Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


గోధుమ రైతులకు కనీస మద్దతు ధరకంటే అదనంగా చెల్లిస్తామని వాగ్దానం చేసిన బిజెపి నామమాత్రంగా పెంచి చేతులు దులుపుకుంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గోధుమ రైతులకు క్వింటాలుకు రు.2,700 చొప్పున చెల్లిస్తామని బిజెపి వాగ్దానం చేసింది. మధ్య ప్రదేశ్‌లో బిజెపి వరికి రు.3,100 చెల్లిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. గోధుమ కనీస మద్దతు ధర రు.2,275 కాగా తమను ఎన్నుకుంటే బోనస్‌ రూపంలో ఇచ్చేదానితో పాటు రు.2,700 చెల్లిస్తామని నమ్మబలికింది. తాజాగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రు.125 మాత్రమే పెంచి రు.2,400 ఇస్తామని ప్రకటించాయి.బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం నాణ్యతను బట్టి క్వింటాలు గోధుమల ధర రు.2,700 నుంచి 3,000 ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ధరలు పడిపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో ఇది చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది.రెండు రాష్ట్రాల బిజెపి ప్రభుత్వాలు క్వింటాలుకు రు.125 బోనస్‌ ప్రకటించటంతో అక్కడ నిరసన, ఆ మాత్రమైనా ఉత్తర ప్రదేశ్‌, హర్యానాలో ఉన్న ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పెంచవు అనే వత్తిడి తలెత్తే అవకాశం ఉంది.

రైతులను మోసగించటంలో బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు నిమగమైతే అసలు రాజధాని ఢిల్లీకే రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని ఫిబ్రవరి 13నుంచి వేలాది మంది రైతులను పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో నిలవేసింది.గతంలో ఏడాది పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) మార్చి 14వ తేదీ ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో తలపెట్టిన కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌కు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్న కేంద్రం వత్తిడికి తట్టుకోలేక చివరకు ఒక రోజు ముందుగా అనుమతి ఇచ్చింది. రైతుల ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు అక్కడ సంకల్ప పత్ర పేరుతో తీర్మానం చేయనున్నారు.లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగనుండటంలో భవిష్యత్‌ కార్యాచరణను కూడా ఇక్కడ ప్రకటిస్తారు. సంయుక్త కిసాన్‌ మోర్చా నుంచి విడిపోయిన కొందరు, గత ఆందోళనకు దూరంగా ఉన్నవారు కలసి ఎస్‌కెఎం(ఎన్‌పి)గా ఏర్పడి ఢిల్లీ చలోకు పిలుపు ఇచ్చారు. వారిని అడ్డుకొనేందుకు అసాధారణ రీతిలో పోలీసులు రాజధానికి వచ్చే రోడ్ల మీద కందకాలు తవ్వటం, మేకులు కొట్టి, పెద్ద పెద్ద సిమెంట్‌ బ్లాకులు, మట్టి, రాళ్లతో నింపిన కంటెయినర్లను రోడ్ల మీద అడ్డంగా పెట్టిన అంశం తెలిసిందే. రామ్‌లీలా మైదానంలో జరిగే మహాపంచాయత్‌కు కేంద్ర కార్మిక సంఘాలు, రంగాల వారీగా పనిచేస్తున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయి.యువజన, విద్యార్ధి,మహిళా సంఘాలు కూడా భాగస్వాములు కానున్నాయి.


ఫిబ్రవరి 22వ తేదీన ఈ సభ గురించి ఎస్‌కెఎం ప్రకటించినప్పటికీ అనుమతి గురించి ఎటూ తేల్చకుండా చివరి నిముషంలో అనుమతి ఇచ్చినప్పటికీ పంజాబ్‌ నుంచి వందలాది బస్సులు, ట్రక్కులు, రైళ్లలో బయలుదేరి 50వేల మంది వస్తున్నట్లు ఆ రాష్ట్రనేతలు చెప్పారు. తమతో పాటు రొట్టెలు చేసుకొనేందుకు పిండి, కూరగాయలు, స్టౌవ్‌లు, గ్యాస్‌ సిలిండర్లు కూడా తెచ్చుకుంటున్నారని, రాజధానిలోని గురుద్వారాలలో రైతులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సమీప హర్యానా, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌,ఉత్తరాఖండ్‌ నుంచి కూడా రైతులు తరలివస్తున్నట్లు ఎస్‌కెఎం నేతలు చెప్పారు.హర్యానాలోని బిజెపి ప్రభుత్వం పంజాబ్‌ నుంచి రైతులు రాకుండా ప్రధాన రహదార్లపై అనేక ఆటంకాలను కల్పించినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలలో వస్తున్నారు. రైతు కుటుంబాల నుంచి మహిళలు కూడా గణనీయంగా వస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.


కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయటం, ఆహార భద్రత కోసం ప్రభుత్వ ధాన్య సేకరణ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్దం. అయితే ఈ అంశంపై గత రెండు దశాబ్దాలుగా ఒక ఒప్పందం జరగని కారణంగా వాటిని కొనసాగిస్తున్నారు. అబూదాబీ సమావేశాల్లో కూడా ధనిక దేశాలు ఈ అంశం మీద పట్టుపట్టాయి. వాటిని సంతుష్టీకరించేందుకు కరోనా కాలంలో రైతులు రోడ్ల మీదకు రారనే అంచనాతో నరేంద్రమోడీ మూడు సాగు చట్టాలను తెచ్చారు. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా సాగు మీద వస్తున్న రైతుల ఆదాయాలు పడిపోతున్నట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. అనేక మంది రైతులు కూలీపని చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. వ్యవసాయ అనుబంధ, పాడి, కోళ్ల పెంపకం వంటి ఇతర వనరుల ద్వారా వస్తున్న రాబడి పెరుగుతున్నది. అందుకే సాగే ప్రధానంగా ఉన్న పంజాబ్‌, హర్యానా, ఇతర ఉత్తరాది ప్రాంతాల రైతులు కనీస మద్దతు ధరలను తమ ప్రాణవాయువుగా చూస్తున్నారు. వాటిని తీసివేస్తే ప్రాణాలు పోతాయని భయపడుతున్నారు గనుకనే, ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా ఆందోళనలకు సిద్దం అవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తాము అధికారానికి వస్తే గోధుమలు, ధాన్య ధరలను కనీస మద్దతు ధరలకంటే పెంచుతామని బిజెపి చెబుతున్నపుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అదే పని ఎందుకు చేయటం లేదు ? దేశంలోని ఇతర ప్రాంతాల రైతుల నుంచి వ్యతిరేకత పెద్ద ఎత్తున రాకపోవటాన్ని అవకాశంగా తీసుకొని రద్దు చేసిన మూడు సాగు చట్టాలను తిరిగి తీసుకురావాలని కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడే వారు ఇప్పుడు వాదిస్తున్నారు. సాగు చట్టాల రద్దు సందర్భంగా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ కూడా వాటి వలన రైతులకు మేలు జరుగుతుందని, వెనక్కు తీసుకోవటం సరైంది కాదని చెప్పింది. అందువల్లనే ఆ కత్తి ఇప్పటికీ రైతాంగం మెడమీద వేలాడుతూనే ఉంది. నరేంద్రమోడీ మరోసారి అధికారానికి వస్తే రద్దుచేసిన వాటిని తిరిగి ప్రవేశపెట్టబోరనే గ్యారంటీ లేదు. మీడియాలో లోక్‌సభ ఎన్నికలను గమనంలో ఉంచుకొని మోడీ గ్యారంటీలంటూ చెబుతున్నవాటిలో కనీస మద్దతు ధర అంశం లేదని వేరే చెప్పనవసరం లేదు.