Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


వాణిజ్య పోరులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సవ్యసాచిలా బాణాలను వదులుతున్నాడు. మరోవైపు రండి మాట్లాడదాం అంటున్నాడు.చైనా కూడా తన ఆస్త్రాలను వదిలింది. పరిస్థితిని గమనిస్తున్నాం అని అధికారుల చేత మాట్లాడిస్తున్నారు తప్ప మన 56 అంగుళాల గుండె కలిగిన ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పటం లేదు.దేశ ప్రజానీకానికి భరోసా ఇవ్వటం లేదు. ట్రంప్‌కు లొంగిపోవటమా, ప్రతిఘటించటమా అని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన తరుణంలో అన్నీ చూస్తున్నాం అంటే అర్ధం ఏమిటి ? ఎవరినైనా తన కాళ్ల దగ్గరకు తెచ్చుకోగల సమర్దుడు మా మోడీ అని బిజెపి ఇంతకాలం చెప్పింది గనుక ఏం చేస్తారా అని ప్రపంచం అంతా చూస్తున్నది.ఒక దగ్గర స్విచ్‌ వేస్తే మరో దగ్గర లైటు వెలుగుతుంది. డోనాల్డ్‌ ట్రంప్‌తో మన నరేంద్రమోడీ మాట్లాడి ఫార్మాను ప్రతి పన్నుల నుంచి రక్షించినట్లు ఒక ఫార్మా ప్రముఖుడు, రాజ్యసభ సభ్యుడి ప్రకటన ఒకటి పత్రికల్లో వచ్చింది. చైనా ఔషధాలను, సెమీకండక్టర్లను కూడా ట్రంప్‌ మినహాయించాడనే అంశం తెలియదో లేక తెలిసి కూడా మోడీని ప్రసన్నం చేసుకోవటానికి అలాంటి ప్రకటన చేశారో తెలియదు. కానీ అదే ఫార్మా షేర్లు కూడా పతనమయ్యాయి. ట్రంప్‌ వేటినీ వదలడు. పేకాటలో తనకు కావాల్సిన దాని కోసం ఎదుటి వారిని ప్రభావితం చేసేందుకు వేసే వాటిని తురుపు ముక్కలు అంటారు. ఇప్పుడు ట్రంప్‌ అదే చేస్తున్నాడు. అమెరికా వ్యవసాయ, పాడి, కోళ్ల ఉత్పత్తులు, ఆయుధాలు,చమురు, గ్యాస్‌ వంటి వాటిని తమదగ్గర నుంచి కొనిపించేందుకు పెద్ద పథకంతో ఉన్న ట్రంప్‌ ట్రంప్‌ తురుపు ముక్కల మాదిరి కొన్నింటిని పన్నుల నుంచి మినహాయించాడు తప్ప మన మీద ప్రేమ కాదు.


ట్రంప్‌ డిమాండ్‌ చేస్తున్నట్లుగా మన దేశం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెంచుకోవాలంటే అమెరికా వస్తువుల మీద పన్నులను తగ్గించాలంటూ కొంత మంది దేశభక్తులు మరోసారి సన్నాయి నొక్కులు ప్రారంభించారు. ఎర్ర చొక్కా కనిపిస్తే తేళ్లూ జెర్రులూ పాకితే వీరంగం వేసినట్లు ఎగిరిపడేవారు అమెరికా నుంచి గాక చైనా నుంచి ఎక్కువగా ఎందుకు దిగుమతులు చేసుకుంటున్నారో జనాలు ప్రశ్నించాలి. వియత్నాం మీద ఎక్కువగా పన్నులు వేసినందున మన దేశం బియ్యం ఎగుమతులు పెంచుకోవచ్చు అన్నది ఒక సూచన. అమెరికాయే ఒక బియ్యం ఎగుమతి దేశం, మన దగ్గర నుంచి ఇప్పటికే బాస్మతి రకాలను అది పరిమితంగా దిగుమతి చేసుకుంటున్నది, కొత్తగా కొనేదేముంటుంది. వియత్నాం బియ్యం మీద ఇతర దేశాలేమీ పన్నులు వేయలేదు గనుక దాని ఎగుమతులకు ఇబ్బంది ఉండదు. రష్యా మీద అమెరికా ఆంక్షలు విధిస్తే చైనా పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకోలేదా ! అలాగే వియత్నాం నుంచి కొనుగోలు మానేస్తే ఆ మేరకు చైనా దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ సమస్య ట్రంప్‌ వత్తిడికి లొంగి మనం పన్నులు తగ్గిస్తే అక్కడి నుంచి బియ్యం, మొక్కజొన్నలు, సోయా, కోడి కాళ్లు, పాలపొడి, జున్ను సర్వం దిగుమతి అవుతాయి. మన దిగుమతిదారులు లాభాల పిండారీలు తప్ప దేశభక్తులేమీ కాదు, చైనా నుంచి దిగుమతులు లాభం గనుక అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, అదే అమెరికా నుంచి తక్కువకు వస్తే అక్కడి నుంచీ కొంటారు.వారికి సరిహద్దు వివాదాలేమీ ఉండవు. ఇదే నరేంద్రమోడీ గతంలో కోడి కాళ్లు దిగుమతి చేసుకొనేందుకు ఆలోచన చేస్తే మన కోళ్ల పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా అమెరికాను ప్రసన్నం చేసుకొనేందుకు బాతులు, టర్కీ కోడి మాంసాన్ని దిగుమతి చేసుకొనేందుకు 2023లో ఆంక్షలను సడలించారు.పన్ను మొత్తాన్ని 30 నుంచి 5శాతానికి తగ్గించారు. ఇక తరువాత కోడి మాంస ఉత్పత్తులే అని అమెరికన్లు వ్యాఖ్యానించారు. పైన పేర్కొన్న వస్తువులకు తలుపులు బార్లా తెరిస్తే ఏం జరుగుతుందో ఆ మోడీకి కూడా తెలుసు. అయినా అంగీకరిస్తారా లేక వ్యతిరేకిస్తారా ? సీతమ్మకు అగ్ని పరీక్ష అని రామాయణంలో చదివాం, చూశాం. ఇప్పుడు ఆధునిక భారతంలో మోడీకి నిజమైన అగ్ని పరీక్ష ఎదురు కానుంది.


చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతుంటారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని,నిజమే బిజెపితో వచ్చిన ప్రతికూలతను పవన్‌ కల్యాణ్‌ మధ్యవర్తిగా అనుకూలంగా మార్చుకున్నారు. ఏ ఇజమూ లేదు ఉన్నదల్లా ఆపర్చ్యునిజమే( అవకాశవాదం) అనుకొనే వారికి తప్ప ఇలాంటివి అందరికీ సాధ్యమా ? ఇది చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశంలోకి జంప్‌ చేసినపుడే అబ్బింది. ఏ పార్టీతో చేతులు కలపాలన్నా తగిన తర్కం పుష్కలంగా ఉన్న నేత. అమెరికా ఉత్పత్తుల మీద ఇతర దేశాలు ఎక్కువగా పన్నులు విధిస్తే మన ఉత్పత్తులకు మార్కెట్‌ పెరుగుతుందని కొందరు సూచిస్తున్నారు. ఉదాహరణకు అమెరికా సోయా ఎగుమతుల్లో సగం చైనా దిగుమతి చేసుకుంటున్నది. ఇప్పుడు చైనా గతంలో విధించినదాని మీద 34శాతం పన్నులు పెంచింది గనుక, మనం అమెరికా స్థానంలో చైనాకు ఎగుమతులు చేసి పెంచుకోవచ్చన్నది కొందరి తర్కం. నిజంగా అదే జరిగితే ట్రంప్‌ ఊరుకుంటాడా ? కొరడా రaళిపిస్తాడు. రష్యా మీద ఆంక్షలు విధిస్తే వారు మనకు చౌకగా ముడిచమురు అమ్మేందుకు ముందుకు వస్తే మనం విపరీతంగా కొనుగోలు చేసి భారాన్ని తగ్గించుకున్నాం. ట్రంప్‌ ఊరుకున్నాడా ? రష్యా చమురును సరఫరా చేసే టాంకర్ల మీద, కొనుగోలు చేసేవారి మీద ఆంక్షలు పెడితే మన మోడీ కొనుగోళ్లు తగ్గించారా లేదా ! అలాగే చైనాకు సోయా, ఇతర ఎగుమతులు నిలిపివేస్తారా లేదా అని గుడ్లురిమితే మోడీ తట్టుకోగలరా ! అమెరికాకు మన వ్యసాయ ఉత్పత్తులు ఇతర వాటితో పోలిస్తే సోదిలో కూడా కనిపించవు. మిగతాదేశాలేవీ కొత్తగా ప్రతి సుంకాలు విధించలేదు, అయినా మన ఎగుమతులు ఎందుకు పెరగటం లేదు ? అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే బియ్యం మీద మన ప్రభుత్వం ఇప్పుడు 70శాతం, గోధుమల మీద 40శాతం, ఆహార తయారీ 150, ఆక్రోట్స్‌ 100, పాల ఉత్పత్తులు 33 నుంచి 63, కోడి కాళ్లు 100, ఖాద్య తైలాలు 45, మొక్కజన్నలు 50, పూలు 60, సహజ రబ్బరు 70, కాఫీ 100, ఆల్కహాల్‌ 150, సముద్ర ఉత్పత్తుల మీద 30 శాతం పన్నులు విధిస్తున్నది. ఆ మొత్తాలను గణనీయంగా తగ్గించాలని అమెరికా డిమాండ్‌ చేస్తున్నది.మన రైతులకు కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్‌కు మోడీ ససేమిరా అంటున్నారు. 2025 మార్చి నెలలో అమెరికా వాణిజ్య ప్రతినిధి ఢల్లీి వచ్చి చట్టబద్దత సంగతి తరువాత అసలు మద్దతు ధరలు ప్రకటించటం ఏమిటని ప్రశ్నించినట్లు వార్తలు.వాటితో ప్రపంచ వాణిజ్యమే అతలాకుతలం అవుతున్నదట, బహుశా అందుకే వాటి చట్టబద్దత గురించి మోడీ భయపడుతున్నారా ? మరోవైపున అమెరికా తన రైతులకు 100శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నది. మన మార్కెట్‌ ధరల కంటే అమెరికా బియ్యం, ఇతర ఉత్పత్తులు తక్కువకు వచ్చి దిగుమతులు పెరిగితే మన రైతాంగ పరిస్థితి ఏమిటి ? జన్యు మార్పిడి పంటల దిగుమతికి మోడీ సర్కార్‌ అనుమతి ఇవ్వలేదు, కానీ అమెరికా వత్తిడిని తట్టుకోలేక 2021లో పశుదాణా నిమిత్తం 12లక్షల టన్నుల సోయా మీల్‌ దిగుమతికి అనుమతించింది.


మంచి తరుణం మించిపోవును ఎవరు ముందు వస్తే వారికి ఎక్కువ రాయితీలు ఇస్తాడు ట్రంప్‌ అంటూ వందల కోట్ల ద్రవ్య వ్యాపారి బిల్‌ అక్‌మన్‌ ప్రపంచ దేశాలకు సలహా ఇచ్చాడు. తక్షణమే ఎవరికి వారు వచ్చి పన్నుల గురించి చర్చించి ఒప్పందాలు చేసుకోమంటున్నాడు. స్టాక్‌మార్కెట్‌లు కుప్పకూలి తన పెట్టుబడుల విలువ తగ్గిపోతున్నది గనుక అక్‌మన్‌ నుంచి అలాంటివి గాక వేరే సలహాలు ఎందుకు వస్తాయి ?అమెరికాలో ఏదైనా కంపెనీ ఫ్యాక్టరీలను ప్రారంభిస్తే సదరు కంపెనీల ఉత్పత్తుల మీద పన్ను విధింపు రద్దు చేస్తాడని కూడా చెప్పాడు. వెనుకటి కెవడో నాకు పదివేల రూపాయలిస్తే బంగారాన్ని తయారు చేసే మంత్రం చెబుతా అన్నాడట.వాడే తయారు చేసి సొమ్ము చేసుకోవచ్చు కదా. అమెరికా దగ్గర డబ్బు లేకనా !


అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్‌నిక్‌ ఇటీవల మన దేశం వచ్చాడు. ఇండియా టుడే సమావేశంలో మాట్లాడుతూ మీ వ్యవసాయమార్కెట్‌లోకి ఇతరులు రాకుండా ఎంతో కాలం మూసుకొని కూర్చోలేరన్నాడు. మాతో కలిస్తే మీకెంతో లాభం,ఇద్దరం ఒప్పందం చేసుకుందాం అన్నాడు. దీర్ఘకాలంగా రష్యా నుంచి మిలిటరీ పరికరాలను కొనుగోలు చేస్తున్నారని దానికి స్వస్థిపలికి తమ దగ్గర మరింతగా కొనాలన్నాడు.మేం మీతో మరింతగా కలసిపోవాలని, మరింతగా వాణిజ్యం చేయాలని అనుకుంటుంటే చైనా ప్రతిపాదించిన బ్రిక్స్‌ దేశాల కరెన్సీ ఉనికిలోకి రావటం మా ట్రంప్‌కు ఇష్టం లేదు, చైనాతో కలసి ఇలాంటి పనులు చేస్తే ప్రేమ, ఆప్యాయతలు పుట్టటానికి వీలుండదు అంటూ ఉపన్యాసం సాగించాడు.అమెరికా వాణిజ్య ప్రతినిధి కూడా ఇంతే. ప్రపంచ వాణిజ్య సంస్థ పరిధి దాటి ప్రపంచంలో అధికంగా 113.1 నుంచి 300శాతం వరకు విధించే దేశాలలో ఒకటిగా భారత్‌ తయారైందని అమెరికా వాణిజ్య వార్షిక నివేదికలో నివేదికలో ధ్వజమెత్తారు. ఇంత పచ్చిగా మన విధానాలు ఎలా ఉండాలో బహిరంగంగా చెప్పే ధైర్యం అమెరికాకు వచ్చిందంటే మనలోకువే కారణం కాదా ! మిలిటరీ, దిగుమతులు, వ్యాపారం అంతా తమ చేతుల్లోకి తీసుకొని మన జుట్టు చేజిక్కించుకోవాలన్నది అమెరికా దురాలోచన. మనకు అర్ధం కావటం లేదా కానట్లు నటిస్తున్నామా ! వారైతే అరటి పండు వలచి చేతిలో పెట్టినట్లు చెబుతున్నారు. ‘‘ పన్నుల రారాజు, ఒప్పందాల దుర్వినియోగి ’’ అని స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే మనలను తిట్టినా చీమకుట్టినట్లు కూడా లేదు.


మనదేశంలో సగటు కమత విస్తీర్ణం ఒక హెక్టారు(రెండున్నర ఎకరాలు) కాగా అమెరికాలో 46 హెక్టార్లు. అక్కడ వ్యవసాయం మీద కేవలం రెండుశాతమే బతుకుతుంటే మనదగ్గర జనాభాలో సగం 50శాతం ఉన్నారు. ఇక్కడ బతకటానికి , అక్కడ వ్యాపారానికి సాగు చేస్తారు. అనేక మంది మేథావులకు మన రైతులంటే చిరాకు ఎందుకటా ! ఎకరాదిగుబడులను గణనీయంగా పెంచటం లేదట, అలా చేస్తే సాగు గిట్టుబాటు అవుతుంది, ఆపని చేయకుండా ధరలు కావాలి, పెంచాలి అంటారు అని విసుక్కుంటారు. ఏ రైతుకారైతు అధిక దిగుబడి వంగడాలను రూపొందించలేడు, పరిశోధనలు చేయలేడు. ఆ పని చేయాల్సిన పాలకులు గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నారు.కాంటాక్టు వ్యవసాయం అయితే దిగుబడి పెరుగుతుంది, పెద్ద కమతాలు లాభదాయకమన్నది కొంత వరకు వాస్తవమే. రైతులందరూ భూములను ఏదో ఒక రూపంలో కంపెనీలకు అప్పగించి ఉపాధికోసం వారి పొలాల్లోనే వ్యవసాయ కూలీలుగా మారి వేతనాలు తీసుకోవటం తప్ప వారికి అదనంగా ఒరిగేదేమీ లేదు. నరేంద్రమోడీ తనకు మంచి మిత్రుడు అంటాడు ట్రంప్‌. భారత్‌ పెద్ద సహభాగస్వామి అంటుంది అమెరికా. ఎక్కడన్నా బావేగానీ వంగతోటదగ్గర కాదన్నట్లుగా ఇన్ని కబుర్లు చెప్పే అమెరికా మన వరి సాగు ఖర్చుల కంటే అదనంగా 87.85, గోధుమల మీద 67.54శాతం అదనంగా కనీస మద్దతు ధరలను నిర్ణయించినట్లు ప్రపంచ వాణిజ్య సంస్థలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఉక్రెయిన్‌, కెనడాలను కలుపుకొని కేసుదాఖలు చేసింది. ఇదంతా మన మీద వత్తిడి, లొంగదీసుకొనే ఎత్తుగడలో భాగమే. అలాంటి దేశాధినేత ట్రంప్‌ ఇప్పుడు మన రైతాంగం మీద బాణాలను ఎక్కుపెట్టాడు.రక్షకుడు అని చెబుతున్న ప్రధాని నరేంద్రమోడీ రైతన్నలకు అండగా ఉంటారా ? అమెరికాకు లొంగిపోతారా, ఏ కారణంతో అయినా లొంగితే ఈసారి దేశవ్యాపితంగా రైతాంగం ఉద్యమించటం ఖాయం ! ఢల్లీి శివార్లలో ఏడాది పాటు మహత్తర ఉద్యమం సాగించి మోడీ మెడలు వంచిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ఇదే హెచ్చరించింది !!