Tags
Fatah, Hamas and Fatah agreement, Hamas Israel, Israel genocide, Palestine Solidarity Day, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
మధ్యప్రాచ్య చరిత్రలో మరో చారిత్మాత్మక ఘట్టానికి తెరలేచింది.పాలస్తీనా విముక్తికోసం పోరాడుతున్న పధ్నాలుగు ప్రజా సంస్థలు, పార్టీలు తమ విబేధాలకు స్వస్తిపలుకుతూ ఐక్యతను పటిష్ట పరిచేందుకు 2024జూలై చివరి వారంలో చైనా మధ్యవర్తిత్వంలో ఒక ఒప్పందానికి వచ్చాయి. వీటిలో ఉప్పు-నిప్పుగా ఉన్న ఫతా – హమస్ కూడా ఉండటం విశేషం.ఈ ఒప్పందం పధ్నాలుగు సంస్థల ఐక్యత, అవి సమాధానపరుచుకోవటానికి అంకితమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రకటించాడు. గతేడాది అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయెల్ మిలిటరీ పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో సాగిస్తున్న మారణకాండ, పశ్చిమగట్టు ప్రాంతంలో సాగిస్తున్నదాడులు, అరబ్బు ప్రాంతాల ఆక్రమణలు కొనసాగిస్తున్న పూర్వరంగంలో ఈ ఒప్పందం కుదిరింది. పాలస్తీనా పౌరులందరికీ ఏకైక అధీకృత ప్రతినిధిగా పాలస్తీనా విముక్తి సంస్థ(పిఎల్‌ఓ)ను గుర్తించటం దీనిలో కీలకమైన అంశం.ప్రస్తుతం కొనసాగుతున్న గాజా మారణకాండ అనంతర పాలనతో పాటు తాత్కాలిక జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు కూడా అంగీకారం కుదిరింది.పశ్చిమాసియాలో చిచ్చుపెట్టి తన ఆధిపత్యాన్ని నెలకొల్పుకొనేందుకు అమెరికా కుట్రలు పన్నుతుండగా వాటిని వమ్ముచేసే క్రమంలో ఐక్యతను సాధించేందుకు చైనా తన పలుకుబడి, అనుభవాన్ని వినియోగిస్తున్నది. ఈ క్రమంలో ఇది రెండవ ఉదంతం. ఇరాన్-సౌదీ అరేబియా మధ్య సయోధ్యను కుదిర్చిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో నాలుగు ప్రధాన అంశాలున్నాయి. తాత్కాలిక జాతీయ ఐక్యతా ప్రభుత్వం ఏర్పాటు,భవిష్యత్ ఎన్నికలకు ముందు ఐక్య నాయకత్వ పొందిక, నూతన పాలస్తీనా జాతీయ మండలికి స్వేచ్చగా ఎన్నికలు, ఇజ్రాయెల్ దాడుల పూర్వరంగంలో ఐక్యతా ప్రకటన. తాము చారిత్రాత్మక కూడలిలో ఉన్నామని, తమ పోరాటాలకు జనం స్పందిస్తున్నందున ఇంతకు మించి మరొక మార్గం లేదని చర్చలలో పాల్గన్న సంస్థల ప్రతినిధులు చెప్పారు.గాజాలో జరుగుతున్న మారణకాండే ఈ ఐక్యత వెనుక ప్రధాన కారణం అని వేరే చెప్పనవసరం లేదు. ఐక్యతా ఒప్పందం పాలస్తీనా పార్టీల అంతర్గత వ్యవహారం, అయితే అంతర్జాతీయ సమాజ మద్దతు లేకుండా సాధించలేరని చైనా ప్రతినిధి లిన్ జియాన్ చెప్పాడు. ఈ ఒప్పందాన్ని వమ్ము చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సకల యత్నాలూ చేస్తాయి.ముఖ్యంగా ఫతా సంస్థను రెచ్చగొట్టేందుకు, వత్తిడి పెంచేందుకు ఇప్పటికే రంగంలోకి దిగాయి.
పాలస్తీనా విముక్తి సంస్థ అనేక పార్టీలు, సంస్థలతో కూడిన ఒక ఉమ్మడి వేదిక. యాసర్ అరాఫత్ దీని నేతగా ఉన్న సంగతి తెలిసిందే.1993లో ఇజ్రాయెల్‌తో ఓస్లో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం ఇజ్రాయెల్ ఆక్రమిత గాజా-పశ్చిమ గట్టు ప్రాంతంలో పాలస్తీనా సాధికార సంస్థ(పిఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో, అదే విధంగా పిఎల్‌ఓలో కూడా ఫతా అనే పార్టీ ప్రధాన పాత్రధారిగా ఉంది.ఈజిప్టు కేంద్రంగా పని చేస్తున్న ముస్లిం సోదరత్వం అనే సంస్థ ప్రభావం పక్కనే ఉన్న గాజా ప్రాంతంపై ఉంది. దానితో సంబంధం ఉన్న శక్తులు 1987లో హమస్‌గా ఉనికిలోకి వచ్చాయి. పిఎల్‌ఓ, దానిలో ఉన్న భాగస్వామ్య పక్షాలతో దానికి ఏకీభావం లేదు. ఓస్లో ఒప్పందాలలో భాగస్వామి కాదు. ఇజ్రాయెల్ ఉనికిని అది గుర్తించలేదు. పాలస్తీనా సాధనకు సాయుధ పోరాటాన్ని మార్గంగా ఎంచుకుంది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో గాజాలో తిరుగులేని రాజకీయ,మత,సాయుధ శక్తిగా ఎదగటమే కాదు, ఎన్నికల్లో తన సత్తాను చూపి అధికారానికి కూడా వచ్చింది.పశ్చిమగట్టు ప్రాంతంలో ఫతా పార్టీ అధికారంలో ఉంది.పాలస్తీనా విముక్తి కోసం అనేక సంస్థలు తమవైన పద్దతుల్లో పోరాడుతున్నాయి.కొన్ని అంశాలు, పద్దతులపై వాటి మధ్య ఏకీభావం లేని మాటవాస్తవం. దీన్ని అవకాశంగా తీసుకొని సామ్రాజ్యవాదుల మద్దతుతో ఇజ్రాయెల్ అణచివేతకు, తాజాగా గాజాలో మారణకాండకు పూనుకుంది.ఇజ్రాయెల్‌ను అధికారికంగా హమస్ గుర్తించకపోయినా 1967నాటి సరిహద్దుల ప్రాతిపదికన పాలస్తీనా ఏర్పాటు జరగాలని 2017లో అది చేసిన ప్రతిపాదనకు అర్ధం పరోక్షంగా అంగీకరించినట్లే.
పాలస్తీనా నేషనల్ ఇనీషియేటివ్ సంస్థ అధ్యక్షుడు ముస్తఫా బర్గౌటీ తాజా ఒప్పందం గురించి మాట్లాడుతూ అన్ని పక్షాలూ పిఎల్‌ఓలో చేరేందుకు అంగీకరించాయని అదొక్కటే పాలస్తీనియన్ల నిజమైన ప్రతినిధి అన్నాడు. రెండు భిన్న పార్టీల పాలనలో ఉన్న పాలస్తీనాలోని గాజా-పశ్చిమ గట్టు ప్రాంతాలను ఒకే పాలనా వ్యవస్థ కిందకు తెచ్చేందుకు 2017లో హమస్-ఫతా మధ్య కుదిరిన ఒప్పందం అమలు కాలేదు.2007వరకు గాజా కూడా ఫతా నాయకత్వంలోని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అదే ఏడాది అధికారానికి వచ్చిన హమస్ యంత్రాంగం ఫతాను అక్కడి నుంచి బహిష్కరించింది. కొన్ని అరబ్ దేశాలూ, ఈజిప్టు తెచ్చిన ఒత్తిడి మేరకు పదేండ్ల వైరాన్ని విరమించుకొనేందుకు చేసుకున్న ఒప్పందం విఫలమైంది. పాలస్తీనా అధారిటీ ప్రధాన మంత్రి రామీ హమదల్లా 2018లో గాజా సందర్శనకు వచ్చినపుడు హత్యాయత్నం జరిగింది. దానికి హమసే కారణమని ఫతా ఆరోపించింది. గతం కంటే నిర్దిష్టంగా కొన్ని చర్యలు తీసుకొనేందుకు తాజా ఒప్పందంలో అంగీకరించినట్లు ముస్తఫా చెప్పారు. మొత్తంగా పాలస్తీనాను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ పూనుకున్నందున దానికి వ్యతిరేకంగా ఐక్యమౌతున్నట్లు చెప్పారు. ఏకాభిప్రాయ సాధనతో ఉమ్మడి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందనే అంశంపై కూడా ఒప్పంద పక్షాల్లో స్పష్టత ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు అమెరికా ఇతర దేశాల అండచూసుకొని ఇజ్రాయెల్ మారణకాండను కొనసాగిస్తూనే ఉంది. అది ముగిసిన తరువాత ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందా ? బీజింగ్ ఐక్యతా చర్చల్లో పాల్గొన్న హమస్ ప్రతినిధి హసమ్ బద్రన్ మాట్లాడుతూ ధ్వంసమైన ప్రాంతాల పునర్‌నిర్మాణం, తగిన సమయంలో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం జరిగిందని, అయితే దాడులు కొనసాగుతున్నప్పటికీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడవచ్చని, అది కాల్పుల విరమణకు దోహదం చేయవచ్చన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజింగ్‌లో హమస్-ఫతా ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.తరువాత చైనా నేత షీ జింపింగ్ మధ్య ప్రాచ్య దేశాలకు ప్రత్యేక రాయబారిని పంపి అంతర్జాతీయ శాంతి సభ జరపటానికి గల అవకాశాలను పరిశీలించారు. ఈప్రక్రియకు ముందు ఇరాన్-సౌదీ అరేబియా మధ్య చెలిమి అసాధ్యం అనుకున్న దాన్ని చైనా సుసాధ్యం గావించింది.మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియాలో అమెరికాతో పోలిస్తే చైనా పాత్ర పరిమితమే. అయినప్పటికీ తంపులు పెట్టే అమెరికాతో పోలిస్తే దానికి భిన్నమైన వైఖరితో ఉన్నందున బీజింగ్ పట్ల విశ్వసనీయత పెరుగుతోంది.
గాజాలో మారణకాండ పూర్వరంగంలో అంతర్జాతీయ సమాజ అభిప్రాయం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మారుతున్నది. గత 57 సంవత్సరాలుగా తూర్పు జెరూసలెం, గాజా, పశ్చిమ గట్టు ప్రాంతాలను ఆక్రమించటం చట్టవిరుద్దమని అంతర్జాతీయ న్యాయ స్థానం(ఐసిజె) వ్యాఖ్యానించింది. ఓస్లో ఒప్పందం ప్రకారం పశ్చిమ గట్టు ప్రాంతంలలో పాలస్తీనా అధారిటీ పాలన కొనసాగుతున్నప్పటికీ యూదుల నివాసాల ముసుగులో ఇజ్రాయెల్ దురాక్రమణలు కొనసాగుతూనే ఉన్నందున ఫతా సంస్థ వైఖరిలో మార్పురాక తప్పలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 23.7చదరపు కిలోమీటర్ల మేర ఇజ్రాయెల్ ఆక్రమించిందని పీస్ నౌ అనే స్వచ్చంద సంస్థ పేర్కొన్నది.గత రెండు దశాబ్దాల్లో ఆక్రమించినదానికంటే ఇది ఎక్కువ. అమెరికా మధ్యవర్తిత్వలో 1993లో కుదిరిన ఓస్లో ఒప్పందం ప్రకారం పశ్చిమ గట్టును ఏబిసి ప్రాంతాలుగా విభజించారు. ఏ తరగతి పాలస్తీనా అధారిటీ ఏలుబడిలో, బి ప్రాంతాలు ఇజ్రాయెల్-పాలస్తీనా ఉమ్మడి పాలన, సి ప్రాంతాలు ఇజ్రాయెల్ ఆధీనంలో ఉంటాయి. మూడవ ప్రాంతంలో యూదుల నివాసాల ఏర్పాటుతో పాటు అరబ్బు రైతాంగాన్ని ఇజ్రాయెల్ క్రమంగా తొలగిస్తున్నది.పాలస్తీనా పశ్చిమ గట్టు ప్రాంతంలో 1990దశకంలో ఇజ్రాయెల్ తీసుకువచ్చిన యూదుల సంఖ్య రెండున్నర లక్షలు కాగా ప్రస్తుతం ఏడు లక్షలకు పెరిగారు. పాలస్తీనా రాజధానిగా ఉండే తూర్పు జెరూసలెంలో అలాంటి వారిని 800 నుంచి మూడు వేలకు పెంచారు. గాజాలో మారణకాండ ప్రారంభించిన ఇజ్రాయెల్ పశ్చిమ గట్టు ప్రాంతంలో కూడా దాడులకు పూనుకుంది. ఇప్పటి వరకు 513 మంది పాలస్తీనియన్లను మిలిటరీ చంపివేసింది.వందలాది మందిని గాయపరచింది.ప్రతి ఏటా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది.
ఒప్పందాన్ని తామింకా సమీక్షించలేదంటూ గాజాలో హమస్ పాత్రను తాము సమర్ధించే ప్రసక్తే లేదని అమెరికా ప్రకటించింది. ఒక ఉగ్రవాద సంస్థకు ప్రభుత్వంలో పాత్ర ఉండకూడదని ప్రతినిధి మిల్లర్ చెప్పాడు.ప్రస్తుత యుద్ధం ముగిసిన తరువాత రెండు ప్రాంతాల్లో ఒకే ప్రభుత్వం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పాడు. పాలస్తీనా ఐక్యతా ఒప్పందం అమలు జరుగుతుందా ? భాగస్వామ్య పక్షాలు కట్టుబడి ఉంటాయా, భవిష్యత్‌లో హమస్ పాత్ర ఏమిటి అంటూ మీడియా, ప్రభుత్వాలలో చర్చలు జరుగుతున్నాయి. ఐక్యతను దెబ్బతీసేందుకు చాణక్య నీతిని ప్రయోగించేందుకు అమెరికా, ఇతర పశ్చిమదేశాలు చూస్తున్నాయి. సందేహాలు లేవనెత్తుతున్నవారందరినీ ఒకేగాటన కట్టలేము గానీ కొన్ని ఆచరణాత్మక సమస్యలు ముందుకు వచ్చినప్పటికీ మొత్తానికే ఎసరు పెడుతున్న సామ్రాజ్యవాదుల కుట్ర, చర్యల కారణంగా వాటిని పరిష్కరించుకొనే పరిణితిని పాలస్తీనా సంస్థలు ప్రదర్శిస్తాయి.దానిలో పెద్ద ముందడుగే తాజా ఒప్పందం.ఒప్పందమైతే జరిగింది గానీ దాని అమలు గురించి అనేక మందికి సందేహాలున్నా అవసరాలు వివిధ పక్షాల వైఖరుల్లో మార్పులకు దోహదం చేస్తున్నాయి.అనేక పరిణామాలను చూసినపుడు ప్రతి పాలస్తీనా సంస్థ అనేక గుణపాఠాలు నేర్చుకుంది. ఐక్యత కోసం రాజీలకు, సర్దుబాట్లకు సిద్దంగాక తప్పని స్థితిలో పడ్డాయి. మొదటికే మోసం తెస్తున్న ఇజ్రాయెల్‌ను నిలువరించటం ప్రధమ కర్తవ్యంగా భావించాయి.
