Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మణిపూర్‌లో 2023 మే మూడవ తేదీన రెండు సామాజిక తరగతుల మధ్య పరస్పర అనుమానాలతో ప్రారంభమైన ఘర్షణ 2024లో కొనసాగి మూడో ఏడాదిలో ప్రవేశించింది. ఎప్పుడు ముగుస్తుందో తెలియటం లేదు. పరిస్థితిని చక్కదిద్దటంలో విఫలమైనందుకు విచారంగా ఉందంటూ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అయితే ఒక రోజు కూడా గడవక ముందే విమర్శకులపై ఎదురుదాడికి దిగటాన్ని బట్టి విచార ప్రకటనలో చిత్తశుద్ది లేదని స్వయంగా వెల్లడిరచుకున్నారు. మెయితీకుకీ, జో తెగల మధ్య ప్రారంభమైన ఘర్షణలు, భద్రతా దళాల చర్యల్లో కొందరు మహిళలపై అత్యాచారాలు, నగ్నంగా ఊరేగింపు, 260 మంది ప్రాణాలు కోల్పోయారు, అరవై వేల మంది నెలవులు తప్పారు. బాధితుల్లో ఎక్కువ మంది గిరిజనులైన కుకీలే ఉన్నారు. మెయితీలందరినీ గిరిజనులుగా పరిగణించాలంటూ హైకోర్టు పెట్టిన చిచ్చు అక్కడ జరుగుతున్న దారుణ మారణకాండకు మూలం.రెండిరజన్ల పాలన సాగిస్తున్న బిజెపి ఆదిలోనే దానికి తెరదించి ఉంటే ఇంత జరిగేది కాదు. ఓట్ల రాజకీయంలో మెజారిటీ మెయితీలను ఓటు బాంకుగా మార్చుకొనేందుకు ఆ పార్టీ చూసింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో దానికి వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. రెండు స్థానాల్లోనూ అది మట్టి కరచింది. తిరిగి మద్దతు పొందే ఎత్తుగడలో భాగమే పశ్చాత్తాప ప్రకటన ప్రహసనం అని చెప్పవచ్చు. నిజానికి అక్కడ జరిగిన ఉదంతాలను జరిగిందేదో జరిగింది మరిచిపోదాం అంటే సరే అనేవి కాదు.ఒక రోజు, ఒక ఘటన కాదు కదా ! మహిళల మీద అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగించిన ఉదంతాన్ని మూసిపెట్టేందుకు చూసిన తీరు, అది వెల్లడైన తరువాత పార్లమెంటులో ప్రతిస్పందనలను మరచిపోవాలని బిజెపి చూడవచ్చు తప్ప చరిత్ర మరవదు, మణిపూరీయులు అసలు మరవరు ! మే మొదటి వారంలో గిరిజన మహిళలపై అత్యాచారం జరిగితే ఏ ఒక్క పత్రికా బయటపెట్టలేదు, అంతా సజావుగా ఉందని రాష్ట్రప్రభుత్వం నమ్మబలికింది. జూలై నెలలో నగ్నంగా తిప్పిన మహిళ వీడియో బయటకు వచ్చిన తరువాత మాత్రమే లోకానికి వెల్లడైంది. అందుకే ఆత్మశుద్ధి లేని యాచారమదియేల, భాండశుద్ది లేని పాకమేల, చిత్తశుద్ది లేని శివపూజలేల అన్న మహాకవి వేమనను ఈ సందర్భంగా బీరేన్‌ సింగ్‌ క్షమాపణల తీరు గుర్తుకు తెచ్చింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ను పొందుపరచటం దుర్వినియోగానికి కాదు సద్వినియోగానికి మాత్రమే. చాకులు, కత్తుల తయారీకి చట్టం అనుమతిస్తున్నదంటే దాని అర్ధం పీకలు కోసేందుకు వినియోగించాలని కాదు. గతంలో సదరు ఆర్టికల్‌ను కాంగ్రెస్‌ దుర్వినియోగం చేసిన మాట నిజం. తమ పాలనలో దాన్ని ఒక్కసారైనా వినియోగిస్తే చెప్పండి అని బిజెపి ప్రశ్నించుతోంది.దుర్వినియోగం ఎంత తప్పో సద్వినియోగం చేయకపోవటం కూడా అంతకంటే పెద్దది. మణిపూర్‌లో బిజెపి రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో ఘోరంగా విఫలమైంది. అదే ఏ ప్రతిపక్ష పార్టీనో అధికారంలో ఉంటే అలా ఉపేక్షించేదా ? అది రాజధర్మమేనా ! అల్లకల్లోల పరిస్థితి ఏర్పడిన కారణంగా రాష్ట్రం మొత్తాన్ని మిలిటరీకి అప్పగించారు. అక్కడ బిజెపికి చెందిన ముఖ్యమంత్రి, మంత్రులు రాజభోగాలు అనుభవించటం తప్ప చేసేదేమీ లేదు.వేతనాలు, అలవెన్సులు దండగ. ప్రపంచ మంతటా, మణిపూర్‌ చుట్టూ ప్రధాని నరేంద్రమోడీ విమానాల్లో తిరుగుతారు, సుభాషితాలు చెప్పి వస్తున్నారు తప్ప మణిపూర్‌ వెళ్లి భరోసా ఇచ్చేందుకు ఎలాంటి చొరవ లేదు.

కాంగ్రెస్‌ నేత జయరాం రమేష్‌ ఈ మాట అంటూ ప్రధాని నరేంద్రమోడీ కూడా మణిపూరీయులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దాన్లో తప్పేముంది ? దేశ చరిత్రలో అనేక మంది ప్రధానులు అనేక చట్టాలను చేశారు. కానీ మోడీ తెచ్చిన మూడు సాగు చట్టాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురుకావటంతో విధిలేక క్షమాపణలు చెప్పి మరీ వాటిని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు ముందుకు తెచ్చిన అనేక అంశాల మీద మోడీ మౌనంగా ఉన్నట్లుగానే ఆయన ప్రధమ గణంలోని బీరేన్‌ సింగ్‌ మౌనంగా ఉంటే అదొక తీరు. కానీ ఎదురుదాడికి దిగారు. గతంలో కూడా మణిపూర్‌లో అనేక ఉదంతాలు జరిగాయి కదా వాటన్నింటికీ నాడు ప్రధానులుగా ఉన్న పివి నరసింహారావు, ఐకె గుజ్రాల్‌ క్షమాపణలు చెప్పారా అని ప్రశ్నించారు. ఆ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవారు కూడా క్షమాపణలు చెప్పిన దాఖలా లేదు, మరి బీరేన్‌ సింగ్‌ ఎందుకు చెప్పినట్లు ? నాడు మణిపూర్‌లో జరిగిన ఉదంతాలను పాలకులు మూసిపెట్టలేదు, మోడీ ఏలుబడిలో ఎందుకు పాచిపోయేట్లు చేసినట్లు ? సామాజిక మాధ్యమంలో నగ్నంగా మహిళను తిప్పిన ఉదంతం వెలువడిన తరువాతనే కదా నోరు విప్పింది. గతంలో కాంగ్రెస్‌ చేసిన పాపాల ఫలితమే నేడు మణిపూర్‌ ఉదంతాలకు మూలం అని బీరేన్‌ సింగ్‌ ఆరోపించారు. ఇది కూడా తర్కానికి నిలిచేది కాదు. ముందే చెప్పుకున్నట్లు మెయితీలకు గిరిజన రిజర్వేషన్‌ కల్పించాలన్న హైకోర్టు సిఫార్సు తాజా పరిణామాలకు మూలం తప్ప మరొకటి కాదు. గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలన్న మెయితీల డిమాండ్‌ను ప్రస్తావించటం ద్వారా బీరేన్‌ సింగ్‌ ఆ సామాజిక తరగతి తెగనేత స్థాయికి దిగజారారు. ఒక వేళ అది సరైనదే అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైఖరి ఏమిటో ఎందుకు ప్రకటించరు ?కాంగ్రెసే అంతా చేసిందని చెబుతున్న బిరేన్‌ సింగ్‌ గతం ఏమిటి ? డెమోక్రటిక్‌ రివల్యూషనరీ పీపుల్స్‌ పార్టీని ఏర్పాటు చేసి దాని తరుఫున తొలిసారి ఎంఎల్‌ఏగా గెలిచారు. తరువాత దానిని 2004 లేదా 2005లో కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆ పార్టీలో కొనసాగారు. తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదనే అసంతృప్తితో 2016లో బిజెపిలో చేరారు, 2017 ఎన్నికల్లో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఫిరాయింపులతో కొనసాగారు, తరువాత 2022లో మెజారిటీ సీట్లతో సిఎం అయ్యారు.

మణిపూర్‌ అంశం ప్రస్తావనకు వచ్చినపుడల్లా బిజెపి నేతలు గతంలో కాంగ్రెస్‌ అనుసరించిన వైఖరి, విదేశీ జోక్యం గురించి చెబుతూ తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు చూస్తారు. సరిహద్దుల భద్రత, అక్రమ చొరబాట్లను అరికట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. పదేండ్ల నుంచి ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? 2017 నుంచి ఇదే బీరేన్‌ సింగ్‌ సిఎంగా ఉన్నారు. ఈ పెద్దమనిషి ఏం చేస్తున్నట్లు ? అంతా చేసి నేరం నుంచి తప్పించుకోవటం తప్ప క్షమాపణలో చిత్తశుద్ది లేదని మణిపూర్‌ గిరిజన సంఘాల ఐక్యతా కమిటీ బీరేన్‌ సింగ్‌ ప్రకటన మీద వ్యాఖ్యానించింది. ఒక మైనారిటీ తరగతి మీద జరిపిన మారణకాండ బాధ్యత నుంచి తప్పించుకొనేందుకు సిఎం చూశారని పేర్కొన్నది. కుకీజో గిరిజనుల పట్ల వివక్ష నిలిపివేయాలని మరో గిరిజన సంఘాల కమిటీ డిమాండ్‌ చేసింది.మణిపూర్‌లో సాయుధ బృందాలపై భద్రతా దళాలు జరిపిన దాడులలో స్టార్‌ లింక్‌ ఉపగ్రహ యాంటెన్నా, రౌటర్‌తో పాటు ఆధునిక రైఫిళ్లు దొరికినట్లు ప్రకటించారు. మారుమూల ప్రాంతాలలో ఇంటర్నెట్‌ సేవలను అందించే ఈ ఉపగ్రహం సేవలను పొందటం మనదేశంలో నిషిద్దం, అయినప్పటికీ అవి దొరికాయంటే అనధికారికంగా సమాచారం అందుకున్నట్లు స్పష్టమౌతోంది. వీటిని మెయితీలు అధికంగా నివసించే ప్రాంతాలపై జరిగిన దాడుల సమయంలో సాయుధులు వదలివేసి పారిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే తమ ఉపగ్రహం నుంచి భారత్‌కు సంకేతాలు అందకుండా చేసినట్లు ఎలన్‌మస్క్‌ చెప్పుకున్నాడు. తమ దాడుల సందర్భంగా మయన్మార్‌లో తయారైన ఆయుధాలు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్పారు. వాటిలో మయన్మార్‌ సైనికులు వాడే ఎంఏ4 రైఫిలు,ఎకె47 కూడా ఉంది. గత ఐదారు నెలల నుంచి సాయుధ బృందాలు తలదాచుకున్న ప్రాంతాలలో బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్‌లు, మిలిటరీ యూనిఫారాలు తదితరాలను కూడా పట్టుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మయన్మార్‌ సరిహద్దులను దాటి ఉగ్రవాదులు రాకపోకలు సాగిస్తున్నా, ఆయుధాలు అక్రమ రవాణా జరుగుతుంటే సరిహద్దు భద్రతలను చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? స్టార్‌ లింక్‌ ఉపగ్రహం నుంచి ఉగ్రవాదులు, సాయుధ మూకలకు సంకేతాలు, సందేశాలు అందుతుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే. భద్రమైన చేతుల్లో దేశం ఉందని నరేంద్రమోడీ గురించి గొప్పలు చెప్పుకోవటం తప్ప ఉపయోగం ఏముంది ?

తాజా ఘర్షణలు, దాడులకు కారణం 2023 ఏప్రిల్‌ 14న మణిపూర్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే మూలం. మెయితీ సామాజిక తరగతికి గిరిజన హోదా కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేయాలంటూ తనకు లేని అధికారంతో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరువాత సుప్రీం కోర్టు ఈ చర్యను తప్పు పట్టింది.ఒక పెద్ద కుట్రలో భాగంగా అక్కడ పరిణామాలు జరిగినట్లు భావిస్తున్నారు. హైకోర్టు ఆదేశాన్ని నిరసిస్తూ మే 3వ తేదీన గిరిజన విద్యార్థులు నిరసన తెలిపారు. నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక వైపు నుంచి హింసాకాండ జరుగుతూనే ఉంది. మెయితీ`గిరిజనుల మధ్య పరస్పరం అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మయన్మార్‌లో 2021 మిలిటరీ తిరుగుబాటు సమయంలో అక్కడి నుంచి శరణార్ధులుగా వచ్చిన వారి గురించి మెయితీలు అభ్యంతరం తెలిపారు. ఇవన్నీ కూడా బిజెపి రెండిరజన్ల పాలనలోనే జరిగాయి. అందువలన గత కాంగ్రెస్‌ పాలనే కారణం అనటం తప్పించుకోచూడటం తప్ప మరొకటి కాదు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అక్కడ నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ అనే ఒక ప్రాంతీయ పార్టీతో జత కట్టి చెరోసీటులో పోటీ చేసింది. రెండు సీట్లలో కాంగ్రెస్‌ గెలిచింది. రెండు సీట్లలో కాంగ్రెస్‌కు 47.59శాతం ఓట్లు రాగా నాగా పార్టీకి 18.87, బిజెపికి 16.58శాతం( మొత్తం 35.45శాతం) ఓట్లు వచ్చాయి. అరవై అసెంబ్లీ సెగ్మెంట్లలో 36 చోట్ల కాంగ్రెస్‌, 13 నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌, బిజెపి తొమ్మిది చోట్ల మెజారిటీ తెచ్చుకున్నాయి. మెయితీలు, గిరిజన సామాజిక తరగతులు రెండూ బిజెపిని ఓడిరచాయన్నది స్పష్టం. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను గమనంలో ఉంచుకొని క్షమాపణల పర్వానికి తెరతీశారని చెప్పాల్సి వస్తోంది. మెయితీలను గిరిజనులుగా గుర్తించాలా లేదా అన్నది బిజెపి తేల్చటం లేదు. తమకు అన్యాయం చేస్తారని కుకీ, ఇతర గిరిజనులు అనుమానంగా చూస్తుంటే తమకు రిజర్వేషన్ల ఆశచూపి ఓటు బాంకుగా మార్చుకోవాలని చూసి ఎటూ తేల్చటం లేదని మెయితీలు అసంతృప్తితో ఉండటమే బిజెపి ఓటమికి కారణం.