Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత రెడ్డి ఎన్నికలకు ముందు, ఫలితాల తరువాత ప్రకటించిన మేరకు వివిధ అంశాల మీద శ్వేత పత్రాలను ప్రకటిస్తూ జనాలకు వాస్తవాలను వెల్లడించే ఒక మంచి పని చేస్తున్నారు. మిగిలిన వాటి మీద కూడా వెంటనే ప్రకటిస్తారని ఆశిద్దాం. వీటికి పోటీగా స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని బిఆర్‌ఎస్‌ ప్రకటించింది. మథనం జరగటం మంచిదే. దేన్నయినా మూసిపెడితే పాచిపోతుందన్నది ఒక సామెత. అధికారానికి వచ్చిన కొత్తలో గతంలో కూడా కొన్ని ప్రభుత్వాలు శ్వేత పత్రాను విడుదల చేశాయి. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ రోజుల్లో సోషల్‌ మీడియాలో వస్తున్న సమాచారం గందరగోళాన్ని సృష్టిస్తున్నది.పైకి ఎన్ని సుభాషితాలను వల్లించినా మీడియా రాజకీయ శిబిరాల వారీ చీలి నాణానికి ఒకవైపు మాత్రమే చూపుతూ తాను మద్దతు ఇచ్చే పక్ష ప్రతికూల సమాచారాన్ని తొక్కిపెడుతున్నది. చాకుతో కూరగాయలతో పాటు మెడను కూడా కోయవచ్చు. శ్వేతపత్రాలు కూడా అలాంటివే. జనానికి వాస్తవాలు చెప్పే మంచితో పాటు ఆ సమాచారాన్ని చూపే పాలకులు వాగ్దాన భంగాలకూ పాల్పడవచ్చు. గత అనుభవాన్ని బట్టి దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు. ఎవరి మీదా భ్రమలు పెట్టుకోనవసరం లేదు.


తెలంగాణా ఆర్థిక స్థితి గురించి వెల్లడించిన పత్రంలోని వివరాలు, రాష్ట్ర సర్కారుకు ఎదురయ్యే సవాళ్ల గురించి చూద్దాం. గత పాలకులు చెప్పినదానికి భిన్నంగా ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో అప్పులు చేసింది..2014లో రాష్ట్ర విభజన సమయంలో ఉన్న అప్పు రు.72,658 కోట్లు. 2023 డిసెంబరు నాటికి అది రు.6,12,343 కోట్లకు పెరిగింది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న (ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి లోబడి) రుణం రు.3,89,673 కోట్లు.పదిహేడు నిర్దిష్ట అవసరాల కోసం( స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌) తీసుకున్న అప్పు రు.1,27,208 కోట్లు, ప్రభుత్వ హామీతో 14 సంస్థలు తీసుకున్న మొత్తం రు.95,462 కోట్లు ఉన్నాయి. ఇవిగాక జెన్‌కో, ట్రాన్స్‌కో, సింగరేణి వంటి వివిధ సంస్థలు స్వంతంగా తీసుకున్న రుణాల బకాయిలు రు.59,414 కోట్లు కూడా కలుపు కుంటే మొత్తం బకాయిలు రు.6,71,757 కోట్లని శ్వేత పత్రంలో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా లోకానికి చూపించిన కాళేశ్వరం పధకానికి రుణ మంజూరు రు.97,449 కోట్లు కాగా విడుదల చేసింది రు.79,287 కోట్లు, దీని అప్పు ఇంకా రు.74,590 కోట్లు ఉంది. ఈ రుణాలకు గాను చెల్లిస్తున్న అసలు, వడ్డీలు 2015లో మొత్తం రు.7,255 కోట్లు(బడ్జెట్‌ రాబడిలో 14శాతం) ఉంటే 2023లో రు.53,978 కోట్ల(బడ్జెట్‌లో 34శాతం)కు చేరాయి. ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల ప్రకారం రాష్ట్ర జిఎస్‌డిపిలో 25శాతం వరకు అప్పులు తీసుకోవచ్చు. ప్రస్తుతం 27.8శాతంగా ఉన్నాయి. ఇవిగాక ఇతరంగా తీసుకున్న అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే 36.9శాతానికి చేరాయి. దీంతో రాష్ట్ర రుణ అర్హత పరిమితి తగ్గింది.


బడ్జెట్‌ కేటాయింపులను పూర్తిగా ఖర్చు చేయటం లేదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో తేడా ఎక్కువగా ఉందని శ్వేత పత్రం పేర్కొన్నది.2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్‌ కేటాయింపుల్లో మొత్తంగా 87శాతం ఖర్చు చేశారు. తెలంగాణా ఏర్పడిన తరువాత అది 82.3శాతానికి దిగజారింది. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం 2021-22లో పద్దెనిమిది సాధారణ రాష్ట్రాలలో రాజస్థాన్‌ 116.4శాతంతో ప్రధమ స్థానంలో ఉండగా పదిహేడవదిగా ఉన్న తెలంగాణాలో 79.3శాతమే ఖర్చు చేశారు. చివరిదిగా 74.7శాతంతో పంజాబ్‌ ఉంది. కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, కార్మికులు, ఇతరులకు చెల్లించాల్సిన బిల్లుల మొత్తం రు.40,155 కోట్లు ఉంది. నిధులు లేనపుడు వేస్‌ అండ్‌ మీన్స్‌, ఓవర్‌ డ్రాప్టుల రూపంలో ఆర్‌బిఐ నుంచి రుణాలు తీసుకొనే సౌకర్యం ఉంది. అడ్డామీద కూలీకి ఏరోజు పని దొరికితేనే ఆ పూట భుక్తి. రాష్ట్ర స్థితి కూడా అలాంటిదే. ఈ కారణంగానే ప్రతి నెలా ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటవ తేదీనే చెల్లించలేని స్థితి. పిఆర్‌సి, కరువు భత్యం వాయిదాల పద్దతిలో చెల్లిస్తుండగా, సకాలంలో మంజూరు చేయకుండా సంవత్సరాల తరబడి నిలిపివేస్తున్నారు.(ప్రస్తుతం రేవంత రెడ్డి రైతు బంధును కూడా దశలవారీ విడుదల చేస్తున్న కారణం అదే.) .2015-16లో కేవలం రెండు సార్లు మాత్రమే మాత్రమే వేస్‌ అండ్‌ మీన్స్‌ సౌకర్యాన్ని వినియోగించుకోగా తరువాత సంవత్సరాల్లో క్రమంగా పెరిగింది. 2022-23లో ఏడాదిలో 328 రోజులు తీసుకున్నారు. వర్తమాన సంవత్సరంలో నవంబరు 23 నాటికి 214 రోజులు తీసుకున్నారు. రేవంత రెడ్డి సర్కార్‌కు సైతం మరో మార్గం లేదు.2014-15లో గరిష్టంగా 303 రోజులు నగదు నిల్వలు ఉండగా ప్రస్తుతం అవి 30 రోజులకు పడిపోయాయి.


నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణా ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నందున ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన జరిగింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడదీసి తెలంగాణాను ఏర్పాటు చేసినపుడు ఆస్తులు-అప్పుల విభజన 58-42 దాషామాతో జరిగింది. దీనికి జనాభా ప్రాతిపదిక. ఉమ్మడి రాష్ట్రంలో 1956-57లో వాస్తవ వ్యయం రు.79 కోట్లు కాగా తెలంగాణా వాటా రు.33 కోట్లు. రాష్ట్రం విడిపోయే నాటికి మొత్తం వ్యయం రు.11,94,945 కోట్లు కాగా తెలంగాణాలో ఖర్చు రు.4,98,053 కోట్లు అంటే 41.68శాతం ఉంది.( రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ, పరిశోధనా సంస్థలు వాటిలో పెట్టుబడులను కూడా కలుపు కుంటే తెలంగాణాలో అంతకంటే ఎక్కువ మొత్తమే ఖర్చు జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అనుబంధంగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో వచ్చిన ప్రైవేటు పరిశ్రమల పెట్టుబడులు వీటిలో లేవు. వీటి గురించి శ్వేత పత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదు)


ఇక విద్యుత్‌ రంగ పరిస్థితి మీద విడుదల చేసిన పత్రంలో ఉన్న వివరాల ప్రకారం పది సంవత్సరాల నాడు పంపిణీ కంపెనీలు(డిస్కామ్స్‌) రు.12,186 కోట్ల నష్టాలతో ఉండగా ప్రస్తుతం రు.62,461 కోట్లకు చేరాయి. ప్రభుత్వ బకాయిలే రు.43,770 కోట్లు ఉన్నాయి.విద్యుత్‌ క్రమబద్దీకరణ కమిషన్‌ ముందు ప్రతిపాదించి ఆమోదం పొందిన దానికన్నా వాస్తవిక వ్యయం పెరిగితే దాన్ని ట్రూ అప్‌ ఛార్జీలు అంటారు.తాత్కాలిక అవసరాల కోసం కొనుగోలు చేసిన విద్యుత్‌ యూనిట్‌ ధర రు.5.86 నుంచి గరిష్టంగా రు.20వరకు ఉంది.ఒక్క 2022-23లోనే ట్రూఅప్‌ ఛార్జీల మొత్తం రు.12,550 కోట్లు. ఇవిగాక క్రమబద్దీకరణ కమిషన్‌ ఆమోదం పొందిన సమయంలో విద్యుత్‌ తయారీకి వినియోగించే బొగ్గు, గ్యాస్‌ వంటి ఇంథన ధరల్లో పెరుగుదల ఎంత ఉంటే అంత సర్దుబాటు చార్జీల పేరుతో అదనంగా వసూలు చేయవచ్చు.ఇవి, ట్రూఅప్‌ ఛార్జీలను సబ్సిడీగా ప్రభుత్వం భరించాలి లేదా వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. ఇంత భారం జనాల నుంచి వసూలు చేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఎన్నికలను గమనంలో ఉంచుకొని వాటిని తామే చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది తప్ప ఇంతవరకు చెల్లించలేదు. ఇవన్నీ భారాల రూపంలో ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ మెడకు చుట్టుకున్నాయి.


బడ్జెట్‌ పత్రాల్లో ఈ వివరాలన్నీ పొందుపరుస్తున్నప్పటికీ వివిధ ఖాతాల్లో చూపుతారు. వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చటం సామాన్యులకు సాధ్యం కాదు గనుక వాటి జోలికి పోరు. అధికార యంత్రాంగం గారడీ చేస్తుంది. శ్వేత పత్రంలో వాటి సారాన్ని ఒక దగ్గరకు చేర్చుతారు గనుక సూటిగా అర్ధం అవుతాయి. ఈ పత్రాలపై చర్చ సందర్భంగా అసెంబ్లిలో, వెలుపలా అధికార పార్టీకి చెందిన వారు ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారిందని తమకు ముందు తెలియలేదని, అధికారికంగా సమీక్షల్లో చూసిన తరువాతనే తీవ్రత అర్ధమైందని మాట్లాడుతున్నారు. వీటిని చూస్తే గతం గుర్తుకు వస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి నేత వై.ఎస్‌ .జగన్మోహనరెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు జరుపుతామని వాగ్దానం చేసి ఓట్లు వేయించుకున్నారు. తరువాత అడ్డం తిరిగి దాని గురించి తెలియక మేము వాగ్దానం చేశాము, దాని బదులు కొత్త పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వ సలహాదారు, పార్టీ నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించి మడమ తిప్పారు.ఐదు సంవత్సరాల్లో మద్యనిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి దాని గురించి ఇప్పుడు అసలు మాట్లాడటమే మానుకున్నారు. ఎందుకంటే దాని మీద వచ్చే రాబడిని వదులుకోవటానికి ప్రభుత్వం సిద్దంగా లేదు. ఆర్థికంగా పరిస్థితి దిగజారి నవరత్నాలకు కోతపెట్టాల్సి వస్తుందన్నదే దీని వెనుక ఉన్న అసలు కారణం. తెలంగాణా రాష్ట్ర సమితి తాము అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పింది. తీరా అడ్డం తిరిగి కొనటానికి భూమి లేదని తప్పించుకున్నది.ఇలా ఎన్ని ఉదాహరణలనైనా చెప్పుకోవచ్చు.


రేవంత రెడ్డి సర్కార్‌ ముందు తీవ్ర సవాళ్లు ఉన్నాయి. గత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధులుకేటాయించి విద్యుత్‌ సంస్థలు, ఇతరులకు పెద్ద ఎత్తున బకాయి పెట్టింది. అప్పులు తెచ్చుకొనే అవకాశాలన్నింటినీ వాడుకొని కొత్తగా పుట్టకుండా చేసింది. వడ్డీ, అసలు వాయిదాలకే పరిమితంగా తీసుకొనే అప్పు సరిపోదు. రైతు బంధు పధకంలో పెద్ద రైతులకు మినహాయిస్తామని చెప్పినందున దాని వలన పెద్దగా మిగిలేదేమీ ఉండదు. ఎందుకంటే అర్హులకు గతం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పటంతో పాటు కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలకు నగదు అందిస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది.లబ్దిదారుల గుర్తింపు విధి విధానాలను ఇంకా ప్రకటించలేదు.లోక్‌సభ ఎన్నికలలోపు వాటిని విడుదల చేస్తే దాని ప్రభావం ఎన్నికల మీద పడుతుంది. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్‌ వస్తుందని చెబుతున్నారు గనుక అప్పటి వరకు శ్వేత పత్రాలు, వాటి మీద చర్చ, తక్షణమే నగదుతో పనిలేని పధకాలను ప్రారంభించవచ్చు. విద్యుత్‌ సంస్థలకు బకాయిలు పెట్టినందుకు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ అంత పెద్ద మొత్తాలను వెంటనే ఎలా తీరుస్తుందన్నది ప్రశ్న. ఉద్యోగులు వేతనాలు, పెన్షన్లు పెరిగేవే తప్ప తగ్గవు.వడ్డీల చెల్లింపు తప్పదు.ఈ కారణంగా ప్రకటించిన హామీలను తక్షణమే అమలు కాకుండా సాగదీసే అవకాశం ఉంది. తక్షణమే వాగ్దానాలను అమలు చేస్తామని చెప్పినందున సహజంగానే జనం కూడా అలాగే ఎదురు చూస్తారు.ఫిబ్రవరి లేదా మార్చినెలలో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ అనుమతి తప్ప పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే అవకాశం లేదు గనుక ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో వెంటనే జనానికి తెలిసే అవకాశం లేదు.