ఎం కోటేశ్వరరావు
జూలై 28న జరిగిన వెనెజులా ఎన్నికల్లో అమెరికా మద్దతు ఉన్న మితవాద,ఫాసిస్టు శక్తులు చావు దెబ్బతిన్నాయి. సోషలిస్టు పార్టీ నేత నికోలస్ మదురో మూడవ సారి ఎన్నికయ్యాడు.పదవీ కాలం ఆరు సంవత్సరాలు(2031వరకు) పదవిలో ఉంటాడు. ఈ ఎన్నికల్లో మదురోను ఓడించేందుకు అమెరికా నాయకత్వంలోని వామపక్ష వ్యతిరేకశక్తులన్నీ తీవ్రంగా ప్రయత్నించాయి.ఎన్నికల ఫలితాల తరువాత కూడా అక్రమాలు జరిగాయని, గుర్తించబోమని నానా యాగీ చేస్తున్నాయి.మరోవైపు దేశమంతటా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. మదురోకు మద్దతుగా కూడా అనేక చోట్ల జనం వీధుల్లోకి వస్తున్నట్లు వార్తలు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన వివరాల మేరకు మదురోకు 53.67శాతం ఓట్లు రాగా ప్రత్యర్థి ఎడ్మండో గోన్‌సాల్వెజ్‌కు 46.33శాతం వచ్చాయి. మరోవైపున ఇతగాడిని సమర్ధించిన డెమోక్రటిక్ యూనిటీ ఫ్లాట్ ఫాం(డియుపి) గోన్‌సాల్వెజ్‌కు 69.46శాతం రాగా మదురోకు 30.54శాతం వచ్చినట్లు పోటీగా ఫలితాలను ప్రకటించింది. ఇది అమెరికా కనుసన్నలలో పనిచేసే ప్రతిపక్ష పార్టీలు, శక్తుల కూటమి. మదురోకు వ్యతిరేకంగా ప్రదర్శలకు దిగిన శక్తుల మద్దతుదార్లు అనేక చోట్ల దివంగత మాజీ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ విగ్రహాలు, చిహ్నాలను ధ్వంసం చేస్తున్నారు. చావెజ్ రాజకీయ వారసుడిగా మదురో రంగంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు ఇది రాసిన సమయానికి కొందరు ప్రదర్శకులు అధ్యక్ష భవనంపై దాడికి వెళుతున్నట్లు, దేశమంతటా రోడ్ల దిగ్బంధనానికి పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని నినాదాలు చేస్తున్నారు. ముందే ఇలాంటి పరిణామాలను ఊహించిన కారణంగా రాజధాని కారకాస్ నగరంతో సహా దేశమంతటా పోలీసు,జాతీయ భద్రతా దళాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష గోన్‌సాల్వెజ్‌కు పరిస్థితి అనుకూలంగా ఉన్నట్లు సర్వేలు పేర్కొన్నాయని, ఫలితాలు వాటిని ప్రతిబింబించలేదని అమెరికా వ్యాఖ్యానించింది.ప్రజల ఆకాంక్షను ఫలితాలు ప్రతిబింబించలేదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించాడు. చైనా, రష్యా, క్యూబా మరికొన్ని దేశాలు మదురోను అభినందించాయి. 2018 ఎన్నికల్లో కూడా సర్వేలన్నీ మదురోకు వ్యతిరేకంగా, ప్రతిపక్ష అభ్యర్థి ముందంజలో ఉన్నట్లే చెప్పాయి. అవన్నీ మదురోను వ్యతిరేకించే శక్తులు వండి వార్చిన కతలు తప్ప మరొకటి కాదు. తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కూల్చివేసేందుకు కుట్ర జరిగిందని అధ్యక్షుడు మదురో టీవీ ప్రసంగంలో దేశ పౌరులకు చెప్పాడు. దీని గురించి ముందే తెలుసని అయితే చట్టాన్ని గౌరవిస్తామని, తన మద్దతుదార్లు ప్రశాంతంగా ఉండాలని కోరాడు.”నేను నికోలస్ మదురో మోరోస్ వెనెజులా బొలివేరియన్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాను. మన ప్రజాస్వామ్యం, చట్టం, పౌరులను కాపాడతాను ” అని ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే మదురో ప్రకటించాడు.
2013లో ఛావెజ్ మరణించిన తరువాత అధికారానికి వచ్చిన నికోలస్ మదురో అనేక సవాళ్లు, కుట్రలను ఎదుర్కొంటున్నాడు. ప్రధాన రాబడి వనరైన చమురు అమ్మకాలు, రవాణాపై అనేక ఆంక్షలు, దిగ్బంధనాలతో అమెరికా, లాటిన్ అమెరికాలోని దాని మిత్రదేశాలు, ఐరోపా యూనియన్ దేశాలూ ఇబ్బందులు పెట్టేందుకు, జనాన్ని రెచ్చగొట్టేందుకు చూస్తున్నాయి. ఎన్నికల ఫలితాలపై ప్రపంచ దేశాల స్పందన వెలువడింది. లాటిన్ అమెరికాలో వామపక్ష వాదులను సమర్ధించేదేశాలు మదురోకు శుభాకాంక్షలు పలకగా వ్యతిరేక దేశాలు ప్రతికూలంగా స్పందించాయి. వెనెజులా కమ్యూనిస్టు పార్టీతో సహా చిలీలోని వామపక్ష ప్రభుత్వం ఎన్నికలు సక్రమంగా జరిగినట్లు వివరాలను వెల్లడించాలని ప్రకటించటం గమనించాల్సిన అంశం. సకాలంలో ఫలితాలతో పాటు పోలింగ్ కేంద్రాల వారీ ఓటింగ్ వివరాలను వెంటనే ప్రకటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కోరినట్లు ప్రతినిధి ప్రకటించాడు. మదురోను వ్యతిరేకించేదేశాలు రంగంలోకి దిగాయి. అమెరికా దేశాల సంస్థ (ఓఏఎస్) అత్యవసర సమావేశం జరిపి ఫలితాలను సమీక్షించాలని కోరుతున్నాయి. వాస్తవాలు తేలేవరకు వెనెజులాతో దౌత్య సంబంధాలను స్ధంభింపచేస్తున్నట్లు పనామా ప్రకటించింది. పూర్తి సమీక్ష జరిపే వరకు కారకాస్‌లో ఉన్న తమ దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపిస్తున్నట్లు పేర్కొన్నది. ఫలితాలను అంగీకరించని, వ్యతిరేకించిన పనామా, పెరు, అర్జెంటీనా, చిలీతో సహా ఏడు దేశాల నుంచి తాను కూడా దౌత్య సిబ్బందిని ఉపసంహరిస్తున్నట్లు మదురో ప్రకటించాడు. ఎన్నికల పరిశీలకులను పంపిన కార్టర్ సెంటర్ కూడా పోలింగ్ కేంద్రాల వారీ ఫలితాలను ప్రకటించాలని కోరింది.ఈ సారి ఎలాగైనా మదురో, వామపక్ష శక్తులను దెబ్బతీస్తామని కలలు గన్న తిరోగామి శక్తులు ఆశాభంగం చెందినట్లు స్పందనలు వెల్లడించాయి. ఫలితాలను ఆలశ్యం చేసేందుకు, లెక్కింపు ప్రక్రియను దెబ్బతీసేందుకు జరిగిన ప్రయత్నాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు అటార్నీ జనరల్ తారెక్ సాబ్ ప్రకటించాడు. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటున్న లిమా విదేశీ శక్తుల బృందాన్ని ఖండిస్తున్నట్లు విదేశాంగ మంత్రి యవన్ గిల్ ప్రకటించాడు. తొత్తు ప్రభుత్వాన్ని రుద్దేందుకు ఇప్పుడే కాదు 2019లో కూడా ప్రయత్నించారని అన్నాడు.వెనెజులా చట్టం ప్రకారం స్వతంత్ర పరిశీలకు ప్రతి పోలింగ్ బూత్‌లో లెక్కింపు జరిగి ఫలితాలను సరి చూసేందుకు, రాతపూర్వంగా ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంది. ఫలితాలు వెలువడి మదురో గెలిచినట్లు ప్రకటించిన తరువాత అంతర్జాతీయ పరిశీలకు తనిఖీకి అనుమతించాలని ప్రతిపక్షాలు కొత్త పల్లవి అందుకున్నాయి.
గత పాతిక సంవత్సరాలుగా వెనెజులాలో వామపక్ష ఉద్యమం, ప్రభుత్వాలను కూల్చివేసేందుకు దేశంలోని తిరోగామి శక్తులు, వాటికి మద్దతు ఇస్తున్న అమెరికా చేయని కుట్ర లేదు. ఫాసిస్టు శక్తులు ఎప్పటికప్పుడు ఊసరవెల్లి మాదిరి రూపాన్ని మార్చుకొని ముందుకు వస్తున్నాయి.జనంలో వాటికి ఆదరణ లేకపోవటంతో జాతీయవాదంతో ఆకర్షించాలని చూస్తున్నాయి. అమెరికా తొత్తులుగా పనిచేస్తున్నాయి. ఎన్నికుట్రలు చేసినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు కలిగించినా అధికారానికి వచ్చిన వామపక్షశక్తులు ఉన్నంతలో కార్మికవర్గాన్ని కాపాడేందుకు చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నాల కారణంగా వాటి ఆటలు సాగటం లేదు. దీని అర్ధం వెనెజులాకు వాటితో ముప్పు లేదని కాదు.మదురో అనుసరిస్తున్న విధానాలన్నీ సరైనవే అని కాదు. వెనెజులా ఎన్నికల్లో పాల్గొనేవారి శాతం క్రమంగా తగ్గుతున్నది. మదురో విధానాలను కాపాడుకోవాలని జనాల్లో కోరిక బలంగా ఉంటే ఎన్నికల్లో పాల్గొనేవారి శాతం పెరగాల్సి ఉంది. కానీ 2013లో 79.65శాతం మంది పాల్గొంటే 2018లో 45.73శాతానికి పడిపోయింది. ఈ సారి 44.85శాతానికి తగ్గింది. 2018 ఎన్నికల్లో మదురోకు 67.85శాతం ఓట్లు రాగా ఇప్పుడు 53.67శాతమే వచ్చాయంటే కొన్ని తరగతుల్లో అసంతృప్తి ఉందన్నది స్పష్టం. పోయిన సారి మదురో మీద పోటీచేసిన ప్రత్యర్ధులలో ఇద్దరికి 20.93-10.75 శాతాల చొప్పున వచ్చాయి. ఈ సారి ఒకే అభ్యర్ధి రంగంలో ఉన్నాడు. ఛావెజ్ అనుసరించిన సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాలను మదురో కూడా కొనసాగిస్తున్నప్పటికీ అంతర్గత విధానాల మీద వెనెజులా కమ్యూనిస్టు పార్టీ(పిసివి) ఇతర కొన్ని వామపక్ష పార్టీలు విమర్శనాత్మక వైఖరితో ఉన్నాయి.లాటిన్ అమెరికాలో అధికారానికి వచ్చిన ఇతర వామపక్ష నేతల మాదిరిగానే మదురో కూడా పెట్టుబడిదారీ విధాన పునాదులను ముట్టుకోకుండా సంస్కరణలతో, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమాన్ని విబేధించిన వామపక్ష శక్తులను సహించటం లేదని కమ్యూనిస్టు పార్టీ విమర్శించింది.
గతంలో ఛావెజ్, మదురో ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టు పార్టీ ఇటీవలి సంవత్సరాలలో మదురో విధానాలతో విబేధిస్తున్నది. తన విధానాలను విమర్శించిన వామపక్ష శక్తులను ప్రతి పక్షపార్టీల ఏజంట్లుగా మదురో దాడి చేశాడు. ఛావెజ్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చూస్తే ఏ కమ్యూనిస్టు లేదా వామపక్ష పార్టీగానీ ప్రతిపక్ష మితవాద శక్తులను సమర్దించిన దాఖలా లేదు. విమర్శనాత్మకంగా ఉంటూనే సోషలిస్టు ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చాయి. ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీకి పార్లమెంటులో ఒక స్థానం, ఎనిమిది మంది మేయర్లు ఉన్నారు. తమ పార్టీ నేతల మీద విచారణకు ఆదేశించిన ప్రభుత్వ చర్యను వెనెజులా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫిగుయెరా గోన్‌సాల్వెజ్ ఖండించాడు.పార్టీ నిబంధనావళి ప్రకారం ఎన్నికైన నేతల స్థానే వేరే వారిని ఎంచుకోవాలని కోర్టు చెప్పటం అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమే అని పార్టీ విమర్శించింది. కోర్టు సూచించిన ఏడుగురు పార్టీ సభ్యులు కూడా కాదని అందువలన అది చట్టవిరుద్దమని కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశం పేర్కొన్నది. వారితో పోటీ పార్టీ సమావేశాలను కూడా ఏర్పాటు చేయించారు. ఛావెజ్ హయాంలో ప్రారంభించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను మదురో రద్దుచేశారని, పౌరసేవలు దిగజారినట్లు కూడా పేర్కొన్నది.కార్మికుల ఆదాయాలు, హక్కులకు కోత పెట్టిందని, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వేతనాల పెంపుదల, ప్రైవేటు గుత్త సంస్థల రద్దు వంటి విప్లవాత్మక చర్యలు చేపట్టటానికి బదులు ఉదారవాద సంస్కరణలకే పరిమితం అయ్యారని పేర్కొన్నది. అమెరికా డాలర్ల చలామణిని స్వేచ్చగా అనుమతించటాన్ని, మారకపు విలువపై అదుపును వదలివేశారని, దిగుమతులపై పన్ను రద్దు చేయటాన్ని అనేక మంది ఆర్థికవేత్తలు తప్పు పట్టారు.మదురో ఆచరణాత్మక విధానాలను అనుసరిస్తున్నారని కొందరు సమర్దిస్తే నయా ఉదారవాద విధానాలు తప్ప మరొకటి కాదని కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. అంతే కాదు, తనతో పాటు కలసివచ్చే వామపక్ష పార్టీలను కలుపుకొని ప్రజా విప్లవ ప్రత్యామ్నాయం పేరుతో ఒక కూటమని ఏర్పాటు చేసింది.ఈ కూటమిలో కమ్యూనిస్టు పార్టీతో సహా మరో నాలుగు పార్టీల నాయకత్వాన్ని మార్చాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యాలయం మీద పోలీసులు దాడి చేశారు. ఇటీవలి కాలంలో అనేక రంగాలలో కార్మికులు జరుపుతున్న పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ మద్దతు ప్రకటించింది, దీంతో కొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది కార్మికుల పోరాటాలు అంతకు ముందు ఏడాడి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ పెరిగాయి.కమ్యూనిస్టు పార్టీ లేదా మరొక పార్టీలో అంతర్గత సమస్యలేవైనా ఉంటే వారు తేల్చుకుంటారు తప్ప కోర్టులు నాయకత్వాన్ని సూచించటం అప్రజాస్వామికం.
