ఎం కోటేశ్వరరావు
చైనా రియలెస్టేట్ రంగంలో తలెత్తిన కొన్ని సమస్యలను చూపి ఇంకేముంది అక్కడి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అంటూ కొంత మంది విశ్లేషణలు చేశారు, పండగ చేసుకున్నారు. కానీ అదే చైనా వస్తువులు ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11వరకు జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో పెద్ద మొత్తంలో దర్శనమివ్వనున్నాయి.క్రీడా పతకాలతో పాటు ప్రపంచ ఫ్యాక్టరీగా తన సత్తా ఏమిటో చూపనుంది. చైనా తూర్పున ఉన్న జెజియాంగ్ రాష్ట్రంలో ‘ఇవు’ అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్ ఉంది. అది ఎంత పెద్దది అంటే నలభైలక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన సముదాయం, 75వేల దుకాణాలు ఉన్నాయి. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్ ఇతివృత్తంతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసేందుకు దిగుమతిదారులు పెద్ద సంఖ్యలో ఆ మార్కెట్‌ను సందర్శించి వస్తువులకు ఆర్డర్లు పెట్టారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల నుంచి ఈ సందడి ప్రారంభమైంది.ఈ వాణిజ్య, పారిశ్రామిక కేంద్రం నుంచి ఒక్క పారిస్ ఒలింపిక్స్‌కే కాదు, అమెరికా, ఐరోపాదేశాల్లో జరిగే అని ప్రముఖక్రీడలకూ అవసరమైన వస్తువులను ఇక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నారు. జూన్ మాసం వరకు ఒలింపిక్ ఆర్డర్ల తయారీకి ఒప్పందాలు కుదిరాయి.జెర్సీలు, ట్రోఫీలు, మెడల్స్ ఒకటేమిటి అన్ని రకాల క్రీడా సామగ్రి ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్నాయి.టేబుల్ టెన్నిస్ బంతుల్లో తక్కువ రకం ధర 0.083 డాలర్లు (రు.6.90) ఉంది.పారిస్ ఒలింపిక్స్‌లో వాడే ఆరుబంతుల ధర.460గా ఉంది.
అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే మొత్తంగా ఫ్రాన్స్‌కు ఈ మార్కెట్ కేంద్రం నుంచి ఎగుమతులు 42శాతం పెరగ్గా వాటిలో క్రీడావస్తువుల పెరుగుదల 70శాతం ఉందంటే పారిస్ ఒలింపిక్సే కారణం.జెజియాంగ్ రాష్ట్ర జనాభా 5.75 కోట్లు. ఇక్కడ ప్రధానంగా వస్త్రాల వంటి వినిమయ వస్తువులు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. చైనా నుంచి వస్తువులను కొనుగోలు చేసేవారు వేరే దేశాలకు మరలుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రమశక్తి ఎక్కువగా ఉండే వస్తుతయారీ నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉత్పత్తుల మీద చైనా కేంద్రీకరించింది. దీనికి తోడు వేతనాల పెరుగుదల వంటి కారణాలతో కొన్ని సంస్థలు ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడికి వెళ్లటం బహిరంగ రహస్యం.దీనికి తోడు వాణిజ్య ఆంక్షలు, సుంకాల విధింపు, ప్రపంచ రాజకీయాలూ పని చేస్తున్నాయి.ఇన్ని కారణాలున్నా ప్రపంచ సరఫరా గొలుసు నుంచి చైనాను తప్పించటం ఇప్పట్లో జరిగేది కాదన్నది పచ్చినిజం. శ్రమశక్తి ఎక్కువగా ఉండే వస్తువులు చైనా మొత్తం ఎగుమతుల్లో 2017లో 18శాతం ఉండగా 2023లో 17శాతానికి మాత్రమే తగ్గాయి. ఇదంతా అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం తరువాత జరిగిన పరిణామం.
చైనాలో తలెత్తిన రియలెస్టేట్ సమస్యలకూ పారిశ్రామిక ఉత్పత్తులకు కొందరు ముడిపెడుతున్నారు. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ధి రేటు 5.3శాతం కాగా పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల రేటు 6.1శాతం కాగా పెట్టుబడులు పదిశాతం వరకు పెరిగాయి. మొత్తం సంక్షోభంలో కూరుకుపోయిందని చెబుతున్నవారే అవసరాలకు మించి ఉత్పత్తి చేసి తమ దేశాల్లో కుమ్మరిస్తున్నట్లు గగ్గోలు పెడతారు.ఈ ఏడాది ప్రారంభంలో చైనా పారిశ్రామికరంగ వినియోగం 75శాతం ఉంది. తీసుకున్న ఆర్డర్లను వేగంగా సకాలంలో పూర్తి చేసి ఇవ్వటంలో చైనా తిరుగులేనిదిగా ఉంది.పారిస్ ఒలింపిక్స్ వస్తువుల విషయంలోనూ అదే నమ్మకం ఉన్నకారణంగా వ్యాపారులు ఎగబడ్డారు.తక్కువ ధరలకు అందించటంతో పాటు సకాలంలో సరఫరా ఇక్కడ ముఖ్యం.జెజియాంగ్ రాష్ట్రంలో 78 పారిశ్రామిక పార్కులుంటే వాటిలో నాలుగున్నరవేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి.వాటికి స్థానిక సంస్థలు అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. పోటీ ఎక్కువగా ఉన్నందున ఆధునిక ప్రమాణాలతో కూడిన ఉత్పాదక పద్దతులతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలను కూడా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. మార్కెట్ ధోరణులను పసిగట్టి అందుకనుగుణ్యంగా ఉత్పత్తుల్లో మార్పులు చేయటం చైనా ప్రత్యేకత అని చెప్పవచ్చు.ఈ కారణంగానే ప్రపంచంలో పెద్ద వాటిలో ఒకటైన షి ఇన్ ఫ్యాషన్ కంపెనీ వారానికి 50వేల కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తుండగా జారా అనే కంపెనీ ఏటా పాతికవేలను ఉంచుతున్నది. భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్న కారణంగా చైనాలో ఖర్చు తగ్గుతుంది, దాంతో చౌక ధరలకు విక్రయించగలుగుతున్నది.తనకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన విధానాలను రూపొందిస్తున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చైనాకు ఇతర దేశాలు ఎంత అవసరమో, ప్రపంచానికి దాని అవసరమూ అంతే ఉంది. పరస్పర ఆధారాన్ని ఎవరు దెబ్బతీసినా రెండు పక్షాలూ నష్టపోతాయి.
చైనాలో మే ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు మేడే సెలవలు ఇస్తారు. ఈ సందర్భంగా జరిగే వస్తు విక్రయాలు చైనా ఆర్థిక వ్యవస్థ, పౌరుల కొనుగోలు శక్తిని అంచనా వేసేందుకు ఒక కొలబద్దగా పరిగణిస్తారు. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో నమోదైన వివరాలు చైనా తిరిగి కోలుకోవటమే కాదు పెరగటాన్ని సూచించాయి. మే ఒకటవ తేదీన ప్రయివేటు, ప్రభుత్వ సంస్థల వద్ద నమోదైన వివరాల ప్రకారం 28 కోట్ల ప్రయాణాలు జరిగాయి. ఇవి కరోనాకు ముందున్న స్థాయిని దాటినట్లు పేర్కొన్నారు.జల, వాయు, భూ మార్గాలలో జరిగే ఈ ప్రయాణాలతో రవాణా సంస్థలే కాదు, పర్యాటక రంగం, వస్తూత్పత్తి ఇతర సేవారంగాలు కూడా లబ్దిపొందుతాయి. అనేక దేశాలకు ఎలాంటి వీసాలతో నిమిత్తం లేకుండా చైనా పౌరులు విహార యాత్రలకు వెళ్లవచ్చు. దీంతో ఆయా దేశాలూ, చైనా కూడా లబ్దిపొందుతున్నది. ఐదు రోజుల మేడే సెలవుల్లో 5,800 విమానాలు 9.18లక్షల మంది ప్రయాణీకులను చేరవేస్తాయని అంచనా వేశారు.జపాన్, దక్షిణ కొరియాలకు ఎక్కువ మంది వెళతారు.ఈ సారి 2019తో పోలిస్తే ఈ ఏడాది 20శాతం ఎక్కువగా ఈ దేశాలకు టికెట్లను కొనుగోలు చేశారు.ఇతర దేశాలకూ ఇదే రద్దీ ఏర్పడింది.
ఆధునిక పరిజ్ఞానంలో గతంలో చైనా ఎంతో వెనుకబడి ఉండేది. ఇప్పుడు కొన్ని రంగాలలో పశ్చిమ దేశాలను సవాలు చేస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం జనం నోళ్లలో నానుతున్న కృత్రిమ మేథ(ఏఐ)లో చైనా పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముందుకు వస్తుందేమో అన్న భయంతో అమెరికాకు నిదురబట్టటం లేదంటే అతిశయోక్తి కాదు. మేథోసంపత్తి హక్కులున్న నమూనాలకు బదులు అందరికీ అందుబాటులో(ఓపెన్ సోర్స్) ఉన్న వనరుల మీద చైనా కేంద్రీకరిస్తున్నది. ఇప్పటి వరకు అనేక బడా కంపెనీలు కొన్ని ఉత్పత్తులపై పేటెంట్ హక్కులను పొంది విపరీతంగా లాభాలు పొందుతున్న సంగతి తెలిసిందే.కృత్రిమ మేథ అలాంటి కంపెనీలను దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. మేథో విజ్ఞానాన్ని మానవ కల్యాణానికి బదులు మారణాయుధాలు తయారు చేసేందుకు, తమకు లొంగని దేశాల వ్యవస్థలను దెబ్బతీసేందుకు వినియోగించిన చరిత్ర పశ్చిమదేశాలది. వివిధ భాషల్లో ఉన్న సమాచారాన్ని పెద్ద ఖర్చు లేకుండానే మన భాషలో తర్జుమా చేసుకొని చదువుకోవచ్చు. మనదేశంలో దుర్వినియోగం చేస్తూ జనాన్ని తప్పుడు సమాచారంతో పక్కదారి పట్టిస్తున్న తీరు ఇప్పటికే చూస్తున్నాము. ఈ రంగంలో చైనా పురోగతిని చూసి అది కూడా తమ మాదిరే వ్యవహరిస్తే అని ఊహించుకొని ఏఐతో చైనా ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకుంటుందని, సైబర్‌దాడులు, జీవాయుధాల తయారీ వంటి వాటికి వినియోగించనుందంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు.లైనక్స్, హ్యూమన్ జినోమ్, ఇమేజ్‌నెట్, పైటార్చ్ వంటి అందరికీ అందుబాటులో ఉన్న వనరులతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో లబ్దిపొందవచ్చు,విద్యార్ధులు, పరిశోధకులకు ఇవి ఎంతో ఉపయోగం.చైనా కంపెనీల విజయానికి ఇదొక ప్రధాన కారణం.వారి నుంచి ఇతర దేశాలు ఎంతో నేర్చుకుంటున్నాయి.చైనాతో పోటీ పడాలని అమెరికాలోని అనేక మంది తమ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు.
తెలివితేటలు కేవలం కొందరి సొంత అన్న భ్రమలు కలిగిన వారికి అవి పటాపంచలయ్యాయి.కృత్రిమ మేథతో ప్రయోజనాలకంటే ప్రమాదాలే ఎక్కువ అనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. గూండాల చేతుల్లో పడితే చాకులు మారణాయుధాలుగా మారతాయి గనుక ఎక్కువ మందికి వినియోగపడే వాటిని తయారు చేయటం మానుకుంటామా ? అణుబాంబులు కలిగి ఉన్న చైనా, రష్యా కృత్రిమ మేథతో వాటిని మోహరించేందుకు నిర్ణయం తీసుకుంటే ప్రమాదమమని అమెరికా గుండెలు బాదుకుంటోంది. అవసరం లేకున్నా ప్రపంచాన్ని భయపెట్టేందుకు, తమకు లొంగనివారికి ఇదే గతి అని హెచ్చరించేందుకు రెండవ ప్రపంచ యుద్ధ చివరి రోజుల్లో జపాన్ మీద అణుబాంబులు వేసిన దుర్మార్గానికి అమెరికా పాల్పడిన సంగతి తెలిసిందే. అణుబాంబులు దాని వద్ద, మిత్రదేశాలుగా ఉన్న బ్రిటన్, ఫ్రాన్సు దగ్గర కూడా ఉన్నాయి. అవి దుర్వినియోగానికి పాల్పడవన్న హామీ ప్రపంచానికి లేదు. ఆధునిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయవద్దంటూ తమ అధికారులు చైనాతో సంప్రదింపుల్లో చెప్పినట్లు అమెరికా అధ్యక్ష భవనం ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది. కృత్రిమ మేథను దుర్వినియోగం చేస్తున్నారన్న ప్రచారకొనసాగింపులో ఇదొక భాగం.చైనాతో వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానంలో పోటీపడలేమని, దానితో ఏదో ఘర్షణ పడటం వలన ప్రయోజనం లేదని అమెరికాకు అవగతమైందంటున్నవారూ లేకపోలేదు.
గత రెండు దశాబ్దాల్లో చైనా సాధించిన ప్రగతిని చూసి అమెరికాలో తీవ్ర మధనం జరుగుతోంది.దాన్నింక ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని అనేక మంది భావిస్తున్నారు. మార్చినెలలో అధ్యక్షుడు జో బైడెన్ తన పౌరులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ” చైనా పెరుగుతోంది, అమెరికా పడిపోతోందంటూ గత కొద్ది సంవత్సరాలుగా నా రిపబ్లికన్ మరియు డెమోక్రాట్స్ స్నేహితుల నుంచి వింటున్నాను ” అని చెప్పాడు.కరోనా తరువాత ఇంక చైనా పని అయిపోయింది, పెరగాల్సిన మేరకు పెరిగింది, ఇంక అవకాశం లేదు అని చెప్పేవారు తయారయ్యారు.కొందరు త్వరలో అమెరికాను అధిగమిస్తుందని, మాంద్యంలో కూరుకుపోతుందని చెప్పినవారూ ఉన్నారు.చైనా వృద్ధి వేగం తగ్గిన మాట నిజం.2021 నుంచి 2023 వరకు అమెరికా జిడిపిలో 76 నుంచి 67శాతానికి చైనాలో తగ్గిందని, అయినప్పటికీ 2019తో పోల్చితే 20శాతం పెద్దదని, కరోనా సమయంలో అమెరికా కేవలం ఎనిమిదిశాతమే పెద్దదన్నది మరచిపోవద్దని అంకెలు చెబుతున్నాయి. అమెరికాలో 2023జిడిపి పెరుగుదల రేటు 6.3శాతం ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ వృద్దిరేటు 2.5శాతమే. అదే చైనాను చూస్తే జిడిపి వృద్ది రేటు 4.6శాతమైనప్పటికీ వాస్తవ వృద్ది 5.2శాతం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ వైరుధ్యానికి కారణం చైనాలో ద్రవ్యోల్బణం రేటు తక్కువ, అమెరికాలో ఎక్కువగా ఉండటమే.అమెరికాలో వడ్డీరేటు 2022 మార్చినెల నుంచి 0.25 నుంచి 5.5శాతానికి పెంచగా చైనాలో 3.7 నుంచి 3.45శాతానికి తగ్గించారు. అమెరికాలో వడ్డీరేట్లను తగ్గిస్తే ఎలా ఉండేది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది.
