Tags
Gaza, HAMAS attacks 2003, Israel Attack 2023, Israel genocide, Joe Biden, Netanyahu, UNSC, UNSC Failures, veto power
ఎం కోటేశ్వరరావు
ప్రపంచంలో శాంతి, దేశాల భద్రత కాపాడేందుకు, మారణకాండలను నివారించేందుకు ఏర్పాటు చేసుకున్న ఐక్యరాజ్యసమితి వైఫల్యం మరోసారి వెల్లడైంది. ఇజ్రాయెల్ జరుపుతున్న మారణకాండ నివారణలో భాగంగా గాజాలో దాడులు నిలిపివేయాలని కోరే తీర్మానాలను భద్రతా మండలిలో అమెరికా అడ్డుకుంది. ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉందని, అందువలన అది చేస్తున్న దాడులు సమర్ధినీయమే అంటూ అమెరికా తెచ్చిన తీర్మానాన్ని చైనా, రష్యా వీటో చేశాయి. దాడులను నిరసిస్తూ మెజారిటీ ఆమోదించిన ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానం దేనికీ కొరగాకుండా పోయింది. 1948లో ఐరాస చరిత్రలో ఐరాస సాధించిన విజయం ఇది అని చెప్పుకొనేందుకు ఒక్కటంటే ఒక్కటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇదే సందర్భంలో శాంతి పరిరక్షక దళాల మాటున హైతీలో కలరా బాక్టీరియాను విస్తరింపచేసిన దుర్మార్గానికి అది పాల్పడటాన్ని చరిత్ర మరచిపోదు. ఉద్రిక్తతలు తలెత్తిన ప్రాంతాల్లో శాంతి పరిరక్షక దళాల ఏర్పాటును విజయంగా కొందరు వర్ణిస్తారు. అంతిమంగా సాధించింది ఏమిటన్నదే గీటురాయి. ఇప్పటి వరకు గడచిన ఏడున్నర దశాబ్దాలలో వివిధ ప్రాంతాలు, దేశాల్లో ఇరవైలక్షల మంది శాంతి దళాలను ఏర్పాడు చేశారు. వివిధ దేశాల్లో జరిగిన దాడులు, ప్రతిదాడుల ఉదంతాల్లో 4,200మందికి పైగా ఈ దళాల్లోని సైనికులు ప్రాణాలు కోల్పోయారు.ఇజ్రాయెల్-అరబ్ కాల్పుల విరమణ ఒప్పందాల అమలును పరిరక్షించేందుకు 1948లో భద్రతా మండలి అక్కడకి శాంతి పరిరక్షక దళాలను పంపాలని నిర్ణయించింది. అవి చేసిందేమీ లేకపోగా తరువాత యూదు దురహంకారులు ఇరుగు పొరుగుదేశాల మీద, పాలస్తీనా ప్రాంతాల మీద దాడులు చేసి వాటిని అక్రమించుకుంటూనే ఉన్నారు. సాధారణ జనాన్ని అణచివేస్తున్నా గుడ్లప్పగించి చూడటం తప్ప ఐరాస చేసిందేమీ లేదు.
ప్రచ్చన్న యుద్ధం వలన ప్రపంచంలో శాంతి కొరవడిందని అనేక మంది చెబుతారు, దానికి సోవియట్ యూనియనే అని కూడా నిందించేవారు లేకపోలేదు.దాన్ని 1990 దశకంలో విచ్చిన్నం చేశారు.అప్పటికి వివిధ ప్రాంతాల్లో పదకొండు వేల మంది శాంతిపరిరక్షణ దళాలు ఉన్నాయి. పదహారు చోట్ల 2014నాటికి లక్షా 30వేలకు పెరిగారు. దీనికి అమెరికా దాని మిత్రదేశాలే కారణం.ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్య ప్రాంతంలో పన్నెండు సమస్యాత్మక ప్రాంతాల్లో 87వేల మంది పని చేస్తున్నారు.ఘోరమైన వైఫల్యాలుగా చెప్పుకోవాల్సి వస్తే 1994లో ఆఫ్రికా దేశమైన ర్వాండాలో టుట్సీ-హుటు తెగల మధ్య తలెత్తిన హింసాకాండను నివారించటంలో చేతులెత్తేసింది. ఫలితంగా ఎనిమిది లక్షల మంది ప్రాణాలు పోయాయి.ఐరోపాలో 1995లో జరిగిన బోస్నియా దాడుల్లో ఎనిమిదివేల మంది ముస్లింలను చంపివేసినా చేసిందేమీ లేదు. 1950దశకంలో ఉత్తర కొరియా మీద జరిపిన దాడుల్లో పదిహేను లక్షల మందికి పైగా మరణించగా ప్రతిదాడుల్లో దాదాపు పది లక్షల మంది దక్షిణ కొరియన్లు చనిపోయారు. దీనికి ఐరాస చేసిన నిర్ణయమే కారణం. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చైనాకు బదులు కొద్ది మంది తిరుగుబాటుదార్లతో తైవాన్‌లో తిష్టవేసిన ప్రభుత్వానికి బదులు ప్రధాన భూభాగంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్నే గుర్తించాలని కోరుతూ సోవియట్ యూనియన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భద్రతా మండలి తిరస్కరించింది. దాంతో తాము 1950జనవరి 13నుంచి ఐరాసను బహిష్కరిస్తున్నట్లు సోవియట్ ప్రకటించింది. సరిగ్గా ఆ సమయంలో ఉత్తర కొరియా దురాక్రమణకు పాల్పడిందనే సాకుతో అమెరికా, దాని మిత్రదేశాలు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందటంతో ఉత్తర కొరియా మీద దాడి జరిగింది.దాంతో సోవియట్, చైనా రెండూ ఉత్తర కొరియా రక్షణకు రంగంలోకి దిగాయి.1953లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగుతోంది తప్ప సాంకేతికంగా యుద్ధ విరమణ జరగలేదు. ఉభయ కొరియాల విలీనానికి ఇంకా తగిన తరుణం రాలేదనే పేరుతో అమెరికా ఇతర దేశాలు అడ్డుపడుతున్నాయి. చైనాలో తైవాన్ ఒక రాష్ట్రం తప్ప దేశం కాదంటూ ఐరాస గుర్తించి అంతకు ముందు దానికి ఉన్న గుర్తింపును రద్దు చేసి కమ్యూనిస్టు చైనాను గుర్తించి నాలుగు దశాబ్దాలు దాటినా తైవాన్ విలీనం బలవంతంగా జరగకూడదు అంటూ దానికీ అడ్డుపడుతున్నారు. ఒక దేశంగా పరిగణించి ఆయుధాలు పెద్ద ఎత్తున అందచేస్తూ చైనా మీద తిరుగుబాటుకు మద్దతు ఇస్తున్నారు. ఇలా తాను చేసిన తీర్మానాలను అమలు జరిపేందుకు తరువాత తానే వెనక్కు తగ్గటం లేదా అసమర్ధంగా ఉండటం, ఇతర అనేక అంశాల పరిష్కారంలో ఐరాస విఫలమైంది. వర్తమాన అంశం పాలస్తీనాలో జరుగుతున్నది కూడా అదే.
ఆత్మరక్షణ పేరుతో గాజాలో సాధారణ పౌరుల మీద వైమానిక, టాంకులతో ఇజ్రాయెల్ సాగిస్తున్న హత్యాకాండ నివారణను అడఐర్డుకొనే వారే లేరా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రతి రోజూ పిల్లలు, మహిళలతో సహా వందలాది మందిని చంపివేయటాన్ని ఆపాలని భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా ఇప్పటికే వీటో చేసి మరోసారి తానేమిటో ప్రపంచానికి వెల్లడించింది. శనివారం ఉదయానికి అందిన సమాచారం మేరకు గాజాలో 3,826 మంది పిల్లలు, 2,405 మంది మహిళలతో సహా మొత్తం 9,227 మందిని ఇజ్రాయెల్ చంపింది. దీనికి పశ్చిమగట్టులో చేసిన హత్యలు అదనం. ఒక నిర్వాసిత శిబిరం, ఒక ఆసుపత్రి అని లేదు, జనం ఎక్కడ ఉంటే అక్కడ బాంబులు వేస్తూ మారణకాండ సాగిస్తున్నది. దానికి అమెరికా కూడా ప్రత్యక్షంగా పాల్గొని సాయం చేస్తున్నది. గాజా ప్రాంతం మీద దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ మిలిటరీకి అవసరమైన సమాచారం అందించేందుకు గాజా ప్రాంతం మీద మానవరహిత డ్రోన్లను అమెరికా ఎగురవేస్తున్నది. హమస్ వద్ద బందీలుగా ఉన్న వారి కోసమే అలా చేస్తున్నట్లు అమెరికా రక్షణశాఖ పెంటగన్ నిర్ధారించింది. మానవతా పూర్వక చర్యగా కాల్పులను విరమించాలన్న తీర్మానాన్ని వీటో చేసిన అమెరికా ఏ అధికారంతో ఈ పని చేస్తున్నది. దానికి భద్రతా మండలి తీర్మానం లేదా మరొకటి లేదు. ఇది అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదు. బందీలను విడుదల చేయించాల్సిన బాధ్యతను తీసుకోవాల్సింది ఐరాస. రోజూ వందల మందిని హతమారుస్తుంటే అది తీసుకున్న చర్యలేమీ లేవు. బందీల ప్రాణాలెంత విలువైనవో పాలస్తీనా అమాయక పౌరుల ప్రాణాలు కూడా అంతే విలువైనవి కాదా ! డ్రోన్లతో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తే పరిస్థితి మరింత విషమిస్తుంది తప్ప మెరుగుపడుతుందా ?
ఐరాస చేసిన తీర్మానం మేరకు ఏర్పడాల్సిన పాలస్తీనాను అడ్డుకోవటమే గడచిన ఏడున్నర దశాబ్దాలుగా అక్కడ సాగుతున్న అణచివేత-ప్రతిఘటనకు మూలం. దీనిపై భద్రతా మండలి ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు శాంతి నెలకొనేందుకు, ఇజ్రాయెల్‌ను ఖండిస్తూ, పాలస్తీనాకు మద్దతుగా ప్రవేశపెట్టిన 42 తీర్మానాలను పాఅమెరికా వీటో చేసింది. ఇప్పటి వరకు భద్రతా మండలి చరిత్రలో అమెరికా చేసిన మొత్తం వీటోలే 83 కాగా సగానికి పైగా ఇజ్రాయెల్‌ను కాపాడేందుకు ప్రయోగించిందంటే అమెరికా దుర్మార్గం ఎలాంటిదో అర్దం చేసుకోవచ్చు. యూదు దురహంకారులను సమర్ధిస్తూ ప్రవేశపెట్టిన మరో రెండింటిని రష్యా, చైనా అడ్డుకున్నాయి.లెబనాన్‌పై దాడి, సిరియా గోలన్ గుట్టలను ఆక్రమించుకోవటంతో సహా ఇజ్రాయెల్ ప్రమేయం ఉన్న మొత్తం 46 తీర్మానాలను అమెరికా అడ్డుకున్నది. దుర్మార్గం ఏమంటే జరూసలెం నగరాన్ని తటస్థంగా ఉంచుతూ ఐరాస చేసిన నిర్ణయాన్ని ఉల్లంఘించి ఆక్రమించుకొని తమ రాజధాని అని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. దాన్ని అమెరికా 2017లో గుర్తించింది.ఐరాస తీర్మానాలకు అనుగుణంగా దాని భవిష్యత్ నిర్ణయం జరగాలని భద్రతా మండలిలో 14దేశాలు ఓటు వేస్తే అమెరికా వీటో చేసింది.1991 నుంచి 2011 కాలంలో అమెరికా 24 వీటోలు చేయగా వాటిలో 15 ఇజ్రాయెల్‌కు కాపు కాసేందుకే. పాలస్తీనా ప్రాంతాల్లో మారణకాండకు పాల్పడుతున్నది ఇజ్రాయెల్ మిలిటరీ, ఉగ్రవాదులు అయినప్పటికీ వారిని వెనుక ఉండి నడిపిస్తున్నది అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు గనుక అక్కడ చిందే ప్రతి రక్తపు బొట్టుకూ బాధ్యతనుంచి తప్పించుకోలేవు.
గతం, వర్తమాన పరిణామాలను చూస్తున్నపుడు ఐరాసను ఒక ప్రజాస్వామిక సంస్థగా మార్చేందుకు సమగ్ర సంస్కరణలు అవసరమన్నది స్పష్టం.లక్ష మంది జనాభా ఉన్న కరీబియన్ ప్రాంత దేశమైన సెయింట్ విన్సెంట్, నూటనలభై కోట్ల జనాభా ఉన్న భారత, చైనాలు ఐరాస సాధారణ అసెంబ్లీలో ఒక్కో ఓటును మాత్రమే కలిగి ఉంటాయి. అది ప్రజాస్వామ్య బద్దమే అయినప్పటికీ అక్కడ చేసే తీర్మానాలకు ఎలాంటి విలువా ఉండదు. పదిహేను మంది ప్రతినిధులు ఉండే భద్రతా మండలిలో ఏదైనా ఒక తీర్మానాన్ని 14 మంది ఆమోదించినా ఐదు శాశ్వత సభ్య దేశాలలో ఏ ఒక్కటి కాదన్నా దానికీ అదే గతి పట్టటం పెద్ద లోపం. ఇజ్రాయెల్ దుర్మార్గం, క్యూబాపై అమెరికా అమలు జరుపుతున్న అష్టదిగ్బంధనాన్ని ఖండిస్తూ ప్రతి సంవత్సరం అత్యధిక మెజారిటీ దేశాలు తీర్మానాలు చేస్తున్నా జరుగుతున్నదేమీ లేదు. గాజాలో జరుపుతున్న దాడులను మానవతా పూర్వకంగా నిలిపివేయాలని సాధారణ అసెంబ్లీలో 121 దేశాలు అనుకూలంగా, 14 వ్యతిరేకంగా ఓటు చేయగా మనతో సహా 44 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన నాలుగు తీర్మానాలను అమెరికా వీటో చేసింది. ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ దాడులు చేసే హక్కుందని అమెరికా తెచ్చిన తీర్మానాన్ని రష్యా, చైనా అడ్డుకున్నాయి.
మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత ఏర్పడిన నానాజాతి సమితిలో భద్రతా మండలి మాదిరి వ్యవస్థలో ఉన్న 15 సభ్యదేశాలకూ వీటో హక్కు ఉండటంతో ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేక అది ఘోరంగా విఫలం కావటమే కాదు, రెండవ ప్రపంచ యుద్ధాన్ని కూడా అడ్డుకోలేకపోయింది.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత విజేతలుగా ఉన్న దేశాల ప్రమేయంతో ఏర్పడిందే ఐరాస. 1945లో అది ఉనికిలోకి వచ్చినపుడు అమెరికా, సోవియట్‌యూనియన్,చైనా, బ్రిటన్, ఫ్రాన్సులకు వీటో హక్కు కల్పించారు. తొలి రోజుల్లో ఐరాస సాధారణ అసెంబ్లీ, భద్రతా మండలిలో అమెరికా, పశ్చిమ దేశాల అనుకూలురే ఎక్కువ.దాంతో వారికి అనుకూలమైన తీర్మానాలను సోవియట్ అడ్డుకుంది. 2022 మే నెల వరకు సోవియట్ , తరువాత దాని వారసురాలిగా ఉన్న రష్యా 121సార్లు, అమెరికా 83, బ్రిటన్ 29, చైనా 17, ఫ్రాన్సు 16సార్లు వీటోను ప్రయోగించాయి. వీటో హక్కు ప్రజాస్వామ్య బద్దం కాదన్నది నిజమే అయినప్పటికీ అది లేకపోతే తొలి రోజుల్లో తమ కూటమికి ఉన్న బలంతో మొత్తం ప్రపంచాన్ని అమెరికా తనపెత్తనం కిందకు తెచ్చుకొని ఉండేది. ఇప్పుడు మెజారిటీ దేశాలు దాన్ని వ్యతిరేకిస్తున్నందున ప్రజాస్వామిక అభిప్రాయాన్ని అడ్డుకొనేందుకు వీటోను ఆయుధంగా చేసుకుంటోంది. అందుకే పైకి ఏమి చెప్పినప్పటికీ ఆచరణలో ఐరాస సంస్కరణలకూ అది ససేమిరా అంటున్నది.
