Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


కేంద్రా ప్రభుత్వం తాజాగా క్వింటాలు చెరకు ధరను రు.25 పెంచింది. దీంతో 2024-25 సీజన్‌కు రు.340కి చేరిందని, రైతులకిచ్చిన ఈ బ హుమతితో పండగ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మన దేశంలో సీజన్‌ అంటే ఆర్థిక సంవత్సరానికి చెప్పే నిర్వచనం వేరు, పంటలకు వేరు. ఏప్రిల్‌ నుంచి మార్చి నెలవరకు ఆర్థిక సంవత్సరం. అదే పత్తి, చెరకు సంవత్సరాలు అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు లెక్కిస్తారు.దీని ప్రకారం 2024-25 సీజన్‌ అంటే ఈ ఏడాది అక్టోబరు నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు. కనుక ప్రకటించిన పెంపుదల వర్తమాన సంవత్సరానికి కాదు. ఈ ఏడాది ధరను సీజనుకు ముందుగా గతేడాది జూన్‌లోనే ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల తరువాత జూన్‌లో చేయాల్సిన ప్రకటనను రైతుల ఓట్ల కోసం నాలుగు నెలల ముందే ప్రకటించారు. అందుకే నిజంగా రైతులు దీంతో సంతోషిస్తారా ? పంజాబ్‌ రైతులు చలో ఢిల్లీ పేరుతో రావటాన్ని పంజాబ్‌-హర్యానా సరిహద్దులో బిజెపి ప్రభుత్వం అడ్డుకుంది. ఫిబ్రవరి 13 నుంచి ఢిల్లీకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో వారు రెండు చోట్ల తిష్టవేశారు.వివిధ రూపాల్లో ఆందోళనకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. పోలీసుల దాష్టీకానికి ఒక రైతు మృతి చెందాడు. త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిపతిికేషన్‌ వెలువడనున్న పూర్వరంగంలో నాటకీయ పద్దతిలో కేంద్ర మంత్రివర్గం ఫిబ్రవరి 21 సమావేశం, దానిలో చెరకు ధర పెంపు నిర్ణయాన్ని నరేంద్రమోడీ వెల్లడించారు.


న్యాయమైన మరియు గిట్టుబాటు ధర(ఎంఆర్‌పి) పేరుతో చేస్తున్న జిమ్మిక్కుతో రైతులకు ఒరిగేదేమిటి ? షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా క్వింటాలుకు 10.25శాతం పంచదార దిగుబడి వస్తేనే ఈ ధర దక్కుతుంది. ప్రస్తుత సీజన్‌లో 2023-24కు రు.315గా 2023జూన్‌లో కేంద్రం ప్రకటించింది. వచ్చే ఏడాది నిర్ణీత ప్రామాణిక శాతానికి మించి ఎక్కడైనా పంచదార దిగుబడి పెరిగితే 0.1శాతానికి రు.3.32 అదనంగా చెల్లిస్తారు. అదే మాదిరి తగ్గితే తగ్గుతుంది. తమ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత 2014-15 నుంచి ఈ మాదిరి పెరుగుదల లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పుకున్నది నిజమే. పదేండ్ల వివరాలను చూసినపుడు చెరకు ధరను రు.220 నుంచి రు.315కు పెంచారు. అంటే పదేండ్లలో పెరిగింది కేవలం రు.95 మాత్రమే. ఏడాదికి సగటు పెంపు రు.9.50 మాత్రమే. అలాంటిది ఏకంగా రు.25 పెంచారంటే ఎన్నికల కోసమే అంటే తప్పేముంది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ రైతాంగంలో పలుకుబడి కలిగిన ఆర్‌ఎల్‌డి పార్టీ బిజెపితో చేతులు కలిపింది, చెరకు పండేది కూడా అక్కడే ఎక్కువ, ఆర్‌ఎల్‌డి మద్దతుదార్లు ఈ రాజకీయ అవకాశవాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు వార్తలు వచ్చిన పూర్వరంగంలో వారిని మచ్చిక చేసుకొనేందుకు మోడీ పూనుకున్నారు. దానిలో భాగంగా చెరకు ధర పెంపుతో పాటు మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌కు భారత రత్న ప్రకటన వెనుక కూడా చెరకు రైతుల మద్దతు కోసమే అన్నది స్పష్టం. గతంలో సాగిన రైతు ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న జాట్‌ రైతాంగాన్ని ఈ సారి ఆందోళనకు దూరంగా ఉంచాలన్న ఎత్తుగడ కూడా ఉంది. మహారాష్ట్రలో బిజెపిని వ్యతిరేకిస్తున్న శరద్‌ పవార్‌ నాయకత్వంలోని పార్టీకి చెరకు రైతులే ప్రధాన మద్దతుదార్లు, వారిని ఆకర్షించటం కూడా దీని వెనుక ఉంది. గడచిన పదేండ్లలో నాలుగు సంవత్సరాలు అసలు పెంచలేదు. ఒకేడాది ఐదు, మూడు సార్లు పది వంతున, ఒకసారి 15, మరొకసారి రు.20 పెంచారు.2019 ఎన్నికలకు ముందు రు.20పెంచారు. అదీ ఎన్నికల కోసమే అనివేరే చెప్పనవసరం లేదాు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోడీ హామీలో భాగమే తాజా పెంపుదల అని ప్రచారం చేస్తున్నారు. ఆ లెక్కన ధర రు.440కి పెరగాలి. అందుకే జుమ్లా అని రైతులు వర్ణిస్తున్నారు. యుపిఏ హయాంలో 2009-10లో ఉన్న ధర రు.129 నుంచి 2013-14 నాటికి రు.210కి అంటే ఐదు సంవత్సరాల్లో రు.81 పెరిగింది. పదేండ్ల మోడీ ప్రభుత్వం పెంచింది కేవలం రు.95 మాత్రమే. ఏ ఎలిమెంటరీ విద్యార్ధిని అడిగినా మోడీ ఏలుబడిలో తక్కువే అని చెబుతారు.


దేశంలో చెరకు ధరకు రెండు పద్ధతులను అనుసరిస్తున్నారు.ఒకటి కేంద్రం ప్రకటించే ఎఫ్‌ఆర్‌పి కాగా రెండవది కొన్ని రాష్ట్రాలు ప్రకటిస్తున్న రాష్ట్ర సలహా ధర(ఎస్‌ఏపి) సహజంగా కేంద్రం కంటే ఎక్కువగా ఉంటుంది.ఉదాహరణకు పంజాబ్‌లో రు.391, ఉత్తర ప్రదేశ్‌లో రు.370 ఉంది. అందువలన కేంద్ర ప్రకటించిన ధరతో ఎవరికి ప్రయోజనం?ప్రస్తుతం ఉన్న రు.315 ధర పంచదార దిగుబడి 9.5శాతం అన్న అంచనాతో నిర్ణయించారు. అందువలన దిగుబడి పెరిగితేనే రైతుకు ఉపయోగం లేకపోతే నష్టమే.దిగుబడి రైతు చేతిలో ఉండదు. ప్రైవేటు రంగంలో ఉన్న ఏ ఒక్క పంచదార ఫ్యాక్టరీ దిగుబడి గురించి వాస్తవ సమాచారాన్ని వెల్లడించదు. అందువలన దిగుబడితో నిమిత్తం లేకుండా ధర చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రమైనా, రాష్ట్రాలు ప్రకటించే ధరలైనా వాస్తవ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదని, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో సాగు ఖర్చు టన్నుకు రు.440 అవుతుందని రైతులు చెబుతున్నారు. అందుక పెంపుదలను ముష్టి విదిల్చినట్లుగా భావిస్తున్నారు. మిల్లు యజమానులు పంచదార, తదితర ఉత్పత్తులను అమ్మిన తరువాతే రైతులకు డబ్బు చెల్లిస్తున్నారు. అంటే రైతుల పెట్టుబడితో మిల్లులు నడుస్తున్నాయి.ఒక టన్ను చెరకు నుంచి వంద కిలోల పంచదార, నలభై కిలోల మొలాసిస్‌ వస్తుంది.దీన్నుంచి పది లీటర్ల మేర ఇథనాల్‌ వస్తుంది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్రం లేదా రాష్ట్రాలు చెరకు ధర పెంచటం లేదు. గడచిన మూడు సంవత్సరాల్లో చెరకు ధర 5.7శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు 19 శాతం కరవు భత్యం పెంచిందని రైతులు గుర్తు చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో సమాజవాదీ పార్టీ పాలన 2012 నుంచి 2017వరకు 26శాతం చెరకు ధర పెంచితే నరేంద్రమోడీ అచ్చేదిన్‌, యోగి బుల్డోజర్‌ పాలన ఏడు సంవత్సరాల్లో పెంచింది 17.46శాతమే.


స్వామినాధాన్‌కు భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఆయన సూచించిన పద్దతి ప్రకారం మద్దతు ధరలను నిర్ణయించేందుకు మొరాయిస్తున్నది. ఉదాహరణకు చెరకు సంగతే చూద్దాం. 2023లో కేంద్రం ప్రకటించిన ఎఫ్‌ఆర్‌పి రు.315(దానికి తాజాగా వచ్చే ఏడాదికి మరో 25 పెంచింది), వివిధ రాష్ట్రాలలో ప్రకటించిన సలహాధరలు, స్వామినాధన్‌ పద్దతిలో ఉండాల్సిన ధర, ఒక క్వింటాలకు (రు.315 ఎఫ్‌ఆర్‌పి ప్రకారం) రైతులు నష్టపోతున్న మొత్తాల గురించి ఆలిండియా కిసాన్‌ సభ రూపొందించిన వివరాలు దిగువ విధంగా ఉన్నాయి.
రాష్ట్రం×××××× రాష్ట్ర ధర×××× స్వామినాధన్‌××××రైతుల నష్టం

ఆంధ్రప్రదేశ్‌ ×× 357 ×××× 535.50 ×××× 220.50

బీహార్‌ ×× 241 ×××× 361.50 ×××× 46.50

గుజరాత్‌ ×× 289 ×××× 433.50 ×××× 118.50

హర్యానా ×× 327 ×××× 490.50 ×××× 175.50

కర్ణాటక ×× 258 ×××× 387.00 ×××× 72.00

మహరాష్ట్ర ×× 214 ×××× 321.00 ×××× 6

పంజాబ్‌్‌ ×× 298 ×××× 447.00 ×××× 132

తమిళనాడు ×× 299 ×××× 448.50 ×××× 133.50

తెలంగాణా ×× 332 ×××× 498.00 ×××× 183

ఉత్తరప్రదేశ్‌ ×× 310 ×××× 465.00 ×××× 150

ఆలిండియా ×× 292 ×××× 438.75 ×××× 123.50

ఈ పూర్వరంగంలో క్వింటాలకు రు.500 ధర నిర్ణయించాలని అఖిలభారత కిసాన్‌ సభ డిమాండ్‌ చేసింది. సహకార, ప్రభుత్వ రంగంలో ఉన్న పంచదార మిల్లులను జాతీయం చేయరాదని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కూడా కోరింది. వర్తమాన సంవత్సరంలో రు.315 అంటే దిగుబడిలో 10.25 శాతం దాటిన తరువాత పెరిగే ప్రతి 0.1శాతానికి అదనంగా రు.3.07 చెల్లిస్తారు, తగ్గితే ఆ మేరకు కోత పెడతారు. సగటు దిగుబడి 9.5శాతమే ఉన్నందున క్వింటాలు ధర రు.315గా చెప్పినా రైతుకు దక్కేది రు.292 మాత్రమే. చెరకు ఉత్పత్తి ఖర్చుకు వందశాతానికి మించి గిట్టుబాటు ధర చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం నమ్మబలుకుతోంది.అసలు కిటుకు అక్కడే ఉంది. క్వింటాలుకు సాగు ఖర్చును కేవలం రు.157 మాత్రమే 2023-24 సంవత్సరానికి లెక్కగట్టి రు. 315 ప్రకటించామంటే రెట్టింపే కదా అని చెబుతున్నారు. రైతులు మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ? ప్రభుత్వం చెబుతున్నది వ్యవసాయ పంటల ధరల నిర్ణాయక సంస్థ సూచించిన మొత్తం. అది వాస్తవ సాగు ఖర్చును పరిగణనలోకి తీసుకోవటం లేదని ప్రారంభం నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అందుకే స్వామినాధన్‌ కమిషన్‌ పద్దతి ప్రకారం సాగు ఖర్చును, మద్దతు ధరలను నిర్ణయించాలని, వాటికి చట్టబద్దత కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో ఏడాది పాటు చేసిన ఉద్యమం, తాజాగా జరుగుతున్న ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారు కూడా కోరుతున్నది అదే.