Tags
బీహార్‌లో బిజెపి ఓటమికి ఎవరూ బాధ్యులు కాదట, అందరూ బాధ్యులేనట ! మంగళవారం నాటి పత్రికలు చూసిన వారికి అర్ధమైన భావం ఇదేనేమో. పార్టీ పార్లమెంటరీ సమావేశం లోపల ఏం చర్చించుకున్నారో తెలియదు గానీ బయటకు మాత్రం వెల్లడించిన సందేశ సారాంశమిది. గతంలో ఇందిరా గాంధీ చుట్టూ చేరిన భజన పరులు ఇందిరే ఇండియా, ఇండియాయే ఇందిర అని నినాదమిస్తే ఆమె దానిని నివారించలేదు. అలాగే దేశంలో ఏం జరిగినా నరేంద్రమోడీ మహత్యమే అని చిత్రించటానికి ఒక తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. గతాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. మనది పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్ధ, అంటే ఎన్నికలలో మెెజారీటీ సంపాదించిన పార్టీ ఎంపీలు అధికార పార్టీ నాయకుడిని ఎన్నకుంటే ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా తమ నేతలను ఎన్నుకుంటారు. కానీ అధ్యక్ష తరహా ఎన్నికల మాదిరి ముందుగానే ప్రధాని అభ్యర్ధి ఎవరో ప్రకటించాలంటూ బిజెపి కాంగ్రెస్‌ను సవాలు చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అదే బిజెపి బీహార్ విషయానికి వచ్చే సరికి అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. అక్కడ ఎన్నికల విజయంపై మితిమీరిన విశ్వాసంతో వున్న మోడీ అనుచర గణం విజయాన్ని మోడీకి ఆపాదించే ఎత్తుగడతోనే ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించనివ్వలేదు, అంతేకాదు రాష్ట్ర టీమును కూడా ప్రజల ముందుంచలేదు. మొదటి దశ ఎన్నికలలో పోలింగ్, జనం నాడిని పసిగట్టిన బిజెపి తరువాత నరేంద్రమోడీతో పాటు స్ధానికనేతల చిత్రాలను కూడా పోస్టర్లలో ముద్రించి ప్రచారం చేసింది. గెలిస్తే మోడీ ఘనత లేకుంటే స్ధానిక నేతలపైకి నెట్టేందుకే ఇది అని అప్పుడే వ్యాఖ్యలు వెలువడిన విషయాన్ని గమనించాలి.
ప్రతం చెడ్డా ఫలం దక్కలేదు. మామూలుగా ఎక్కువ సమయం విదేశాల్లో గడిపే నడిపే నరేంద్రమోడీ విదేశీ పర్యటనలను త్యాగం చేసి బీహార్‌లో తిష్టవేసి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేశారు. బిజెపి అధికారిక వెబ్‌సైట్ సమాచారం ప్రకారం 29 నియోజకవర్గాలలో ప్రచారం చేశారు. ప్రధాని ఒక కేంద్రంలో జరిగే సభ అంటే పరిసర ప్రాంతాలు లేదా జిల్లాలోని నియోజకవర్గాలన్నింటికీ వుద్ధేశించి వుంటుంది. అయినా 29 నియోజకవర్గాలనే పరిగణనలోకి తీసుకున్నా 16 చోట్ల బిజెపి ఓడిపోయింది. లక్షానలభై వేల కోట్ల బీహార్ పాకేజ్, బిజెపి నేత అరుణ్ శౌరీ వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ అజెండాకు ఒక ఆవును కలిపినా ఫలితం లేకపోయింది. ఘోర ఓటమి ఎందుకు సంభవించిందో ఆత్మావలోకనం చేసుకోకుండా ఎవరిదీ తప్పులేదని చెప్పటం చుట్టూ శాఖాహారులే మధ్యలో రొయ్యల బుట్ట మాయం అన్నట్లుగా వుంది.
ఇప్పటివరకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పెద్ద వ్యూహకర్త అని వూదరగొట్టారు. తీరా ఇప్పుడు బీహార్‌లో కులాల వారీ ఓట్లు చీలిపోతాయని , మహాకూటమి పక్షాల మధ్య ఓట్లు పూర్తిగా బదిలీ కావని అనుకున్నాము, దానికి భిన్నంగా పక్కాగా బదిలీ అయ్యాయి, ఈ పరిణామాన్ని వూహించలేదు, ఇదే తమ ఓటమికి కారణం తప్ప వ్యక్తులు కాదు అని ఇప్పుడు చెబుతున్నారు. దీనిలో పెద్ద వ్యూహం, ఎత్తుగడ ఏముంది, అమిత్ షా బుర్రలో ఇంత కంటే మెరుగైన ఆలోచనలు, ఎత్తుగడలు లేవన్న మాట. నిజానికి ఇలా చెప్పటం అసలు కారణాలను బయటికి చెప్పుకోలేకపోవటం తప్ప వేరు కాదు. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే బిజెపి పార్లమెంట్ సభ్యుడు హుకుం నారాయణ యాదవ్ తమ ఓటమికి ఆరెస్‌ఎస్ అధిపతి మోహన్ భగత్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే అని వ్యాఖ్యానించాడు. ఆ విషయాన్ని అంగీకరించే దమ్ము బిజెపికి లేదు. అందుకే ఎవరి బాధ్యత లేదు అని చెప్పుకోవాల్సి వచ్చింది. రాజకీయేతర వ్యక్తులతో కూడిన ఒక కమిటీని నియమించి రిజర్వేషన్లను సమీక్షించాలని గతంలో ఆర్‌ఎస్‌ఎస్ చేసిన తీర్మానానికి ప్రధానితో సహా ప్రభుత్వంలోని ‘ప్రచారక్‌లు’ ఇప్పటికీ కట్టుబడి వున్నారా లేదా ?
