Tags
2026 US Attack Iran, Data centres, Donald trump, Joe Kent, oil price, Pete Hegseth, Trump’s peace talk, US attack Iran, West Asia Crisis
ఎం కోటేశ్వరరావు
అయ్యగారేం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నది ఒక లోకోక్తి. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్, అతగాడి మాటలు నమ్మి ఎటూకాకుండా పోయిన అపర చాణుక్యులు ఇప్పుడు అదే చేస్తున్నారు. దాడులకు ముందు అమెరికా ప్రతిపాదించిన అంశాలపై జెనీవా చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. వియన్నాలో తదుపరి సంప్రదింపులు జరుపుదామన్న అమెరికా ఏకపక్షంగా ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌తో కలసి ఇరాన్‌పై దాడులకు దిగింది. ఇప్పుడు ఆ పాత అంశాలనే ఇప్పుడు 15 పాయింట్ల కాల్పుల విరమణ ప్రతిపాదనలుగా ఇరాన్ ముందుంచినట్లు వార్తలు. గతంలోనే వాటిని తిరస్కరించిన ఇరాన్ ఇప్పుడు కొత్త డిమాండ్లను ముందుకు తెచ్చింది. భవిష్యత్‌లో అమెరికా-ఇజ్రాయెల్ దాడులు జరపవనే హామీ, పశ్చిమాసియా-మధ్య ప్రాచ్య ప్రాంతంలో తమ పాత్రకు గుర్తింపు, దాడులకు నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్లను అంగీకరిస్తే చర్చలకు సిద్దమే అని, గతంలో మాదిరి హామీలను ఉల్లంఘిస్తే కుదరదని ఇరాన్ స్పందించినట్లు కూడా చెబుతున్నారు. అంతకు ముందు మంగళవారం నాటి వరకు జరిగిన పరిణామాలను ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం.
ఇరాన్‌పై ఏకపక్ష దాడులకు దిగిన అమెరికా వెనకడుగు వేసిందా ? పోరును ఆపేందుకు ట్రంప్ దారులు వెతుకుతున్నాడా ? దానిలో భాగంగానే ఇరాన్‌లో ఇంథన వ్యవస్థలపై ఐదు రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడా ! అవన్నీ ఒట్టి మాటలే అని టెహరాన్ ఎందుకన్నది ! ఒక్కటి మాత్రం వాస్తవం ఇరాన్‌పై దాడులను అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఇంకెన్ని రోజులో కొనసాగించే అవకాశాలు లేవన్నది అత్యధిక విశ్లేషకుల అభిప్రాయం.దీనికి విరుద్దంగా జరుగుతుందా ? ఏమో ! ట్రంప్ ప్రకటన చేసిన తరువాత అమెరికా, మనదేశంలో కూడా మంగళ, బుధవారాల్లో యుద్దం ఆగనుందనే అంచనాతో స్టాక్ మార్కెట్లు కళకళలాడాయి. ఐదు రోజుల విరామం ప్రకటన చేసిన తరువాత కూడా సోమవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఇరాన్‌పై దాడులు ఆగలేదు. ఇరాన్‌లోని ఒక ప్రముఖుడితో రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ చెప్పాడు. ఆ పెద్దమనిషి టెహరాన్ మేయర్, పోలీసు అధికారి, అధ్యక్ష స్థానం కోసం పోటీ చేయాలని చూస్తున్నట్లు చెబుతున్న పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగరె గాలిబ్ కావచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.చర్చలకు తాము సిద్దమే అని ఇరాస్ సుప్రీమ్ నేత అయాతుల్లా మొజ్తాబా ఖమేనీ చెప్పినట్లు నిర్ధారణ కాని వార్తలు వచ్చాయి. అమెరికా తరఫున ట్రంప్ అల్లుడు జెరెడ్ కుషనర్, రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ రంగంలో ఉన్నట్లు వార్తలు. ఇరాన్‌తో చర్చలు సాగుతున్నాయని, విశాలమైన ఒప్పందం కుదురుతుందా లేదా అన్నది చూడాలని, వారు పరిష్కారాన్ని, శాంతిని కోరుకుంటున్నారని ట్రంప్ చెప్పాడు. అయితే అయితే ఈ కబుర్లన్నీ తప్పుడు వార్తలని ఎలాంటి చర్చలు జరగలేదని తొలుత ఇరాన్ వార్తా సంస్థ పేర్కొనగా తరువాత పార్లమెంటు స్పీకర్ కూడా చెప్పాడు. ద్రవ్య, చమురు మార్కెట్లను ప్రభావితం చేసేందుకు వాటిని వాడుకున్నారని అన్నాడు. ట్రంప్ ప్రకటనకు ముందు బ్రెంట్ రకం ముడి చమురు పీపా ధర 114 డాలర్లకు పెరిగింది, ప్రకటన తరువాత 98 డాలర్లకు పడిపోయి, చర్చలు జరగలేదన్న ఇరాన్ ప్రకటన తరువాత మంగళవారం మధ్యాహ్నానికి 104 డాలర్లకు చేరింది. బుధవారం నాడు వంద డాలర్లలోపు ఉంది. ఒక వైపు ట్రంప్ ఐదురోజుల విరామ ప్రకటన చేసినప్పటికీ మరోవైపు అమెరికా మిలిటరీ కేంద్ర కమాండ్ ఇరాన్ మీద తీవ్రమైన దాడులు జరుపుతూనే ఉంటాయని ప్రకటించింది. దానికి ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణులను ప్రయోగిస్తున్నది.ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్ మీద దాడులను కొనసాగిస్తున్నాయి.దాడులు దీర్ఘకాలం కొనసాగితే అమెరికన్లలో వ్యతిరేకత మరింత పెరుగుతుందని, నవంబరులో జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే పదవీకాలం పూర్తయ్యే వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో ట్రంప్ వెనకడుగు వేసేందుకు నిర్ణయించుకొని దారి వెతుక్కుంటున్నట్లు చెబుతున్నారు.
అమెరికా బలహీనతలు, దాని ఎత్తుగడల వైఫల్యం గురించి పెద్ద ఎత్తున సాగుతున్న చర్చతో వెనక్కు తగ్గే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వెలువడుతున్న సమయంలో ట్రంప్ 48 గంటల బెదిరింపు ప్రకటన చేశాడు.హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ప్రకటించాడు. అయితే ఆ గడువు ముగిసిన వెంటనే ఐదు రోజుల పాటు దాడులను వాయిదా వేస్తామంటూ నాటకీయంగా సోమవారం సాయంత్రం ప్రకటించాడు.తమపై దాడులకు మరింత మంది సైనికులను కూడ గట్టుకొనేందుకే ఈ ప్రకటన చేశాడని ఇరాన్ స్పందించింది. తమ విద్యుత్ సంస్థలపై దాడులు జరిపితే తలెత్తే పర్యవసానాలకు భయపడి ట్రంప్ ఆ ప్రకటన చేశాడని ఇరాన్ జాతీయ టీవీ, ఇతర మీడియా సంస్థలు పేర్కొన్నాయి.రెండు దేశాల మధ్య చర్చల గురించి ఎవరేమి చెప్పినప్పటికీ తెరవెనుక సంప్రదింపులు జరుగుతున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఇరాన్‌పై దాడులకు ట్రంప్‌ను ఎవరు ప్రేరేపించారనే అంశంపై రకరకాల వార్తలు వచ్చాయి.అయితే సోమవారం నాడు ట్రంప్ టెన్నెసీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేత్‌పై నెపం మోపాయి.తన పక్కనే ఉన్న హెగ్‌సేత్‌తో ట్రంప్ మాట్లాడుతూ ” వారు అణ్వాయుధాలను కలిగి ఉండకూడదంటే మనం వారిని వదల కూడదని నువ్వే కదా మొదట చెప్పింది ” అన్నాడు. అంతా అధ్యక్షుడి చేతుల్లోనే ఉంది అన్నాడు తప్ప పీట్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇతరులపై నెపం మోపటంలో ట్రంప్ ఘనుడు. ఇరాన్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల గురించి తనకు తెలియదని కొద్ది రోజుల క్రితం చెప్పాడు. ఇరాన్ ప్రతిఘటన ఇలా ఉంటుందని తనకెవరూ చెప్పలేదన్నాడు. ఇప్పుడు మరొక కొత్త కథ చెప్పాడు.రేపు ఇంకెన్ని చెబుతాడో చూద్దాం.
ఇరాన్‌పై దాడులు ఎందుకు చేశారని ట్రంప్ యంత్రాంగంలో ఏ ఇద్దరిని అడిగినా ఒకే సమాధానం రావటం లేదు.ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. ఇజ్రాయెల్ దాడులకు దిగాలని నిర్ణయించినందున అమెరికాకు తప్పలేదన్నది ఒక కథనం. ఇరాన్ అణ్వాయుధాలను మోహరిస్తున్నందున దాడికి దిగక తప్పదని మరికొందరు చెబుతున్నారు. ముందే చెప్పినట్లుగా ట్రంప్ మరోవిధంగా మాట్లాడాడు.” నేను పీట్‌ను సంప్రదించాను, నేను జనరల్ కానేతో మాట్లాడాను. అనేక మంది మన గొప్ప జనాలతో మాట్లాడాను.మధ్య ప్రాచ్యంలో మనకు ఒక సమస్య వచ్చింది.మనం దాన్ని ఆపగలం, మధ్య ప్రాచ్యంలోకి చిన్న ప్రయాణం పెట్టుకొని పెద్ద సమస్యను అంతం చేయాలి ” అని ట్రంప్ చెప్పాడు. అంతకు ముందు మాట్లాడుతూ గల్ఫ్ దేశాల మీద ఆకస్మికంగా ఇరాన్ చేసిన దాడులను చూస్తే ఎవరూ కనీసం ఊహించను కూడా లేదు అన్నాడు. అయితే ఇలా మాట్లాడటానికి ముందే ఇరాన్ ప్రతిఘటన గురించి దాడులకు ముందుగానే ట్రంప్‌ను హెచ్చరించారని, వాటిని ఖాతరు చేయలేదని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొన్నది.అందరికీ తెలిసినప్పటికీ ఇరాన్ సామర్ధాన్ని అంచనా వేయటంలో విఫలం, పెత్తందారీ పోకడలతో దాడులకు తెగబడ్డారన్నది సత్యం. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అంత ఉత్సాహంగా లేకున్నా, వ్యతిరేకతను వెల్లడించలేదన్నది ఒక కథనం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, మీడియా అధిపతి రూపర్ట్ మర్డోచ్ దాడులను ఎగదోసిన ప్రముఖుల్లో ఉన్నట్లు చెబుతున్నారు.జాతీయ ఉగ్రవాద నిరోధ కేంద్రం అధికారి జో కెంట్ దాడులను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన తీరు ట్రంప్ యంత్రాంగంలో ఉన్న భిన్నాభిప్రాయాలను వెల్లడించింది.ఇరాన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి, అంతా సవ్యంగా జరిగితే సరే లేకుంటే బాంబుదాడులను కొనసాగిస్తూనే ఉంటామని ట్రంప్ చెప్పాడు.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన దాడులు ఎప్పుడు ముగుస్తాయో తెలియదు. ఇప్పటి వరకు వరకు ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాదాపు రెండువేల దాడులు జరిపినట్లు అంచనా. ఆపరేషన్ ఎపిక్ ఫురీ పేరుతో అమెరికా, రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ తెగబడుతున్నాయి. వందకు పైగా విమానాలను దాడులకు వినియోగించినట్లు చెబుతున్నారు. అత్యధిక దాడులు రాజధాని టెహరాన్ నగరం మీదే జరిగాయి. ఈ దాడులతో భారీగా నష్టపోయినప్పటికీ ఇరాన్ ఎందుకు వెనక్కు తగ్గటం లేదన్నది యావత్ ప్రపంచంలో చర్చగా ఉందంటే అతిశయోక్తి కాదు. సుప్రీమ్ నేత అయాతుల్లా అలీ ఖమేని, ఇతర అనేక మంది ప్రముఖులను పోగొట్టుకున్నప్పటికీ ధైర్యం కోల్పోలేదు. అమెరికా మీద గెలవటం అన్నది కల అని తెలిసినప్పటికీ ప్రతిఘటన దాడులు జరుపుతున్నది.ముందుగా దాడులు నిలిపివేయాలని, తమకు నష్టపరిహారం చెల్లించాలని, తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని, భవిష్యత్‌లో ఎలాంటి దాడులు జరపబోమనే హామీ కావాలని అమెరికాకే షరతులు పెట్టింది. తాను బలహీనంగా ఉన్నపుడు ఎదుటి వాడి బలహీనతల మీద దెబ్బకొట్టాలన్నది ఒక సూత్రం. ఇప్పుడు అదే జరిగింది. హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేయటంతో ఆ మార్గంలో చమురు, గ్యాస్ ఎగుమ తి, దిగుమతి చేసుకొనే దేశాలు ప్రభావితమై అమెరికా మీద వత్తిడి తెస్తాయన్నది ఒకటైతే అమెరికా మిలిటరీ స్థావరాలను అనుమతించిన గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తే అవి కూడా వాషింగ్టన్ మీద ప్రభావం చూపుతాయన్నది ఇరాన్ అంచనా, అదే జరిగింది. నిజానికి ఈ విషయాలన్నీ ముందే చెప్పినా ఎవరూ ఖాతరు చేయలేదు.చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు కతార్, ఒమన్ తెరవెనుక కాల్పుల విరమణ యత్నాలు ప్రారంభించాయి, అయితే తొందరేం లేదు ముందు మాపై దాడులను నిలిపివేయనివ్వండి, అర్దవంతమైన ప్రతిపాదనలతో రానివ్వండి అన్నట్లు ఇరాన్ తాపీగా ఉంది.ఎలాంటి చర్చలకూ సంసిద్దత వెల్లడించలేదు. యుద్ధం మీద అమెరికా అదుపు కోల్పోతున్నదంటూ సోమవారం నాడు అమెరికా ప్రధాన మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.ఉభయపక్షాలూ ఎవరూ ఎవరిని నమ్మే స్థితి లేనందున చర్చలు అనుమానమే. ఒక వేళ తామే విజయం సాధించినట్లు అమెరికా ప్రకటిస్తే హార్ముజ్ జలసంధి మీద ఇరాన్ ఆధిపత్యం నిర్ధారణ అవుతుంది. దాని అణుకార్యక్రమం కూడా కొనసాగుతుంది.రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరిపితే గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు కొనసాగుతాయి. ఇరాన్ చమురు కేంద్రం ఖార్గ్ దీవి మీద దాడులకు దిగితే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. మెరైన్ దళాలతో ఈ దీవిని చేరుకుంటే పెద్ద సంఖ్యలో అమెరికన్లను బందీలుగా ఇరాన్‌కు అప్పటించటమే అని రాజీనామా చేసిన ఉన్నతాధికారి కెంట్ హెచ్చరించాడు. అందువలన ఏకపక్షంగా దాడులను విరమించటమే అమెరికా ముందున్న మార్గం అని చెప్పవచ్చు. అయితే సామ్రాజ్యవాదం తన ఓటమిని అంత తేలికగా అంగీకరిస్తుందా ? ఒక వైపు ఐదు రోజుల విరామం ప్రకటించిన ట్రంప్ మరోవైపు అదనపు దళాలను సమీకరిస్తున్నాడు.జపాన్‌లో ఉన్న సైనిక స్థావరం నుంచి రెండువేల మంది మెరైన్(సముద్రం, భూమి మీదా దాడులు చేసే శిక్షణ పొందినవారు) దళాన్ని మధ్య ప్రాచ్యానికి తరలించారు.అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి మరో రెండున్నరవేల మందిని తరలిస్తున్నారు. ఏప్రిల్ నాటికి ఇతర మరికొన్ని దళాలను కూడా తరలించేందుకు నిర్ణయించారు.
అమెరికా దూకుడు వైఖరిలో వచ్చిన మార్పుతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా వాషింగ్టన్-టెహరాన్ చర్చలు ఈ వారంలో జరగవచ్చని రాయిటర్స్ పేర్కొన్నది.ఉభయపక్షాలను దగ్గరకు చేర్చేందుకు ఈజిప్టు, టర్కీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.పాక్ సైన్యాధికారి మునీర్ రెండు దేశాల అధ్యక్షులతో ఈపాటికే సంప్రదింపులు జరిపినట్లు వార్తలు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలీబ్‌తో ట్రంప్ అల్లుడు కుషనర్, రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ సంప్రదింపులు జరిపినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొన్నది. ట్రంప్ చర్యలకు నిరసనగా రాజీనామా చేసిన అమెరికా ఉగ్రవాద వ్యతిరేక సంస్థ మాజీ అధిపతి జో కెంట్ ఐదు రోజుల ట్రంప్ విరామప్రకటన గురించి స్పందించాడు. ముందుగా ఇజ్రాయెల్‌ను అదుపు చేస్తే తప్ప సంప్రదింపులు ముందుకు వెళ్లవని, అవి కొనసాగితే అమెరికా సంప్రదింపుల సామర్ధ్యం బలహీనపడుతుందని చెప్పాడు.ఇజ్రాయెల్ గూఢచార సంస్థలు ఇచ్చిన తప్పుడు సమాచారం అమెరికాను యుద్ధంలోకి లాగిందని, అమెరికా విదేశాంగ విధానంపై ప్రభావం చూపిందన్నది కెంట్ అభిప్రాయం. యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఇరాన్ మరొక చర్య ఏమంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న డేటా(సమాచార) కేంద్రాలపై దాడులు. ఈ కేంద్రాలు అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన కృత్రిమ మేథ లక్ష్యాలను నెరవేర్చకుండా చేసేందుకు ఇరాన్ కేంద్రీకరించింది.అయితే అమెరికా కూడా టెహరాన్‌లో ఉన్నకేంద్రాల మీద దాడులు చేసింది.ఇప్పటి వరకు రెండు వైపులా ఐదు కేంద్రాలు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఇరవై తొమ్మిది సాంకేతిక కేంద్రాలపై దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. సాంప్రదాయ యుద్ధంలో వంతెనలు, విమానాశ్రయాలు, నౌకా కేంద్రాల మీద కేంద్రీకరించటం తెలిసిందే.ఇప్పుడు యుద్ధంలో డేటా కేంద్రాలను కూడా వినియోగిస్తున్నందున వాటిని కూడా వదలటం లేదు. గల్ఫ్ దేశాలు వివాదాలకు దూరంగా ఉంటాయంటూ అమెరికా, ఇతర అనేక దేశాలు అక్కడ పెట్టుబడులు పెట్టాయి. తాజా పరిణామాలతో అవి ఆర్థికంగా నష్టపోవటమేగాక గల్ఫ్ దేశాల మీద ఉన్న నమ్మకం కూడా సడలటం ఖాయం. ఇరాన్‌కు వీటిని దెబ్బతీయాలనే ఆలోచన కలగటానికి అమెరికా, ఐరోపా దేశాలు చూపిన మార్గమే. రష్యాను దెబ్బతీసేందుకు ఈ దేశాలు ఉక్రెయిన్‌కు డేటా కేంద్రాల ద్వారా కీలకమైన రష్యా కేంద్రాల గురించి సమాచారం ఇవ్వటమేగాక ఉక్రెయిన్ దాడులను సమన్వయపరచటం, ఎప్పటికప్పుడు మాప్‌లను అందించటం వంటి సేవలను అందించాయి. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు ఇరాన్‌కు అవసరమైన సలహాలు, సమాచారాన్ని రష్యా అందిస్తున్నదని ఎవరైనా వాపోతే చేసేదేమీ లేదు !
