Tags
Donald trump, Insane Donald Trump, Iran nuclear weapon, Narendra Modi Failures, TRADE WAR, Trade war Expanding, Ukraine crisis, Vladimir Putin, Volodymyr Zelensky
ఎం కోటేశ్వరరావు
ఆ సాయంత్రం... రాక్సీలో నార్మా షేరర్, బ్రాడ్వేలో కాంచనమాల, ఎటుకేగుటో సమస్య తగిలిందొక విద్యార్ధికి (1939లో చెన్నయ్‌లో ఆంగ్ల, తెలుగు సినిమాలు ఆడిన సినిమాహాళ్లు) అని సంధ్యా సమస్యలు అనే కవితలో శ్రీశ్రీ మన ముందుంచినట్లుగానే ఏ అంశం గురించి రాయాలో ఈ విద్యార్థికి పరీక్ష పెట్టాడు డోనాల్డ్ ట్రంప్.ఏప్రిల్ రెండవ తేదీ నుంచి తనకు లొంగని, నచ్చని దేశాలన్నింటి మీద ప్రకటించిన వాణిజ్య యుద్దంలో పన్ను అస్త్రాల ప్రయోగం, అణు ఒప్పందానికి రాకపోతే అంతు చూస్తామన్న బెదరింపులపై తేల్చుకుందాం రా అంటూ ఇరాన్ అధినేత ఘాటు స్పందన, పుతిన్ మీద కోపం వస్తోందన్న ట్రంప్, గాజాపై సాగుతున్న మారణకాండ ఇలా అనేక సమస్యలు మన ముందున్నాయి. తాను చాలా దయతో వ్యవహరిస్తానని ట్రంప్ ప్రకటించాడు. పిచ్చివాడు అనేక మాటలు మాట్లాడతాడు,తన చేతిలో రాయితో అందరినీ భయపెడతాడు, ఎవరినైనా కొట్టవచ్చు, ఉన్మాదంలో తన తలను తానే పగలగొట్టుకోనూ వచ్చు.వాడి దాడి నుంచి తప్పించుకోవాటానికి ప్రతి ఒక్కరూ చూడటంతో పాటు అదుపులోకి తీసుకొని కట్టడి చేసేందుకూ చూస్తారు. ఇప్పుడు ప్రపంచంలో అదే స్థితిలో ఉందా ! ఏం జరగనుంది !!
మంగళవారం రాత్రి నుంచి అమల్లోకి రానున్న ప్రతి సుంకాల విషయంలో తాను ఎంతో దయతో వ్యహరిస్తానని సోమవారం నాడు డోనాల్డ్ ట్రంప్ చెప్పాడు. తమ నేత చైనా, కెనడా, ఐరోపా యూనియన్లను రెచ్చగొట్టి ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరలేపుతున్నాడని కొంత మంది రిపబ్లికన్ పార్టీ సెనెటర్లే వ్యతిరేకతను వ్యక్తం చేసినట్లు వార్తలు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాం గనుక ప్రతి దేశం దాన్ని ముక్కలు చేస్తున్నందున ప్రతికూల పన్నులు వేయకతప్పటం లేదని, త్వరలో అమెరికాకు విముక్తి రోజు వస్తుందని చెప్పాడు ట్రంప్. తమ శత్రువుల మీద పోరాడాలంటూనే కొన్ని పన్నుల మీద అధికార పార్టీ సెనెటర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, కెనడా మీద చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేస్తానని సుసాన్ కోలిన్స్, థోమ్ టిలిస్ ప్రకటించారు. తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు.ఎవరి జాగ్రత్తలో వారున్నారు.పరస్పర వాణిజ్యంపై చైనా, జపాన్, దక్షిణ కొరియా ఆదివారం నాడు ఒక అవగాహనకు వచ్చాయి. ఏ దేశాల మీద ఎంత పన్ను, ఏ వస్తువుల మీద విధించేదీ బుధవారం నాడు ప్రకటిస్తామని అధ్యక్ష భవన మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ విలేకర్లతో చెప్పారు. పన్నులపై అనిశ్చితి ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడిరది. అమెరికా వాణిజ్య భాగస్వాములందరి మీద 20శాతం వరకు పన్ను విధించవచ్చని ట్రంప్ సలహాదారులు చెప్పినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది. పన్నులతో ముందుకు పోతే రానున్న ఏడాది కాలంలో అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశాలు 20 నుంచి 35శాతానికి పెరుగుతాయని గోల్డ్‌మన్ శాచస్ విశ్లేషకులు చెబుతున్నారు.కార్ల ధరలు పెరిగితే వాటిని తాను పెద్దగా పట్టించుకోనని ట్రంప్ అన్నాడు.
ఇప్పటివరకు చైనా, కెనడా ప్రతి సుంకాలను ప్రకటించాయి. ఐరోపా యూనియన్ బేరసారాలాడుతున్నందున, మరో పదిహేను రోజుల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. కార్ల మీద ట్రంప్ ప్రకటించిన పన్నులు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. అమెరికా పన్నులు ఆతృతకు కారణమౌతున్నాయని ఐఎంఎఫ్ అధిపతి క్రిస్టాలినా జార్జియేవా వ్యాఖ్యానించారు. చైనా, ఐరోపా యూనియన్,మెక్సికో,కెనడా,వియత్నాం, జపాన్, దక్షిణ కొరియా, చైనీస్ తైవాన్, భారత దేశాలతో వస్తు వాణిజ్యంలో అమెరికా లోటులో ఉంది. ఈ దేశాలన్నీ కూడా వాటి లావాదేవీలను పరిమితం చేసుకొనేందుకు చూస్తున్నాయి. అమెరికా వత్తిడికి లొంగి లేదా మన ఎగుమతిదార్ల లాబీ కారణంగా మన దేశం అమెరికాకు కొన్ని రాయితీలు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.మన మీద పన్నుల గురించి ఇంకా స్పష్టత రాలేదు. మొత్తంగా పరిస్థితిని గమనించి అమెరికా ప్రకటించిన పన్నులను గణనీయంగా తగ్గించవచ్చు లేదా కొంత కాలం అమలు వాయిదా వేయవచ్చని కొందరు ఆశిస్తున్నారు.
తమ మీద అమెరికా, దాని అనుయాయులు దాడులకు దిగితే అణ్వాయుధాలను సమకూర్చుకోవటంతప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని ఇరాన్ హెచ్చరించింది. దాడులు జరిగితే వారు కచ్చితంగా ప్రతిదాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని రంజాన్ ఉపవాసమాసం ముగింపు సందర్భంగా చేసిన ప్రసంగంలో అధినేత అయాతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించాడు. ఖమేనీ సలహాదారు అలీ లార్జియానీ టీవీలో మాట్లాడుతూ తాముగా అణ్వాయుధాలను సమకూర్చుకొనే దిశలో పయనించటం లేదని, ఒకవేళ అమెరికా స్వయంగా లేదా ఇజ్రాయెల్ ద్వారా దాడులకు దిగితే తమ నిర్ణయం భిన్నంగా ఉంటుందని, ఆత్మరక్షణకు వాటిని ప్రయోగించకతప్పదని చెప్పాడు. తమతో అణు ఒప్పందం మీద సంతకాలు చేయకపోతే పెద్ద ఎత్తున దాడులు చేస్తామని, సుంకాలు విధిస్తామని ఆదివారం నాడు ట్రంప్ బెదిరించాడు. దీని గురించి సోమవారం నాడు భద్రతా మండలికి ఇరాన్ ఫిర్యాదు చేసింది. రాయబారి అమీర్ సయిద్ ఇర్వానీ ఒక లేఖ ద్వారా తమ మీద దురాక్రమణకు పాల్పడితే నిర్ణయాత్మకంగా వ్యహరిస్తామని, యుద్దోన్మాదం, రెచ్చగొట్టటాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నాడు. గతంలో 2015లో కుదిరిన ఒప్పందం నుంచి ఇదే ట్రంప్ 2018లో ఏకపక్షంగా వైదొలిగాడు. ఇరాన్ పరిసర ప్రాంతాల్లో అమెరికా పది మిలిటరీ కేంద్రాలను, యాభైవేల మంది సైనికులను నిర్వహిస్తున్నది. అద్దాల మేడలో ఉండి ఎవరూ ఇతరుల మీద రాళ్లు వేయకూడదని ఇరాన్ క్షిపణి కార్యక్రమ అధికారి, ఇస్లామిక్ రివల్యూలషనరీ గార్డ్స్ సీనియర్ కమాండర్‌గా ఉన్న అమిరాలీ హజిజదే హితవు పలికాడు.
గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం పశ్చిమ దేశాల ఆంక్షలు ఎత్తివేయాలంటే ప్రతిగా ఇరాన్ తన అణుశుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి ఉంది. అయితే పశ్చిమ దేశాలు ఒప్పందాన్ని ఉల్లంఘించటంతో ఇరాన్ తన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది.వాటిని శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే అని పదే పదే చెబుతున్నది. తిరిగి అణు ఒప్పందంపై చర్చలకు అంగీకరించాలని లేకుంటే మిలిటరీ చర్యతప్పదని మార్చి ఏడవ తేదీన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ద్వారా ట్రంప్ ఒక లేఖను పంపాడు. దానికి గాను గత వారంలో ఒమన్ ద్వారా ఇరాన్ సమాధానం పంపింది. గరిష్ట వత్తిడి, మిలిటరీ చర్య బెదిరింపుల పూర్వరంగంలో తాము ప్రత్యక్ష చర్చలకు సిద్దం కాదని, పరోక్షంగా అంగీకరిస్తామని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశాడు. ఇదే అంశాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా తేటతెల్లం చేశాడు. చర్చలకు తాము విముఖం కాదని, ముందుగా అమెరికా తన గత తప్పిదాలను సరిచేసుకొని విశ్వాసం కలిగించాలని చెప్పాడు. గతంలో కుదిరిన ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలిగిన తీరును బట్టి ఇరానియన్లకు నమ్మకం లేకపోవటం సరైనదే అని వాషింగ్టన్‌లోని స్టిమ్సన్ కేంద్ర బార్బరా స్లావిన్ వ్యాఖ్యానించారు.హిందూ మహాసముద్రంలోని డిగోగార్సియాలో సైనిక కేంద్రానికి అమెరికా అదనపు యుద్ద విమానాలను తరలించిందని, మరొక విమానవాహక నౌకను తరలించటాన్ని చూస్తే ఇజ్రాయెల్‌తో కలసి ఏదో ఒక రకమైన మిలిటరీ చర్యకు సిద్దం అవుతున్నట్లు కనిపిస్తున్నదని ఆమె చెప్పారు. అణుకార్యక్రమంతో పాటు పశ్చిమాసియా ప్రాంతంలో ప్రతినిధుల ద్వారా తన పలుకుబడిని పెంచుకొనేందుకు చూస్తున్నదని పశ్చిమ దేశాలు ఇరాన్ మీద ఆరోపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అలాంటి ప్రతినిధి ఎవరైనా ఉంటే యూదు దురహంకార ప్రభుత్వమేనని దాన్ని తుడిచివేయాలని ఖమేనీ స్పష్టం చేశాడు. అనేక బాంబులను తయారు చేసేందుకు అవసరమైన యురేనియంను ఇరాన్ సమకూర్చుకుందని, అయితే ఇంకా బాంబులను తయారు చేయలేదని ఇటీవల అంతర్జాతీయ అణు ఇంథన సంస్థ పేర్కొన్నది. అవసరమైతే రెండు నెలల వ్యవధిలో బాంబులను రూపొందించి, వాటిని పరీక్షించి, విడదీసి అవసరమైన చోటికి తరలించి తిరిగి తయారు చేసేందుకు, వాటిని ప్రయోగించే క్షిపణులను కూడా సమాంతరంగా సిద్దం చేసిందనే వార్తలు వచ్చాయి. ఆ తరువాతే ట్రంప్ బెదిరింపులకు దిగాడు. ఈ నేపధ్యంలో తన భూగర్భ క్షిపణి ప్రయోగ కేంద్రాలన్నింటినీ ఇరాన్ సన్నద్దం చేస్తున్నదని ఈ మేరకు వాటికి సంబంధించి కొన్ని వీడియోలను కూడా విడుదల చేసిందని వార్తలు వచ్చాయి. శత్రుదేశాల దాడులనుంచి వాటిని కాపాడేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రెండు దేశాల మధ్య చర్చలకు తెరతీయాలంటే విధించిన ఆంక్షలను అమెరికా సడలించాల్సి ఉంటుంది.
రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ మీద తనకు పిచ్చి కోపం వస్తున్నదని డోనాల్డ్ ట్రంప్ అన్నాడు.ఉక్రెయిన్‌పై ఒప్పందానికి ముందుకు రాకపోతే అదనంగా రష్యన్ చమురు మీద 50శాతం పన్నులు విధిస్తానని చెప్పాడు. నెల రోజుల పాటు నల్ల సముద్ర ప్రాంతంలో నౌకల రవాణాపై ఒప్పందానికి ఉక్రెయిన్‌రష్యా అంగీకరించినట్లు ప్రకటించినప్పటికీ అదింకా అమల్లోకి రాలేదు.దాన్లో అంగీకరించినదాని ప్రకారం ఇరు దేశాలు తమ ఇంథన మౌలికవసతులపై పరస్పరం దాడులు నిలిపివేయాలి, అయితే ఇరుపక్షాలూ పాటించటం లేదని ఆరోపించుకుంటున్నాయి. తమ ఆహార, ఎరువుల రవాణాను స్వేచ్చగా జరగనివ్వటంతో పాటు వాటి లావాదేవీలు జరిపే బ్యాంకుల మీద పశ్చిమ దేశాలు ఆంక్షలను తొలగిస్తేనే అమలు చేస్తామని రష్యా షరతులు విధించింది. గతంలో జెలెనెస్కీని బెదిరించిన ట్రంప్ ఇప్పుడు మాటమార్చి రష్యా మీద కేంద్రీకరించాడు.తాను ఏది అనుకుంటే అది చేయగలననే అగ్రరాజ్య అహంకారంతో ఉన్నట్లున్నాడు.
ఉక్రెయిన్‌లో మరింత సమర్దవంతమైన ప్రభుత్వం ఉండాలని, జెలెనెస్కీ పదవీకాలం ముగిసినందున ఐరాస పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పుతిన్ సూచించాడు. ఈ ప్రకటన ద్వారా జెలెనెస్కీని తాను గుర్తించటం లేదని స్పష్టం చేశాడు. నల్లసముద్రంలో నౌకల రవాణా గురించి కూడా అమెరికాతో తప్ప ఉక్రెయిన్‌తో రష్యాకు ఎలాంటి ఒప్పందం లేదు, అయితే అమలు జరపాల్సింది మాత్రం జెలెనెస్కీ యంత్రాంగమే. సుదూరంగా ఉన్న ఉత్తర రష్యా నగరమైన మురుమాన్స్క్‌కు జలాంతర్గామిలో ప్రయాణించిన పుతిన్ విలేకర్లతో మాట్లాడుతూ తాత్కాలిక ప్రభుత్వం అక్కడ ఎన్నికలు జరిపేందుకు దోహదం చేస్తుందని, ప్రజల మద్దతు ఉన్న ప్రభుత్వం ఏర్పడితే దానితో చట్టబద్దమైన పత్రాలపై సంతకాలు చేసేందుకు శాంతి చర్చలకు సిద్దమని చెప్పాడు. యుద్దం కారణంగానే గడువు ముగిసినా రాజ్యాంగం ప్రకారం జెలెనెస్కీ అధికారంలో కొనసాగుతున్నాడని, 50లక్షల మంది పౌరులు దేశం వెలుపల ఉంటున్నపుడు, లక్షలాది మంది యుద్ధ రంగంలో ఉండగా ఎన్నికలు ఎలా సాధ్యమని ఉక్రెయిన్ అంటున్నది. గతంలో తూర్పు తైమూరు, పూర్వపు యుగోస్లావియా తదితర దేశాల్లో ఇలాగే ఎన్నికలు జరిగినపుడు ఇక్కడెందుకు సాధ్యం కాదని పుతిన్ ప్రశ్నించాడు. ఉక్రెయిన్ సంక్షోభంలో ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే నిలిపివేసిన ఆయుధ సాయాన్ని ట్రంప్ పునరుద్దరించాడు. మరోవైపు ఐరోపా దేశాలు కూడా మరింతగా జెలెనెస్కీ సేనలను పటిష్టపరచటం ఎలా అని ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్సు చర్చిస్తున్నాయి.తమ ప్రమేయం లేకుండా అమెరికా కుదుర్చుకున్న ఒప్పంద షరతులను తామెందుకు అమలు జరపాలని ఐరోపా సమాఖ్య పరోక్షంగా ప్రశ్నిస్తోంది.తన పరువు కాపాడుకొనేందుకు ట్రంప్ నానా తంటాలు పడుతున్నాడు. ఆ బలహీనతను ఉపయోగించుకొని తమపై ఆంక్షలను ఎత్తివేయించుకోవాలని, ఉక్రెయిన్‌లో తమకు ఎదురులేదని నిరూపించుకోవాలని రష్యా చూస్తోంది. ఎవరి రాజకీయం వారిది, ఈ క్రమంలో ఎవరి ఇబ్బందులు వారివి !
