ఎం కోటేశ్వరరావు
మాల్దీవులు,ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటి. ఆసియాలో రెండవది. కేవలం ఐదు లక్షల 21వేల జనాభా మాత్రమే కలిగిన ఈ దేశం ఇప్పుడు ప్రపంచ మీడియాలో పెద్ద స్థానాన్ని ఆక్రమించింది.కారణం గతనెల 30న అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు. వాటి మీద ప్రపంచ మీడియాలో వచ్చిన కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి.” మాల్దీవుల ఎన్నికల్లో మహమ్మద్ ముయిజ్జు గెలుపు చైనా అనుకూల శిబిరానికి విజయం ” భారత్‌కు మాల్దీవుల నూతన అధ్యక్షుడు ఒక దౌత్యసవాలుకు ప్రతినిధి ” ” చైనా చెవులకు సంగీత విందు ” ” భారత్ వెళ్లిపోవాలంటున్న మాల్దీవుల చైనా అనుకూల నూతన అధ్యక్షుడు ” ఇలా పదజాలాల్లో మార్పు ఉన్నప్పటికీ స్పందన స్వభావమిది.హిందూ మహా సముద్రంలో మనదేశం, శ్రీలంకకు 750 కిలోమీటర్ల దూరంలో ఈ దేశం ఉంది. నామమాత్రంగా క్రైస్తవులు తప్పు నూటికి నూరుశాతం ముస్లింలు ఉన్న 1,200 చిన్నా పెద్ద దీవుల దేశానికి ఎవరితోనూ సరిహద్దు తగాదాలు లేవు. దేశ రాజధాని మాలె దీవిలో దేశంలోని సగం జనాభా ఉంది. చైనా నుంచి విమాన మార్గం 4,900 కిలోమీటర్ల దూరం ఉంది. సముద్ర మార్గంలో 4,682 నాటికల్ మైళ్లు లేదా 8,670 కిలోమీటర్ల దూరంలో ఉంది.ప్రపంచంలో ఏ దేశమూ మరొక దేశాన్ని విశ్వసించక పరస్పరం అనుమానంతో చూస్తున్న అంశం తెలిసిందే. ప్రాంతీయ, ప్రపంచ యుద్దాలు తలెత్తితే సముద్రాల్లోని ఒక చిన్న దీవి, దాని మీద పెత్తనం లేదా ఎవరి ప్రభావంలో ఉంది అన్న అంశం కూడా ఎంతో కీలకమైనదే. అందువల్లనే ఆయా దేశాల మిలిటరీ వ్యూహకర్తలు రూపొందించిన ప్రణాళికలు, ఎత్తుగడల ప్రకారం ఇరుగు పొరుగు, దూరంగా ఉన్న దేశాలు కూడా సంబంధాలను నిర్వహిస్తుంటాయి. అలాంటి కీలక ప్రాంతాలలో ఒకటిగా మాల్దీవులు ఉన్న కారణంగానే అక్కడ జరిగే ప్రతి పరిణామాన్ని ప్రపంచం జాగ్రత్తగా గమనిస్తుంది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇబ్రహీం మహమ్మద్ సాలి 2018లో అధికారానికి వచ్చాడు. అంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్లా యామీన్ మీద అవినీతి ఆరోపణల కేసులు పెట్టి పదకొండు సంవత్సరాల పాటు జైలు శిక్ష వేయించాడని ఆరోపణ ఉంది. సదరు యామీన్ ప్రభుత్వంలో మంత్రి, రాజకీయ వారసుడే నూతన అధ్యక్షుడు ముయిజ్జు.అక్కడి విధానం ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఎందరైనా పోటీ పడవచ్చు. పోలైన ఓట్లలో 50శాతం పైగా ఓట్లు తెచ్చుకున్న అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తారు. ఒక వేళ అలా తెచ్చుకోని పక్షంలో అధిక ఓట్లు తెచ్చుకొని మొదటి రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్య 21వ రోజున తిరిగి పోటీ నిర్వహిస్తారు. సెప్టెంబరు 9న జరిగిన ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది పోటీ చేశారు. వారిలో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ తరఫున 45 ఏండ్ల మహమ్మద్ ముయిజ్జు 46.06శాతం ఓట్లు తెచ్చుకోగా రెండవ స్థానంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇబ్రహీం మహమ్మద్ సాలి 39.05 తెచ్చుకున్నాడు. సాలి నాయకత్వంలోని మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీలో ఎన్నికల ముందు చీలిక వచ్చింది. విడిపోయిన వారు డెమోక్రాట్స్ పేరుతో పోటీ చేసి 7.18శాతం తెచ్చుకున్నారు. సెప్టెంబరు 30న రెండవసారి ఎన్నిక జరిగింది. ముయిజ్జు 54.04శాతం తెచ్చుకున్నాడు.నవంబరు 17న అధికారాన్ని స్వీకరిస్తాడు, ప్రస్తుతం రాజధాని మాలె నగర మేయర్‌గా పని చేస్తున్నాడు. ఈ ఎన్నికల నిర్వహణ గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవు. మాల్దీవుల ట్రాన్సఫరెన్సీ అనే సంస్థ ఎన్నికల హింసాకాండ ఉదంతాలు కొన్ని జరిగినట్లు చెప్పటం తప్ప వివరాలను వెల్లడించలేదు. అర్హులైన రెండు లక్షల 82వేల మంది ఓటర్లలో తొలి దఫా 79.85, తుది విడత 87.31 శాతం ఓట్లు వేశారు.
ఈ ఎన్నిక ఒక విధంగా చెప్పాలంటే చైనా – భారత్ మధ్య పోటీగా జరిగిందంటే అతిశయోక్తి కాదు. బహుశా ఎక్కడా ఇంత బాహాటంగా రాజకీయ పార్టీలు పోటీ చేసి ఉండవు. ఈ ఎన్నికలు తమ పౌరుల దేశ భక్తికి ఒక ప్రతిబింబమని, మా ఇరుగు పొరుగు వారు, భాగస్వాములు తమ స్వాతంత్య్రం, సర్వసత్తాకతను పూర్తిగా గౌరవించాలని ఇచ్చిన ఒక పిలుపు అని పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ కూటమి ప్రతినిధి వ్యాఖ్యానించాడు. చైనా బిఆర్‌ఐ పధకం కింద పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వంలో గృహశాఖ మంత్రిగా ముయిజ్జు పని చేశాడు. తాను అధికారానికి వస్తే రెండు దేశాల మధ్య మరో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతానని గతేడాదే ప్రకటించాడు. 2018లో అధికారానికి వచ్చిన సాలి తన పాలనా కాలంలో విచక్షణా రహితంగా భారత ప్రవేశానికి అవకాశమిచ్చినట్లు విమర్శలు చేశాడు. చివరికి భారత మిలిటరీని కూడా దేశంలో అనుమతించాడని, తాను అధికారానికి వస్తే దళాలను వెనక్కు పంపటమే గాక ప్రస్తుతం భారత్‌కు అనుకూలంగా వాణిజ్య సంబంధాలను సమతూకంలో ఉండేట్లు చూస్తానని వాగ్దానం చేశాడు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం మేరకు ఒక డాక్‌యార్డ్ నిర్మాణ పర్యవేక్షణకు మాత్రమే భారత సైనికులు ఉన్నారని సాలి సమర్ధించుకున్నాడు. కొత్త ప్రభుత్వం భారత్-చైనాల పట్ల ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనే అంశంపై విమర్శకులు భిన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. చైనాకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ భారత్‌ను తక్కువ చేయదన్నది వాటిలో ఒకటి.
రద్దీగా ఉండే తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గంలో మాల్దీవులు కీలకమైన ప్రాంతంలో ఉంది. అమెరికా విశాల మిలిటరీ వ్యూహంలో హిందూ మహాసముద్రం ఎంతో ముఖ్యమైనది. ఈ కారణంగానే బ్రిటీష్ ఆక్రమించిన మారిషస్‌కు చెందిన డిగోగార్సియా దీవులను అమెరికా తన ఆధీనంలోకి తెచ్చుకొని ఖాళీ చేసేందుకు మొరాయిస్తున్నది. అక్కడ ఒక సైనిక స్థావరాన్ని కూడా నిర్మించింది. మనదేశంలోని కన్యాకుమారికి ఆ దీవులు 1,796కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. అది మనదేశంతో పాటు పరిసరాల్లోని అన్ని దేశాలకూ ఆందోళన కలిగించే అంశమే. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా పట్టునుంచి విడివడటం, అవి క్రమంగా చైనాకు సన్నిహితం కావటం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఆ వరుసలో మాల్దీవులు కూడా చేరితే ఏమిటన్నదే వారి ఆందోళన. ఈ పరిణామం భారత భద్రతకు ముప్పు అని మన దేశానికి అవి చెబుతున్నాయి. ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత కారణంగా 1965లో బ్రిటన్ ఆక్రమణ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత మన దేశం అన్ని రంగాలలో దగ్గరయ్యేందుకు చూసింది. అనేక విధాలుగా సాయం చేసింది. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. తమను అదుకోవాలని అనేక దేశాలను గయూమ్ కోరినా ఎవరూ ముందుకు రాలేదు. భారత్ స్పందించింది, ఆపరేషన్ కాక్టస్ పేరుతో ఆగ్రా వైమానిక దళ కేంద్రం నుంచి ఐదు వందల మంది పారా ట్రూపర్లను ఎక్కడా ఆపకుండా నేరుగా మాల్దీవుల్లో దించి కుట్రను విఫలం గావించింది. అనేక మంది కుట్రదారులను కాల్చి చంపి, కొందరిని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి సంబంధాలు మరింతగా బలపడ్డాయి.
తరువాత జరిగిన పరిణామాల్లో దీవుల ఆర్థిక సమస్యలను, పౌరుల జీవితాలను మెరుగుపరచటంలో పాలకుల వైఫల్యం కారణంగా జనంలో అసంతృప్తి తలెత్తింది. సరిగ్గా అదే సమయంలో చైనా తన బిఆర్‌ఐ పధకాన్ని ముందుకు తెచ్చింది. ఐఎంఎఫ్, ప్రపంచబాంక్, అమెరికా, ఇతర పశ్చిమదేశాల మాదిరి కఠినమైనవి కాకుండా సాధారణ షరతులతో ప్రాజెక్టులకు చైనా రుణాలు ఇచ్చింది. దాంతో 2013లో అధికారానికి వచ్చిన అబ్దుల్లా యామిన్ చైనాతో సంబంధాలను పెంచుకున్నాడు.2018లో గెలిచిన ఇబ్రహీం సాలి భారత్‌కు పెద్ద పీట అనే విధానంతో మన దేశానికి సన్నిహితంగా భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాడు. అది తాజా ఎన్నికల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.2020లో ప్రతిపక్షాలుగా ఉన్న మాల్దీవుల ప్రోగ్రెసివ్ పార్టీ, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఒక కూటమిగా ఏర్పడి ” భారత్‌ను బయటకు పంపాలి( భారత్ అవుట్) ” అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించాయి. జనంలో ఉన్న భారత వ్యతిరేక మనోభావాలు కూడా దీనికి దోహదం చేశాయి. 1978లో అధ్యక్షుడిగా నియమితుడైన అబ్దుల్ గయూమ్ ప్రజాస్వామిక స్వేచ్చకు తిలోదకాలిచ్చి 2008లో ఓడిపోయే వరకు పదవిలో కొనసాగాడు. అతడి మీద జరిగిన కుట్రను భారత్ అడ్డుకొని అధికారంలో కొనసాగేందుకు దోహదం చేసింది.2013లో పోటీ చేసిన యామిన్ ఈ గయూమ్‌కు సవతి సోదరుడు. ఆ ఎన్నికల్లో గయూమ్ అతనికి మద్దతు ఇచ్చాడు. తరువాత ఇద్దరి మధ్య తలెత్తిన విబేధాలతో గయూమ్ పార్టీని చీల్చి ప్రతిపక్షంతో చేతులు కలిపాడు. తరువాత ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రచేశాడనే ఆరోపణతో 2018లో అతన్ని అరెస్టు చేశారు. తరువాత బెయిలు మీద విడుదల చేశారు. మనదేశానికి చెందిన జిఎంఆర్ కంపెనీ మాలెలోని విమానాశ్రయ అభివృద్ధి నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.విదేశీ ప్రయాణీకులతో పాటు మాల్దీవుల పౌరుల మీద అభివృద్ధి పన్ను విధించటంతో అక్కడ వ్యతిరేకత వెల్లడైంది. దాని వెనుక అధ్యక్షుడు నషీద్ మద్దతు కూడా ఉందని చెబుతారు. అదే పెద్ద మనిషి మీద అవినీతి అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తటంతో జనంలో నిరసన తలెత్తి చివరకు 2012లో రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నాడు. జనం ఛీకొట్టిన నషీద్ మనదేశంతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. అది కూడా జనంలో మనదేశం మీద వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేసింది.దాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి.
2013లో అధికారానికి వచ్చిన యామీన్ మరుసటి ఏడాది చైనా అధినేత షీ జింపింగ్‌ను పర్యటనకు ఆహ్వానించాడు. అధికారికంగా భారత్‌కు అగ్రస్థానం అనే విధానం నుంచి వైదొలగనప్పటికీ చైనాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. మౌలిక సదుపాయాల పధకాలకు ఒప్పందం చేసుకున్నాడు.చైనాతో కలసి సాగర పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్చలు జరిపాడు.చైనాతో బంధం బలపడిన తరువాత 2018లో అప్పటి వరకు మాల్దీవుల్లో నిర్వహిస్తున్న భారత హెలికాప్టర్లు, నిర్వహణ సిబ్బంది తమ దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు, గూఢచర్యం జరుపుతున్నట్లు ఆరోపించి వెంటనే వెనక్కు తీసుకోవాలని మనదేశాన్ని కోరాడు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. అధికారానికి వచ్చిన ఇబ్రహీం సాలి చైనా రుణ పధకాలనుంచి దేశాన్ని కాపాడినట్లు చెప్పుకున్నాడు.జనం విశ్వసించలేదు. ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్ మాదిరి విధానపరమైన షరతులను ఎవరి మీద చైనా రుద్దలేదు. చైనా రుణాలు పుచ్చుకున్న దేశాలు, అందుకు చొరవ చూపిన అక్కడి పాలకులు అనుసరించిన విధానాల్లో ఏవైనా లోపాలు, అక్రమాలు, అవినీతి ఉంటే అవి ఆ దేశాల అంతర్గత అంశాలు. వాటి మంచి చెడ్డలను జనం చూసుకుంటారు. కానీ చైనా వ్యతిరేక పశ్చిమ దేశాలు, వాటికి వంతపాడే ఇతర దేశాల పాలకులు, మీడియా అనేక కట్టుకధలను వ్యాపింప చేస్తోంది. మాల్దీవుల్లో కూడా అదే జరిగింది. 2018లో యామీన్ పదవి నుంచి దిగిపోయేనాటికి ఉన్న పరిస్థితిని తిరిగి కొనసాగిస్తామని ముయిజ్జు ఎన్నికలకు ముందే స్పష్టం చేశాడు. అందువలన ఆ విధానాలకు అనుకూలంగా జనం ఇచ్చిన తీర్పుగా దీన్ని పరిగణించాలి తప్ప, భారత్‌కు ఎదురుదెబ్బ అనో మరో విధంగానో చిత్రించటం మన ప్రయోజనాలను కాపాడుకోవాలనే సరైన ఆలోచనలో భాగం కాదు. మాల్దీవులే కాదు మరేదేశానికైనా మన దేశం కూడా అభివృద్ధికి తోడ్పడి మనకు మిత్రదేశాలుగా ఉండేట్లు చూసుకోవాలి తప్ప అమెరికా రాజకీయంలో భాగంగా వ్యవహరించకూడదు.
