ఎం కోటేశ్వరరావు
” ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, మరింత సాయం వస్తుందని నేను చెప్పలేను, మీకు మరింత స్వేచ్చ, మీ పనికి మర్యాద కోసం కావాలంటే నేను కూడా మీతో కలసి ఆందోళన చేస్తా , నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాడినే ” జనవరి ప్రారంభం నుంచి ఆందోళన చేస్తున్న రైతులతో జర్మనీ ఆర్థిక మంత్రి క్రిస్టియన్ లిండ్‌నర్ అన్న మాటలి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బెర్లిన్‌తో సహా అనేక పట్టణాల్లో రోడ్ల మీద ట్రాక్టర్లను నిలిపి ఆందోళన చేస్తున్న అన్నదాతలను రౌడీ రైతులుగా చిత్రించి మీడియా వార్తలకు శీర్షికలిచ్చింది.2024 బడ్జెట్‌తో ప్రారంభించి వ్యవసాయ యంత్రాలు, డీజిల్‌కు ఇస్తున్న సబ్సిడీలను దశలవారీ ఎత్తివేస్తామని జర్మన్ ప్రభుత్వం డిసెంబరులో ప్రకటించింది. సబ్సిడీలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చిందంటూ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో రైతాంగంలో ఆగ్రహం పెల్లుబుకింది. దీంతో ఒకడుగు వెనక్కు వేసి కొత్త వ్యవసాయ యంత్రాలకు పన్ను రాయితీలు ఇస్తాం తప్ప డీజిల్ సబ్సిడీలు ఎత్తివేస్తామని చెప్పింది. శాంతించని రైతులు జనవరి మొదటి వారం నుంచి వివిధ రూపాలలో ఆందోళనలు చేస్తున్నారు.పదిహేనవ తేదీన బెర్లిన్‌లో దేశమంతటి నుంచి వచ్చిన 30వేల మంది రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో సహా తరలి వచ్చి ప్రదర్శన చేశారు. దాంతో నగరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్‌లు, ట్రామ్‌లు నడిచే మార్గాలను మూసివేయాల్సి వచ్చింది. ఆ సందర్భంగా రైతుల నుద్దేశించి మాట్లాడేందుకు మంత్రి ప్రయత్నించగా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనకు ప్రతిపక్ష మితవాద పార్టీలు మద్దతు ప్రకటించటంతో ఇంకేముంది ఆందోళన వెనుక మితవాదులు చేరారు అంటూ మీడియాలో పక్కదారి పట్టించే వార్తలు, వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.(మన దేశంలో రైతులు ఢిల్లీ శివార్లలో తిష్టవేసి ఏడాది పాటు చేసిన ఆందోళనను బిజెపి ప్రభుత్వం కూడా ఇలాగే ఉగ్రవాదులతో ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే). జర్మన్ రైతులు తమ నిరసన వ్యక్తం చేసేందుకు గ్రామ ప్రవేశ ద్వారాల వద్ద విడిచిన బూట్లు,పక్కనే వెలుగుతున్న కొవ్వొత్తులున్న డబ్బాలను ప్రదర్శిస్తున్నారు.రైతుల నిరసనలతో కాస్తవెనక్కు తగ్గిన సర్కార్ వ్యవసాయ వాహనాల పన్నులను తగ్గించేది లేదని, డీజిల్‌పై పన్నులను దశలవారీ ఎత్తివేస్తామని చెప్పింది. దీన్ని రైతులు అంగీకరించటం లేదు. సోమవారం (జనవరి 22న) ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, తమకు అంగీకారం కానట్లయితే మరోసారి ఆందోళనకు దిగుతామని జర్మనీ రైతు సంఘం ప్రకటించింది.
రైతులకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించేందుకు ప్రభుత్వం ఉక్రెయిన్ సంక్షోభాన్ని సాకుగా చూపింది. బెర్లిన్‌లో నిరసన తెలిపిన రైతులతో మంత్రి లిండ్‌నర్ మాట్లాడుతూ స్కూళ్లు, రోడ్లు, పారిశ్రామిక ఇంథన సబ్సిడీలకు నిధులు అవసరమని చెప్పటంతో రైతులు మరింత ఆగ్రహించారు. దాంతో స్వరం పెంచిన మంత్రి ఐరోపాలో స్వేచ్చకు మరోసారి ముప్పు వచ్చినందున భద్రత నిమిత్తం ఉక్రెయిన్ యుద్ధం కోసం నిధులు కావాలని అన్నాడు. ఉక్రెయిన్‌కు నిధులు ఇస్తే ఇచ్చుకోండిగానీ దానికి తమను ఎందుకు బలిపెట్టాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. జర్మనీతో సహా అనేక దేశాల్లో రైతుల ఆందోళనకు ఉక్రెయిన్ సంక్షోభం ఒక తక్షణ కారణమైంది. ఉక్రెయిన్ నుంచి వస్తున్న ధాన్యంతో పోటీ పెరిగిందని, తమకు గిట్టుబాటు కావటం లేదని ఉక్రెయిన్ సరిహద్దులో రుమేనియా రైతులు ఆందోళన చేశారు.
అనేక పారిశ్రామిక దేశాల్లో మాదిరి జర్మనీలో రైతుల ఆత్మహత్యల రేటు ఎక్కువ.మన దేశంలో మాదిరి వ్యవసాయం గిట్టుబాటుగాక అప్పులపాలై పురుగుమందులు తాగి ప్రాణాలు తీసుకుంటున్నవారు అక్కడ కూడా ఉన్నారు. అనేక మంది సాగుభూములను వదలి వేశారు.వ్యవసాయం చేసే వారికి జీవిత భాగస్వాములు దొరకటం కూడా సమస్యే. సబ్సిడీ చెల్లించే నిబంధనలను ఎప్పటికప్పుడు మారుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కొదవలేదు. వారి నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే సూపర్‌మార్కెట్లు కూడా ప్రపంచ ధరల తీరు పేరుతో ఎప్పటి కప్పుడు మార్చివేస్తుండటంతో రైతులకు ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది.ఐరోపా యూనియన్ దేశాలలో సాగు గిట్టుబాటుగాక ప్రతి రోజూ వెయ్యి మంది రైతులు వ్యవసాయానికి దూరం అవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిన్న రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పెద్ద్ద కమతాలైతేనే సాగు గిట్టుబాటు అవుతుందనే సూత్రీకరణలు పశ్చిమదేశాల ఆర్థికవేత్తలు చేస్తున్నారు. అది వాస్తవం కాదని అనేక దేశాల్లో జరుగుతున్న ఆందోళనలు స్పష్టం చేస్తున్నాయి. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లుగా మన దేశంలో కూడా కార్పొరేట్ల లాబీయిస్టులు కొందరు అదే పాట పాడుతున్నారు. పారిశ్రామిక-వర్ధమాన దేశాలలో వ్యవసాయ సంక్షోభ తీరుతెన్నులు భిన్నంగా ఉండవచ్చు గానీ సంక్షోభం మాత్రం వాస్తవం.పూర్తిగా మార్కెట్ శక్తులకు వదలి వేస్తే మెరుగైన ధరలు వచ్చి రైతులు లబ్ది పొందుతారని కొందరు చేస్తున్న వాదనలు వట్టి బూటకమని జర్మనీ రైతుల ఆందోళన వెల్లడిస్తున్నది. వారి ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర వస్తే యంత్రాలు, డీజిలుపై సబ్సిడీ చెల్లించాలని రోడ్డెక్కాల్సిన అవసరం ఉండేది కాదు. డీజిల్ సబ్సిడీలను ఎత్తివేస్తే ఏటా జర్మన్ రైతులు ఐదు నుంచి పదివేల యూరోలు( మన కరెన్సీలో ఒక యూరో విలువ 91 రూపాయల వరకు ఉంది) నష్టపోతారని అంచనా.
కార్పొరేట్ సాగు మాత్రమే గిట్టుబాటు అవుతుంది అని చెబుతున్నవారు అది అమలు జరుగుతున్న, భారీ కమతాలున్న ధనిక దేశాల్లో ఎందుకు రైతులు ఆందోళనలు చేస్తున్నారో, ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఎందుకు సబ్సిడీలు ఇస్తున్నాయో చెప్పాలి. ప్రపంచ వాణిజ్య ఒప్పందం కుదరకపోవటానికి ధనిక దేశాలు ఇస్తున్న వ్యవసాయ సబ్సిడీలపై తలెత్తిన వివాదమే ప్రధాన ఆటంకంగా ఉన్న సంగతి తెలిసిందే. జర్మనీ పార్లమెంటుకు సమర్పించిన ఒక నివేదికలో 2010-20 దశాబ్ద కాలంలో 36వేల వ్యవసాయ క్షేత్రాలు మూతపడ్డాయి. పక్కనే ఉన్న ఫ్రాన్స్‌లో 2021డిసెంబరులో విడుదల చేసిన వివరాల ప్రకారం పదేండ్లలో లక్ష మూతపడ్డాయి. ఐరోపా మొత్తంగా 2005 నుంచి 2020 వరకు మొత్తం 53లక్షల వ్యవసాయ క్షేత్రాలు అదృశ్యమయ్యాయి. అంటే కుటుంబ సాగు బడాకంపెనీల చేతుల్లోకి భూమి పోతున్నది. కమతాల్లో భూమి ఎంత ఎక్కువగా ఉంటే సాగు ఖర్చు అంత తక్కువ అని ఒకవైపు చెబుతారు. అమెరికా, ఐరోపాల్లో హెక్టార్ల వంతున సబ్సిడీ చెల్లిస్తున్నారు తప్ప వేరు కాదు.అందుకే చిన్న రైతులకు గిట్టుబాటు కావటం లేదు. అమెరికాలో ప్రత్యక్ష, పరోక్ష సాగు సబ్సిడీలకు గాను 130 పధకాలున్నాయి. ఏడాదికి 30బిలియన్ డాలర్ల సబ్సిడీ ఇస్తున్నారు. అంటే ధనిక దేశాల్లో కార్పొరేట్ సాగు కూడా సబ్సిడీలు లేకుండా నడవదా లేక ప్రభుత్వాలు వాటికి అప్పనంగా దోచిపెడుతున్నట్లా ? అమెరికాలో గడచిన నాలుగు దశాబ్దాలలో 33 సంవత్సరాలు ఉత్పత్తి ఖర్చు గిట్టుబాటు కాలేదని తేలింది. అందుకే అక్కడ భారీగా సబ్సిడీలు ఇస్తున్నారు. కార్పొరేట్ సాగే అలా ఉంటే కుటుంబ సాగు పరిస్థితి చెప్పనవసరం లేదు. మన దేశంలో కూడా ఒక్క పంజాబ్‌లో తప్ప దేశమంతటా ధాన్య రైతులుఉ నష్టపోవటం లేదా ఖర్చులు రావటమే అన్నట్లుగా పరిస్థితి ఉంది.
ఐరోపా దేశాల్లో పర్యావరణ పరిరక్షణ అంటూ కాలుష్యాన్ని తగ్గించే పేరుతో డీజిల్, పురుగుమందులు, ఎరువుల మీద సబ్సిడీల తగ్గింపుకు తీసుకుంటున్న చర్యలు సాగు రంగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. 2050 నాటికి పర్యావరణానికి హాని కలిగించే వాయువుల విడుదల నిలిపివేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. దానిలో భాగంగా 2030 నాటికి రసాయన పురుగు మందుల వాడకాన్ని 50శాతానికి తగ్గించాలనే నిబంధనలు విధించారు. రైతులను నిరుత్సాహపరిచేందుకు వీటికి ఇస్తున్న సబ్సిడీలను రద్దు చేస్తున్నారు. వీటితో పాటు ఉక్రెయిన్ నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటున్న ధాన్యం అనేక దేశాల్లో రైతులను రోడ్ల బాట పట్టిస్తున్నది. నీటి పొదుపు చర్యల పేరుతో బోరు బావుల తవ్వకాన్ని నిషేధించటంతో స్పెయిన్ రైతులు అక్రమంగా తవ్వుతున్నారు. బావుల నిబంధనలకు వ్యతిరేకంగా స్పెయిన్ రైతులు, నీటి తీరువా ,డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా ఫ్రెంచి రైతులు ఇటీవల కాలంలో ఆందోళన చేశారు. వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరిగిన విధంగా ఉత్పత్తులకు పెరగటం లేదు. బీమా ప్రీమియం పెంపు, సబ్సిడీల నిలిపివేతకు నిరసనగా రుమేనియా రైతులు, ట్రక్కు డ్రైవర్లు దేశమంతటా ట్రాక్టర్లు, ట్రక్కులతో రోడ్ల మీద నిరసనలు తెలిపారు.డీజిల్‌పై పన్నులు తగ్గించాలని, రుణాల వసూలు వాయిదా వేయాలని, సబ్సిడీలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌చేశారు. మొక్కజన్నలపై సబ్సిడీ ఇవ్వాలని, పన్నులు పెంచరాదని పోలాండ్ రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వం అంగీకరించటంతో ఆందోళన విరమించారు.
జర్మనీలో ఆందోళన చేస్తున్న రైతులకు అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మితవాద ఎఎఫ్‌డి పార్టీ మద్దతు ఇస్తున్నది. దాన్ని చూపి నయా నాజీలు, మితవాదులు రైతులను రెచ్చగొడుతున్నారని, ఆందోళన వారి చేతుల్లోకి పోతోందని జర్మన్ పాలక కూటమి ఆరోపించింది. తమ డిమాండ్లకు ఎవరు మద్దతు ఇచ్చినా స్వీకరిస్తామని రైతులు చెబుతున్నారు. అనేక దేశాల్లో ఎన్నికలు జరగనుండటంతో మితవాద శక్తులు మౌనంగా ఉండవు. అధికారపక్షాల మీద వ్యతిరేకతను సహజంగానే రెచ్చగొడతాయి. పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకుంటే వాటికి అలాంటి అవకాశం రాదు. ఉదారవాద పాలకపార్టీల వైఫల్యం అనేక దేశాల్లో మితవాద పార్టీలు అధికారానికి రావటం లేదా సవాలు చేసే స్థితికి ఎదిగాయి. వాటిని ఎదుర్కోవాలనటంలో ఎలాంటి పేచీ లేదు గానీ ఆ బూచిని చూపి న్యాయమైన డిమాండ్లను తిరస్కరిస్తే జనాన్ని ఆ శిబిరంలోకి నెట్టినట్లే. తాము అధికారానికి వస్తే సాగు సబ్సిడీలను తగ్గిస్తామని పార్టీ కార్యక్రమంలో పేర్కొన్నది. అయితే ప్రభుత్వం మీద ఉన్న ఆగ్రహంతో కొందరు రైతులు ఆ పార్టీవైపు కూడా మొగ్గుచూపవచ్చని విశ్లేషకులు చెబుతున్న మాటలకు అర్ధం ఇదే.
