Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


మరోసారి రైతులు ఢిల్లీబాట పట్టారు.వారిని ఎట్టి పరిస్థితిలోనూ నగరంలో ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు బిజెపి సర్కార్‌ పూనుకుంది. అనేక చోట్ల రైతుల మీద బాష్పవాయువు, లాఠీ ఛార్జీ జరిపారు, అడుగడుగునా హర్యానా బిజెపి ప్రభుత్వం ఆటంకాలు కల్పించింది. ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే మార్గాలలో కూడా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఆందోళనకు సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎన్‌పి-రాజకీయ రహిత) పిలుపు నిచ్చింది. గతంలో ఏడాది పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) నుంచి విడిపోయిన వారు, గత ఆందోళనకు దూరంగా ఉన్న కొని సంఘాలు తాజా ఆందోళనకు పిలుపునిచ్చాయి. గతంలో రైతులు ఢిల్లీలో ప్రవేశించి తమ డిమాండ్ల మీద నిరసన తెలుపకుండా అడ్డుకొనేందుకు రోడ్ల మీద మేకులు, కాంక్రీటు దిమ్మలను ఏర్పాటు చేసిన నరేంద్రమోడీ సర్కార్‌ తీరు తెలిసిందే.ఇప్పుడు ఢిల్లీలో ఉన్న బవనా స్టేడియంను బందెల దొడ్డిగా మార్చి రైతులను అందులో నిర్బంధించేందుకు అవకాశమివ్వాలని మంగళవారం నాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. రైతుల ఆందోళన వలన రోడ్లు, రైలు ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగుతాయి గనుక రైతుల మీద చర్యలు తీసుకొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ అరవింద్‌ సేత్‌ అనే లాయరు పంజాబ్‌-హర్యానా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు..రైతులు న్యూసెన్సు చేస్తున్నారని ఆరోపిస్తూ వారు బలవంతంగా నగరంలోకి అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను కోరింది. ఇలాంటి వారు అదే రైతులకు కనీస మద్దతు ధరల కోసం వేసిన కమిటీ నివేదికను వెంటనే ఇప్పించి రైతులు ఆందోళనకు దిగకుండా చూడాలని కేంద్రం మీద ఎలాంటి వాజ్యాలు ఇంతవరకు దాఖలు చేయలేదు.నోరులేని రైతులను అడ్డుకొనేందుకు పూనుకున్నారు. రైతులు వినకుండా దురుసుగా ముందుకు వస్తే పోలీసులు చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదని, మనం కూడా అదే పద్దతిలో ఉండాలని లేకపోతే వారిని అపలేమని ఢిల్లీ శాంతి భద్రతల స్పెషల్‌ పోలీసు కమిషనర్‌ రవీంద్ర యాదవ్‌ ఢిల్లీ శివార్లలోని శింఘు సరిహద్దులో పోలీసులతో మైకులద్వారా ప్రకటించారు.మనం ఆత్మరక్షణలో పడనవసరం లేదు, బాష్పవాయువు వదలండి, లాఠీలను ప్రయోగించండి, ఇది ఒక రోజంతా జరగవచ్చు అని కూడా చెప్పారని మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఇచ్చిన వార్తలో పేర్కొన్నది. ఎవరైనా అలసిపోతే వారి స్థానంలో వేరొక బృందం వస్తుందని, ఎట్టి పరిస్థితిలోనూ రైతులను నగరంలోకి అనుమతించవద్దని కూడా చెప్పినట్లు తెలిపింది.


రైౖతుల డిమాండ్లు న్యాయబద్దమైనవని అందువలన స్టేడియంను జైలుగా మార్చాలన్న కేంద్ర కోరికను తాము అంగీకరించేది లేదని ఢిల్లీ ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం తిరస్కరించింది. రైతులతో చర్చించి పరిష్కరించాలని కోరింది. శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్దమైన హక్కు ప్రతి పౌరుడికీ ఉన్నదని అందువలన రైతులను అరెస్టు చేయటం సరైంది కాదని ఢిల్లీ హౌం మంత్రి కైలాష్‌ గెహలట్‌ చెప్పారు. ఢిల్లీ పోలీసు యంత్రాంగం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. తమ డిమాండ్ల మీద నిరసన తెలిపేందుకు మంగళవారం నాడు ఢిల్లీ వస్తున్న రైతులను అనేక చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. పంజాబ్‌ నుంచి వస్తున్న వారి మీద హర్యానా బిజెపి ప్రభుత్వ పోలీసులు లాఠీ చార్జి చేశారు. రైతులు అన్నదాతలు, వారి పట్ల ఈ విధంగా ప్రవర్తించటం పుండు మీద కారం చల్లినట్లే, స్టేడియంను జైలుగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగస్వాములం కాలేమని కైలాష్‌ గెహలట్‌ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.2021లో రైతుల ఆందోళన సందర్భంగా కూడా అదే స్టేడియంను జైలుగా మార్చాలని కోరిన నాటి కేంద్ర ప్రభుత్వ కోరికను అప్పుడు కూడా ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ తిరస్కరించింది.


ఇటీవలనే ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన సూచించిన పద్దతిలో రైతాంగానికి కనీస మద్దతు ధరలు ప్రకటించేందుకు, వాటికి చట్టబద్దత కల్పించేందుకు మొరాయిస్తున్నది.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం మినహా రైతులు ఏమైనా కోరుకోవచ్చని ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళన సందర్భంగా బిజెపి నేతలు చెప్పారు. విధిలేని పరిస్థితిలో ప్రధాని నరేంద్రమోడీ దేశానికి క్షమాపణలు చెప్పి మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించారు, కనీస మద్దతు ధరల గురించి సిఫార్సు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ మేరకు ఆరునెలల తరువాత 2022 జూలై 18న 26 మందితో కమిటీని ప్రకటించారు.దానిలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు, మూడు సాగు చట్టాలను రూపొందించిన పెద్దలే ఉన్నందున తామా కమిటీని బహిష్కరిస్తున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ప్రకటించింది. తరువాత ఆ కమిటీ ఏం చేస్తున్నదో, ఏం చెబుతుందో తెలియదు.
తమ ప్రభుత్వ హయాంలో 2014-15లో ఏ గ్రేడ్‌ వరి మద్దతు ధర రు.1,400 నుంచి 2023-24లో రు.2,203కు అంటే రు 803 పెంచినట్లు మోడీ సర్కార్‌ చెప్పుకున్నది.సగటున వార్షిక పెంపుదల 5.7శాతం. అంతకు ముందు కాంగ్రెస్‌ ఏలుబడిలో 2004-05 రు.590 నుంచి రు.1,400కు పెరిగింది. రు.810 పెరిగింది. దీన్ని సగటు వార్షిక పెరుగుదలలో చూస్తే 14శాతం ఉంది. పొడవు పింజ పత్తి ధర రు.1,760 నుంచి కాంగ్రెస్‌ ఏలుబడిలో రు.4,050 పెరిగింది. నిఖర పెరుగుదల రు.2,290 వార్షిక సగటు 13శాతం, అదే నరేంద్రమోడీ కాలంలో రు.4050 నుంచి రు.7,020కి పెంచారు.నిఖర పెరుగుదల రు.2,970 కాగా వార్షిక సగటు 7.3శాతమే. దీని అర్ధం కాంగ్రెస్‌ రైతులను ఏదో ఉద్దరించిందని చెప్పటం కాదు, పెరిగిన సాగు ఖర్చులతో పోలిస్తే అది కూడా తక్కువే. దానితో పోలిస్తే మంచి రోజులను తెచ్చి అమృత కాలంగా మార్చి రైతుల రాబడి రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ పాలనలో మరింత దిగజారింది అని చెప్పేందుకే ఈ పోలిక.ఎంఎస్‌ స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి వార్షిక ద్రవ్యోల్బణ ప్రాతిపదికన నామమాత్రంగా పెంచుతున్నారు తప్ప సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదు.


కేంద్రం ఏర్పాటు చేసిన ఆ కమిటీ పరిధి ఏమిటి ? ఏ అంశాలను అది పరిశీలిస్తుందో వివరించాలని రైతు ఉద్యమం నడిపిన సంయుక్త కిసాన్‌ మోర్చా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదు. అందువలన ఆ కమిటీలో ఉండి చేసేదేమీ లేదు గనుక ప్రతినిధుల పేర్లను ప్రతిపాదించటం లేదని స్పష్టం చేసింది. ఈ కమిటీ చైర్మన్‌ ఎవరంటే రైతులు తిరస్కరించిన మూడు సాగు చట్టాలను రచించిన వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి సంజయ అగర్వాల్‌. ఆ చట్టాలను ఎలా రూపొందించాలో సలహా ఇచ్చిన రమేష్‌ చాంద్‌ నీతిఅయోగ్‌ సభ్యులు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించకూడదని చెప్పిన ఆర్థికవేత్తలను నిపుణుల పేరుతో చేర్చారు. ప్రభుత్వ ప్రతినిధులు సరేసరి, వీరుగాక రైతుల ఆందోళనను వ్యతిరేకించిన ఐదు సంఘపరివార్‌ సంఘాలకు చెందిన వారిని చేర్చారు. ఆందోళనకు నాయకత్వం వహించిన వారిని మూడు పేర్లు ఇవ్వాలని కోరారు. మూడు సాగు చట్టాలను అమలు జరపకుండా 2022 నాటికి రైతుల రాబడిని రెట్టింపు చేయటం కుదరదని నీతిఅయోగ్‌ సభ్యులు రమేష్‌ చాంద్‌ రైతుల ఆందోళన సమయంలో చెప్పారు.ఇటీవలి కాలంలో ఎక్కడా దాని గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడటం లేదు.


తాజాగా ఢిల్లీ చలో ఆందోళనకు పిలుపు ఇచ్చి ఎస్‌కెఎం(ఎన్‌పి), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ముందుకు తెచ్చిన డిమాండ్లు పాతవే.ఎవరు పిలుపునిచ్చినా సమర్ధించాల్సినవే.పంజాబ్‌ నుంచి వస్తున్న రైతులు ఢిల్లీ చేరకుండా హర్యానా పోలీసులు పంజాబ్‌ సరిహద్దులోని పాటియాలా సమీపంలోని షాంభు వద్ద అడ్డుకున్నారు. రైతుల మీద బాష్పవాయు ప్రయోగం చేశారు. కనౌరీ వద్ద లాఠీ ఛార్జి చేశారు.అనేక చోట్ల రోడ్ల మీద పోలీసులు కల్పించిన ఆటంకాలను పక్కకు తొలగించి రైతులు ముందుకు వస్తున్నారని వార్తలు. చర్చలు జరపాలి తప్ప ఢిల్లీ వెళ్ల వద్దని హర్యానా హౌంమంత్రి అనిల్‌ విజి రైతులకు సలహా ఇచ్చారు.రెండుసార్లు కేంద్ర మంత్రులు ఇక్కడకు వచ్చారు. రైతులు వారితో మాట్లాడలేదంటే దీని వెనుక ఏదో దురుద్దేశ్యం ఉందని ఆరోపిస్తూ రాష్ట్రంలోకి రానిచ్చేది లేదని అన్నారు. కనీస మద్దతు ధరలకు అనేక మందితో చర్చలు జరపాల్సి ఉందని, రైతులు కూడా మాట్లాడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా చెప్పారు. మంగళవారం నాడు ఢిల్లీకి దారితీసే అనేక మార్గాలలో రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది.నగరంలో అనేక మెట్రో స్టేషన్లను మూసివేశారు.