Tags
ఆంధ్రప్రదేశ్‌లో, ఎగువ రాష్ట్రాలలో ఖరీఫ్ సీజనలో సరైన వర్షాలు పడక నాగార్జున సాగర్, మరికొన్ని ప్రాంతాల రైతాంగం ఈ ఏడాది పంటలను నష్టపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కోస్తాలోని నెల్లూరు నుంచి గోదావరి జిల్లాలు, రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాలో రైతాంగానికి పెను గండంగా మారింది. లక్షలాది ఎకరాలలోని పంటలు నీట మునిగినట్లు వార్తలు ఆందోళన కలగిస్తున్నాయి. వర్షాలు తగ్గు ముఖం పట్టిన తరువాత గానీ నష్ట తీవ్రతను అంచనా వేయటం సాధ్యం కాదు.
ఎగువ ప్రాంతాలలో వర్షాలు లేని కారణంగా ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లకు తగిన నీరు రాలేదు. ఈ కారణంగా ధాన్యం సాధారణ సాగు ఆంధ్రప్రదేశ్‌లో 16,75,518 హెక్టార్లకు గాను అధికారిక లెక్కల ప్రకారం ఖరీఫ్ సీజన్లో 13,76,515 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. ప్రకాశంలో 27, గుంటూరు జిల్లాలో 66, కృష్టా 81శాతం మాత్రమే( అదీ కృష్ణా డెల్టా ప్రాంతం) సాగైంది. సాగర్ ప్రాంతంలో నాట్లు పడలేదు. ఇప్పుడు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాగు చేసిన ప్రాంతంలోని వరితో, కోస్తా , రాయలసీమ జిల్లాలన్నింటా మెట్ట పంటలకు సైతం పెద్ద నష్టాన్ని కలగచేస్తాయని రైతాంగ ఆందోళన చెందుతోంది. సకాలంలో వర్షాలు లేక కొన్ని ప్రాంతాలు నష్టపోతే అకాల వర్షాలు అన్ని ప్రాంతాలను దెబ్బతీస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వుదారంగా ఆదుకోనట్లయితే రైతాంగం మరింతగా అప్పుల ఊబిలో కూరుకు పోనుంది.
