ఎం కోటేశ్వరరావు
వెనుకటికి ఎవడో మీకు భయంగా ఉంటే అందరూ నా చుట్టూ ఉండండి అన్నాడట. డోనాల్డ్ ట్రంప్ అమెరికా భద్రతకు ప్రపంచమంతా తనకు కావాలంటున్నాడు. ఇప్పటికే అన్ని ఖండాలలోని 80దేశాల్లో అమెరికాకు 800కు పైగా చిన్నా పెద్దా సైనిక స్థావరాలు, కేంద్రాలూ ఉన్నాయి, అవి చాలవట. ఏది కావాలంటే దాన్ని ఇచ్చేద్దామా ? అధికార స్వీకరణకు ముందు చెప్పిన మాటలను చూసి అనేక మంది డోనాల్డ్ ట్రంప్ పిచ్చివాగుడులే గద్దె నెక్కిన తరువాత బుద్ధిగా ఉంటాడు అనుకున్నారు. కానీ తరువాత వెలువడిన తొలి పలుకుల నుంచీ ఏదో తేడా కొడుతోంది అనుకుంటున్నారు. తమ కాలువ గురించి చేసిన వ్యాఖ్యలతో ఉలిక్కి పడిన పనామా దాన్ని బలవంతగా ఆక్రమించుకొనేందుకు అమెరికా చూస్తోందంటూ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. ప్రపంచ పరిణామాల్లో అమెరికా నానాటికీ ఒంటరి అవుతోంది. దానికి అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇంకేమాత్రం ప్రజాస్వామిక పద్దతుల్లో వ్యవహరిస్తే లాభం లేదని భావిస్తోందా ? తన రక్షణ మరొక పేరుతో ఏది కావాలని అమెరికా కోరుకుంటే దాన్ని ప్రపంచం ఇచ్చివేయాలా ? తమ నౌకలు సప్త సముద్రాల్లో తిరుగుతాయి, వాటి మధ్యన దేశాలు ఉంటాయి గనుక అవన్నీ తమ ఆధీనంలోకి రావాలంటే పుచ్చుకోబాబూ అంటూ సమర్పించుకోవాలా ? ప్రమాణ స్వీకారానికి ముందు కెనడా తమ దేశంలో 51వ రాష్ట్రంగా విలీనం కావాలన్నాడు, పనామా కాలువను తిరిగి తీసుకుంటా, డెన్మార్క్‌లోని స్వయం పాలిత ప్రాంతం గ్రీన్ లాండ్ కూడా కావాల్సిందే అన్నాడు. అసలు ట్రంప్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు. అధ్యక్ష ప్రసంగంలో పనామా గురించి మాత్రమే ప్రస్తావించాడు. గతంలో తమ నేతలు తెలివి తక్కువగా దాన్ని అప్పగించారని అన్నాడు. దాన్ని తిరిగి తీసుకోకుండా ప్రశాంతంగా ఒక అధ్యక్షుడు ఎలా ఉండగలడన్నాడు. అందువలన పనామా కాలువ గురించి చూద్దాం.
వలస వచ్చిన ఐరోపా శ్వేతజాతీయులు అమెరికా ఖండమంతటా విస్తరించటానికి దేవుడు తమకు ఆదేశమిచ్చాడంటూ స్థానికంగా ఉన్న రెడ్ ఇండయన్లను ఊచకోత కోసి ఆక్రమించుకున్నారు. తరువాత మరో రూపంలో ప్రపంచాధిపత్యం కోసం అమెరికా పూనుకుంది. డోనాల్డ్ ట్రంప్ అజెండా దాని కొనసాగింపే. దక్షిణ అమెరికాను ఆక్రమించుకున్న స్పానిష్ పాలకులు తమ దేశం నుంచి పెరూ చేరుకోవాలంటే నౌకల రవాణా కోసం అట్లాంటిక్‌పసిఫిక్ సముద్రాలను కలుపుతూ ఒక కాలువ తవ్వాలనే ఆలోచనను పదహారవ శతాబ్ది ప్రారంభంలోనే చేశారు. ఎందుకంటే పదకొండువేల కిలోమీటర్ల మేర సముద్రంలో ప్రయాణించి చేరటం దూరా భారం కనుక వారికి ఆ ఆలోచన వచ్చింది. అమెరికన్లు తొలుత నికరాగువా ద్వారా అనుసంధానం చేయాలనే ఆలోచన చేశారు, తరువాత పనామాను ఎంచుకున్నారు. దాని కంటే ముందు ఈజిప్టులో సూయజ్ కాలువ తవ్వారు. ఐరోపా నుంచి ఆసియాకు నౌకలు రావాలంటే ఆఫ్రికా ఖండాన్ని చుట్టి వచ్చేవి. సమయం, ఖర్చు తగ్గించేందుకుగాను మధ్య ధ సముద్రంఎర్ర సముద్రం మధ్య ఒక కాలువ తవ్వితే అరేబియా, హిందూ మహాసముద్రాల్లోకి సులభంగా ప్రవేశించవచ్చని ఫ్రెంచి ఇంజనీర్లు ఆలోచనచేసి 185969 మధ్య కాలువ తవ్వి రవాణాకు వీలు కల్పించారు. దానిని చూసిన తరువాత పనామా కాలువను అదే ఫ్రెంచి ఇంజనీర్లు 188089 మధ్య కొంత మేరకు తవ్వి అనేక అవాంతరాలు రావటంతో నిలిపివేశారు. తరువాత అమెరికన్లు ఆ కాలువను స్వాధీనం చేసుకొని మిగతా భాగాన్ని పూర్తి చేసి 1914 నాటికి సిద్దం చేశారు. అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కావటంతో ఎలాంటి ప్రారంభోత్సవాలు లేకుండా నౌకలను అనుమతించారు. ఆ యుద్దంలో అమెరికా మిలిటరీకి అది ఎంతో ఉపయోగపడిరది.1977 వరకు అమెరికా ఆధీనంలోనే ఉన్న ఆ కాలువను అనివార్య స్థితిలో పనామాకు అప్పగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దాన్ని ఒక పట్టాన వదులుకొనేందుకు సిద్దపడకుండా 1999 వరకు సాగదీసింది.తరువాత దాన్ని పనామా నవీకరించి పెద్ద ఓడలకు వీలుగా విస్తరించింది.
పనామాకు ఇచ్చింది మేం గనుక తిరిగి మాకు కావాలని ఇప్పుడు ట్రంప్ చెబుతున్నాడు. అదే గనుక అయితే ముందు ప్రారంభించినందున మా సంగతేమిటని ఫ్రాన్సు అడిగితే....? ఎవరైనా ఎవడబ్బ సొమ్మని అడుగుతారు ! ట్రంప్ చెబుతున్న కారణం ఏమిటి ? అప్పగింత ఒప్పందాన్ని ఉల్లంఘించి పనామా ఆ కాలువను చైనాకు అప్పగించినట్లు ఆరోపించాడు.సర్వసత్తాక దేశమైన తమకు తమ కాలువ నిర్వహణను ఎవరికైనా అప్పగించే హక్కుందని పనామా అధ్యక్షుడు జోస్ రావుల్ ములినో వెంటనే స్పందించాడు. కాలువను తమకు ఏదో అప్పనంగా ఇచ్చినట్లు చెప్పటాన్ని ఖండిరచాడు. ఈ మార్గంలో అమెరికా చమురు, కంటెయినర్ ఓడల్లో 40శాతం ప్రయాణిస్తాయంటే అదెంత కీలకమో అర్ధం అవుతోంది. తమనుంచి ఎక్కువ మొత్తంలో టోల్ వసూలు చేస్తున్నట్లు ట్రంప్ ఆరోపించాడు. ఈ కాలువ రెండు వైపులా ఉన్న రేవులను 1997 ఒప్పందం ప్రకారం హాంకాంగ్ కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ కంపెనీ సికె హచిసన్ నిర్వహిస్తున్నది. తరువాత రెండు సంవత్సరాలకు చైనాలో ప్రత్యేక ప్రాంతంగా అనుసంధానమైంది. ఆ కంపెనీలో జపాన్ మిత్సుబిషి, అమెరికా కంపెనీ బీచ్‌టెల్ కూడా భాగస్వాములే. 2049వరకు హంకాంగ్ చైనాలో విలీనం కాదని, అప్పటి వరకు ఆ కంపెనీతో సహా అన్నీ కూడా లావాదేవీలు జరిపేందుకు చైనా అనుమతించింది, అప్పటి వరకు ప్రత్యేక ప్రాంతంగానే ఉంటుంది.అమెరికన్లు కాలువను పూర్తిగా 1999 డిసెంబరు 31న పనామాకు అప్పగించారు. ట్రంప్ అసలు ఏడుపు ఏమంటే ఇటీవలి కాలంలో పనామాచైనా సంబంధాలు విస్తరించాయి.2017వరకు అమెరికా కనుసన్నలలో నడిచిన పనామా తైవాన్ను తప్ప చైనాను అసలు గుర్తించలేదు. తరువాత చైనాను గుర్తించటమే గాక బిఆర్‌ఐలో భాగస్వామిగా మారింది. పనామా కాలువకు సమాంతరంగా చమురు, గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు ద్వారా అదనపు రాబడి పొందవచ్చని పనామా ఆలోచిస్తున్నది. అది జరిగితే అమెరికా ఇంథనం కూడా దాని ద్వారానే సరఫరా చేయాల్సి ఉంటుంది. అంతే కాదు ప్రపంచ వాణిజ్యంలో ఆరుశాతం ఈ కాలువ ద్వారా జరుగుతున్నది, దీని వలన పనామాకు 2024లో ఐదు బిలియన్ డాలర్ల మేర లాభం వచ్చింది, ప్రతి డాలరును లెక్కవేసుకొనే అమెరికా కార్పొరేట్లు ఇంత మొత్తాన్ని వదులుకుంటారా ! ఈ కారణంగా కూడా ట్రంప్ ఆ కాలువను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడు. మెక్సికో గల్ఫ్‌గా వ్యవహరిస్తున్నదానిని అమెరికా గల్ఫ్‌గా పేరు మారుస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడు. అయితే అమెరికా మాప్‌లో మాత్రమే ఆ పేరుతో ఉంటుంది, మిగతా దేశాలు తమ పటాల్లో పేరు మార్చాల్సిన అవసరం లేదు.తన చేతిలో పని గనుక పేరు మార్చాడు, పనామా కాలువను కలం పోటుతో స్వాధీనం చేసుకోగలడా ?
పనామాతో కుదురిన ఒప్పందం ప్రకారం అ కాలువ నిర్వహణలో తటస్థంగా ఉంటూ అన్ని దేశాలకు చెందిన నౌకలను అనుమతించాలని మాత్రమే ఉంది తప్ప తిరిగి అమెరికా తీసుకోవటానికి ఎలాంటి నిబంధన లేదు. హంకాంగ్ కంపెనీకి నిర్వహణను అప్పగించటాన్ని తటస్థ నిబంధన ఉల్లంఘన, చైనాకు అప్పగింతగా ట్రంప్ చిత్రించాడు. 2024 జూలైలో పనామా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ములినో ఒక మితవాది. తమ దేశంలో చైనా పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయని, అమెరికా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు గతంలో చెప్పాడు.దాన్ని అవకాశంగా తీసుకోవాలని ట్రంప్ చూస్తున్నట్లు ఉంది. ఒక వేళ అతగాడు లొంగిపోయినా జనం అంగీకరించరు. అందుకే వ్యతిరేకిస్తూ ప్రకటన చేయాల్సి వచ్చింది.ఈ కాలువను చైనా తన మిలిటరీ అవసరాల కోసం వినియోగించుకోవచ్చని అమెరికా ఆరోపిస్తున్నది.గత పదేండ్లలో ఒక్క చైనా మిలిటరీ నౌక కూడా ఆ కాలువలో ప్రయాణించలేదు. సరకు రవాణాలో కూడా చైనా వాటా చాలా తక్కువ. ఇక పనామాలో పెట్టుబడుల విషయానికి వస్తే అమెరికా నుంచి 13 బిలియన్ డాలర్లు ఉంటే చైనా 51.5కోట్ల డాలర్లు మాత్రమే. అందువలన ఏ విధంగా చూసినా అమెరికాకు పోటీ కాదు, ముప్పు కూడా కాదు. పనామా కాలువను మిలిటరీ లేదా ఆర్థికపరమైన బెదిరింపుల ద్వారా అదుపులోకి తీసుకోవటం గురించి ట్రంప్ ఆలోచన కూడా చేయవద్దని రష్యా హెచ్చరించింది. పనామాను మరోసారి దురాక్రమణ చేస్తే తప్ప కాలువను స్వాధీనం చేసుకొనే అవకాశం లేదు. ఆ కాలువ ఐదువందల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉంది. దేశ జనాభా 45 లక్షలు. దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే 90వేల మంది సైనికుల అవసరం ఉంటుందని మిలిటరీ అధికారులు అంచనావేశారు. దీన్ని బట్టి ఎక్కడ ఎలా దాడి చేయాలో ఎంత మంది సైనికులు అవసరమో అన్నీ సిద్దం చేసుకున్నదనుకోవాలా ? అలాంటి దుండగానికి పాల్పడితే దక్షిణ అమెరికా దేశాలన్నీ మౌనంగా ఉంటాయా ! ఫ్రెంచి కంపెనీ పనామా కాలువ తవ్వకం ప్రారంభించిన సమయంలో పనామా ప్రాంతం కొలంబియాలో ఉంది. ఆ కాలువను అమెరికా తీసుకోవాలని నిర్ణయించిన తరువాత కొలంబియా అంగీకరించకపోవటంతో పనామాకు స్వాతంత్య్రం ఇవ్వాలంటూ అమెరికా తన మిలిటరీని పంపింది. తరువాత కాలువ పరిసరాలను ఆక్రమించి పనామాను రెండుగా మార్చింది. కాలువ కోసం తరువాత పనామాలో అనేక ఉద్యమాలు జరిగాయి. దాంతో అమెరికా వైదొలగక తప్పలేదు.
