Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన రెండవ పదవీ కాలం తొలి నెల రోజుల్లో చేసిన ప్రకటనలు, తీసుకున్న నిర్ణయాల పరిణామాలు, పర్యవసానాల గురించి పరిపరి కథనాలు వెలువడుతున్నాయి. నిజంగా ఏం జరిగేది ఎవరూ చెప్పలేని స్థితి. రష్యాను దగ్గరకు తీసుకొని చైనాకు వ్యతిరేకంగా నిలపాలనే ఎత్తుగడతో అమెరికా ఉందని చెబుతున్నారు.సోమవారం నాడు ఐరాసలో జరిగిన పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.తమపై నాలుగో ఏడాదిలో ప్రవేశించిన రష్యా సైనిక చర్యలను ఖండిస్తూ దాడులు నిలిపివేయాలని ఐరాస సాధారణ అసెంబ్లీలో ఉక్రెయిన్‌ సోమవారం నాడు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దానికి అనుకూలంగా 93, వ్యతిరేకంగా 18 దేశాలు ఓటు చేయగా, భారత్‌, చైనాతో సహా 65 దేశాలు తటస్థంగా ఉన్నాయి. గతంలో 140దేశాలు రష్యా చర్యను ఖండిరచే తీర్మానానికి మద్దతు ఇవ్వగా ఈసారి 93కు తగ్గాయి. ఉక్రెయిన్‌ తన తీర్మానాన్ని వెనక్కు తీసుకొని ‘‘ త్వరగా సంక్షోభాన్ని ముగించాలని ’’ తాను ప్రతిపాదించిన దానికి మద్దతు ఇవ్వాలని అమెరికా వత్తిడి చేసింది. మరోవైపున రష్యా మీద ఎలాంటి విమర్శ చేయకుండా సంక్షోభాన్ని ముగించాలని కోరుతూ భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతుగా పది ఓట్లు రాగా ఐదుదేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వాటిలో వీటో హక్కు కలిగిన బ్రిటన్‌, ఫ్రాన్సు కూడా ఉండటం విశేషం.ఈ పరిణామాల తరువాత శుక్రవారం నాడు జెలెనెస్కీ వాషింగ్టన్‌ వెళుతున్నాడని, విలువైన ఖనిజాల మీద ట్రంప్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోవచ్చని బుధవారం నాడు వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే ట్రంప్‌ ఇప్పటి వరకు చెప్పినదానికి పూర్తి విరుద్దంగా వ్యవహించినా ఆశ్చర్యం లేదు. విలువైన ఖనిజాల కోసం ఉక్రెయిన్ను ట్రంప్‌ బెదిరిస్తున్నాడని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి.

తమకు నాటో సభ్యత్వమిస్తే పదవి నుంచి వైదొలగటానికి కూడా సిద్దమే అని, తమ ప్రాంతాలను ఆక్రమించిన పుతిన్‌ అక్కడే తిష్టవేయటాన్ని అంగీకరించేది లేదని జెలెనెస్కీ అంతకు ముందు చెప్పాడు. తాము చేసిన ప్రతి డాలరు మిలిటరీ సాయానికి రెండు డాలర్లు చెల్లించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోందన్నాడు. ఐదువందల బిలియన్‌ డాలర్ల ఖనిజాలను అప్పగించాలన్న వాషింగ్టన్‌ వత్తిడికి లొంగేది లేదని కూడా చెప్పాడు, అవసరమైతే వచ్చే పదితరాల వారు తమ రుణాలను తీర్చుకుంటారని అన్నాడు. విలువైన ఉక్రెయిన్‌ ఖనిజాల్లో 350 బిలియన్‌ డాలర్ల విలువ గలవి రష్యా అధీన ప్రాంతాల్లోనే ఉన్నాయని ఉపప్రధాని యులియా చెప్పాడు. ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపేందుకు సోమవారం నాడు అనేక మంది ఐరోపా నేతలు కీవ్‌ చేరుకున్నారు. ఉక్రెయిన్‌పై ఒక నిర్ణయం తీసుకొనేందుకు, ఐరోపా రక్షణ గురించి చర్చించేందుకు మార్చినెల ఆరవ తేదీన సమావేశం కానున్నారు. రానున్న రెండు వారాల్లో రెండవ సారి సమావేశమయ్యేందుకు అమెరికా, రష్యా ప్రతినిధులు సన్నద్దమవుతున్నారు. తప్పుడు సమాచార బుడగలో ట్రంప్‌ ఇరుక్కు పోయాడని అన్న జెలెనెస్కీని నియంత అని ట్రంప్‌ వర్ణించటాన్ని అర్ధం చేసుకోదగినదే అని రష్యా సమర్ధించింది.

రష్యాను దగ్గరకు తీసుకొని చైనాకు వ్యతిరేకంగా నిలపాలని నిజంగా ట్రంప్‌ భావిస్తే అది ఇప్పటికైతే ఊహాజనితమే. ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే మరోవైపు ఉన్న భారత్‌, మూడో వైపు ఉన్న జపాన్‌తో కథ నడిపించి చైనాను దెబ్బతీయాలన్న వ్యూహం ఉందన్నది ఒక దృశ్యం. ఇది కార్యరూపం దాలిస్తే ఐరోపాలో అమెరికా ప్రాబల్యం తగ్గి చైనా పలుకుబడి పెరుగుతుందని మరికొందరి హెచ్చరిక. ఉక్రెయిన్ను ఫణంగా పెట్టి రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంటే ప్రపంచంలో అమెరికాను నమ్మే పరిస్థితి ఉంటుందా ? ట్రంప్‌ను నమ్మి రష్యా ముందుకు పోతుందా అన్నది ప్రశ్న. గతంలో ఇదే అమెరికన్లు జి7 కూటమిని జి8గా మార్చి రష్యాను చేర్చుకొనేందుకు చూశారు. అది బెడిసికొట్టటంతో రష్యాను వ్యతిరేకించటమే గాదు, దానికి ముప్పు తెచ్చేందుకు చూశారు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి కారణం అదే కదా ! గడచిన మూడు సంవత్సరాలుగా ఆంక్షలతో ఆర్థికంగా దెబ్బతీసేందుకు చూసిన తీరు, ఉక్రెయిన్‌ పోరులో సంభవించినట్లు చెబుతున్న ప్రాణ, ఆర్థిక నష్టాలను మరచి రష్యన్లు కొత్త బాటలో నడుస్తారా ? కష్ట సమయంలో ఆదుకున్న చైనాకు వ్యతిరేకంగా జట్టుకడుతుందా ? పుతిన్‌ లేదా పాలకవర్గం లొంగిపోయినా జనం సమ్మతిస్తారా ? అమెరికాయే చేతగాక బేరసారాలకు దిగుతుంటే రష్యన్లు చైనాను కట్టడి చేయగలరా ? ఇలాంటి అనేక ఊహాజనిత దృశ్యాలను కొందరు ఆవిష్కరిస్తున్నారు.

చరిత్రను చూస్తే నాటి సోవియట్‌చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య తలెత్తిన సైద్దాంతిక వివాదాలు, దేశాల మధ్య విబేధాలకు దారి తీశాయి.1969లో ఆరు నెలలకు పైగా సరిహద్దులో ఇరు సైన్యాలను మోహరించటమే గాదు, స్వల్ప ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. దాన్ని వినియోగించుకొని సోవియట్‌ను దెబ్బతీసేందుకు అమెరికన్లు ప్రజా చైనాను గుర్తించి భద్రతా మండలిలో ప్రాతినిధ్యానికి అంగీకరించారన్నది ఒక అభిప్రాయం. తమ సమస్యల నుంచి బయటపడేందుకు విదేశాలకు మార్కెట్‌ను తెరిచే సంస్కరణలు అవసరమని చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. ఈ అవకాశాన్ని అక్కడ ఉన్న విస్తారమైన శ్రమశక్తిని కారుచౌకగా పొందేందుకు, మార్కెట్లో ప్రవేశించేందుకు అమెరికా వినియోగించుకుందన్నది మరొక సూత్రీకరణ. అంతిమంగా నాలుగు దశాబ్దాల అనుభవంలో ఎవరు ఎవరిని వినియోగించుకున్నారని బేరీజు వేస్తే ఎగుమతులతో చైనా దిగుమతులతో అమెరికా, ఐరోపా లబ్దిపొందాయి. కొన్ని లాటిన్‌ అమెరికా దేశాలు ఎగుమతి ఆధారిత వ్యవస్థలతో కొనసాగిన మాదిరి చైనా కూడా అలాగే ఉంటుందని భావించిన అమెరికా ఘోరంగా దెబ్బతిన్నది. అన్ని రంగాలలో తననే సవాలు చేసే విధంగా మారుతుందని అది అంచనా వేయలేకపోయింది, గుర్తించేసరికే తమ చేతులు దాటిపోయినట్లు గమనించింది. దాని పర్యవసానమే డోనాల్డ్‌ ట్రంప్‌ తొలి పాలనా కాలంలో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం. ఇప్పుడు దాని కొనసాగింపుతో మరోసారి ముందుకు పోనున్నట్లు సూచనలు.


చైనా గురించి మరోసారి అమెరికా అంచనాలు తప్పనున్నాయా ? అట్లాంటిక్‌ పత్రిక వ్యాఖ్యాత కథనం చైనాకు ప్రపంచాన్ని అప్పగించనున్న ట్రంప్‌ అంటూ సాగింది. ఇది సామ్రాజ్యవాదుల కోణంలో ఆలోచిస్తున్నవారి బుర్రలో పుట్టిన బుద్ది అని చెప్పవచ్చు.‘‘ అమెరికా ప్రపంచ నాయకత్వం ముగుస్తున్నది. ఇది అమెరికా దిగజారి లేదా బహుధృవ ప్రపంచం ఉనికిలోకి వచ్చి కాదు లేదా అమెరికా ప్రత్యర్ధుల చర్యలతో జరుగుతున్నది కాదు. నాయకత్వ ముగింపు ఎందుకంటే అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నాడు గనుక. ఇంటా బయటా ట్రంప్‌ విధానాలు అత్యంత వేగంగా అమెరికా అధికార పునాదులను నాశనం చేస్తున్నాయి. ప్రపంచ అగ్రశక్తిగా ప్రస్తుతం అమెరికాను పక్కకు నెట్టి దాని స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్న చైనా నేత షీ జంపింగ్‌ ప్రధాన లబ్దిదారు అవుతాడు. ప్రపంచాన్ని హ్రస్వదృష్టితో చూస్తున్న ట్రంప్‌కు తానేం చేస్తున్నదీ తెలియటం లేదు, అతడి చర్యలు అంతర్జాతీయ భద్రతకు ముప్పు తెస్తున్నాయని, అమెరికా భవిష్యత్‌ కూడా దానితోనే ముడిపడి ఉందని తెలుసుకోలేకపోతున్నాడు, అమెరికా వదలిన ఖాళీలో చైనా ప్రవేశాన్ని ఇతర ధనిక దేశాలు అడ్డుకోవలేవంటూ ఆ పత్రిక విశ్లేషణ కొనసాగింది.


వాణిజ్య యుద్దం గురించి అమెరికా గతంలో వేసుకున్న అంచనాలు తప్పాయి. 2024లో అమెరికా వాణిజ్య లోటు లక్ష కోట్ల డాలర్లుగా ఉంటే చైనా వాణిజ్య మిగులు కూడా అంతే ఉంది. అమెరికా, ఐరోపాలో కోల్పోయిన మార్కెట్లను మరోచోట పొందేందుకు చైనా ముందుకు పోతున్నది.ట్రంప్‌ ప్రకటించినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి వాటి నుంచి అమెరికా వైదొలిగినా, యూఎస్‌ఎయిడ్‌ ఆకస్మికంగా నిలిపివేసినా ఆ స్థానాన్ని చైనా ఆక్రమిస్తుందని కొందరు ఇప్పటికే హెచ్చరించారు. ఇప్పటి వరకు ఉద్దరించే పేరుతో సాయం బిస్కెట్లతో పలు దేశాల్లో పాగా వేయాలని చూసిన అగ్రదేశపు అమెరికా ఎత్తుగడ ఫలించలేదు. అలాంటిది అంతశక్తిలేని చైనా వల్ల అవుతుందా ? నిజానికి చైనా నేరుగా అప్పులిస్తున్నది తప్ప అమెరికా, జపాన్‌, మరొక ధనిక దేశం మాదిరి సాయం పేరుతో షరతులతో కూడిన నిధులు ఇవ్వటం లేదు, అలాంటి ఏర్పాట్లు కూడా లేవు. అమెరికా సాయం పొంది బాగుపడిన దేశాలేమిటంటే ఎవరూ చెప్పలేరు, కానీ అనేక దేశాలలో మౌలిక సదుపాయాలలో చైనా పెట్టుబడుల ఫలితాలు కనిపిస్తున్నాయి. చరిత్రలో మార్కెట్ల కోసం ఏకంగా దేశాలనే ఆక్రమించుకోవటం తెలిసిందే. తొలి వాణిజ్య యుద్దం చైనా`బ్రిటన్‌ మధ్య నల్లమందు దిగుమతుల మీద జరిగింది.రెండవది కూడా అదే సమస్య మీద బ్రిటన్‌, ఫ్రాన్స్‌ కలసి చేశాయి. తొలి యుద్దంలో నల్లమందును ధ్వంసం చేసినందుకు చైనా నష్టపరిహారం చెల్లించటంతో పాటు హాంకాంగ్‌ దీవులను బ్రిటన్‌కు 99 సంవత్సరాల పాటు కౌలుకు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. రెండవ యుద్దంలో నల్లమందు విక్రయాలను చట్టపరంచేసేందుకు ఒప్పందాన్ని రుద్దారు. వర్తమాన వాణిజ్య యుద్దాన్ని చైనా మీద అమెరికా 2018లో ప్రారంభించింది.ట్రంప్‌ దిగిపోయినా బైడెన్‌ కొనసాగించాడు, తిరిగి ట్రంప్‌ వచ్చాడు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే అప్పుడూ చైనా కుంగిపోలేదు, ఇప్పుడు మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంది.వాణిజ్యపోరు కరెన్సీ పోరుకు విస్తరించింది.

కెనడా, మెక్సికోల మీద 25శాతం పన్ను విధిస్తానన్న ట్రంప్‌ చైనా దగ్గరకు వచ్చేసరికి పదిశాతమే అన్నాడు.నిజానికి 2024లో జో బైడెన్‌ చైనా నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్‌ వాహనాలపై 100, సోలార్‌ సెల్స్‌, సెమీ కండక్టర్ల మీద 50, లిథియం అయాన్‌ బాటరీలపై 25శాతం చొప్పున దిగుమతి సుంకాలు విధించాడు. తాజాగా ట్రంప్‌ చేసిన ప్రకటనను అసలు చైనా పట్టించుకోలేదనే చెప్పాలి. కొన్ని నామమాత్ర చర్యలు తీసుకుంది. అవి అమెరికా నుంచి దిగుమతయ్యే వాటిలో పదో వంతు వస్తువుల మీదనే అని వార్తలు.పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తే ఎక్కువగా నష్టపోయేది అమెరికాయే గనుక ఎంతవరకు ముందుకు పోతుందో చూద్దాం అన్నట్లుగా చైనా ఉంది. ఎనిమిదేండ్ల నాటితో పోలిస్తే తాజా బెదిరింపు లెక్కలోది కాదని భావిస్తోంది. అందుకే ట్రంప్‌ ప్రకటనలను అది ఖాతరు చేయటం లేదు.దీని అర్ధం అసలేమీ ప్రతికూల ప్రభావాలు ఉండవని కాదు.


ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్న పూర్వరంగంలో అమెరికా పాలకవర్గం చూస్తూ ఊరుకుంటుందా ? శత్రువుగా పరిగణించే చైనాతో పాటు తన కనుసన్నలలో నడిచే కెనడా, మెక్సికో, ఐరోపా దేశాలు, చేతులు కలిపేందుకు తహతహలాడుతున్న భారత్‌ మీద కూడా బస్తీమే సవాల్‌ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆయా దేశాలతో బేరమాడేందుకు అయితే సరే, మొదటికే మోసం వస్తే పాలకవర్గం సహించే సమస్యే లేదు. దాని డిఎన్‌ఏలో ఎలాంటి మార్పులు ఉండవు. ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువగా పాల్గ్గొనేందుకు ప్రోత్సహించటానికి మనమెందుకు డబ్బు ఇవ్వాలంటూ ట్రంప్‌ చేసిన ప్రకటన అమెరికా సామాన్యులను ఆకట్టుకుంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ సాయం పేరుతో జరుపుతున్న కార్యకలాపాలు వేరు. ఇప్పటి వరకు జరిపిన వాటితో ఫలితం లేకపోతే సమీక్షల తరువాత కొత్త రూపాలతో అమెరికా రంగంలోకి దిగుతుంది తప్ప వెనక్కు తగ్గే అవకాశం లేదు !ఉక్రెయిన్‌ విషయంలో ట్రంప్‌ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ వైఖరిని మార్చుకోవటానికి ఇప్పటికీ సమయం మించిపోలేదని, రష్యన్ల ఊబిలో చిక్కుకోవద్దని అమెరికా మేథోమధనంలో నిమగ్నమైన వారు సూచిస్తున్నారు.అమెరికాను ప్రధమ శత్రువుగా పరిగణిస్తున్న రష్యాను దగ్గరకు తీసుకోవాలను కోవటం జరిగేది కాదని, కనిపిస్తున్నదానికి భిన్నంగా ఉక్రెయిన్‌ ఇంకా ఓడిపోలేదని లేదా అమెరికాతో సంబంధాలు తెగలేదని, తన చర్యలు స్వయం ఓటమికి దారితీస్తాయని గ్రహిస్తే ట్రంప్‌ యంత్రాంగం ప్రకటించినదానికి పూర్తి విరుద్దమైన వైఖరిని తీసుకోవటానికి విముఖత చూపకపోవచ్చని ఛాతమ్‌ హౌస్‌ విశ్లేషణలో పేర్కొనటం గమనించదగిన అంశం. సామ్రాజ్యవాదులు ఏది లబ్ది అనుకుంటే దానికి మొగ్గుచూపుతారనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వారు కూడా పప్పులో కాలేసిన చరిత్రను కూడా మరచిపోరాదు. ఎవరి మీదా భ్రమలు పెట్టుకోనవసరం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం !