Tags

, ,

అరవై ఏళ్లు నిండాయంటే మా కమలన్న మేధా కమలం మరింత వికసిస్తుంది, మరింత పరిపూర్ణుడౌతాడనుకుంటే ఇదేంటి ఇలా చేశాడు మీ హీరో అని అందరూ అంటుంటే నీకెలా వుందోగాని మాకు మాత్రం సిగ్గుగా వుందన్నా ! ఏదైనా ఒక సమస్యపై ఎటూ తేల్చుకోలేకపోతే మౌన భూషణం ధరించటం ఒక పద్దతి. మీ సినిమా చీకటి రాజ్యం విడుదల సందర్బంగా దానితో నాలుగు డబ్బులు చేసుకొనేందుకు హైదరాబాదు వచ్చారు, ఓకే. విలేకర్లతో మాట్లాడినపుడు అనేక విషయాలను ముఖ్యంగా ఇబ్బంది పెట్టేవి అడుగుతారు, ప్లీజ్‌ నేను సినిమా కోసం వచ్చాను మిగతా విషయాలు ఇప్పుడు వద్దు అని తప్పించుకొని వుంటే ఒక పద్దతిగా వుండేది. నోరు విప్పారు, ముందుగా స్క్రిప్టు, డైరెక్షన్‌ వగైరా ఏమీ లేకుండా మాట్లాడారు కనుక ఇదేమిటి ఇలా మాట్లాడారు అనుకున్నాము. ఆ మాటలు ఎదురు తన్నాయి. పోనీ అంతటితో వూరుకున్నారా అంటే లేదు అసలే కోతి, దానికి తోడు కల్లు తాగిందన్నట్లుగా చెన్నయ్‌లో మరింత రెచ్చిపోయారు. గూండాలు, రౌడీలు, మతశక్తులు ఒంటరిగా వుండరు. తెలిసో తెలియకో తమ దగ్గరకు వచ్చిన వారితో ఏదో ఒక నేరం చేయించి తమ పట్టునుంచి జారిపోకుండా చూసుకుంటారు. అయినా మా పిచ్చిగానీ ఎన్నో సినిమాలు తీసి, కధలు విన్న మీకు ఇవన్నీ మేం చెప్పాలా ? కమలనాధులు మిమ్మల్ని అదే చేసినట్లుగా కనిపిస్తోంది.


వివిధ సందర్బాలలో మీరు మాట్లాడినవి,వెలిబుచ్చిన అభిప్రాయాలను బట్టి ‘ విశ్వరూపం, హేరామ్‌, వుత్తమ విలన్‌’ వంటి సినిమాల విడుదల సందర్బంగా మతశక్తులు చేసిన గొడవను బట్టి మీకు కాస్త వామపక్ష భావజాలం, స్వతంత్ర భావాలు వున్నాయని, హేతువాదివని ఇంతవరకు అనుకుంటున్నాము. మీ తండ్రితో కలసి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న యాకూబ్‌ హసన్‌ స్నేహానికి గుర్తుగా మీ తండ్రి మీ పేర్ల చివరన హసన్‌ చేర్చినట్లు విన్నాం, మీరు కూడా మీ కుమార్తెల పేర్లకు చివరన హసన్‌ చేర్చినందుకు మీ కుటుంబం ఎంతో విశాల భావాలు కలదని అభిమానులంతా పొంగి పోయారు.చదవేస్తే వున్న మతి పోయిందన్నట్లుగా వయస్సు పెరిగింది కానీ బుర్ర వికసించలేదని తాజాగా స్వయంగా రుజువు చేసుకున్నారు.

మీరు కాషాయ బురద అంటించుకొని ఈ వయస్సులో వారి తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడటాన్ని అభిమానులుగా జీర్ణించుకోలేకపోతున్నాం. అనుపమఖేర్‌ అంటే వాళ్లావిడ చండీఘర్‌ బిజెపి ఎంపీ నుక ఆ పార్టీ వుప్పు తింటున్నందుకు ఆ పెద్దమనిషి గజ్జెలు కట్టుకొని జడలు విరబోసుకొని శరభ శరభ దశ్శరభ శరభ అంటూ వీర తాళ్లతో వీరంగం వేస్తున్నాడు. మీకేం వచ్చింది ? కొంపదీసి ఇలా మాట్లాడి మద్దతు నటించటానికి మీరు గానీ కాల్షీట్లు ఇచ్చారా ఏమిటి ? ఎందుకంటే గతంలో అనేక మంది నటీ నటులను అలా ఏర్పాటు చేసుకున్నారు, సొమ్ము చేసుకొనేందుకు వారు కూడా అలా నటించారు మరి.

దేశంలో అసహన పరిస్ధితులు పెరిగి పోతున్నాయని కళాకారులు, సాహితీవేత్తలు, వివిధ రంగాలలోని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఆలోచన కలిగించిందీ, దాన్ని మరింత మందికి తెలిసేట్లు చేసింది ఎవరు? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కన్నడ రచయిత లుబుర్గిని వుట్టి పుణ్యానికి మత మదమెక్కిన వారు హత్య చేస్తే ఖండించమనేగా రచయితలు అకాడమీని అడిగింది. అదేమీ రాజకీయ సంస్ధ కాదు, మీరన్నట్లు మేధావులతో కూడినదే. కలుబుర్గి హత్య కుటుంబ తగాదాల కారణంగా అని ఒక కధ, వ్యక్తిగత సమస్య అని ఒక కధ తొలుత ప్రచారంలో పెట్టారు. పోనీ అదే నిజం అనుకున్నా తాము అవార్డు ఇచ్చిన ఒక ప్రముఖుడిని కాల్చి చంపితే అయ్యో పాపం అనటానికి, హత్యను ఖండిిస్తే వారి నోటి ముత్యాలు రాలిపోతాయా ? చంపింది ఆయన భావాలను సహించలేని వారే అని తేలిన తరువాత, వారు మరికొందరు రచయితలను కూడా హతమారుస్తామని బెదిరింపులకు దిగిన పూర్వరంగంలో అయినా సాహిత్య అకాడమీ ఖండించి వుంటే పరిణామాలు మరొక విధంగా వుండేవి.లుబుర్గి హత్యను సాహిత్య అకాడమీ ఎందుకు ఖండించలేదు? అంటేె ఎండని చేప కథ గుర్తుకు వస్తోంది. ఆ కథలో చివరకు నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని చీమ చెబుతుంది. దీనిలో మమ్మల్ని పర్యవేక్షించే కమలనాధులకు ఇష్టం లేని పని మేమెందుకు చేస్తాము అన్నట్లుగా సాహిత్య అకాడమీ పెద్దలు మౌనంగా వుండటం తప్ప మరొకటి ఏముంది? అయినా కలుబుర్గి హేతువాది, మీరూ హేతువాది అంటారు, అంటే తోటి హేతువాది హత్యపై కూడా నోరు విప్పని వారిని పట్టుకొని ఎంతో ప్రముఖులు, మేధావులు, వారిని నేనెంతో గౌరవిస్తా అని చెప్పటానికి మీది నోరా మరొకటా ? ఆరుపదులకే ముది మది తప్పిందా లేక వుమ్తెత్త కాయలు కానీ తినలేదు కదా !

కలుబుర్గిని చంపింది ఆగస్టు 30న, దానిని ఖండించనందుకు నిరసనగా అవార్డును తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించిన తొలి రచయితగా వుదయ ప్రకాష్‌ చరిత్రకెక్కారు. అవార్డు రచయితల నిరసన క్రమంగా పెరుగుతున్న సమయంలో సెప్టెంబరు 28న దాద్రిలో ఆవు మాంసం తింటున్నారనే పేరుతో ఒక మూక ఒక ముస్లిం కుటుంబంపై దాడి చేసి యజమానిని బలిగొన్నది. దానిని ఖండించటానికి ముందుకు రాకపోగా బిజెపి పెద్దలు హంతకులను సమర్ధించిన తరువాతే అసహన ధోరణిపై రచయితలతో పాటు ఇతర మేధావులు కూడా జతకలిశారు. దీనిలో మీరు చెబుతున్న ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ? బిజెపి, దానికి వంత పాడుతున్న మీ వంటి వారి బుర్రల్లో తప్ప, నిజంగా ప్రభుత్వవ్యతిరేకతే అయితే పోయినేడాది మోడీ అధికారానికి వచ్చి ఏడాది వుత్సవాలు జరుపుకునేంతవరకు ఆగటం ఎందుకన్న కనీస జ్ఞానం మీకు లేకపోయిందే అని అభిమానులుగా మేం బాధపడుతున్నాం. అసహన ధోరణులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్న భావం ప్రబలటానికి కారకులు ఎవరు ? ఐదూళ్లు కాదు సూది మోపినంత కూడా ఇచ్చేది లేదన్న ధుర్యోధనుడి మాదిరి దాద్రి హత్యను ఖండించేందుకు నరేంద్రమోడీ తిరస్కరించటం మరింత ఆజ్యం పోసిందా లేదా ? ఖండించకపోగా ప్రతి పక్షాలే మత ధోరణులను పెంచుతున్నాయని ఎదురుదాడికి దిగారా లేదా ? సేనాపతే అలా వున్న తరువాత అనుంగు సైనికులైన సాక్షి మహరాజ్‌ వంటి నోటి దురద వ్యాధి గ్రస్తులు సాధ్వులు, సంతులు రెచ్చిపోయిన తరువాతే కదా మరింత మంది నిరసన గళం విప్పింది.

అవార్డులు తిరిగి ఇచ్చినంత మాత్రాన జరిగేదేమీ వుండదని మీ నోటి వెంట ఒక సుభాషితం వెలువడింది. అంటే అసహన ధోరణులను నిరుత్సాహపరచటం జరగదు, వారు చేసేది చేసుకుంటారు, మీరు చేసేది చేసుకోండన్నదే మీ మాటలకు అర్ధమా ? దేశంలో ఇప్పుడు గతం కంటే ఎక్కువగా అసహన ధోరణులు వున్నాయా లేవా అనే దానికి అవునో కాదో చెప్పకుండా నిరసన తెలుపుతున్న వారు కూడా సహనంతో వుండాలని, ఇచ్చి పుచ్చుకోవాలని చెప్పటం నవ్వు తెప్పిస్తోంది. సహనయాత్ర పేరుతో అవార్డులను తిరిగి ఇచ్చివేస్తున్నవారికి వ్యతిరేకంగా అసహనయాత్ర చేసిన అనుపమఖేర్‌ అండ్‌కో రాష్ట్రపతికి ఇచ్చేందుకు తయారు చేసిన ఒక పిటీషన్‌పై మీరు కూడా సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయి. సహనంతో చదివి సంతకం చేశారా లేక నిరసన తెలుపుతున్న వారి మీద అసహనంతో చూడకుండానే వేలి ముద్ర వేశారా ? అసహన పరిస్ధితులు వున్నాయని తెలియ చెప్పేందుకు అనేక పద్దతులు వున్నాయన్నారు బాగుంది ఆ లెక్కన మీరే పద్దతిలో అయినా ఇంతవరకు ఎందుకు నిరసన తెలపలేదో చెప్పగలరా ? ఒక వేళ రహస్యంగా తెలిపితే వచ్చిన స్పందన ఏమిటో తెలిపితే సంతోషం. ఊరందరికీ వుల్లిపాయ తినొద్దని చెప్పాను గానీ మనింట్లో వద్దని నీకు చెప్పానా అని ఒ బోధకుడు భార్యపై దెబ్బలాడినట్లు సహనశీలత పేరుతో అసహనపరులు అనుపమఖేర్‌ బృందం జరిపిన ప్రదర్శన సందర్భంగా జర్నలిస్టులను చూసి నిర్వాహకులు రెచ్చిపోయారు. ఒక మహిళా జర్నలిస్టును అనరాని మాటలతో అవమాన పరిచారు.

సినీ రంగంలో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన మీరు అవార్డుకు, డిగ్రీకి తేడా తెలియకుండా మాట్లాడటం బెర్నార్డ్‌ షా జోకును గుర్తుకు తెస్తోంది. అదేమంటే ఒక అందగత్తె ఆయన దగ్గరకు వెళ్లి మనం పెళ్లి చేసుకుందాం , నా అందం, మీ తెలివి తేటలతో పుట్టే పిల్లలు మన కంటే గొప్పవారు అవుతారన్నదట. దానికాయన నీతో పెళ్లికి నాకు ఓకే. ఒక వేళ నా అందం నీ తెలివి తేటలు కలిగిన పిల్లలు పుడితే ఎలా అని ప్రశ్నించాడట. మీరు కాషాయ నరేంద్రమోడీతో ముడివేసుకున్న ఫలితంగా మీ వివేకం స్ధానంలో వారి బుద్ది ప్రవేశించినట్లుగా వుంది. మధ్యలో మహాత్మాగాంధీని తెచ్చారెందుకు మహానుభావా ? బ్రిటీష్‌ వారు పరిపాలిస్తున్నారు గనుక గాంధీజి తన బారిస్టరు డిగ్రీని తిరిగి ఇచ్చివేస్తారని మనం వూహించగలమా అది బాధ్యతా రహితం అవుతుంది, నేనలాంటి బాధ్యతారాహిత్యానికి పాల్పడను అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసన తెలపటం మన దేశంలో విశ్వకవి రవీంద్రుడితో ప్రారంభమైందని తెలుసా మీకు ? 1915లో తనకు బ్రిటీష్‌ వారు ఇచ్చిన వున్నత గౌరవాన్ని 1919లో జలియన్‌వాలాబాగ్‌ దురంతం తరువాత నిరసతో తిరిగి అప్పగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి.

ఏమైనా ఒకందుకు మీకు, మీ వంటి వారు అలుపెరగకుండా మోస్తున్న కాషాయ నరేంద్రమోడీకి ఒక విధంగా అభినందనలు చెప్పక తప్పదు.అన్ని వ్యవస్ధలను కాషాయ బంట్లతో నింపినట్లుగానే కేంద్ర సాహిత్య అకాడమీని కూడా కాషాయపూరితం చేశారు. ఆయా సంస్ధల విస్వసనీయతనే ప్రశార్ధకం చేశారు. రాబోయే రోజుల్లో సాహిత్య, పద్మ, ఇతర అవార్డులను ఈ ప్రభుత్వం లేదా దాని పర్యవేక్షణలో పనిచేసే సంస్ధలు ప్రకటిస్తే తీసుకోవాలా లేదా అన్నది ముందుగానే నిర్ణయించుకోవాల్సి వుంటుంది. తిరస్కరిస్తే మీరన్నట్లు ప్రభుత్వ వైఖరితో విబేధించినవారిగా, తీసుకుంటే కాషాయ భజనపరులుగా జనం పరిగణిస్తారు. మేధావులు ఎటువుండాలో తేల్చుకోవాల్సిన పరిస్ధితిని ముందు తెచ్చారు.

కమలన్నా ఇప్పటికైనా మించిపోయింది లేదు ! ఇంతకాలం నా వంటి అభిమానులు మీ గురించి అల్లుకున్న ఊహలను ఒక్కసారిగా పటాపంచలు చేస్తూ కమలం గూటి పలుకులు పలుకుతావని ఎన్నడూ వూహించలేదు. ఒక్కసారి పునరాలోచించు. నోరు మంచిదైతే వూరు మంచిదౌతుందంటారు. బీహారు ఎన్నికల ప్రచారంలో గతంలో ఏ ప్రధాని కూడా తిరగని విధంగా గల్లీ గల్లీ తిరిగి గల్లీ వుపన్యాసాలు చేసిన ఫలితం ఏమి వచ్చిందో చూసే వుంటారు. తప్పు చేయటం కంటే చేసిన తప్పు తెలుసుకున్న వారు ఎంతో గొప్పవారని వేరే చెప్పనవసరం లేదు. వుంటా మరి

మీ అభిమాని