Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికా చరిత్రలో పిన్న వయస్కుడిగా 35వ అధ్యక్ష పదవికి ఎన్నికైన జాన్‌ ఎఫ్‌ కెనడీ జీవితం 43 ఏండ్లకే అర్ధంతరంగా ముగిసింది.1961 జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత 1963 నవంబరు 22న డాలస్‌ నగరంలో హత్యకు గురయ్యాడు. చిత్రం ఏమిటంటే ఇంతవరకు హత్య వెనుక ఎవరున్నదీ అమెరికా చెప్పలేకపోయింది. అనేక అంశాలను ఇట్టే పసిగట్టి గుట్టువిప్పగల ఎఫ్‌బిఐ,సిఐఏ,జాతీయ దర్యాప్తు సంస్థలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. నిజంగా వైఫల్యమా ? లేక హంతకుడి వెనుక ఈ సంస్థలలో ఏదో ఒకటి ఉందా, ఉంటే ఎవరి ప్రోద్బలంతో హత్య జరిగింది అన్నది ఎప్పటికీ వెల్లడిగాని రహస్యంగానే మిగిలిపోతుందా ? తాజాగా కెనడీ హత్యకు సంబంధించి రహస్యంగా ఉన్న పత్రాలన్నింటినీ బహిరంగ పరచాలని మార్చి 18వ తేదీన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించిన మేరకు 63వేల పేజీలను విడుదల చేశారు. అనేక కాగితాల్లో ఏముందో తెలియకుండా చేసేందుకు నల్లటి ఇంకు పూశారు. అందువలన కొత్త అనుమానాలు తలెత్తటం తప్ప తెలిసిందేమీ లేదని చెబుతున్నారు. అన్నివేల పేజీలను చదవటం వెంటనే సాధ్యమయ్యేది కాదు గనుక వాటిలో ఎక్కడైనా అణుమాత్రమైనా ఆధారాలుంటే తరువాత బయటకు వస్తుందని ఆశించాలా లేక అలాంటివి కనిపించకుండానే ఇంకు పూశారనుకోవాలా ? 1992లో చేసిన ఒక చట్ట ప్రకారం 25 సంవత్సరాలలోగా కెనడీ హత్యకు సంబంధించి వివరాలన్నీ వెల్లడిరచాలని నిర్దేశించారు. ఆ మేరకు 2017లోనే బయటపెట్టనున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. అయితే షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా రక్షణ వ్యవహారాలు అందులో ఉంటే వాటికి మినహాయింపు కూడా ఇచ్చారు. ట్రంప్‌ గతంలో కొన్నింటిని, తరువాత జో బైడెన్‌ మరికొన్ని, తాజాగా ట్రంప్‌ మరికొన్నింటిని విడుదల చేసేందుకు ఆదేశాలిచ్చాడు.


‘‘ కెనడీ అర్ధశతాబ్దం ’’ పేరుతో ఒక గ్రంధాన్ని రాసిన వర్జీనియా విశ్వవిద్యాలయ రాజకీయ శాస్త్ర ఫ్రొఫెసర్‌ రికార్డులను పూర్తిగా సమీక్షించాలంటే సమయం పడుతుందన్నారు. మొత్తం ఎనభైవేల పేజీల రికార్డులను విడుదల చేయనున్నట్లు ట్రంప్‌ ప్రకటించినందుకు మరికొన్ని త్వరలో వెల్లడి కావచ్చు. ఇప్పటి వరకు విడుదల చేసిన ఫైళ్లలో సిఐఏ గురించిన సమాచారం ఎంతో ఉంది తప్ప కెనడీ హత్య వెనుక కుట్ర గురించేమీ లేదన్నది వెంటనే వెల్లడైన స్పందన.ట్రంప్‌ నిర్ణయానికి ముందు మూడు నుంచి మూడున్నరవేల ఫైళ్లు విడుదల కావాల్సి ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. ఫిబ్రవరి నెలలో తాము కొత్తగా 2,400 కొత్త రికార్డులను కనుగొన్నట్లు ఎఫ్‌బిఐ చెప్పింది. అందువలన ఇంకా ఎన్ని విడుదల కావాల్సిందీ స్పష్టంగా చెప్పలేని స్థితి. లీ హార్వే ఓస్వాల్డ్‌ అనే 24 సంవత్సరాల యువకుడు కెనడీ మీద కాల్పులు జరిపాడని చెప్పారు. వాడిని పోలీసు కస్టడీ నుంచి జైలుకు తరలిస్తుండగా జాక్‌ రూబీ అనే నైట్‌క్లబ్‌ యజమాని కాల్చి చంపాడు. ఎందుకంటే వాడికి కోపం వచ్చిందట. ఇదంతా కేవలం రెండు రోజుల్లోనే జరిగింది. ఈ తీరు చూసిన తరువాత బుర్ర ఉన్నవారెవరికైనా పెద్ద కుట్ర దీని వెనుక ఉంది అన్న అనుమానం రాకుండా ఎలా ఉంటుంది.


తాజాగా వెల్లడైన పత్రాల ప్రకారం ఓస్వాల్డ్‌ గురించి సిఐఏ గట్టి నిఘావేసినట్లు తేలింది. అలాంటపుడు ఎందుకు నిర్లక్ష్యం వహించినట్లు ? ఈ పత్రాలలో చాలా వాటిని పాక్షికంగా గతంలోనే విడుదల చేశారు. ఇప్పుడు చేసిందేమంటే పూర్తి పాఠాల బహిర్గతం.కెనడీ హత్యకు ముందు ఓస్వాల్డ్‌ సోవియట్‌ వెళ్లినట్లు తిరిగి వచ్చిన తరువాత 1963సెప్టెంబరులో మెక్సికో సిటీ వెళ్లినట్లు, అక్కడ సోవియట్‌ రాయబార కార్యాలయం ముందు ఉన్న మూడు సార్లు గేటు ముందుకు ఉన్న చౌకీదారుతో మాట్లాడినట్లు సిఐఏ నమోదు చేసినా ఒక్కసారే అతడిని గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిందేమీ లేదని సిఐఏ ఒక మెమోలో పేర్కొన్నట్లు కూడా వెల్లడైంది. 1959 నుంచే ఓస్వాల్డ్‌ మీద నిఘావేసినట్లు కూడా వెల్లడైంది. అయితే ఒక యువకుడి మీద ప్రత్యేకించి,కెనడీ అధికారానికి రాక ముందునుంచే ఎందుకు నిఘా పెట్టారన్నది సందేహాస్పద అంశం. రష్యా వెళ్లాడు గనుక అని చెప్పవచ్చు. హత్యకు ముందు ఇతగాడి మీద నిఘావేసిన ఒక అధికారి సమర్పించిన సమాచార ఫైలును ఇప్పటికీ విడుదల చేయలేదు. అమెరికా విదేశాంగ విధాన వ్యవహారాలలో సిఐఏ పాత్ర ఎక్కువగా ఉందని, రాయబార కార్యాలయాల్లో దాని ఏజంట్లే దౌత్యవేత్తల ముసుగులో ఉన్నట్లు వీటి గురించి ఆర్థర్‌ షెల్సింగర్‌ అనే సహాయకుడు కెనడీ వివరించినట్లు సిఐఏ గురించి కెనడీకి నమ్మకం, సదభిప్రాయం లేదని, సత్సంబంధాలు కూడా లేవని తేలింది. కెనడీ పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో అమెరికా రాయబార కార్యాలయాల్లో పని చేస్తున్న రాజకీయ ప్రతినిధుల్లో 47శాతం మంది సిఐఏ కనుసన్నలలో పని చేసేవారే. ఉదాహరణకు పారిస్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో నాడున్న 123 మంది ముసుగులో ఉన్న ఏజంట్లే, చిలీ కార్యాలయంలో ఉన్న పదమూడు మందిలో పదకొండు మంది కూడా వారే. మొత్తం 3,700 మంది దౌత్య సిబ్బందిగా పేర్కొన్నవారిలో 1,500 మంది మాత్రమే విదేశాంగశాఖకు చెందిన వారు, మిగతా వారంతా మిలిటరీ లేదా గూఢచార సంబంధంగలవారేనని అతను నివేదించాడు. కంటికి కనిపించని దొంగ చెవుల ద్వారా సేకరించిన సమాచారం, చిత్రాలను చూసేందుకు ఎక్స్‌రేస్‌ను వినియోగించినట్లు తేలింది. అతి నీలలోహిత కిరణాలను ప్రసరింప చేస్తే కనిపించే రంగులను కొన్ని పబ్లిక్‌ ఫోన్లకు పూసి ఉపయోగించినట్లు కూడా వెల్లడైంది. ఇలాంటి మరికొన్ని ప్రక్రియల గురించి కూడా బహిర్గతమైంది. తరువాత కాలంలో అవన్నీ లోకానికి తెలిసిన కారణంగా ఇప్పుడు దాయాల్సిందేమీ లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో మిలిటరీ గూఢచారిగా ఉన్న గారీ అండర్‌హిల్‌ సేకరించినట్లు చెబుతున్న సమాచారం ప్రకారం కెనడీ హత్యవెనుక సిఐఏ హస్తం ఉన్నట్లు ఒక వర్తమానంలో కనుగొన్నాడని 1967లో ఒక పత్రిక ప్రచురించింది, అయితే 1964లోనే అండర్‌హిల్‌ ఆత్మహత్య చేసుకున్నాడని, కానీ దాని మీద అనుమానాలున్నట్లు సదరు పత్రిక పేర్కొన్న అంశానికి ప్రాధాన్యత ఏర్పడిరది. అయితే ఇదేమీ సరికొత్త అంశం కాదు. 2017లో విడుదల చేసిన వాటికి ఒక పేజీ అదనంగా తోడైంది.


కెనడీ హత్య గురించి అనేక కుట్ర సిద్దాంతాలు, అనుమానాలు నేటికీ వెల్లడౌతూనే ఉన్నాయి. సినిమాలు కూడా వచ్చాయి. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా అసలు విషయం తేలటం లేదు. ఓస్వాల్డ్‌ సోవియట్‌లో ఉండి వచ్చాడని, అందువలన హత్యకు అక్కడే కుట్ర జరిగిందన్నది ఒకటి. అధ్యక్షులుగా గాడిద పార్టీ ఉన్నా ఏనుగు పార్టీ ప్రతినిధి ఉన్నా సోవియట్‌, తరువాత రష్యాను వ్యతిరేకించిన వారే తప్ప మరొకరు లేరు. అలాంటపుడు రష్యన్ల హస్తం గురించి ఎందుకు తేల్చలేకపోయారు ? కెనడీ డెమోక్రాట్‌ గనుక రిపబ్లికన్లు కుట్ర చేశారనుకుంటే మరి స్వంత పార్టీ వారెందుకు రుజువు చేయలేకపోయారు, లేదూ స్వంత మనుషులే అనుకుంటే అదే పని రిపబ్లికన్లు కూడా చేయలేదు కదా ! కొందరు క్యూబన్ల కుట్ర, మెక్సికో అన్నారు, వాటి గురించీ తేల్చలేకపోయారు. మోటారు వాహనంలో ప్రయాణిస్తుండగా ఓస్వాల్డ్‌ కాల్చినట్లు చెప్పారు. అయితే అతను మెరైన్‌ తప్ప షూటింగ్‌లో అంత నేర్పరి కాదన్నది మరొక వాదన. కాల్పులు జరిగిన సమయంలో అతను సోవియట్‌ కెజిబి అదుపులో లేడని దానికోసం పనిచేసిన ఒక ప్రొఫెసర్‌ కథనం.


సిఐఏకు కమ్యూనిస్టులు లేదా వ్యతిరేకులు అనే బేధం లేదు. వాషింగ్టన్‌ డిసిలో మిత్రదేశమైన ఫ్రాన్సు రాయబార కార్యాలయంలో కూడా దొంగచాటుగా సమాచారాన్ని సేకరించటమేగాక కొన్ని పత్రాలను కూడా తస్కరించినట్లు తాజాగా విడుదల చేసిన ఫైళ్లలో వెల్లడైంది.కెనడీ కాలంలో సిఐఏ డైరెక్టర్‌గా పనిచేసిన జాన్‌ మెకాన్‌ తన పదవీ కాలంలో పోప్‌ జాన్‌23, పోప్‌ పాల్‌6తో నెరిపిన సంబంధాలు కూడా కొన్ని అనుమానాలను రేకెత్తించాయి. ఇతగాడి హయాంలోనే డొమినికన్‌ రిపబ్లిక్‌ పాలకుడు రాఫేల్‌ ట్రుజిలో హత్యకు సహకరించిన సిఐఏ అధికారుల పేర్లు, బొలీవియాలో తమకు అనుకూలమైన అభ్యర్థికి అనుకూలంగా తీసుకున్న చర్యలు, కమ్యూనిజానికి వ్యతిరేకంగా చేసిన కుట్రల్లో భాగంగా రాజకీయ పార్టీలకు అందచేసిన నిధుల గురించి వివరాలు కూడా బయటకు వచ్చాయి. ‘‘ చీకటి ప్రాంతాల ’’ పేరుతో మన ఢల్లీి, కొలకత్తాతో సహా ప్రపంచంలో ఏ ఏ నగరాల్లో సిఐఏ కార్యాలయాలను ఏర్పాటు చేసిందో కూడా ఈ పత్రాల నుంచి వెలికి తీసి రష్యన్‌ టీవీ ప్రకటించింది.


కెనడీ హత్య గురించి దర్యాప్తు జరిపేందుకు 1964లో వారెన్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారు. అదేమీ తేల్చలేదు. 1963 నవంబరు 22 మధ్యాహ్నం డలాస్‌ నగరంలో తన సతీమణి జాక్విలిన్‌, టెక్సాస్‌ గవర్నర్‌ జాన్‌ కోనల్లీ, అతని సతీమణి టాప్‌లేని కారులో ప్రయాణిస్తుండగా 12.30 సమయంలో రైఫిల్‌తో కాల్పులు జరిగాయి. కెనడీ, జాన్‌ కోనలీ ఇద్దరు గాయపడ్డారు. వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించగా ఒంటి గంటకు కెనడీ మరణించాడు, కోనలీ గాయాలతో కోలుకున్నాడు. కాల్పులు జరిపిన ఒక గంటలోనే ఓస్వాల్డ్‌ను పట్టుకున్నారు. రోడ్డు పక్కనే ఉన్న ఒక భవన ఆరవ అంతస్తులో ఉండి కాల్చినట్లు చెప్పారు. కెనడీ ప్రయాణిస్తున్న వాహన శ్రేణికి ఒక వ్యక్తి అడ్డుగా వచ్చినట్లు, అతడిని ఆ భవనంలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదని, ఒక అరగంట ముందు ఓస్వాల్డ్‌ కనిపించినట్లు ఆ భవనంలో పని చేస్తున్న ఉద్యోగులు చెప్పారు. అంతకు ఒక నెల రోజుల ముందే నిందితుడు అక్కడ పని చేస్తున్నట్లు కూడా వెల్లడిరచారు. ఓస్వాల్డ్‌ను పట్టుకొనేందుకు ప్రయత్నించిన పోలీసు జెడి టిపిట్‌ను ఒక రివాల్వర్‌తో చంపివేసినట్లు తెలిపారు.మొత్తం మీద హంతకుడి వెనుక ఉన్నది ఎవరు, కుట్ర ఏమిటి అన్నది వారెన్‌ కమిషన్‌ గానీ, వెల్లడిరచిన రహస్య పత్రాలు గానీ తేల్చలేకపోయాయి. సూత్రధారి సిఐఏ అయితే పాత్రధారి ఎవరు, ఎందుకు కుట్ర చేశారన్నది బహుశా ఎప్పటికీ వెల్లడయ్యే అవకాశాలు లేవని, అంతుచిక్కని ఒక రహస్యంగా మిగిలిపోవచ్చని భావిస్తున్నారు.