Tags
Donald trump, Gaza ceasefire deal, Israel genocide, Latin america left, Netanyahu, Nobel peace prize, Peru Protests, Venezuela
ఎం కోటేశ్వరరావు
అమెరికా ముందుకు తెచ్చిన 20 అంశాల శాంతి ప్రతిపాదన ఒప్పందంపై సోమవారం నాడు కైరో(ఈజిప్టు)లో అనేక మంది దేశాధినేతల సమక్షంలో సంతకాలు జరిగాయి. హమస్ వద్ద బందీలుగా ఉన్న 20మంది, ఇజ్రాయెల్ జైళ్లలో నిర్బంధంలో ఉన్న రెండువేల మంది పాలస్తీనియన్ల విడుదల జరిగింది. బందీలుగా ఉండి మరణించిన 28 మంది మంది భౌతిక కాయాలను కూడా అప్పగించేందుకు హమస్ అంగీకారం తెలిపింది. గాజాలో సాగిస్తున్న మారణకాండకు ప్రస్తుతానికి తెరపడింది.ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే మరోసారి ఇజ్రాయెల్ అలాంటి దుర్మార్గానికి పాల్పడనే హామీ ఏమీ లేదు. పాలస్తీనియన్లు ఊపిరి పీల్చుకొనేందుకు అవకాశం ఇచ్చే ఏ చర్యనైనా ఆహ్వానించాల్సిందే. అసలైన సమస్య పాలస్తీనా గుర్తింపు, ఐరాస తీర్మానం ప్రకారం దానికి కేటాయించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలగటం మీద ఆధారపడి ఉంది. గతంలో కుదిరిన ఒప్పందాలేవీ కూడా ఈ అంశంపై ఎలాంటి పరిష్కారాన్ని చూపలేదు. ఏడాదికేడాది ఇజ్రాయెల్ ఆక్రమణలు, నివాసాల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనాభా స్వభావాన్ని మార్చేందుకు యూదులందరినీ తీసుకువచ్చి ఆ ప్రాంతాల్లో ఉంచుతున్నారు. ఒప్పందం మొదటి దశగా పేర్కొన్నదాని ప్రకారం బందీలు-ఖైదీల మార్పిడికి మాత్రమే పరిమితం.
సోమవారం నాడు డోనాల్డ్ ట్రంప్ కైరో వెళ్లే ముందు జెరూసలెంలో ఉన్న ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించాడు.నూతన మధ్య ప్రాచ్యానికి చారిత్రాత్మక ఉషోదయం అని ఒప్పందాన్ని వర్ణించాడు. ఆ సందర్భంగా ఇద్దరు వామపక్ష వాదులైన ఎంపీలు పాలస్తీనా పట్ల అమెరికా వైఖరికి నిరసన తెలిపారు.అమెన్ ఒడే, ఓఫర్ కాసిఫ్ అనే ఎంపీలను భద్రతా సిబ్బంది బయటకు తీసుకువెళ్లారు. యూదు దురహంకారం, అరబ్బులను రెండోతరగతి పౌరులుగా చూసే వివక్ష వాస్తవం. అయితే మొత్తం యూదు సామాజికతరగతికి దీన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు.వారిలో కూడా పురోగామి,ప్రజాతంత్ర వాదులు ఉన్నారు గనుకనే అనేక మంది గాజాలో జరుపుతున్న మారణకాండను వ్యతిరేకించారు.దానికి సారధ్యం వహించిన నెతన్యాహు చర్యలకు నిరసన తెలిపారు.అయితే వాటికి ఉన్న పరిమితులు, మీడియా పూర్తిగా అలాంటి వార్తలను పక్కన పెట్టిన కారణంగా బయటి ప్రపంచానికి వివరాలు పూర్తిగా తెలియవు. ట్రంప్‌కు నిరసన తెలిపిన ఇద్దరు ఎంపీలలో ఒకరైన ఒడే సామాజిక మాధ్యమంలో తరువాత పెట్టిన పోస్టులో తామెందుకు ఆ చర్యకు పాల్పడిందీ తెలిపాడు. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించాలని యావత్ ప్రపంచ సమాజం అంగీకరించినందున ఆ పని ఎందుకు చేయరన్నదే తమ ప్రశ్న అని ఆ మాత్రానికే తమను పార్లమెంటునుంచి బయటకు గెంటారని పేర్కొన్నాడు.మరో ఎంపీ కాసిఫ్ ఒక ప్రకటన చేస్తూ ట్రంప్ చర్యలను విమర్శించాడు, పాలస్తీనా, ఇజ్రాయెల్ గుర్తింపు పరిష్కారాన్ని అమలు జరపాలని డిమాండ్ చేశాడు. అమెరికా మిత్రదేశాలుగా ఉన్న కెనడా, కొన్ని ఐరోపా దేశాలు ఇప్పటికే పాలస్తీనాను అధికారికంగా గుర్తించినప్పటికీ అమెరికా ముందుకు రావటం లేదు. ఇజ్రాయెల్ అసలు ఉనికినే ప్రశ్నిస్తున్నది. ఐరాస అచేతనంగా ఉండిపోయింది. భద్రతామండలిలో ఎవరైనా కార్యాచరణకు తీర్మానం పెడితే వీటో హక్కుతో అమెరికా సైంధవుడిలా అడ్డుపడుతున్నది.మారణకాండనే ఆపేందుకు ముందుకు రాని వాషింగ్టన్ తన రాజకీయ, మిలిటరీ, ఆర్థిక అజెండాను పక్కకు పెట్టి పాలస్తీనాను గుర్తిస్తుందా ?
వివిధ రంగాలలో ప్రజ్ఞ కనపరచిన వారికి ఇచ్చే నోబెల్ బహుమతుల గురించి ఇంతవరకు ఎలాంటి వివాదమూ లేదుగానీ శాంతి బహుమతికి ఎంపికలు కొన్ని అపహాస్యానికి గురౌతున్నాయి. తాజాగా వెనెజులా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మరియా కోరినా మచోడోకు శాంతి బహుమతి అలాంటిదే. అక్కడి వామపక్ష నికోలస్ మదురో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చివరికి అమెరికా మిలిటరీ కూడా జోక్యం చేసుకోవాలని, బాంబులు వేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును కోరిన ఆమెను శాంతిదూతగా పరిగణించటం, తనకు వచ్చిన బహుమతిని తనకు నిర్ణయాత్మక మద్దతు ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్‌కు అంకితం చేస్తున్నట్లు ఆమె ప్రకటించటాన్ని చూస్తే నోబెల్ కమిటీ ఎవరి కనుసన్నలలో పని చేస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. గత రెండున్నర దశాబ్దాలుగా ఆమె తీరుతెన్నులన్నీ వెనెజులాలో అశాంతిని రెచ్చగొట్టేందుకు అమెరికాతో చేతులు కలిపి చేసిన నిర్వాకాలు తప్ప శాంతి చిహ్నాలే లేవు. అసలా బహుమతి తనకే ఇవ్వాలని డోనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మదురోను అరెస్టు చేసేందుకు అవసరమైన సమాచారమిచ్చిన వారికి ఐదు కోట్ల డాలర్ల బహుమతి ఇస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వెనెజులాను మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రంగా మార్చారంటూ వెనెజులా నుంచి వచ్చిన రెండు బోట్లమీద కాల్పులు జరిపి వాటిలో ఉన్నవారిని హత్య చేసి మాదకద్రవ్య సరఫరాదారులుగా ప్రచారం చేయటమే కాదు, అవసరమైతే సైనిక చర్యకు దిగేందుకు మిలిటరీని మోహరించిన సంగతి తెలిసిందే. మరియా కోరినా నిర్వాకాలను చూస్తే 2002లో హ్యూగో ఛావెజ్‌కు వ్యతిరేకంగా జరిగిన విఫల కుట్రలో ఆమె పాత్రధారి.కేవలం 47 గంటలు మాత్రమే అధికారంలో ఉన్న తిరుగుబాటుదార్లు రాజ్యాంగాన్ని , పతి ప్రజా సంస్థను రద్దు చేశారు. వెనెజులాను విముక్తి చేసేందుకు మిలిటరీ జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరింది. కరీబియన్ సముద్ర ప్రాంతంలో మాదక ద్రవ్యాల నిరోధం పేరుతో దిగిన అమెరికా నౌకాదళానికి ఆమె జేజేలు పలికింది. వెనెజులా ఎన్నికల ఫలితాన్ని గుర్తించేందుకు నిరాకరించిన వ్యక్తితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన ఘనురాలామె. జెరూసలెంలో మూసివేసిన వెనెజులా రాయబార కార్యాలయాన్ని తెరవాలని కోరింది. వెనెజులా చమురు, నీరు, మౌలిక సదుపాయాలవంటి అన్నింటినీ ప్రవేటింకరించాలని కోరుతున్న శక్తుల ప్రతినిధిగా పని చేస్తున్నది.ఆమె శాంతి లేదా పురోగతికి ప్రతీక కాదని, ఫాసిజం, యూదు దురహంకారం మరియు నయాఉదారవాదాల ప్రపంచ కూటమిలో భాగం,ప్రజాస్వామ్య ముసుగులో శాంతిని విచ్చిన్నం చేసే శక్తి అని కొందరు విమర్శించారు. నోబెల్ శాంతి బహుమతి ఆశయం, లక్ష్యాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నవారికి దాన్ని ప్రదానం చేయటం పక్కా రాజకీయం. వియత్నాంలో దురాక్రమణకు పాల్పడి లక్షలాది మంది ప్రాణాలు తీసింది అమెరికా. దానికి నాయకత్వం వహించినవారిలో ఒకడు హెన్రీ కిసింజర్. అక్కడ కాల్పుల విరమణకు కృషి చేశాడనే పేరుతో 1973లో శాంతి బహుమతి ఇచ్చారు. అదే పెద్దమనిషి ఇజ్రాయెల్ దుర్మార్గాలకు మద్దతు ఇచ్చాడు.ఈజిప్టును లొంగదీసుకొని ఇజ్రాయెల్‌తో కాంప్‌డేవిడ్ ఒప్పందానికి తెరతీసిన జిమ్మీ కార్టర్‌కు 1978లో అదే బహుమతి ఇచ్చారు. ఆ ఒప్పందంలో పాలస్తీనా గుర్తింపును విస్మరించారు. పాలస్తీనా ప్రాంతంలో దురాక్రమణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌పై ఆంక్షల కోసం పెట్టిన తీర్మానాన్ని వీటో చేసిన పెద్దమనిషి బరాక్ ఒబామా,మిలిటరీ సాయాన్ని మరింతగా పెంచినందుకా అన్నట్లు 2009లో శాంతి బహుమతి పొందాడు. ఇలాంటి విషయాల్లో నేను మాత్రం తక్కువ తిన్నానా నాకెందుకు ఇవ్వరని ట్రంప్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
బ్రెట్టన్ ఉడ్ కవలలుగా పేరుమోసిన ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ ప్రయోగశాల లాటిన్ అమెరికా. వాటి ప్రజావ్యతిరేక, ప్రపంచ పెట్టుబడి అనుకూల విధానాల కారణంగా జన జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వాటిని బలవంతంగా అమలు జరిపేందుకు మిలిటరీ పాలకులు, నియంతలను రంగంలోకి తెచ్చారు. వారికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో జరిగిన పోరాటాలతో వామపక్ష శక్తులు ముందుకు వచ్చాయి, అనేక చోట్ల అధికారాన్ని పొందాయి. అయితే నయావలసవాద పునాదులను పూర్తిగా నాశనం చేయకుండా జనాలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ అసలు సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అందుకే ఎన్నికలలో వామపక్షాలకూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇదే సమయంలో బ్రెట్టన్ ఉడ్ కవలలు మరింతగా సంస్కరణల పేరుతో తమ విధానాలను రుద్దుతుఉన్న కారణంగా కార్మికవర్గం, ఇతర తరగతులు వీధులలోకి రావటం అనివార్యంగా కనిపిస్తున్నది.
ఈ పూర్వరంగంలో పెరూలో వామపక్ష అభ్యర్ధిగా ముందుకు వచ్చి విజయం సాధించిన ఒక సామాన్య స్కూలు టీచర్ పెడ్రో కాస్టిలో 2021లో అధికారానికి వచ్చిన ఏడాదిలోనే పదవి కోల్పోయాడు. తన మూలాలను మరచి మితవాద,మతవాద శక్తులతో చేతులు కలిపి కార్మికవర్గాన్ని విస్మరించాడు.పార్లమెంటు ఉద్వాసనతో పదవి నుంచి తప్పుకున్నాడు. అప్పుడు ఉపాధ్యక్షరాలిగా ఉన్న దినా బోలార్టే 2022లో గద్దెనెక్కింది. అన్ని విధాలుగా పాలనలో విఫలం కావటంతో పార్లమెంటు గత శుక్రవారం నాడు పదవి నుంచి తొలగించింది.ఆమెకు వ్యతిరేకంగా దేశవ్యాపితంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. గురువారం రాత్రి చర్యకు ఉపక్రమించిన పార్లమెంటు మెరుపువేగంతో వ్యవహరించి తెల్లవారేసరికి ఉద్వాసన పలికింది. రాత్రి 11.30కు పార్లమెంటు రావాలని ఇచ్చిన ఆదేశాన్ని ఆమె ఉల్లంఘించింది. ఒకనాడు మద్దతు ఇచ్చిన పార్టీలు కూడా వ్యతిరేకంగా ఓటువేశాయి. విచ్చలవిడి అవినీతి, రెచ్చిపోయిన నేరస్థ ముఠాలను అదుపుచేయటంలో వైఫల్యంతో దినా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగేవరకు పార్లమెంటు స్పీకరు జోస్ జెరీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాడు. గత తొమ్మిది సంవత్సరాలలో ఏడుగురు అధ్యక్షులు మారారు. వారిలో ముగ్గురిని పార్లమెంటు తొలగించింది. అధ్యక్షులుగా ఎన్నికైన పార్టీ పార్లమెంటులో మెజారిటీ సాధించలేకపోవటం అనేక లాటిన్ అమెరికా దేశాల్లో జరుగుతున్నది.దామాషా ప్రాతినిధ్యంతో అనేక పార్టీలు పార్లమెంటులో అడుగుపెడుతున్నాయి. పౌరుల ఆగ్రహం తలెత్తినపుడు అధ్యక్షులను పార్లమెంట్లు తొలగిస్తున్నాయి. ప్రైవేట్ పెన్షన్ నిధులకు కార్మికులు చెల్లించాలనే బిల్లుకు వ్యతిరేకంగా యువతరం నిరసనలకు దిగింది.దీనికి తోడు ఉద్యోగ భద్రత లేదు, యువతలో నిరుద్యోగం విపరీతంగా ప్రబలింది.
మరో లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్. మితవాది, వాణిజ్యవేత్తలకు అనుకూలమైన అధ్యక్షుడు డేనియల్ నోబావోకు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నది. చమురు మీద ఇస్తున్న సబ్సిడీలను ఎత్తివేయటంతో ఆగ్రహం భగ్గుమన్నది. ఒక గాలన్(3.79 లీటర్లు) డీజిలు ధర 1.8 డాలర్ల నుంచి 2.8డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ ధరలను బట్టి ఎప్పటికప్పుడు ధరలను సవరిస్తామని ప్రకటించారు. స్థానిక తెగలకు ప్రాతినిధ్యం వహించే సంస్థ అనేక రూపాల్లో ఆందోళనకు పిలుపు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఆదివారం నాడు కొలంబస్ దినం రోజున(1492లో కొలంబస్ లాటిన్ అమెరికా గడ్డపై అడుగు పెట్టాడు) తాజా ప్రదర్శనలపై దేశవ్యాపితంగా పోలీసులు విరుచుకుపడ్డారు. దాంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పది జిల్లాల్లో అధ్యక్షుడు అత్యవసర పరిస్థితిని ప్రకటించేంతగా ఉద్రిక్తత పెరిగింది.గతవారంలో రోడ్డు మీద అధ్యక్షుడి కారునే అడ్డుకున్నారు. స్థానిక తెగలు ఎక్కువగా పని చేస్తున్న వ్యవసాయం, చేపలు పట్టటం, రవాణా రంగాలపై చమురు సబ్సిడీ ఎత్తివేత ప్రభావం ఎక్కువగా ఉంది. ఏటా ప్రభుత్వం 110 కోట్ల డాలర్ల సబ్సిడీ ఇస్తున్నదని, ఈ కారణంగా ఇరుగుపొరుగున ఉన్న కొలంబియా, పెరూ దేశాలకు పెద్ద ఎత్తున అక్రమరవాణా జరుగుతున్నదని అధ్యక్షుడు వాదిస్తున్నాడు. డేనియల్ నోబావో నియంతమాదిరి వ్యవహరిస్తున్నాడని,చమురు సబ్సిడీ ఎత్తివేతకు ముందు ఇతర రాయితీలను కూడా తొలగించారని, చమురు అక్రమరవాణా అన్నది ఒక సాకుమాత్రమే నంటూ ఐదువేల మంది ప్రభుత్వ ఉద్యోగులను కూడా తొలగించారని కార్మిక నేతలు ప్రకటించారు. సమ్మెకు పిలుపు ఇచ్చిన సంస్థతో చర్చలకు ససేమిరా అనటంతో పరిస్థితి మరింతగా దిగజారింది. కొత్తగా రుణం ఇచ్చేందుకు రుద్దిన ఐఎంఎఫ్ ఆదేశాల మేరకు పొదుపు పేరుతో నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఔషధాలు కూడా సరిగా ఉండటం లేదు. విదేశీ మిలిటరీ స్థావరాల ఏర్పాటును అనుమతించేందుకు జూన్‌లో పార్లమెంటు తీర్మానించింది. ఇది అమెరికా కోసమే అన్నది తరువాత వెల్లడైంది. ప్రజా వ్యతిరేక విధానాలకు, అమెరికాకు లొంగిపోవటాన్ని లాటిన్ అమెరికా కార్మికవర్గం వ్యతిరేకిస్తున్నది.
