Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగా గవర్నర్లలో కాషాయ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తీరే వేరుగా ఉంది. అనితర సాధ్యమైన కొత్త చరిత్రను జనవరి 25 గురువారం నాడు సృష్టించారు. సరిగ్గా గణతంత్ర దినానికి ఒక రోజు ముందు రాజ్యాంగాన్ని, వ్యవస్థలను అపహాస్యం చేశారనే విమర్శలకు తావిచ్చారు. కేరళ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా సాంప్రదాయబద్దంగా గవర్నర్‌ చేయాల్సిన ప్రసంగాన్ని కేవలం 75 సెకండ్లలో ముగించి వెళ్లిపోయారు. 1982 జనవరి 29న నాటి గవర్నర్‌ జ్యోతి వెంకటాచలం కేవలం ఆరు నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించిన రికార్డును ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ బద్దలు కొట్టారు. స్పీకర్‌ ఎఎన్‌ షంషీర్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గవర్నర్‌కు వీడ్కోలు కూడా రెండు నిమిషాల్లో ముగిసింది.అసెంబ్లీకి వచ్చిన గవర్నర్‌కు సిఎం పుష్పగుచ్చం అందచేసి స్వాగతం పలికినపుడు ముఖం పక్కకు పెట్టుకొని దాన్ని అందుకున్నారు. తరువాత ప్రసంగం ప్రారంభానికి ముందు సభ్యులను ఉద్దేశించి సంబోధించే మర్యాదను కూడా పాటించకుండా 62పేజీలు, 136 పేరాల ప్రసంగంలో చివరి పేరాను చదివి ముగించినట్లు మళయాల మనోరమ పేర్కొన్నది. నా ప్రభుత్వం అనే పదాలను ఉచ్చరించకుండా దాటవేసేందుకు ఇలా చేసినట్లు పేర్కొన్నది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్లు చేసే ప్రసంగాలను ఆయా ప్రభుత్వాల విధాన పత్రాలుగా పరిగణిస్తారన్నది తెలిసిందే. వాటిలో సాధించిన వాటితో పాటు రానున్న రోజుల్లో కేంద్రీకరించే అంశాలను కూడా వెల్లడిస్తారు. మంత్రివర్గం పంపిన ప్రసంగ పాఠం మీద ఎలాంటి అభ్యంతరాలు వెల్లడించకుండా వెంటనే ఆమోదం తెలపటం అనేక మందికి ఆశ్చర్యం కలిగించింది. వివాదాలకు తెరదించేందుకు సానుకూల సూచికగా ఇలా చేశారేమో అనుకున్నారు. అయితే ప్రసంగించిన తీరును ఎవరూ ఊహించలేదు.


ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్‌ 9.02కి ప్రసంగం ముగించి 9.04కల్లా అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. సభను ఉద్దేశించి ప్రసంగించటం తనకు సంతోషంగా ఉందనే ముక్కతో ప్రారంభించి చివరి పేరాను చదువుతున్నట్లు ప్రకటించి వెంటనే ముగించి వెళ్లిపోయారు.వెలుపల వేచి ఉన్న మీడియాకు ఒక నమస్కారం చేసి కారెక్కారు. అసెంబ్లీకి రావటం, ప్రసంగం చదవటం, జాతీయ గీతాలాపాన, వెళ్లిపోవటం అంతా నాలుగు ఐదు నిమిషాల్లోపే పూర్తయింది. గవర్నర్‌ చదివిన చివరి పేరాలో ఇలా ఉంది.” మన గొప్ప వారసత్వం భవనాలు లేదా కీర్తి స్థంభాలలో కాదు, విలువకట్టలేని భారత రాజ్యాంగం, కాలంతో నిమిత్తం లేని ప్రజాస్వామ్య విలువలు,లౌకికవాదం, సమాఖ్యవాదం,సామాజిక న్యాయం పట్ల మనం చూపే గౌరవం, మర్యాదలలో ఉంది. సహకార సమాఖ్యవాద సారమే ఇంతకాలం భారత్‌ను ఐక్యంగా, బలంగా ఉంచింది.దీన్ని దిగజారకుండా చూడటమే మన మహత్తర కర్తవ్యం. సుందరమైన, భిన్నత్వం కలిగిన దేశంలో భాగస్వాములుగా మనం కలసి కట్టుగా సమగ్ర అభివృద్ధి, సమున్నతంగా ముందుకు తీసుకుపోయే విధంగా దేశ చిత్రాన్ని రూపొందించాల్సి ఉంది. మన దారిలో ఎదురయ్యే అన్ని సవాళ్లను అధిగమించాలి ” ఈ పేరాలో ఎక్కడా నా ప్రభుత్వం అనే పదం లేదు. అందుకే గవర్నర్‌ ఈ మాత్రమైనా చదివి ఉంటారన్నది స్పష్టం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం. సమాఖ్యవాదం పట్ల గౌరవ, మర్యాదలను చూపాలని చెప్పిన గవర్నర్‌ వ్యవహరించిన తీరు అందుకు అనుగుణంగా ఉందా లేదా అన్నది ఎవరికి వారు నిర్ధారణకు రావచ్చు. క్లుప్తంగా ముగించటం ద్వారా గవర్నర్‌ తన అసంతృప్తిని వెల్లడించారని రాష్ట్ర బిజెపి వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను తీవ్రంగా అవమానించినట్లు ఆరోపించింది. గవర్నర్‌ చర్యతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లు వర్ణించింది.


గవర్నర్‌ వ్యవహరించిన తీరు రాష్ట్రాన్ని అవమానించటమే అని ప్రతిపక్ష యుడిఎఫ్‌ నేత వి సతీశన్‌ విమర్శించారు. ప్రతిపక్ష ఉపనాయకుడు, ముస్లింలీగ్‌ నేత కున్హాలికుట్టి మాట్లాడుతూ తాము గవర్నర్‌ రావటాన్ని రాకెట్‌ మాదిరి వెళ్లిపోవటాన్ని చూసి ఆశ్చర్యపోయామని, కనీసం ప్రతిపక్ష సభ్యులవైపు కూడా చూడలేదని, ఇది అసెంబ్లీని అవమానించటమే అన్నారు. గవర్నర్‌ చర్యను పట్టించుకోవద్దని, నిరసనల వంటివి తెలపవద్దని అసెంబ్లీ ముగిసిన తరువాత ఎల్‌డిఎఫ్‌ ఎంఎల్‌ఏల సమావేశంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. సమావేశం తరువాత రాష్ట్ర న్యాయ, పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్‌ మాట్లాడుతూ గవర్నర్‌ ” రాజ్యాంగబద్ద విధి ” నిర్వహించారని చెప్పారు. మంత్రివర్గం రూపొందించిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్‌ ఆమోదించారు. మొదటి చివరి పేరాలను చదివినప్పటికీ మొత్తం చదివినట్లే పరిగణించబడుతుంది, అసెంబ్లీ రికార్డుల్లో అదే నమోదౌతుంది. గవర్నర్‌ పూర్తి పాఠాన్ని ఎందుకు చదవలేదో తెలియదు, చదవలేకపోయారా ఇంకేమైనా కారణాలున్నదీ తెలియదని రాజీవ్‌ చెప్పారు. గవర్నర్‌ ఇలా ముగించారంటే బహుశా ఆయనకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందేమోనని రాష్ట్ర మంత్రి సాజీ చెరియన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర గవర్నర్‌గా ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వివాదంతో మీడియాకు ఎక్కుతూనే ఉన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసిన భాగాన్ని అసెంబ్లీలో చదివేందుకు తిరస్కరించి వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవల విద్యార్థులను తూలనాడి వారి నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొన్నారు. బహుశా ఆ ఉక్రోషాన్ని ఈ రూపంలో తీర్చుకొని ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి తన మీద దాడికి ఎస్‌ఎఫ్‌ఐ గూండాలను, డబ్బిచ్చి నేరగాండ్లను ఉసిగొల్పినట్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ తీరుకు నిరసనగా ఎక్కడ పర్యటనకు వెళితే అక్కడ విద్యార్ధులు నిరసన తెలుపుతున్నారు. గవర్నరు ప్రసంగాన్ని అసెంబ్లీ మీడియాకు విడుదల చేసింది. రాష్ట్ర ప్రధాన ఆదాయవనరుగా లాటరీలు, మద్యం వుండటం సిగ్గుగా ఉందని గతంలో గవర్నర్‌ ఆరోపించారు. గురువారం నాటి గవర్నర్‌ ప్రసంగంలో దాని గురించి వివరణ ఉంది. రాష్ట్ర పన్ను రాబడిలో మద్యం ద్వారా వస్తున్న మొత్తం కేవలం 3.7శాతమేనని, కొన్ని రాష్ట్రాలలో గరిష్టంగా 22శాతం వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. ధాన్య రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా క్వింటాలుకు రు.2,820 కనీస మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపింది.


గవర్నర్‌గా ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ స్వతంత్రంగా వ్యవహరించటం లేదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్‌ నారిమన్‌ చేసిన వ్యాఖ్య మీద గవర్నర్‌ విరుచుకుపడ్డారు. డిసెంబరు నెలలో ముంబైలో జరిగిన ఒక సభలో రోహింటన్‌ మాట్లాడుతూ గవర్నర్లుగా స్వతంత్రంగా వ్యవహరించే వారిని మాత్రమే పదవుల్లో నియమించాలని సుప్రీం కోర్టు చెప్పే రోజుకోసం తాను వేచి చూస్తున్నట్లు చెప్పారు.” ఈ రోజు మనకు కనిపిస్తున్నటు వంటి వారిని నియమించకూడదు,ఉదాహరణకు ఈ రోజు కేరళలో ఉన్నటువంటి వారిని ” అన్నారు. బుధవారం నాడు చెన్నరులో జరిగిన ఒక సభలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతూ రోహింటన్‌ స్వలాభంతోనే అలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.రోహింటన్‌ తండ్రి సీనియర్‌ న్యాయవాది పాలీ ఎస్‌ నారిమన్‌, ఆయన సహాయకులు కేవలం సలహా చెప్పినందుకే కేరళ ప్రభుత్వం నుంచి రు.40లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల గవర్నర్ల మీద ఎలాంటి వ్యాఖ్య చేయకుండా తననే ఎంచుకోవటానికి తండ్రి నుంచి సలహాలు తీసుకోవటాన్ని అంగీకరించకపోవటమే అని చెప్పుకున్నారు.