ఎం కోటేశ్వరరావు
ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైన గూఢచారి సంస్థలలో ఒకటైన మొసాద్ తమ ప్రభుత్వానికి హమస్ దాడుల గురించి ఎందుకు ఉప్పందించలేకపోయిందన్న ప్రశ్నకు దాడి జరిగిన రెండు వారాలకు కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఇప్పుడు మేం యుద్ధంలో ఉన్నాం వాటి గురించి దర్యాప్తు జరపటం లేదని అధికారులు సమాధానమిస్తున్నారు.స్వజనం, ఇతర దేశాల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తప్పుదారి పట్టించేందుకు అసలు హమస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశంపై అనేక కథలను ప్రచారం చేస్తున్నారు. హమస్ సంస్థ అధికారంలో ఉన్న గాజా ప్రాంత విస్తీర్ణం 360 చదరపు కిలోమీటర్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా ఎంతో తెలుసా ? 7,257చదరపు కిలోమీటర్లు. జన సాంద్రత 1,474. గాజా గడచిన పదిహేడు సంవత్సరాలుగా చుట్టూ ఆరుమీటర్ల ఎత్తున ఇనుపకంచెతో అనుమతి లేకుండా జనం బయటకు పోకుండా చేసిన ఒక బహిరంగ జైలు మాదిరి ఉంది. జనాభా ఇరవై మూడు లక్షలు.చదరపు కిలోమీటరుకు 6,507. అలాంటి జనసమ్మర్ధం ఉన్న ప్రాంతం మీద హమస్ తీవ్రవాదులను పట్టుకుంటామనే పేరుతో ఇజ్రాయెల్ విమానాలతో బాంబులు వేస్తోంది. సగం ప్రాంతాన్ని ఖాళీ చేసి వేరే వైపు వెళ్లమని జనాన్ని నెట్టేస్తోంది.తరువాత మరోసగాన్ని మరోవైపు పంపి నాశనం చేయాలన్నది దాని పథకం. ఇటు వంటి దుర్మార్గాన్ని గట్టిగా కొనసాగించమని అమెరికా అధిపతి జో బైడెన్, భారత అల్లుడు, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సలహా ఇచ్చి వెళ్లారు.మన ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా వెళ్లలేదు తప్ప ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించటం బైడెన్, సునాక్ అడుగుల్లో అడుగు వేయటమే !
నిజమే హమస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి.ఈ ప్రశ్నకు సమాధానం కోరుతున్న వారు 1947కు ముందు వివిధ దేశాల నుంచి బ్రిటీష్ ఆక్రమణలో ఉన్న పాలస్తీనా ప్రాంతంలోకి యూదులు ఎలా వచ్చారు, వారికి ఆయుధాలు ఎలా అందుబాటులోకి వచ్చాయి, మిలిటరీ శిక్షణ ఎవరు ఇచ్చారు అన్న వాస్తవాలు తెలుసుకుంటే పాలస్తీనాకు చెందిన హమస్‌కు అస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చిందీ తెలుసుకోవటం అంత కష్టం కాదు. పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయాలన్న ముందస్తు పథకంతో ఉన్న బ్రిటన్, ఇతర సామ్రాజ్యవాదులు ఎక్కడెక్కడి నుంచో యూదులను రప్పించి ఆయుధాలు, శిక్షణ ఇచ్చారు.ఐరాస తీర్మానం చేసిన నాటి నుంచి వారు పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకోవటం ప్రారంభించారు. మాతృభూమి రక్షణ కోసం పోరాడుతున్న వారికి నాటి నుంచి నేటి వరకు మద్దతు ఇస్తున్న ఇరుగుపొరుగు దేశాలు ఆయుధాలు అందిస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన రహస్యం !
పాకిస్తాన్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం బంగ్లాదేశ్ పౌరులు ఉద్యమించారు. ఆయుధాలు చేతబట్టి గెరిల్లా పోరు సాగించారు. వారికి ఆయుధాలు ఎవరు ఇచ్చారు ? తుపాకి పట్టిన ప్రతివారినీ ఉగ్రవాది అనలేం.బంగ్లా ముక్తివాహిని పేరుతో తిరుగుబాటు చేసిన వారికి మన దేశం మద్దతు ప్రకటించటమే కాదు, మన మిలిటరీని కూడా పంపి పాక్ సైన్యాన్ని అణచివేసింది. బంగ్లా విముక్తికి ఆయుధాలు పట్టిన వారిని నాడు జనసంఘం సమర్ధించింది. నేడు పాలస్తీనా వాసులు ఆయుధాలు పట్టినందుకు బిజెపి తప్పుపడుతోంది. నిజానికి బంగ్లా విభజనకు ఐరాస తీర్మానాలు లేవు. పాలస్తీనా ఏర్పాటుకు తీర్మానం ఉన్నప్పటికీ అడ్డుకుంటున్న ఇజ్రాయెల్‌కు నరేంద్రమోడీ, బిజెపి మద్దతు ప్రకటించటం రెండు నాలుకల వైఖరికి నిదర్శనం. బంగ్లా విముక్తికి చర్యలు తీసుకున్నందుకు అభినందిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ అధినేత గురూజీగా పిలుచుకున్న గోల్వాల్కర్ కూడా ఇందిరా గాంధీకి లేఖ రాశారు. మద్దతు పలికినందుకు గాను అతల్‌బిహారీ వాజ్‌పాయికి 2015లో బంగ్లాదేశ్ అత్యున్నత ” విముక్తి యుద్ధ గౌరవ ” అవార్డును బంగ్లాదేశ్ ప్రకటించింది.తమ దేశ ఏర్పాటుకు అడ్డుపడుతున్న ఇజ్రాయెల్ మీద పాలస్తీనియన్లు అనేక రకాలుగా పోరాడుతున్నారు. ఆయుధాలు పట్టిన వారిని ఉగ్రవాదులుగా చిత్రిస్తే నరేంద్రమోడీ దానికి తాన తందాన తాన అంటున్నారు. ఇజ్రాయెల్ దుర్మార్గాలను గుర్తించేందుకు నిరాకరించటం తప్ప మరొకటి కాదు. ఉక్రెయిన్ అంశంలో తటస్థవైఖరి తీసుకున్న మోడీ ఇప్పుడు ఒక పక్షం వహించటం అంటే అమెరికా కూటమి మెప్పు పొందేందుకు తహతహలాడటమే. రష్యా నుంచి ఆయుధాల అవసరం ఉంది, చౌకగా చమురు దొరుకుతుంది గనుక తటస్థం అన్నారు. పాలస్తీనా నుంచి అలాంటివేమీ ఉండవు గనుక ఒక పక్షానికి మద్దతు పలుకుతున్నారు.
హమస్ సాయుధులు ఆయుధాలను ఇరాన్ నుంచి తెచ్చుకుంటున్నారని, గాజాలోనే తయారు చేస్తున్నారంటూ సిఐఏ చెప్పిందని మీడియాలో వార్తలు వచ్చాయి. హమస్ కోసం ఇరాన్ ఆయుధాలను అక్రమంగా సేకరిస్తున్నదని, దానితో పాటు స్వంతంగా తయారు చేసుకోవటం గురించి శిక్షణ ఇస్తున్నట్లు సిఐఏ ఆరోపించింది. వాషింగ్టన్ ఇనిస్టిట్యూట్ అనే అమెరికా అనుకూల సంస్థ నిపుణుడు మైకేల్ నైట్స్ తమ దేశం ఇజ్రాయెల్‌కు పంపిన ఆయుధాలను పట్టుకొని లేదా బ్లాక్‌మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నదని చెప్పాడు. స్మగ్లింగ్ జరిగే మార్గాలను ఈజిప్టు కట్టుదిట్టం చేసిన తరువాత గాజాలోనే తయారు చేసుకుంటున్నారని అన్నాడు. తప్పేముంది. ఇజ్రాయెల్ వైపు నుంచి మిలిటరీ, సాయుధ యూదులు బాంబులు వేస్తుంటే పాలస్తీనియన్లు రసగుల్లాలు విసురుతారా ? ఇదే సంస్థ 2021లో విడుదల చేసిన ఒక నివేదికలో ఇజ్రాయెల్ ప్రయోగించిన వాటిలో కొన్ని పేలలేదని, పేలిన వాటి విడిభాగాలను రీసైకిలింగ్ చేసి హమస్ నిపుణులు స్వంతంగా ఆయుధాలను రూపొందిస్తున్నారని పేర్కొన్నది. హమస్ సాయుధుల దాడుల చిత్రాలను చూసిన అమెరికా పార్లమెంటు సభ్యులు కొందరు మాట్లాడుతూ ఉక్రెయిన్‌కు పంపినవి లేదా ఆఫ్ఘనిస్తాన్‌లో వదలి వచ్చినవి గానీ వారి చేతుల్లోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఉక్రెయిన్‌కు పంపిన ఆయుధాలను అది బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకుంటున్నదని కూడా చెబుతున్నారని అందువలన ఉక్రెయిన్‌కు సాయం అందించకూడదని కూడా మైకేల్ నైట్స్ చెప్పాడు. కాదు కాదు ఇలాంటి వార్తలన్నింటినీ రష్యా పుట్టిస్తున్నది కనుక నమ్మవద్దని మరికొందరు తమ ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నారు. వియత్నాం నుంచి పారిపోతూ అమెరికన్లు వదలివేసిన ఆయుధాలు తరువాత ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించాయని కొందరు గుర్తు చేశారు. ఉక్రెయిన్‌కు పంపుతున్న ఆయుధాలు ఇతరుల చేతుల్లో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి 2022 అక్టోబరులో అమెరికా విదేశాంగశాఖ ఒక పత్రంలో పేర్కొన్నది. ఉక్రేనియన్లను పట్టుకున్నపుడు వారి వద్ద దొరికిన అమెరికా ఆయుధాలను రష్యా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుందని కూడా హెచ్చరించింది.
అక్టోబరు ఏడవ తేదీ దాడి తరువాత ఇజ్రాయెల్ సేకరించిన నమూనాలను బట్టి హమస్ పూర్వపు సోవియట్ కాలం నాటి క్షిపణులతో దాడి చేసిందని ఒక కథనం. కాదు స్వంతంగా తయారు చేసిన వాటితోనే జరిపిందని ఇజ్రాయెల్ సైనికుడు చెప్పిన వీడియో కూడా బయటకు వచ్చింది. వారు వాడిన ఆయుధాలు చాలా చిన్నవని అమెరికా అందచేసే వాటిని గాజాలోకి చేర్చటం చాలా కష్టమని కొందరు చెప్పారు. ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా తెచ్చారు అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నదే గీటురాయి ! భుజాల మీద మోస్తూ ప్రయోగించే ఉత్తర కొరియా ఆయుధాలను హమస్ వినియోగించిందన్నది మరొక కథ ! దానికి రుజువు ఏమిటట, వాటికి ఎర్ర రిబ్బన్లు కట్టి ఉన్నాయట. ఎవడైనా వాటి గుర్తింపు తెలియకుండా ఎర్ర రిబ్బన్లు తీసివేస్తాడు తప్ప అలంకరించి మరీ వాడతారా ? అసలు ఉత్తర కొరియా ఆయుధాలను సరఫరా చేసిందా లేదా అని కొందరు అడగవచ్చు. ఇజ్రాయెల్‌కు బ్రిటన్‌తో సహా పశ్చిమ దేశాలన్నీ అన్ని రకాల ఆయుధాలను, వందల కోట్ల డాలర్లు అందిస్తున్నాయి. అమెరికా వారు ఎఫ్ 16 యుద్ధ విమానాలను అందించవచ్చు, మధ్య ధరా సముద్రానికి తన విమానవాహక యుద్ధ నౌకలను పంపించి ఆ ప్రాంతదేశాల మీద దాడులు చేస్తామని బెదిరించవచ్చు.ప్రపంచానికంతటికీ ఆయుధాలను ఆమ్మవచ్చు. ఉత్తర కొరియా హమస్‌కు ఆయుధాలు నిజంగా అందించిందో లేదో తెలియదు, ఒకవేళ ఇజ్రాయెల్ నుంచి ఆత్మరక్షణకు అందిస్తే తప్పే ముంది ? పాలస్తీనియన్లను వారి ఖర్మకు వారిని వదలివేయాలా ? గతంలో ఉత్తర కొరియా మీద అమెరికా దాడి చేసింది, ఇంకా దాడి చేసేందుకు దక్షిణ కొరియాలో వేలాది మంది మిలిటరీతో తిష్టవేసింది. మరోసారి ఉత్తర కొరియా మీద కూడా దాడులకు దిగవచ్చు. అప్పుడు దానికి దిక్కెవరు ? ఇంతకీ ఉత్తర కొరియా ఆయుధాలను హమస్ వాడిందా లేదా అని ఏపి వార్తా సంస్థ అడిగితే సమాధానం చెప్పేందుకు ఇజ్రాయెల్ మిలిటరీ తిరస్కరించింది. ఇవన్నీ అమెరికా వ్యాపింపచేసే కట్టుకథలని ఉత్తర కొరియా పేర్కొన్నది. వెయ్యి కంటెయినర్లలో రష్యాకు ఆయుధాలు, మందుగుండు ఉత్తర కొరియా నుంచి వెళ్లినట్లు అమెరికా ఆరోపించింది. నిరంతరం ఇతర దేశాల మీద అలాంటి నిందలను ప్రచారం చేస్తూనే ఉంది.హమస్ గురించి మనదేశంలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అందువలన వాటిని గుడ్డిగా నమ్మాల్సినపని లేదు.
హమస్‌కు ఆయుధాల సరఫరా గురించి చీకట్లో బాణం వేసినట్లుగా ఇతర దేశాల మీద ఆరోపణలు చేయటం తప్ప ఎవరిదగ్గరా నిర్దిష్ట సమాచారం లేదు.ఇక హమస్ ఆయుధ తయారీ గురించి కొన్ని వీడియోలు ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ నిజమని నమ్మటానికి లేదు. ఇజ్రాయెల్‌ను తప్పుదారి పట్టించేందుకు లేదా తమపై దాడులు చేస్తూ తమ ప్రాంతాలను ఆక్రమిస్తున్న తమ పాలకులు మీద ఇజ్రాయెలీ పౌరులు వత్తిడి తెచ్చేందుకు కొన్ని వీడియోలను రూపొందించి ప్రచారదాడి చేస్తున్నట్లు కూడా కొందరు చెబుతారు. అలాంటి వాటిలో ఒకదానిలో తాము గాజాలో పది నుంచి 250కిలో మీటర్ల వరకు ప్రయోగించే మోర్టార్లు, వాటికి అవసరమైన షెల్స్ తయారు చేసేందుకు ఫ్యాక్టరీలు ఉన్నట్లు, రష్యా అనుమతితో ఎకె రకం తుపాకులు, తూటాలు కూడా తయారు చేస్తున్నట్లు హమస్ ప్రతినిధి చెప్పినట్లుగా ఉంది. మరోవైపు ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీలు గాజాలో లేవని, దుస్తులు, ఫర్నీచర్, ఆహార పదార్ధాలు తయారు చేసే పరిశ్రమలే ఉన్నట్లు సిఐఏ వెలువరించే ఫ్యాక్ట్ బుక్‌లో ఉంది. ఇతర దేశాలు తయారు చేసిన ఆయుధాలు హమస్ దగ్గర దొరికినంత మాత్రాన ఆయా దేశాలు దానికి సరఫరా చేసినట్లు కాదు. కాశ్మీరులో లష్కరే తోయబా, జైషే మహమ్మద్ తదితర ఉగ్రవాదుల దగ్గర అమెరికా తయారీ ఆయుధాలు దొరికాయి. మనకు మిత్ర దేశం అని చెబుతున్న అమెరికా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సిరియా వంటి చోట్ల అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక ఉగ్రవాద, కిరాయి మూకలకు అమెరికా స్వయంగా ఆయుధాలు అందచేయటం బహిరంగ రహస్యం. అమెరికాకు ఆయుధాల తయారీ, విక్రయం పెద్ద లాభసాటి వ్యాపారం. డాలర్లు చెల్లిస్తే చాలు ఎవరికైనా అమ్ముతుంది.2018-22 కాలంలో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా 40శాతంగా ఉందని స్టాక్‌హౌం ఇంటర్నేషనల్ పీస్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్(సిప్రి) 2023 మార్చి నెలలో ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోతూ అమెరికన్లు 712 కోట్ల డాలర్ల విలువగల ఆయుధాలు, రక్షణ సామగ్రి వదలి వెళితే అవన్నీ తాలిబాన్ల వశమయ్యాయి.వాటిలో కొన్ని కాశ్మీరులో దొరికాయి. అవి తాలిబాన్ల నుంచి లేదా పాకిస్తాన్ నుంచి కూడా సరఫరా చేసి ఉండవచ్చు. ఇతర దేశాల నుంచి సేకరించిన అమెరికా ఆయుధాలనే హమస్ ఇటీవల ఇజ్రాయెల్ మీద ప్రయోగించినట్లు అమెరికన్ పార్లమెంటు సభ్యులు ప్రకటించారు.
ఇతర దేశాల్లో గూఢచర్యం కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వం మొసాద్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. మన దేశంలో ” రా ” అమెరికా సిఐఏ వంటిది. దేశీయంగా షిన్ బెట్ అనే గూఢచార సంస్థ ఉంది. ఇవి రెండూ కూడా హమస్ దాడిని పసిగట్టలేకపోయాయి.తాము విఫలం చెందినట్లు షిన్ బెట్ అధిపతి రొనెన్ బార్ అంగీకరించాడు. హమస్ దగ్గర ఇజ్రాయెల్ మిలిటరీ రహస్యాలు, వాటి మాప్‌లు ఉన్నట్లు, పది మంది గాజా సాయుధులకు కచ్చితమైన సమాచారం ఉండబట్టే వారు లోపలికి చొరబడినట్లు న్యూయార్క్‌టైమ్స్ పత్రిక రాసింది. డ్రోన్లతో నిఘా, సమాచార టవర్లను కూల్చివేశారని, బుల్డోజర్లు, ట్రాక్టర్లతో సరిహద్దులో ఉన్న పెద్ద కంచెను కూల్చివేసి ముందు రోజు రెండువందల మంది మరుసటి రోజు 1,800 మంది హమస్ సాయుధులు ఇజ్రాయెల్‌లో ప్రవేశించినట్లు అధికారులను ఉటంకిస్తూ పేర్కొన్నది.ఇంత జరుగుతున్నా ఎందుకు పసిగట్టలేకపోయారన్నదే ప్రశ్న. గాజా ప్రాంతలోని హమస్‌ను బాగా బలహీన పరిచినందున అక్కడి నుంచి దాడి జరిగే అవకాశం లేదని, లెబనాన్‌లోని హిజబుల్లా నుంచే ముప్పు ఉందనే అంచనాకు ఇజ్రాయెల్ గూఢచార సంస్థలు భావించిన కారణంగా అవి దృష్టి పెట్టలేదని, హమస్ శక్తి సామర్ధ్యాలను తక్కువ అంచనా వేసిందని కొందరి విశ్లేషణ. ఇజ్రాయెల్‌లో ఉన్న అంతర్గత కుమ్ములాటల కారణంగా తెలిసి కూడా మౌనంగా ఉన్నారన్నది మరొక కథనం.
