Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


గతేడాది అక్టోబరు ఏడు నుంచి పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్‌ గత ఏడు రోజులుగా ఉగ్రవాదులను ఏరివేసే పేరుతో వెస్ట్‌ బాంక్‌ ప్రాంతమంతటా దాడులు చేస్తోంది.అనేక మంది ప్రాణాలు తీసింది. విచక్షణా రహితంగా అరెస్టులు చేస్తోంది.అక్కడేమీ హమస్‌ పార్టీ లేదా దాని మద్దతుదారులెవరూ లేరు.ఒక వైపు గాజాలో పసిపిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెబుతూనే మరోవైపు మిలిటరీదాడులు చేస్తోంది.గాజాలోని ఒక సొరంగంలో శనివారం నాడు ఆరుగురు బందీల మృతదేహాలు దొరకటంతో ఇజ్రాయెల్‌ పౌరులు దేశమంతటా లక్షలాది మంది నిరసన ప్రదర్శనలు జరపటంతో పాటు సాధారణ సమ్మె పాటించారు. ప్రధాని నెతన్యాహు దీనికి బాధ్యత వహించాలని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.తాము బందీల వద్దకు వెళ్లటానికి కొద్దిసేపటి ముందే హమస్‌ వారిని చంపిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది.ఇజ్రాయెల్‌ దాడుల్లోనే వారు మరణించారని హమస్‌ చెబుతోంది.సోమవారం నాటికి ఇజ్రాయెల్‌ దాడులలో గాజాలో 40,786 మంది మరణించగా 94,224 మంది గాయపడ్డారు. మరణాలతో పాటు గాజాలో ఇప్పటి వరకు 60శాతం నివాస గృహాలు, 80శాతం వాణిజ్య సముదాయాలు,65శాతం సాగు భూమి, 65శాతం రోడ్లు పనికి రాకుండా చేశారు.ఆసుపత్రులు 36 ఉండగా వాటిలో 17మాత్రమే పాక్షికంగా పని చేస్తున్నాయి. అదే మాదిరి 85శాతం పాఠశాల భవనాలను నేలమట్టం చేశారు. హమస్‌ సాయుధులు వీటిని కేంద్రాలుగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.గాజాలోని ఒక పాఠశాలలో నిర్వహిస్తున్న హమస్‌ కమాండ్‌ కేంద్రాన్ని తమ వైమానిక దళం నాశనం చేసిందని ఇజ్రాయెల్‌ చెప్పుకుంది. పాలస్తీనాలో జోర్డాన్‌ నది పశ్చిమంగా ఉన్న ప్రాంతానే ్న వెస్ట్‌బాంక్‌ లేదా పశ్చిమ గట్టు అంటున్నారు. అది 5,650చదరపు కిలోమీటర్లలో ఉంది.జనాభా 30లక్షలు.దానికి ఒకవైపు జోర్డాన్‌, మరోవైపు ఇజ్రాయెల్‌,మూడోవైపు మృత సముద్రం(డెడ్‌ సీ) ఉంది.గాజాకు వెళ్లాలంటే ఇజ్రాయెల్‌ ప్రాంతాల నుంచే దారి ఉంది.అది పూర్తిగా పాలస్తీనాకు చెందినప్పటికీ అనేక ప్రాంతాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించింది.దాంతో 8లక్షల 71వేల మంది పాలస్తీనియన్లు తమ స్వంతగడ్డమీదే శరణార్ధులుగా శిబిరాలలో ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్‌ వాటి మీద కూడా దాడులు చేస్తున్నది.తక్షణమే హమస్‌తో రాజీకి వచ్చి వారి వద్ద ఉన్న వందకు పైగా ఉన్న బందీలను విడిపించాలని కోరుతున్నట్లు అనేక సర్వేలు వెల్లడిరచినప్పటికీ నెతన్యాహు ఖాతరు చేయటం లేదు.మరోవైపు ఇటీవల ఇరాన్‌ జరిపిన క్షిపణుల దాడి తరువాత సామాన్య జనంలో భయాందోళనలు పెరుగుతున్నాయి.ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ పేరుతో సెకనుకు ఒకటి చొప్పున 100 క్షిపణులను ప్రయోగించి ఉక్కిరిబిక్కిరి చేసింది.దీన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ ఊహించలేదు.మా తడాఖా ఇది అని ఇరాన్‌ ప్రదర్శించిన తరువాత దాడి నిలిపివేసింది. అందువలన ఎప్పుడేం జరుగుతుందో తెలియటం లేదు.


గాజాతో పాటు వెస్ట్‌బాంక్‌ ప్రాంతం మీద కూడా జరుపుతున్న దాడులను చూస్తే పశ్చిమాసియాలో మరో ప్రాంతీయ యుద్ధానికి రెచ్చగొడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా అమెరికా కనుసన్నల్లోనే అని వేరే చెప్పనవసరం లేదు.అయితే ఈ దాడులతో ఇజ్రాయెల్‌ మరింతగా సంక్షోభంలో కూరుకుపోతున్నదని చెప్పవచ్చు.పాలస్తీనియన్ల రెండవ తిరుగుబాటు 2000 నుంచి 2005వరకు జరిగింది. ఆ సందర్భంగా ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో మూడువేల మందికిపైగా మరణించారు. తరువాత మరోసారి ఇప్పుడు తెగబడుతోంది.ఇరాన్‌ మద్దతు ఉన్న ఉగ్రవాదులను అణచే సాకుతో ఇప్పుడు దాడులకు దిగుతోంది.ఈ పరిణామాన్ని గాజా 2.0గా వర్ణిస్తున్నారు. గాజా మారణకాండ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వెస్ట్‌బాంక్‌లో అడపాదడపా జరుపుతున్న దాడుల్లో 150 మంది పిల్లలతో సహా 650 మంది మరణించారు.ఇప్పటి వరకు 10,300 దాడులు జరిగాయి, ఆ ప్రాంతంలోని యూదు ఆక్రమణదార్లకు వేలాది ఆయుధాలను అందించి అరబ్బులపై దాడులకు రెచ్చగొడుతున్నది. గతవారం రోజులుగా అనేక పట్టణాల్లో ఉన్న నిర్వాసితుల శిబిరాలపై మిలిటరీ దాడులు చేస్తున్నది. ఓస్లో ఒప్పందాల ప్రకారం వెస్ట్‌ బాంక్‌లో పాలస్తీనా ఫతా ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ అది చేసేదేమీ లేదు. అడుగడుగునా ఇజ్రాయెల్‌ మిలిటరీ, సాయుధ దళాలు ఉన్నాయి.పాలస్తీనియన్‌ ప్రాంతాల ఆక్రమణ, వాటిలో యూదుల నివాసాల ఏర్పాటు, జనాభా నిష్పత్తిని మార్చివేసే కుట్ర కొనసాగుతూనే ఉంది.వాటిని ప్రతిఘటించేవారిని అణచివేసేందుకు యూదుల రక్షణ పేరుతో ఇజ్రాయల్‌ మిలిటరీ తిష్టవేసింది. విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ మాట్లాడుతూ ‘‘ గాజాలో ఉగ్రవాదుల వ్యవస్థను దెబ్బతీస్తున్నట్లుగానే ఇక్కడ కూడా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, విజయం సాధించాలని ’’ ప్రకటించాడు. వెస్ట్‌బాంక్‌పై దాడికి ఇజ్రాయెల్‌ చెబుతున్న సాకులన్నీ అబద్దాలేనని జోర్డాన్‌ విదేశాంగ మంత్రి అయమాన్‌ సఫాదీ వర్ణించాడు.పాలస్తీనియన్లను తమ ప్రాంతాల నుంచి తరిమివేసే ఏ చర్యనైనా తాము వ్యతిరేకిస్తామన్నాడు.


తాజా పరిణామాలో వెస్ట్‌బాంక్‌లో కూడా ప్రతిఘటించటం మినహా పాలస్తీనియన్లకు మరోదారి లేదు.ఇజ్రాయెల్‌ కోరుకుంటున్నది కూడా అదే కావటంతో కావాలని రెచ్చగొడుతున్నది. ఇటీవల చైనా మధ్యవర్తిత్వంలో పాలస్తీనా విముక్తి సంస్థలన్నీ ఒక అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు హమస్‌ను వ్యతిరేకిస్తున్న పరిమిత అధికారాలున్న పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌ కూడా పిఎల్‌ఓలో హమస్‌ భాగస్వామ్యాన్ని అంగీకరించాడు. గత కొద్ది సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌ దిగ్బంధనంతో వెస్ట్‌బాంక్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. సహజంగానే అబ్బాస్‌ మీద వ్యతిరేకతను పెంచుతుంది. నేడు గాజాలో జరుగుతున్నది రేపు తమ మీద కూడా జరగవచ్చనే ఆందోళన వెస్ట్‌బాంక్‌లో తలెత్తింది.దీన్ని గమనించే అబ్బాస్‌ కూడా గత వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది.హమస్‌ కూడా ఒక అడుగు వెనక్కు తగ్గింది. ఈ కారణంగానే వెస్ట్‌బాంక్‌లో రాజకీయ విబేధాలతో నిమిత్తం లేకుండా పాలస్తీనియన్లు ప్రతిఘటిస్తున్నారు.ఇది అమెరికా, ఇజ్రాయెల్‌ మీద వత్తిడిని పెంచుతుంది, మరో మాటలో చెప్పాలంటే ఊహించని పరిణామం. తాజా దాడులకు ఇది ఒక కారణం. దీన్ని చూపి దిగజారుతున్న తన ప్రతిష్టను నిలుపుకొనేందుకు నెతన్యాహు చూస్తున్నాడు. రెండుదశాబ్దాల నాటి పరిస్థితికీ ఇప్పటికీ వచ్చిన తేడాను యూదు దురహంకారులు గుర్తించటం లేదు.గాజా పరిణామాలు పక్కనే ఉన్న జోర్డాన్‌ రాజు అబ్దుల్లాకు ఎసరుతెచ్చేవిగా ఉన్నాయి.వెస్ట్‌బాంక్‌లో దాడుల కారణంగా పాలస్తీనియన్లు నిర్వాసితులైతే జోర్డాన్‌ వారికి ఆశ్రయం కల్పించే స్థితిలో లేదు. తిరస్కరించే పరిస్థితి కూడా రాజుకు లేదు. పాలస్తీనియన్ల మీద దాడులు పెరిగితే జోర్డానియన్లు సహించరు.ఈజిప్టు,యుఏయి,మొరాకో, బహరెయిన్‌ దేశాల పాలకులు ఇజ్రాయెల్‌తో మిత్ర సంబంధాలు కలిగి ఉన్నారు.వారి మీద కూడా జనం నుంచి వత్తిడి పెరుగుతుంది.ఒక్క గాజా, వెస్ట్‌బాంక్‌ ప్రాంతాల నుంచే కాదు, గోలన్‌ గుట్టలు,లెబనాన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి కూడా ఇజ్రాయెల్‌ వైదొలగాలనే డిమాండ్‌ పెరుగుతుంది.వెస్ట్‌ బాంక్‌ ప్రాంతంలో రెండవ తిరుగుబాటు జరిగినపుడు 2002లో 70వేల యూదుల నివాసాలు ఉంటే వాటిని ఇజ్రాయెల్‌ 2024నాటికి ఎనిమిది లక్షలకు పెంచింది. వాటన్నింటినీ ఖాళీ చేసి అక్రమంగా ప్రవేశపెట్టిన యూదులందరినీ అక్కడి నుంచి తరలించాల్సి ఉంది.తూర్పు జెరూసలెం రాజధానిగా గణతంత్ర పాలస్తీనా ఏర్పడాలన్న ఐరాస తీర్మానం అమలు తప్ప మరొక పరిష్కారం లేదు.
ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నాయి.గాజా మారణకాండకు నిరసనగా ఇరాన్‌ ఒకవేళ దాడులకు దిగితే అడ్డుకొనేందుకు అమెరికా తన నౌక,వైమానిక దళాలను పెద్ద ఎత్తున ఎర్ర సముద్ర ప్రాంతానికి తరలించింది.

ఒకేసారి పలు రంగాలలో దాడులకు నెతన్యాహు ఎందుకు పాల్పడుతున్నాడనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.లెబనాన్‌,ఇరాన్‌లలో హమస్‌ నేతలను హత్య చేయటం,హిజబుల్లాను రెచ్చగొట్టటం,గాజాతో పాటు ఇప్పుడు వెస్ట్‌బాంక్‌పై దాడులకు దిగటం చూస్తున్నాము.నెతన్యాహు అమెరికా పర్యటన జరిపి చర్చలు జరిపి వచ్చిన తరువాత వెస్ట్‌బాంక్‌ మీద దాడులకు దిగింది.ఎవరెన్ని వివరణలు, భాష్యాలు చెప్పినప్పటికీ పొసగటం లేదు. అమెరికా ఎన్నికలు ముగిసేవరకు వర్తమాన పరిణామాలు ఇలాగే కొనసాగవచ్చు.ఉద్రిక్తతలను మరింత పెంచటం ద్వారా బైడెన్‌ మీద వత్తిడి పెరుగుతుందని అది తన విజయానికి బాట వేస్తుందనే అంచనాతో ట్రంప్‌ ఉన్నట్లు, అతగాడి నుంచి వచ్చిన సూచన మేరకు నెతన్యాహు రెచ్చిపోతున్నట్లు ఒక భాష్యం.బైడెన్‌ అమెరికాలో పలుకుబడి కలిగిన యూదుల మద్దతు పొందటానికి వారిని సంతుష్టీకరించేందుకు దాడులకు మద్దతు ఇస్తున్నాడని, దానికి అనుగుణ్యంగానే ఇజ్రాయెల్‌ వ్యవహరిస్తున్నదనే కథనాలు కూడా ఉన్నాయి. ప్రాంతీయ యుద్ధం తలెత్తితే అది ఎన్నికల్లో తమకు లాభిస్తుందని డెమోక్రాట్లు భావిస్తున్నారని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఉక్రెయిన్లో తగులుతున్న ఎదురుదెబ్బలు, భారీ ఖర్చును చూసిన తరువాత అమెరికా మరో రంగంలో చేతులు కాల్చుకుంటుందా, పరువు పోగొట్టుకొని పలుచన అవుతుందా ? కారణాలేమైనప్పటికీ అమెరికా పన్నిన వలలో చిక్కుకొనేందుకు ఇరాన్‌ తదితర దేశాలు సిద్దంగా లేవు.అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అది సిద్దమౌతోంది.సౌదీతో ఉన్న విబేధాలను పరిష్కరించుకోవటంలో అదే కనిపిస్తున్నది. హమస్‌తో రాజీకి వచ్చినా తనదే పైచేయి అని చెప్పుకొనేట్లుగా నెతన్యాహు చూస్తున్నాడు, లేనట్లయితే ప్రతిపక్షం వెంటనే దాడి ప్రారంభిస్తుంది. అందుకే అసాధ్యమైన షరతులను విధిస్తున్నట్లు చెబుతున్నారు.గాజా`ఈజిప్టు సరిహద్దులో ఫిలడెల్ఫీ,నెట్‌జారిమ్‌ కారిడార్లలో తమ మిలిటరీని అనుమతించాలన్నది వాటిలో ఒకటి. దానికి హమస్‌ ససేమిరా అంటున్నది.అక్కడ తీవ్రమైన ప్రతిఘటన ఉన్నప్పటికీ మిలిటరీ కొనసాగాల్సిందేనని ఇజ్రాయెల్‌ యుద్ధ కాబినెట్‌ తీర్మానించింది. అమెరికాలో నవంబరులో ఎన్నికలు జరిగి జనవరిలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పాలస్తీనాలో మారణకాండ సాగేట్లు కనిపిస్తున్నది.