Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కేసు ఓడిన వారు కోర్టులో ఏడుస్తారు, గెలిచిన వారు ఇంట్లో ఏడుస్తారనే లోకోక్తి తెలిసిందే. అంటే గొడవ పడి కోర్టుకు ఎక్కితే ఇద్దరూ నష్టపోతారని అర్ధం, అలాగే వాణిజ్య పోరులో విజేతలెవరూ ఉండరని నెత్తీ నోరూ కొట్టుకుంటున్నా ఎవరూ వినటం లేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్యపోరు 2.0లో ముందు ఓడేది అమెరికానా లేకా చైనా వారా అన్నది కొందరి మీమాంస. మొగ్గు అమెరికావైపే కనిపిస్తున్నది, ఏమైనా జరగవచ్చు. బస్తీమే సవాల్‌ అంటూ ప్రపంచం మీద తొడగొట్టింది ట్రంప్‌. దానికి ప్రతిగా చూసుకుందాం రా అంటూ మీసం మెలివేస్తున్నది చైనానేత షీ జింపింగ్‌. అయినను పోయి రావలె హస్తినకు అన్నట్లుగా ట్రంప్‌తో రాయబారాలు, బేరాలు చేసినప్పటికీ కుదరకపోవటంతో చేసేదేముంది మనమూ గోదాలోకి దిగుదాం అని ఐరోపా సమాఖ్య ప్రకటించింది. కొంత మందికి దిక్కుతోచక నోట మాట రావటం లేదు. మన విషయానికి వస్తే దానికి స్థిత ప్రజ్ఞత అని ముద్దు పేరు పెట్టి నరేంద్రమోడీకి ఆపాదించి సామాజిక మాధ్యమంలో ఆకాశానికి ఎత్తుతున్నారు. చైనా ప్రతిసవాలును షీ జింపింగ్‌ ఆవేశంగా వర్ణిస్తున్నారు.మోడీని కొందరు గోపి అంటుంటే 56 అంగుళాల ఛాతీకీ ఏమైందని అనేక మంది విస్తుపోతున్నారు. సాధారణ సమయాల్లో పౌరుషం, వీరత్వం గురించి మీసాలు మెలేయటం, తొడగొట్టటాలు కాదు, ఓడతామా గెలుస్తామా అన్నదీ కాదు, పరీక్షా సమయం వచ్చినపుడు ఏం చేశారనేదే గీటురాయి. పృధ్వీరాజ్‌ను ఓడిరచేందుకు పరాయి పాలకులతో చేతులు కలిపి ద్రోహానికి మారుపేరుగా తయారైన జయచంద్రుడు బావుకున్నదేమీ లేదు, చివరికి వారి చేతిలోనే చచ్చినట్లు చరిత్ర చెబుతున్నది.


అనేక ఆటంకాలు, ప్రతిఘటనలు, కుట్రలు, కూహకాలను ఎదుర్కొంటూ ప్రపంచ అగ్రరాజ్యానికి పోటీగా ఎదుగుతున్నది చైనా. 2024లో అమెరికా జిడిపి 29.2లక్షల కోట్లు కాగా చైనా 18.9లక్షల కోట్లతో ఉండగా వృద్ధి రేటు 2.8, 5శాతం చొప్పున ఉన్నాయి. అంటే త్వరలో అమెరికాను అధిగమించనుంది. పిపిపి పద్దతిలో ఇప్పటికే చైనా అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు దానికి డోనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద పరీక్ష పెట్టిన మాట నిజం. చైనా వస్తువుల మీద 145శాతం పన్నులు విధించిన ట్రంప్‌కు అతనికంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లు అమెరికా న్యాయమూర్తి ఒకడు 400శాతం విధించి కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని సలహా ఇచ్చాడు.జపాన్‌ సామ్రాజ్యవాదుల ఆక్రమణకు,కొరియాలో అమెరికా సేనలకు వ్యతిరేకంగా పోరాడిన చైనా కమ్యూనిస్టు పార్టీ వారసుడు షీ జింపింగ్‌. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరులో పాత్రలేకపోగా లొంగిపోయి సేవ చేసుకుంటామని లేఖలు రాసి ఇచ్చిన వారి వారసుడు నరేంద్రమోడీ. అందువలన అమెరికా సామ్రాజ్యవాదం, దానికి ప్రతినిధిగా ఉన్న ట్రంప్‌ను వ్యతిరేకించటంలో ఆ తేడా ఉండటం సహజం.
ఇది రాసిన సమయానికి చైనా వస్తువుల మీద పెంటానిల్‌ పన్ను 20శాతంతో కలిపి అమెరికా 145శాతం పన్ను విధించగా ప్రతిగా 125శాతం విధించినట్లు చైనా ప్రకటించింది. పోరు రెండు దేశాలకే పరిమితమైంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా కేసును కూడా దాఖలు చేసింది. చైనాను దుష్టశక్తిగా అమెరికా చూపుతున్నది.ఈ పోరు ప్రపంచ, అమెరికా ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందని బడా వాణిజ్య సంస్థల హెచ్చరిక, తక్షణమే చర్చలు జరపాలని అమెరికా`చైనా వాణిజ్య మండలి పిలుపు, చైనా వైపు నుంచి చర్చలకు చొరవ ఉండదని నిపుణుల అభిప్రాయం, తన అమ్ముల పొదిలోని అస్త్రాలన్నింటినీ చైనా మోహరిస్తున్నది, బీజింగ్‌ను వంటరి చేసేందుకు అనేక దేశాల మీద సుంకాలను రద్దు చేసిన ట్రంప్‌, అమెరికాను వ్యతిరేకించే శక్తులను కూడగడుతున్న చైనా. మార్కెట్లలో అనిశ్చితిని చూస్తే ఇప్పటికే నష్టం జరిగినట్లు కనిపిస్తోంది.


‘‘మీరు అమెరికాను కొడితే మా అధ్యక్షుడు ట్రంప్‌ మరింత గట్టిగా కొడతాడు ’’ అని అధ్యక్ష భవన మీడియా అధికారిణి కరోలిన్‌ లీవిట్‌ ప్రకటించారు. పెద్ద పెద్ద అరుపులకు, ఉడుత ఊపులకు భయపడే రకం కాదు మేం అంటూ తాపీగా చైనా ప్రకటన. ఆకాశం ఊడిపడదంటూ అధికార పత్రిక పీపుల్స్‌ డైలీ వ్యాఖ్య. అమెరికా మార్కెట్ల మీద ఆధారపడటాన్ని తగ్గించుకుని అంతర్గత మార్కెట్‌ను విస్తరిస్తున్నామని పేర్కొన్నది. అయితే చర్చలకు ద్వారాలు మూయలేదని కూడా తెలిపింది. తొలిసారి 2018లో ట్రంప్‌ వాణిజ్య పోరును ప్రారంభించిన నాటి నుంచి చైనా తన అస్త్రాలన్నింటినీ అవసరాల మేరకు ప్రయోగిస్తున్నది. అమెరికా నుంచి దిగుమతులను తగ్గించింది, ఎగుమతులను నియంత్రిస్తున్నది.అమెరికా కంపెనీలను నిషేధిత జాబితాలో చేరుస్తున్నది.కొన్నింటి మీద నియంత్రణలను అమలు చేస్తున్నది. విలువైన ఖనిజాలను అమెరికాకు అందకుండా చూస్తున్నది. ‘‘ అమెరికాకు వ్యతిరేకంగా బీజింగ్‌ తన అమ్ముల పొది మొత్తాన్ని ఇప్పుడు వినియోగిస్తున్నది.వారు బంకర్‌(దాడుల నుంచి తట్టుకొనే భూ గృహం) నిర్మిస్తున్నారు, నేనే గనుక షీ జింపింగ్‌ను అయితే నేడు డోనాల్డ్‌ ట్రంప్‌ కంటే మరింత సౌకర్యవంతంగా ఉన్నట్లు భావిస్తా ’’ అని అమెరికా అట్లాంటిక్‌ కౌన్సిల్‌కు చెందిన మెలాని హార్ట్‌ వ్యాఖ్యానించాడు.


మూడు నెలల పాటు తాను ప్రకటించిన పన్నుల యుద్ధాన్ని వాయిదా వేస్తున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన దేనికి సూచన అని పండితులు చర్చలు చేస్తున్నారు. చైనాకు ప్రపంచ మార్కెట్ల మీద గౌరవం,శ్రద్ద లేదని ట్రంప్‌ ఆరోపణ, బీజింగ్‌ మీద కోపం ఉంటే యావత్‌ ప్రపంచం మీద ప్రతికూల పన్నులెందుకు ప్రకటించినట్లు ? అతగాడి నిర్వాకం కారణంగా స్టాక్‌మార్కెట్లు పతనమయ్యాయన్నది తెలిసిందే. మూడు నెలల వాయిదా గురించి సామాజిక మాధ్యమంలో వచ్చిన వార్తలను కొద్ది రోజుల ముందు ట్రంప్‌ యంత్రాంగం తోసి పుచ్చింది. తమ మంత్రిత్వశాఖలు, వాణిజ్య ప్రతినిధితో 75దేశాలు సంప్రదింపులు జరిపినట్లు ట్రంప్‌ చెప్పుకున్నాడు. వారంతా ఒప్పందం చేసుకోవటానికి చచ్చిపోతున్నారన్నాడు.రిపబ్లికన్‌ పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ మనకు ఫోన్లు చేస్తున్న వారు ప్లీజ్‌ ప్లీజ్‌ సర్‌ ఒప్పందం చేసుకోండి, నేను ఏదైనా చేస్తాను అని చెబుతున్నారని, చివరకు నా….ను ముద్దు పెట్టుకుంటున్నారని నోరుపారవేసుకున్నాడు. ఎక్కువ పన్నులు విధించిన దేశాల నుంచి సరకులను దిగుమతి చేసుకొని వాటికి మన ముద్ర వేసి తిరిగి ఎగుమతి చేయవద్దని మన వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ మన ఎగుమతిదార్లను హెచ్చరించారు.పిటిఐ వార్త మేరకు చైనా, ఇతర ఆసియన్‌ ఆదేశాల సరకులను మన దేశం నుంచి ఎగుమతి చేయవద్దని చెప్పారట. మన ఎగుమతిదార్లు అలాంటి పనులు చేస్తున్నట్లు గతంలో ఎన్నడూ మన ప్రభుత్వం చెప్పలేదు. ఇప్పుడు అలా మాట్లాడారంటే అమెరికా మెప్పు పొందేందుకే అన్నది స్పష్టం. ఏ దేశం నుంచి ఏ సరకు వస్తోందో తిరిగి ఎక్కడికి వెళుతోందో తెలుసుకోలేనంత అధ్వాన్నంగా మన నిఘా సంస్థలు, వాటిని నడిపిస్తున్న ప్రభుత్వం ఉందా ?

అసలు పన్నుల వాయిదా నిర్ణయానికి దారితీసిందేమిటి ? మొదటి కారణంగా చెప్పుకోవాలంటే ఏప్రిల్‌ ఐదున 150 సంస్థల పిలుపు మేరకు 20లక్షల మంది జనం నిరసన ప్రదర్శనలు చేశారు. వెనక్కు తగ్గకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తొలుత మద్దతు ప్రకటించిన ద్రవ్య పెట్టుబడిదారులు, ఇతరులు కూడా పర్యవసానాలను చూసి వైఖరి మార్చుకుంటున్నారు. ఒక్కరంటే ఒక్క ఆర్థికవేత్త కూడా సానుకూలంగా మాట్లాడిన ఉదంతం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుతుందన్న భయం పెరిగింది. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత భారీగా పెరుగుతుందని ఆశించిన ఎలన్‌ మస్క్‌ సంపద ఇప్పటి వరకు 135 బిలియన్‌ డాలర్లు హరించుకుపోయింది. చైనాతో ఎవరి మీదా పన్నులు వేయవద్దని, పునరాలోచించాలని ట్రంప్‌ను మస్క్‌ గట్టిగా కోరినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక రాసింది. చైనా వెనక్కు తగ్గకపోగా ఐరోపా సమాఖ్య కూడా ప్రతిఘటనకు పిలుపు ఇచ్చింది.23 బిలియన్‌ డాలర్ల పన్ను విధిస్తామన్నది. ట్రంప్‌ మాదిరి అది కూడా ప్రతికూల సుంకాలను 90 రోజులు వాయిదా వేసింది. పన్నుల విధింపులో కీలక పాత్ర పోషించిస సలహాదారు పీటర్‌ నవారో, ఎలన్‌మస్క్‌ రోడ్డెక్కి అంతా నువ్వే చేశావంటే నువ్వే చేశావని దుమ్మెత్తి పోసుకుంటున్నారు. విదేశాల నుంచి విడి భాగాలు తీసుకొచ్చి అసెంబ్లింగ్‌ చేసి ఇక్కడే కార్లను తయారు చేస్తున్నట్లు చెప్పుకోవటం ఒక గొప్పా అన్నట్లు మస్క్‌ మీద నవారో ధ్వజమెత్తాడు. స్వదేశంలో పెట్టుబడులు పెట్టి వస్తూత్పత్తి చేయాలన్న పిలుపుకు పెద్ద స్పందన కనిపించటం లేదు. ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసిన వారు వాటిని అమ్మి సొమ్ము చేసుకొని అమెరికా వెలుపల పెట్టుబడులు పెడుతున్నారు. లొంగుబాటును ప్రదర్శించే దేశాల మీద కొన్ని ఒప్పందాలను రుద్ది దక్కిన మేరకు లబ్ది పొందే ఎత్తుగడ కూడా కనిపిస్తున్నది.


గతంలో కమ్యూనిజం బూచిని చూపి దాన్ని వ్యతిరేకించే దేశాలన్నింటినీ అమెరికా కూడగట్టింది. ఇప్పుడు ప్రపంచం తన అడుగుజాడల్లో నడవటం లేదన్న అక్కసుతో ట్రంప్‌ దేశాలన్నింటి మీద యుద్ధం ప్రకటించాడు.తనకు తానే అమెరికాను ఒంటరిపాటు చేశాడు.కొలిమిలో కాలినపుడే ఇనుమును సాగదీయాలన్న సూత్రానికి అనుగుణంగా అమెరికా దిగిరావాలంటే దాని బాధిత దేశాలన్నీ ఏకం కావటం తప్ప మరొక మార్గం లేదు.కొన్ని తొత్తు దేశాలు కలవక పోవచ్చు, విభీషణుడి పాత్ర పోషించవచ్చు. మన దేశం ఎలాంటి ప్రకటన చేయకపోయినా మాకు అందరూ కావాలి ఎవరితో కలవం అని ఆస్ట్రేలియా చెప్పుకుంది. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తనతో కలసి పని చేస్తున్న ఐరోపా దేశాలను పక్కన పెట్టి రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్‌ను నమ్మేదెలా అని ఆలోచిస్తున్న తరుణంలో వాటి మీద కూడా పన్నుల యుద్ధం శంఖారావం పూరించాడు. ఒంటరి పోరుకు సిద్దం అవుతూనే అలాంటి దేశాలన్నింటినీ కూడ గట్టేందుకు చైనా పూనుకుంది. ఎంత మేరకు విజయవంతమౌతుందనేది వేరే అంశం. చైనా ప్రధాని లీ క్వియాంగ్‌ ఫోన్లో ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లియాన్‌తో మాట్లాడాడు.తరువాత వాణిజ్య ప్రతినిధులు మాట్లాడుకున్నారు. పది ఆగ్నేయాసియా దేశాల కూటమితో కూడా చైనా సంప్రదింపుల్లో ఉంది. ఏం జరగనుందనే ఆసక్తి సర్వత్రా పెరుగుతున్నది, ముందుగా ఎవరు మునుగుతారన్నది చర్చగా మారుతున్నది.