Tags
China-Africa Cooperation, China’s African Policy, FOCAC, Geopolitics, The China Factor, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
మూడు రోజుల పాటు 2024 సెప్టెంబరు 46 తేదీల మధ్య బీజింగ్‌లో జరిగిన చైనాఆఫ్రికా సహకార వేదిక సమావేశాలు జయప్రదంగా ముగిశాయి.వర్తమాన భూభౌతిక రాజకీయాల్లో ఈ వేదిక 8వ సమావేశాలకు ఆఫ్రికాలోని 54కు గాను 53దేశాల నుంచి ప్రభుత్వాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. గత సమావేశాలు సెనెగల్ రాజధాని డాకర్‌లో జరిగాయి. అమెరికాకు అనుకూలంగా తిరుగుబాటు ప్రాంతం తైవాన్ను చైనాగా గుర్తించిన పన్నెండు లక్షల జనాభా గల చిన్నదేశం స్వాతినీ(గతంలో స్వాజీలాండ్ అని పిలిచేవారు) మాత్రమే రాలేదు. 2000 సంవత్సరంలో ఉనికిలోకి వచ్చిన చైనాఆఫ్రికా సహకార వేదిక ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యక్రమాలను నిర్ణయించుకుంటుంది. ఈ వేదిక సాధనంగా ప్రపంచంలోని పేద దేశాలకు చెందిన 280కోట్ల మంది జీవితాలను నవీకరించవచ్చని సమావేశాలను ప్రారంభించిన చైనా అధినేత షీ జింపింగ్ చెప్పారు.చైనా,ఆఫ్రికా రెండూ సామ్రాజ్యవాదుల దురాక్రమణ,వలస వాదానికి వ్యతిరేకంగా పోరాడినవే అని గుర్తు చేశారు. కేవలం పదినిమిషాలు మాత్రమే మాట్లాడిన షీ రానున్న మూడు సంవత్సరాల్లో చేపట్టదలచిన పది అంశాలను సభ ముందుంచారు. గత రెండున్నర దశాబ్దాలుగా ఆఫ్రికా,చైనా సంబంధాలు నానాటికీ పెరగటం అమెరికాను కలవర పెడుతోంది.భౌగోళికంగా ప్రాధాన్యత ఉన్న ఆ ప్రాంతంలో చైనాతో మిత్రత్వంతో కంటే తన పట్ల వ్యతిరేకత పెరగటాన్ని అది సహించలేకపోతోందంటే అతిశయోక్తి కాదు. ఉత్తర, దక్షిణ అమెరికా, ఐరోపా ఖండంలోని సామ్రాజ్యవాద, ధనిక దేశాలు చీకటి ఖండగా పిలిచిన ఆఫ్రికాను తమ ఉత్పత్తులకు మార్కెట్‌గా, తమ పరిశ్రమలు, గనులు,భూముల్లో పని చేసేందుకు బానిసలుగా పట్టుకువచ్చేందుకు అనువైన ప్రాంతంగా మాత్రమే చూసినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు చైనా దానికి విరుద్దమైన విధానాలతో స్నేహ బంధాలను నెలకొల్పుకోవటం వాటికి మింగుడుపడటం లేదు.
ఈ సమావేశాల్లో రానున్న మూడు సంవత్సరాల్లో ఆఫ్రికాలో పది లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు 51బిలియన్ డాలర్ల మేరకు అందిస్తామని చైనా వాగ్దానం చేసింది. ఈ మొత్తంలో 30బిలియన్లు రుణాలు,పదిబి.డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. చైనాఆఫ్రికా మధ్య వాణిజ్య లావాదేవీలు ఈ ఏడాది తొలి ఆరుమాసాల్లో 167.8బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.వర్తమాన దశాబ్ది చివరకు 300 బి.డాలర్లకు పెంచాలని చూస్తున్నారు. బీజింగ్ కార్యాచరణ పధకం పేరుతో ఆమోదించిన ప్రకటన ప్రకారం రానున్న రోజుల్లో మరింతగా హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా అందించనుంది. ప్రపంచంలో ఈ రంగంలో అన్ని దేశాల కంటే చైనా ఎంతో ముందుంది. తన బిఆర్‌ఐ (బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్) పధకం కింద గత దశాబ్దకాలంలో వివిధ దేశాలలో రోడ్లు, రైల్వేలు, విద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, ఆసుపత్రుల వంటి అనేక పధకాలకు 120 కోట్ల డాలర్లమేర పెట్టుబడులు పెట్టింది. సోవియట్‌ను విచ్చిన్నం చేసిన తరువాత సంక్లిష్టమైన ఈ ఖండ దేశాలు చైనాను తమ నమ్మకమైన భాగస్వామిగా పరిగణిస్తున్నాయి. అనేక దేశాల్లో కొనసాగుతున్న అంతర్గత కలహాలు, అంతర్యుద్ధాలలో అమెరికా మాదిరి ఏదో ఒక పక్షం వహించకుండా వీలైతే వాటిని పరిష్కరించటానికి, సర్దుబాటు చేసేందుకు చూస్తున్నది.
ఆఫ్రికాతో పాటు అనేక దేశాలలో చైనా పెట్టుబడులు పెడుతున్నది, రుణాలు ఇస్తున్నది. వీటితో సదరు దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోతే వాటి ఆస్తులపై కన్నువేస్తున్నదని ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తునప్రచారం జరుగుతున్నది. చైనా కంటే అమెరికా, ఐరోపాలో అనేక ధనికదేశాలు ఉన్నాయి. అవసరమైన పేద, వర్ధమాన దేశాలకు అవే సులభతరమైన పద్దతిలో పెట్టుబడులు, రుణాలు ఇచ్చి చైనాకు ఎందుకు అడ్డుకట్టవేయటం లేదు ? చైనా అంటే ఇటీవలి కాలంలో రుణాలు, పెట్టుబడులు పెడుతున్నది. మరి గత శతాబ్దిలో లాటిన్ అమెరికా దేశాలు అప్పులపాలై సంక్షోభంలో కూరుకుపోవటానికి కారకులు ఎవరు ? మన దేశం కూడా ప్రపంచ బాంకు వద్దకు వెళ్లి అది విధించిన షరతుల మీద అప్పులు తీసుకున్న చరిత్ర ఉంది కదా ? దానికి కారకులు ఎవరు ? సందర్భం ఆఫ్రికా గురించి కనుక దాని అప్పుల నిజానిజాల గురించి చూద్దాం. గతేడాది(2023)చివరి నాటికి ఆఫ్రికా దేశాల మొత్తం అప్పు 1,15,200 కోట్ల డాలర్లు. దీనికి గాను 2010లో చెల్లించిన వడ్డీ, అసలు మొత్తం 6,100 కోట్ల డాలర్లు కాగా 2024 నాటికి 16,300 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఇక చైనా 2000 నుంచి 2023వరకు ఆఫ్రికాకు ఇచ్చిన అప్పు 18,228 కోట్ల డాలర్లు. ఈ మొత్తంతోనే ఆఫ్రికాను చైనా ఆక్రమించుకుంటే మరో లక్ష కోట్ల డాలర్లు ఇచ్చిన దేశాలూ, సంస్థలూ గుడ్లప్పగించి చూస్తూ ఉంటాయా ? ఎందుకు చైనా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ? ఆఫ్రికా దేశాలు సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినవి. మంచేదో చెడేదో నిర్ణయించుకోగలగిన పరిణితి కలిగినవే. వాటిని చైనా వలలో ఇరుకుంటున్నాయని చెప్పటమంటే అవమానించటం తప్ప మరొకటి కాదు. పశ్చిమ దేశాలు, వాటి సంస్థలు, ప్రైవేటు సంస్థల నుంచి అప్పులు చేసినపుడు ఇలాంటి హెచ్చరికలను ఎందుకు చేయలేదు ? నాడు అప్పుల ద్వారానే అభివృద్ధి, రుణాలు తీసుకోని దేశం ఏదైనా ఉందా అంటూ సమర్ధించారు. పాలకులు బయటి నుంచి తీసుకున్న అప్పులను దుర్వినియోగం చేయటాన్ని ఈ సందర్భంగా కొందరు ప్రస్తావిస్తున్నారు. ఒక్క చైనా నుంచి తీసుకున్నవాటినే స్వాహా చేస్తారు, మిగతా దేశాల వాటిని ముట్టుకుంటే భస్మమౌతారని చెబుతున్నట్లా ? ఏ అవినీతి, అక్రమం జరిగినా దాని గురించి ఆయాదేశాల జనమే తేల్చుకుంటారు.అలాంటి పాలకులందరినీ జనం చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టారు. లాటిన్ అమెరికా దేశాలను అప్పుల పాలు చేసిన పాలకులను పేరు చెప్పి మరీ ఓడిరచిన ఉదంతాలు తెలిసిందే, వారికి మద్దతు ఇచ్చిన అమెరికా అంటే అక్కడ నేడు ఎంత వ్యతిరేకత ఎంతో ఉందో కూడా చూస్తున్నాము. పరస్పరం లబ్ది పొందుతున్న కారణంగానే చైనా ఆఫ్రికా సంబంధాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి.చైనా పెట్టుబడులు ఆఫ్రికా ఖండాన్ని అప్పుల ఊబిలో దింపుతాయని చెప్పే మాటలను తాను విశ్వసించనని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా బీజింగ్ సమావేశాలకు హాజరైన సందర్భంగా విలేకర్లతో చెప్పాడు. పరస్పర లాభదాయకమైనవన్నాడు.
రెండవ ప్రపంచ యుద్ధంలో విజేతల్లో బ్రిటన్, ఫ్రాన్సులు కూడా ఉన్నప్పటికీ అవి ఆఫ్రికాలో వలసలుగా చేసుకున్న దేశాలన్నింటినీ వదలి వెళ్లాల్సి వచ్చింది, స్వచ్చందంగా చేయని చోట పోరాటాల ద్వారా జనం తరిమికొట్టారు. ఆ తరువాత మార్కెట్లను ఆక్రమించటంలో అమెరికా ముందుకు వచ్చింది. తమను దెబ్బతీసే వలసలను, నిరంకుశ పాలకులను వ్యతిరేకించిన ఆఫ్రికన్లు ఒకవేళ చైనా కూడా తమను దోపిడీ చేస్తున్నదని భావిస్తే అదే పని చేస్తారు. గతంలో సోవియట్ యూనియన్ అలాంటి పనులకు పాల్పడలేదు కనుకనే చైనాను వారు నమ్ముతున్నారు.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసలు సాధ్యం కాదని గ్రహించిన పశ్చిమదేశాలు మార్కెట్లను ఆక్రమించుకొనేందుకు నయావలస విధాన సాధనాలుగా ఐరాస, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణ్యిస్థలను ముందుకు తెచ్చాయి. అవేవీ పేద,వర్ధమానదేశాలను ఉద్దరించేవికాదని ఎనిమిది దశాబ్దాల అనుభవం నేర్పింది. వాటి విధానాల పర్యవసానమే ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల్లో ఇరుక్కోవటం, దానికి వ్యతిరేకంగా తలెత్తిన పోరాటాలను అణచేందుకు మిలిటరీ, మితవాద నిరంకుశ శక్తులను రుద్ది ప్రజాస్వామ్యాన్ని కూడా హరించటం దాస్తే దాగేది కాదు.గతంలో సోవియట్ యూనియన్‌గానీ, ఇటీవల తాను పెట్టుబడులు పెట్టిన లేదా రుణాలు ఇచ్చిన దేశాల్లో అలాంటి శక్తులను చైనా ప్రతిష్ఠించిన లేదా పనిగట్టుకొని సమర్ధించిన దాఖలాలు లేవు.
ఆఫ్రికాలో చైనా పలుకుబడి పెరగటాన్ని అమెరికా, ఐరోపా ధనికదేశాలు భరించలేకపోతున్నాయి.ప్రధానంగా అమెరికా ముందుంది. చైనాను అడ్డుకొనేందుకు చూస్తున్నది.అదే సమయంలో తాను కూడా ఆఫ్రికా పేద దేశాలను ఆదుకుంటానంటూ పోటీగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నది. 2022 డిసెంబరు 1315 తేదీలలో వాషింగ్టన్ డిసిలో అమెరికాఆఫ్రికా నేతల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దాదాపు 50దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. 2000 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చైనా`ఆఫ్రికా వేదిక సమావేశాలు జరుగుతున్నాయి.క్రమంగా పెట్టుబడులతో ముందుకు పోతున్నది.చైనా పట్ల సానుకూల ధోరణి పెరుగుతోంది. కొన్ని సందర్భాలలో అమెరికా మీద వత్తిడి పెరుగుతోంది. దీర్ఘకాలంగా ఆఫ్రికాతో వాణిజ్యం జరిపే దేశాలలో ముందున్న అమెరికాను 2021లో చైనా వెనక్కు నెట్టేసింది. అనేక దేశాల మాదిరే ఆఫ్రికాలోని జిబౌటీలో చైనా కూడా 2017తన మిలిటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది విదేశాల్లో దాని తొలి కేంద్రం. అనేక మంది ఆఫ్రికన్ నేతలు చైనాతో పాటు అమెరికా నుంచి కూడా లబ్దిపొందాలని చూస్తున్నారు. అయితే అమెరికాతో సహా అనేక దేశాలు కబుర్లు చెప్పటం తప్ప నిర్దిష్టంగా చేస్తున్నదేమీ లేదనే విమర్శలు వచ్చాయి.దాన్ని పొగొట్టుకొనేందుకు అమెరికా తొలి సమావేశాన్ని 2014లో నిర్వహించిన తరువాత 2022లో ఏర్పాటు చేసింది. గతంలో వచ్చిన విమర్శలు వాస్తవం కాదని చెప్పుకొనేందుకు అమెరికా చూసింది. ఈ సభలో 1,500 కోట్ల డాలర్ల మేర ఒప్పందాలు కుదిరినట్లు ప్రకటించారు. అంతకు ముందు కూడా కొన్ని లావాదేవీలు జరిగాయి.2023లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆఫ్రికాలోని మూడు దేశాల్లో పర్యటించారు.ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, తమకు ముప్పు సాకుతో అమెరికా, దాని మిత్రదేశాలు అనేక దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాయి.అంతర్యుద్దాలను రెచ్చగొట్టి తాము దూరాలని చూస్తున్నాయి.ఆఫ్రికాలో కూడా జరుగుతున్నది అదే.అనేక దేశాలు వాటి నుంచి దూరం జరుగుతున్నాయి. అమెరికా వైఖరిని అనేక చోట్ల రష్యా ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తున్నది.అనేక చోట్ల ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ అమెరికా ఇప్పటికీ దాదాపు ఆరువేల మంది సైనికులను ఆఫ్రికాలో నిర్వహిస్తున్నది. రష్యా ఒక వైపు మిలిటరీ రీత్యా ఆఫ్రికా దేశాలకు దగ్గర అవుతుంటే ఆర్థిక రంగంలో చైనా ముందుకు పోతున్నది. ఈ రెండు దేశాలూ తమను సవాలు చేయటాన్ని అమెరికా సహించలేకపోతున్నది.
