Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ మారణకాండ బుధవారం నాటికి 215వ రోజుకు చేరుకుంది. కాల్పుల విరమణ ఒప్పందం గురించి చర్చలు సాగుతున్నాయి.తమకు అంగీకారమే అని హమస్‌ చెప్పింది.ఎటూ తేల్చకపోగా రఫా నగరం మీద సైనిక చర్యకు ముందుకు పోవాలని ఇజ్రాయెల్‌ యుద్ధ మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది.మరొకవైపు చర్చలకు తమ ప్రతినిధులను పంపుతామని చెబుతూనే సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారే వరకు వైమానిక దాడులు జరుపుతూ రాఫా-ఈజిప్డు సరిహద్దు ద్వారం దగ్గర పాలస్తీనా వైపు ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ చర్యను చర్చల మధ్యవర్తి కతార్‌ ఖండించింది. దాడులు కొనసాగుతున్నాయి. గాజాలోని పౌరులకు ఐరాస అందిస్తున్న సహాయాన్ని కూడా అడ్డుకుంటున్నాయి.దాడుల్లో అనేక మంది మరణించారు. మధ్యవర్తులు ముందుకు తెచ్చిన ప్రతిపాదనలను హమస్‌ ఆమోదించినప్పటికీ తమకు అంగీకారం కాదని, తమ డిమాండ్లకు చాలా దూరంగా ఉందని నెతన్యాహు కార్యాలయం చెప్పింది. మంగళవారం నాటికి గాజాలో 34,789 మందిని ఇజ్రాయెల్‌ చంపివేసినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గాయపడిన వారు 78,204 మంది. రాఫాను ఖాళీ చేయాలని పౌరులను ఇజ్రాయెల్‌ ఆదేశించింది. ఇతర దేశాలకు ప్రత్యేకించి పక్కనే ఉన్న ఈజిప్టుకు వెళ్లకుండా దిగ్బంధనం గావించింది.ఇది రాసిన సమయానికి ఏం జరగనుందో తెలియని స్థితి.జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఒకటి స్పష్టం.ఏదో ఒక ఒప్పందం చేసుకొని హమస్‌ వద్ద బందీలుగా ఉన్న వారిని విడిపించాలని నెతన్యాహు మీద రోజు రోజుకూ వత్తిడి పెరుగుతోంది.మరోవైపు హమస్‌ను తుడిచిపెట్టకుండా వెనుదిరిగితే మీ సంగతి చూస్తామనే దురహంకారులు.మారణకాండకు మద్దతు ఇవ్వటాన్ని ఏమాత్రం సహించం అంటున్న విద్యార్థులపై జో బైడెన్‌ సర్కార్‌ కాల్పులకూ పాల్పడింది. గాజా దక్షిణ ప్రాంతంలోని రాఫా నగరం మీద దాడులకు దిగితే అక్కడ ఉన్న పిల్లలు పెద్ద సంఖ్యలో మరణించే అవకాశం ఉన్నందున హమస్‌ ఒక అడుగు వెనక్కు తగ్గేందుకు నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మారణకాండను కొనసాగించకపోతే నెతన్యాహు, ముందుకు పోతే ఎన్నికల్లో జో బైడెన్‌ పతనం ఖాయంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. మారణకాండను అంతర్జాతీయ న్యాయ స్థానం కూడా అడ్డుకోలేకపోయింది. తన ఆదేశాన్ని ధిక్కరించిన ఇజ్రాయెల్‌ను ఏమీ చేయలేని అశక్తురాలిగా మారింది.పాలస్తీనా పౌరులకు సంఘీభావం తెలుపుతున్న విద్యార్థులు యూదు వ్యతిరేకులంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిందించి మరింతగా రెచ్చగొట్టారు.


మంగళవారం తెల్లవారు ఝామున ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో అనేక మంది మరణించినట్లు వార్తలు. వైమానిక దళం జరిపినదాడుల్లో అనేక భవనాలు నేలమట్టం కాగా అనేక మంది శిధిలాల్లో చిక్కుకు పోయారు. ఎందరు గాయపడింది, మరణించిందీ ఇంకా స్పష్టం కాలేదు. తమ ఆసుపత్రికి పదకొండు మృతదేహాలు వచ్చినట్లు రాఫాలోని కువాయిట్‌ ఆసుపత్రి వెల్లడించింది. హమస్‌ వద్ద ఉన్న తమ బందీలను విడిపించే వరకు దాడులు కొనసాగిస్తూనే ఉంటామని మరోవైపు చర్చలకు తమ ప్రతినిధి బృందాన్ని పంపుతామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇరవైలక్షల మందికి పైగా పాలస్తీనియన్లు గాజాలో వున్నారు. వారి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఇజ్రాయెల్‌ మిలిటరీ తరలిస్తున్నది.ఈ క్రమంలో 64చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న రాఫా నగరం, పరిసరాల్లో లక్షల మంది తలదాచుకుంటున్నారు. హమస్‌ సాయుధులు జనంలో కలసిపోయినందున వారిని పట్టుకోవాలంటే పెద్ద ఎత్తున దాడులు చేయకతప్పదని ఇజ్రాయెల్‌ చెబుతున్నది. అసలు ఆ సాకుతోనే ఏడు నెలలుగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.రాఫా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించటం ఏ మాత్రం సహించరాదని ఐరాస ప్రధాన కార్యదర్శి చెప్పారు. ఈ దాడులను వ్యతిరేకిస్తున్నట్లు అమెరికా కబుర్లు చెబుతున్నది. బందీల విడుదలకు తాత్కాలిక కాల్పుల విరమణ అని ఇజ్రాయెల్‌ చెబుతుండగా పూర్తిగా గాజా నుంచి వైదొలగాని హమస్‌ పట్టుబట్టటంతో ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న చర్చలు నిలిచిపోయాయి. సంప్రదింపుల ప్రక్రియ వెంటిలేటర్‌ మీద ఉంది, అందుకే ఒక మధ్యవర్తిగా ఉన్న కతార్‌తో చర్చలు జరిపేందుకు సిఐఏ డైరెక్టర్‌ బిల్‌ బరన్స్‌ వెళ్లినట్లు ఇజ్రాయెల్‌ మీడియా పేర్కొన్నది. మూడు దశల్లో ఒప్పందం అమలు జరుగుతుందని, తన వద్ద బందీలుగా ఉన్న 132 మందిలో 33 మందిని 42 రోజుల వ్యవధిలో విడుదలు చేస్తుందని దీనికి ఇరు పక్షాలూ అంగీకరించినప్పటికీ తదుపరి రెండు దశల గురించి వివాదం ఏర్పడిందని తొలుత వార్తలు వచ్చాయి. కొత్త ప్రతిపాదనలను అంగీకరిస్తున్నట్లు సోమవారం హమస్‌ ప్రతినిధి ఈజిప్టు, కతార్‌ మంత్రులకు ఫోన్‌ ద్వారా తెలిపినట్లు వార్తలు. ఇజ్రాయెల్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోగా రాఫా ప్రాంతం నుంచి పాలస్తీనియన్లు వెళ్లిపోవాలని విమానాల నుంచి వెదజల్లిన కరపత్రాల్లో ఆదేశించటమేగాక, రాత్రి నుంచి దాడులను కూడా ప్రారంభించింది. ఒప్పందం కుదిరినా కుదరకున్నా దాడులు చేసి తీరుతామని నెతన్యాహు చెబుతున్నాడు.


కైరో చర్చలు సఫలమౌతాయని, తక్షణ, శాశ్వత కాల్పుల విరణమకు దారితీస్తాయని కతార్‌ విదేశాంగశాఖ ప్రతినిధి మహమ్మద్‌ అల్‌ అన్సారీ చెప్పారు.వ్యవధి కోసం హమస్‌ నాటకమాడుతున్నదని, దాడులను నిలిపివేసేందుకు, చర్చల వైఫల్య నెపం తమపై నెట్టేందుకు చూస్తున్నదని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తున్నది.రాఫా ఇప్పుడు బాలల నగరంగా మారిందని, దాడులు జరిగితే పెద్ద ఎత్తున ప్రాణనష్టం ఉంటుందని యూనిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసిందని, రక్షణ కోసం పిల్లలు ఎక్కడకు వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్నారని సంస్థ డైరెక్టర్‌ కాథరీన్‌ రసెల్‌ చెప్పారు. ఇప్పటికే అక్కడి పిల్లలు భౌతికంగా, మానసికంగా ఎంతో బలహీనపడ్డారని, పిల్లలతో పాటు మొత్తం జనాన్ని రక్షించాల్సి ఉందన్నారు. ఇజ్రాయెల్‌ దాడులకు ముందు నగరం, పరిసరాల జనాభా రెండున్నరలక్షలు కాగా ప్రస్తుతం అక్కడ పన్నెండు లక్షల మంది తలదాచుకుంటున్నారని, వారిలో దాదాపు ఆరులక్షల మంది పిల్లలే ఉంటారని చెబుతున్నారు.హమస్‌ ఒక మెట్టు దిగిరావటానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. దాడుల ప్రభావం పెద్దల మీద కంటే పిల్లల మీద ఎక్కువగా ఉంటుందని యూనిసెఫ్‌ హెచ్చరించింది. రాఫా మీద దాడి అంటే ఏదో విహారయాత్ర అని భావిస్తే పొరపాటు తమ వారిని రక్షించేందుకు పూర్తి సన్నద్దంగా ఉన్నామని హమస్‌ ప్రకటించింది. దాడులకు పాల్పడవద్దని సౌదీ అరేబియా విదేశాంగశాఖ ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది.


తమ నేత జో బైడెన్‌కు గాజా మరో వియత్నాంగా మారుతున్నదని, అయితే డోనాల్డ్‌ ట్రంప్‌ను వెనక్కు కొట్టేందుకు తాను బైడెన్‌కు మద్దతు ఇస్తున్నట్లు డెమోక్రటిక్‌ సోషలిస్టు నేత బెర్నీ శాండర్స్‌ ప్రకటించాడు.గాజాలో మారణకాండను ఖండిస్తూ అమెరికా విద్యార్ళులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగటంతో ఎన్నికలలో పోటీ చేస్తున్న అధ్యక్షుడు జో బైడెన్‌ ఇరకాటంలో పడ్డాడు. ఉద్యమాన్ని అణచివేసేందుకు పూనుకోవటంతో పాటు ప్రపంచాన్ని నమ్మించేందుకు ఇజ్రాయెల్‌ మీద వత్తిడి తెస్తున్నట్లు నాటకం ప్రారంభించాడు.రాఫాపై దాడులను వ్యతిరేకిస్తున్నట్లు బైడెన్‌ స్పష్టం చేసినట్లు జాతీయ భద్రతా మీడియా సలహాదారు జాన్‌ కిర్బీ చెప్పాడు. అర్ధగంటపాటు నెతన్యాహు-జో బైడెన్‌ ప్రైవేటుగా నిర్మాణాత్మకంగా మాట్లాడుకున్నారని అన్నాడు. నెతన్యాహుతో మాట్లాడిన తరువాత జో బైడెన్‌ వైట్‌హౌస్‌లో జోర్డాన్‌ రాజు రెండవ అబ్దుల్లాకు అనధికారిక మధ్యాహ్న విందు ఏర్పాటు చేశాడు. ఇజ్రాయెల్‌ గనుక రాఫాపై దాడులకు దిగితే పెద్ద ఎత్తున మారణకాండ జరిగే అవకాశముందని అబ్దుల్లా హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఏడు నెలల దాడుల తరువాత గాజాలో తీవ్రమైన కరవు పరిస్థితి ఏర్పడిందని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమ అధిపతి సిండీ మెకెయిన్‌ చెప్పాడు.తన మీద ప్రపంచ నేతలెవరూ ఏమాత్రం వత్తిడి తేలేరని, ఏ అంతర్జాతీయ సంస్థా ఇజ్రాయెల్‌ తనను తాను కాపాడుకోవటాన్ని అడ్డుకోజాలదని నెతన్యాహు ఆదివారం నాడు చెప్పాడు.


కొలంబియా విశ్వవిద్యాలయాన్ని అదుపులోకి తీసుకున్న న్యూయార్క్‌ పోలీసుల్లో ఒకడు విద్యార్థుల మీద కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. వారి వెనుక బయటి శక్తుల హస్తం ఉందనే సాకుతో ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నది.దీనికి కార్పొరేట్‌ మీడియా మరింతగా ఆజ్యం పోస్తున్నది.ప్రభుత్వ యంత్రాంగం ఎంతగా రెచ్చగొడుతుంటే అంత ఎక్కువగా విద్యార్థులు ఆందోళనలకు దిగుతున్నారు. గుడారాలను పీకివేస్తే వెంటనే కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు. దొంగే దొంగని అరచినట్లుగా విద్యార్థుల నిరసనలను తప్పుదారి పట్టించేందుకు ఇజ్రాయెల్‌ అనుకూలురను రెచ్చగొట్టి పోటీ ప్రదర్శనలను చేయించటం, ఆ ముసుగులో పౌరదుస్తుల్లో ఉన్న పోలీసులు, బయటివారిని రప్పిస్తున్నట్లు అనేక చోట్ల స్పష్టమైంది.వారు విద్యా ప్రాంగణాల్లో ప్రవేశించి దాడులు చేస్తున్నారు. యూదు వ్యతిరేక నినాదాలు చేస్తూ విద్యార్ధుల ఆందోళనను తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. ఇలాంటి వారి చర్యలను చూపి మీడియా దాడులకు దిగుతున్నది. మీడియాకు జరుగుతున్నదేమిటో తెలిసినప్పటికీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది కనుక దాని ప్రాపకం కోసం కట్టుకథలు రాస్తున్నది పిట్టకతలు చెబుతున్నది. పార్లమెంటు సభ్యుల కమిటీల పేరుతో విద్యా సంస్థల చాన్సలర్లు, అధ్యక్షులు, ఇతర అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి ఆందోళనను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలేమిటని అడ్డదిడ్డంగా ప్రశ్నిస్తున్నారు. గట్టిగా వ్యవహరించకపోతే రాజీనామా చేసి ఇంటికి పోండని వత్తిడి తెస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేయకపోతే తాము ఇచ్చిన విరాళాలను స్థంభింప చేస్తామని బెదిరించేందుకు దాతలను రంగంలోకి దించారు. నిజానికి వీరంతా బయటివారు తప్ప ఆందోళన చేస్తున్న వారు లేదా వారికి మద్దతు ఇస్తున్నవారు కాదు. ఇలాంటి వారిని చూసి ఆందోళనలకు దూరంగా ఉన్నవారు తొలి రోజుల్లో పొరపాటు పడిన అనేక మంది ఇప్పుడు తోటి విద్యార్థులతో చేతులు కలుపుతున్నారు. మహిమగల దుస్తులు వేసుకున్నానంటూ దిగంబరంగా వీధుల్లోకి వచ్చిన రాజును చూసి నిజం చెబితే రాజుగారి దెబ్బలకు గురికావాల్సి వస్తుందని ప్రతి వారూ రాజుగారి దుస్తులు బహుబాగున్నాయని పొగుడుతుంటే భయమంటే ఏమిటో తెలియని ఒక పిల్లవాడు రాజుగారి గురించి నిజం చెప్పినట్లుగా విద్యార్థులు ఆందోళన ద్వారా అనేక మంది కళ్లు తెరిపిస్తున్నారు. దిగంబర అమెరికా పాలకుల నైజాన్ని బయటపెడుతున్నారు.ఉన్మాద పులిని ఎక్కిన ఇజ్రాయెల్‌ నెతన్యాహు ఇప్పుడు వెనక్కు తగ్గితే రాజకీయంగా పతనమే, గాజాలో మారణకాండ ఇంకా కొనసాగితే దాన్ని నిస్సిగ్గుగా బలపరిస్తే ఎన్నికల్లో జో బైడెన్‌కు ఓటమి తప్పదంటున్నారు.