ఇబ్బందే. అధికారం వస్తుందనుకొని ఆశాభంగం చెందిన బిజెపి వచ్చే లోక్‌సభ ఎన్నికలను గమనంలో ఉంచుకొని వ్యవహరిస్తుందని తెలిసిందే. చెప్పినట్లుగా వాగ్దానం అమలు చేయలేదంటూ ఇప్పటికే ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ రుణాలు రాష్ట్ర జి(ఎస్)డిపిలో 25శాతానికి మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే అంతకు మించి అప్పులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు 23.8శాతం ఉంటాయని అంచనా కాగా కాగా వివిధ సంస్థలకు హామీగా ఇప్పించిన అప్పులు 2022-23 నాటికే రు.1,29,244 కోట్లు(11.3శాతం) కలుపు కుంటే 35.1శాతానికి చేరుకుంటాయి. బడ్జెట్ పత్రాల్లో పేర్కొన్నదాని ప్రకారం 2023నాటికి రాష్ట్రప్రభుత్వం 19 సంస్థలకు ఇచ్చిన రుణాల హామీల మొత్తం రు.1,35,282 కోట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం రుద్దుతున్న విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రైతులకు మీటర్లు పెట్టటం వంటి వాటిని అమలు చేస్తే రుణ అర్హతను కేంద్రం పెంచుతుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆపని చేస్తే కాంగ్రెస్‌కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. గత ప్రభుత్వ భూముల అమ్మకాన్ని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ అధికారానికి వచ్చిన వెంటనే అదే చేస్తే అభాసుపాలవుతుంది. మద్యం బెల్ట్‌షాపుల కారణంగా పెద్ద ఎత్తున ఖజానాకు రాబడి వస్తున్నది. వాటిని అనుమతించబోమని చెప్పినట్లుగా వెంటనే అమలు చేస్తే దాని రాబడి కూడా తగ్గి నిధుల కటకట ఏర్పడుతుంది.
గడువు ప్రకారం నిర్వహిస్తే లోక్‌సభ ఎన్నికలకు ముందే పంచాయతీల ఎన్నికలు జరగాల్సి ఉంది.మరోవైపు నరేంద్రమోడీ, బిజెపి కోయిల కూతలను వింటే లోక్‌సభ ఎన్నికలు కూడా రెండు నెలల ముందుగానే జరగవచ్చు అంటున్నారు. ఒకవేళ అవి గడువు ప్రకారమే జరిగినా కొత్త ప్రభుత్వానికి ఓట్ ఆన్ ఎకౌంట్‌కు అనుమతి తీసుకొని ఎన్నికల తరువాత పూర్తి బడ్జెట్‌ను పెట్టటం తప్ప మరొకమార్గం లేదు. ఆర్థిక పరిస్థితి మీద శ్వేత పత్రం ప్రకటించే వరకు రైతు బంధు నిధుల విడుదల ఆపితే ప్రభుత్వం మీద వత్తిడి, రాజకీయ దాడి పెరుగుతుంది.ఉచిత బియ్యం పథకానికి కేంద్రం ఆమోదించిన కార్డుల కంటే అదనంగా ఉన్నవాటికి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తున్నది. అదనపు కార్డులు ఇస్తే అది పెరుగుతుంది కనుకనే ఏదో ఒకసాకుతో కొత్త కార్డులు ఇవ్వటం లేదు. ప్రకటించిన వివిధ పథకాలకు లబ్దిదారుల ఎంపిక విధానాన్ని కూడా వెంటనే ప్రకటించటం అవసరం. అవన్నీ లోక్‌సభ ఎన్నికల ముందునాటికి పూర్తి చేయకపోతే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తునదాడి చేస్తాయి. ఇలా అనేక సమస్యలున్నందున ఏ విధంగా చూసినప్పటికీ కత్తిమీద సాములా పరిస్థితి ఉంది. జనం కూడా ప్రభుత్వానికి ఎక్కువ సమయం ఇవ్వరు. ఎందుకంటే అధికారానికి రావటమే తరువాయి వెంటనే అమలు అన్నట్లుగా కాంగ్రెస్ నేతల ప్రకటనలు ఉన్నాయి. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లుగా చేసిన వాగ్దానాలు అమలు జరిపారా లేదా అన్నదానినే జనం, మీడియా వారూ చూస్తారు.
