ఎం కోటేశ్వరరావు
కేవలం మూడు నిమిషాల్లోనే విడిపోయిన జంట ఉదంతం ప్రపంచంలో అత్యంత తక్కువ సమయం మనుగడ సాగించిన వివాహంగా చరిత్రలో నమోదైంది. కువాయిట్‌లో 2019లో ఇది జరిగింది, ప్రమాదవశాత్తూ తూలిపడిన వధువును బుద్ధిలేనిదానా అని తిట్టిన వరుడు తనకు అక్కర లేదనటంతో కోర్టుకు ఎక్కారు. అంతకు వందేళ్ల క్రితం ఒక హాలీవుడ్ జంట కేవలం 20నిమిషాల్లోనే విడిపోయింది. వివాహం మీద పునరాలోచనలో పడ్డ నటి భర్తను హానీమూన్ రూమ్‌లో పెట్టి బయట తాళం వేసి వెళ్లిపోయిందట. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్, ప్రపంచ అగ్రరాజ్య అధిపతి డోనాల్డ్ ట్రంప్ ప్రేమాయణం చెడిరది. ఇద్దరూ లాభాలు తప్ప మరొకటి పట్టని పక్కా వ్యాపారులే. ఛీ పో అంటే ఛా పో అనుకున్నారు, అంతలోనే మరోసారి దగ్గరయ్యేందుకు చూస్తున్నారు, సిగ్గూ ఎగ్గులేని బతుకులు. ప్రేమలో పడటానికి, విడిపోవటానికి, తిరిగి దగ్గర కావటానికి డాలర్లు తప్ప మరొక అంశాన్ని ఊహించటం కష్టం. జెఫ్రీ ఎప్‌స్టెయిన్ అనే అమెరికన్ పక్కా తిరుగుబోతు, తార్పుడుగాడు. పద్నాలుగు, పదిహేనేండ్ల ఆడపిల్లలను వలవేసి పట్టటం అనుభవించటం, బడాబాబులకు తార్చటం, తద్వారా లబ్దిపొందటం వాడి చరిత్ర.2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వాడి గురించి దర్యాప్తు చేసిన పోలీసులు సేకరించిన సమాచారాన్ని జెఫ్రీ ఫైల్స్ అంటున్నారు. వాటిలో డోనాల్డ్ ట్రంప్ పేరు ఉందన్నది తాజాగా ఎలన్ మస్క్ పేల్చిన బాంబు. అందుకే వాడిని జైల్లో లేపేశారని బయటకు ఆత్మహత్య చేసుకున్నాడని కథలు అల్లారని చెబుతారు. వీడి ఖాతాదార్లలో ట్రంప్ ఉన్నట్లు ఎక్స్ చేసిన మస్క్ దాన్ని వెనక్కు తీసుకున్నాడు. డోనాల్డ్ ట్రంప్ పేరు ఎప్‌స్టెయిన్ ఫైల్స్‌లో ఉంది, అందుకే వాటిని బహిర్గత పరచలేదు అని మస్క్ పేర్కొన్నాడు. తరువాత దాన్ని తొలగించాడు. దీని మీద తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో నాకు వ్యతిరేకంగా ఎలన్ మస్క్ మారటాన్ని నేను పట్టించుకోను అన్నాడు, ఎయిర్ ఫోర్స్ ఒన్ విమానంలో ప్రయాణిస్తూ దాని గురించి నేనసలు ఆలోచించటం లేదన్నాడు.అయితే మస్క్ కంపెనీలతో ప్రభుత్వ కాంట్రాక్టుల గురించి ప్రతి అంశాన్ని పరిశీలిస్తామన్నాడు. డెమోక్రటిక్ పార్టీకి నిధులు ఇస్తే సంగతి చూస్తానని బెదిరించాడు.
ట్రంప్‌ను పదవి నుంచి అభిశంసన ద్వారా తొలగించాలని మస్క్ అన్నాడు. అదే నోటితో లాస్ ఏంజల్స్‌లో వలస కార్మికుల నిరసనలను అణచివేసేందుకు మిలిటరీని దింపిన ట్రంప్‌ను పొగుడుతున్నాడు. మస్క్‌తో మాట్లాడేదేలేదు అన్న ట్రంప్ మాట మార్చాడు. మస్క్ ఫోన్ చేస్తే మీరు మాట్లాడతారా అన్న విలేకర్ల ప్రశ్నకు దాని గురించి నిజంగా నేను ఆలోచించలేదు, నేను ఊహించగలను, దాని గురించి ఆలోచిస్తా అన్నాడు తప్ప అవునని కాదని చెప్పలేదు. దోచుకొనేదగ్గర, వాటాల పంపిణీలో దెబ్బలాట, జనాన్ని అణచటంలో ముద్దులాట. వర్గనైజం ఇది. ఎలన్‌మస్క్ పెద్ద వ్యాపారి, పారిశ్రామికవేత్త.తన టెస్లా కార్లను అమ్ముకోవాలన్నా, స్టార్‌లింక్‌ను పలుదేశాల్లో ఏర్పాటు చేయాలన్నా అమెరికా పాలకుల అండకావాలి. మన నరేంద్రమోడీ ఇటీవలనే అనుమతించటం దానికి పక్కా నిదర్శనం. డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారుగా ఉన్న ఆ పెద్ద మనిషి అందుకోసమే డోనాల్డ్ ట్రంప్‌కు ఎన్నికల విరాళాల రూపంలో ఆర్థికంగా భారీ మొత్తంలో సమర్పించుకున్నాడు.అధికారానికి వచ్చిన మరుసటి రోజు నుంచే సతాయించటం మొదలు పెట్టాడు. రానున్న రోజుల్లో వినియోగదారులందరూ విద్యుత్ కార్లే కొనుగోలు చేయాలంటూ ఒక విధాన నిర్ణయం చేయాలని, వాటి మీద ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని పెంచాలని, వారికి అందుబాటులో మూలమూలనా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు. ట్రంప్ దానికి అంగీకరించలేదు . ఎందుకని ? అమెరికా కార్ల కంపెనీల యజమానుల చరిత్రను చూసినపుడు తమ కార్లను అమ్ముకొనేందుకు ప్రజారవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్లను, ట్రామ్‌లను పక్కన పెట్టేసే విధంగా ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చి విజయవంతమయ్యారు. వారికి పెట్రోలు, డీజిలు అమ్ముకొనే కంపెనీలు వత్తాసు పలికాయి. ఎక్కడో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుడు కావచ్చు కానీ ఇప్పటికే ఉన్న చమురు కార్ల పరిశ్రమ మొత్తాన్ని మూసివేయించేంత మొనగాడా అది జరిగితే నీ సంగతి తేలుస్తామని ఆ రంగంలోని కంపెనీలు ట్రంప్‌ను హెచ్చరించటంతో ఇరకాటంలో పడి వెనక్కు తగ్గాడు. వారి మధ్య వైరానికి అసలు కారణం ఇదే !
ఎలన్ మస్క్, డోనాల్డ్ ట్రంప్‌ల అక్రమ సంబంధాలు జగమెరిగిన సత్యం. ఇంతకు ముందు గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బెన్ భార్య నికోలే సహాన్‌తో మస్క్ పెట్టుకున్న అక్రమ సంబంధం కారణంగా వారిద్దరూ విడిపోయారు. తాజా ఉదంతానికి వస్తే అమెరికా అధ్యక్ష భవనంలో ఉన్నత అధికారిగా పనిచేస్తున్న స్టెఫాన్ మిల్లర్ భార్య కాటీ మిల్లర్‌తో సంబంధం పెట్టుకున్నట్లు గుప్పుమంది. ట్రంప్ మీద ఆగ్రహంతో మస్క్ డోజ్ పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్లినపుడు అప్పటి వరకు అధ్యక్ష భవనంలో ఉద్యోగిగా ఉన్న కాటీ కూడా రాజీనామా చేసి ఎలన్ మస్క్ కంపెనీలో పని చేసేందుకు వెళ్లిపోయింది. వేరే సందర్భంలో స్టెఫాన్ మిల్లర్ ‘‘ అమెరికాను తిరిగి వెనక్కు తీసుకువచ్చాం’’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. దాని మీద మస్క్ స్పందిస్తూ ‘‘ నేను నీ భార్యను తీసుకుపోయినట్లేనా ’’ అని వ్యాఖ్యానించాడు. అయితే అదంతా నిజం కాదని తానలాంటి పోస్టు పెట్టలేదని మస్క్ చెప్పుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. తన స్వంత కృత్రిమ మేథ గ్రోక్‌ను సంప్రదిస్తే అది కూడా మస్క్ పెట్టిన పోస్టు స్క్రీన్ షాట్ నిజమే అని చెప్పిందట. అమెరికా స్టాక్ మార్కెట్ వీటిని పెద్దగా పట్టించుకోదు. ఇద్దరూ రాజీబాటలో ఉన్నారని సంతృప్తి వ్యక్తం చేయటంతో మస్క్ కంపెనీల వాటాల ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ పడిపోయన నాటి స్థాయికి చేరలేదు. వెంటనే వారిద్దరూ కలవక పోయినా కొన్ని నెలలకు పూర్తిగా సర్దుకుంటారని భావిస్తున్నారు.ఇద్దరి మధ్యా సంబంధాలు బాగున్నాయని అందరూ భావించినపుడు మార్చి నెలలో ట్రంప్ ఒక ఎర్ర టెస్లా కారు ముందు నిలిచి దానిని కొనుగోలు చేసినట్లు ఫొటోలకు ఫోజులిచ్చాడు. దాన్ని ఇప్పుడు వదిలించుకోవచ్చని అధ్యక్ష భవన సిబ్బంది చెబుతున్నారు.
మాజీ డెమోక్రాట్ అయిన మస్క్ 2016లో ట్రంప్ తొలిసారి అధికారానికి వచ్చినప్పటి నుంచి వాణిజ్య సలహ మండళ్లలో చోటు సంపాదించుకున్నాడు.రెండోసారి ఓడిపోయిన తరువాత ఇక చాల్లే మళ్లీ పోటీకి దిగవద్దన్నాడు. ఫ్లోరిడా గవర్నర్ డేశాంటిస్ పోటీ చేస్తే తాను మద్దతు ఇవ్వకపోయినా జో బైడెన్ మీద గెలుస్తాడని ఎక్స్ చేశాడు. కానీ 2024లో ట్రంప్‌కు అన్నీ తానే అన్నట్లు వ్యవహరించాడు. అతగాడి కోసమే తొలిసారిగా రిపబ్లికన్ పార్టీకి ఓటు వేశానన్నాడు. అమెరికా అధికారపీఠంపై అనుచరులతో ట్రంప్ దాడి చేయించినపుడు ఎక్స్ ఖాతాను రద్దు చేశారు. తరువాత మస్క్ కొనుగోలు చేసిన తరువాత 2022 చివరిలో పునరుద్దరించాడు.ట్రంప్ సొంతంగా ట్రూత్ అనే వేదికను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ట్రంప్ కేసుల్లో ఇరుక్కునపుడు ఐదు కోట్ల డాలర్లు మస్క్ ఇచ్చాడు. ట్రంప్ ఎన్నడూ తనను డబ్బు అడగలేదని తానే ఇచ్చినట్లు చెప్పుకున్నాడు.ఎన్నికల్లో 25 కోట్ల డాలర్లు ఖర్చు చేశాడు. అధికారానికి వచ్చిన తరువాత మస్క్ గొంతెమ్మ కోర్కెలు తీర్చే అవకాశం లేదని ట్రంప్ పక్కన పెట్టటం ప్రారంభించాడు, ఇచ్చిన పదవితో పండగ చేసుకో అన్నాడు. విద్యుత్ వాహనతయారీదారులు కష్టకాలంలో ఉన్నారు. వారు బిలియన్ల డాలర్లను సబ్సిడీగా ఇవ్వాలని కోరుకుంటున్నారు, అది సాధ్యం కాదనటంతో మస్క్ ఆశాభంగం చెందాడని ట్రంప్ చెప్పాడు. తన మద్దతులేకపోతే రిపబ్లికన్లు ఓడిపోయి ఉండేవారని, కృతజ్ఞత చూపలేదని మస్క్ అంటే అతగాడికి పిచ్చి ఎక్కిందని, తానింకే మాత్రం అతగాడి గురించి ఆలోచించనని ట్రంప్ బదులిచ్చాడు. నేను చైనా, రష్యాలతో, ఇంకా చాల సమస్యలతో తీరిక లేకుండా ఉన్నాను, ఎలన్ గురించి ఆలోచించటం లేదు, మీకు తెలుసు అతగాడు బాగుండాలని కోరుకుంటున్నా అన్నాడు.గుడిలో లింగాన్ని, గుడినీ మింగాలనుకున్న మస్క్ ఇచ్చిన పదవితో సంతృప్తి చెందలేదు. దాంతో ఇద్దరూ రోడ్డెక్కారు. మస్క్ త్వరలో బయటకు వెళ్లిపోతాడని ట్రంప్ తన కాబినెట్, ఇతర ముఖ్యులతో వ్యాఖ్యానించినట్లు ఏప్రిల్ రెండవ తేదీన పొలిటికో పత్రిక రాసింది. మే చివరి వారంలో పదవీ కాలం ఒక రోజు ఉండగానే రాజీనామా చేశాడు.
ఈ బాగోతం చూసిన తరువాత సామాజిక మాధ్యమం, రాజకీయ వర్గాల్లో జోకులే జోకులు. సముచితమైన ఫీజు కింద మాకు స్టార్‌లింక్ కంపెనీ వాటాలు ఇస్తే ఇద్దరి మధ్య రాజీకుదుర్చుతాం, దెబ్బలాడుకోవద్దు అంటూ రష్యన్ మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ చమత్కరించాడు. కావాలంటే మస్క్‌కు రాజకీయ ఆశ్రయం కల్పిస్తామని రష్యా ఇతర నేతలు చెప్పారు. ఎలన్ ఆశాభంగం చెందవద్దు, అమెరికాలో అసాధ్యమైన సమస్యలను ఎదుర్కొంటే మా దగ్గరకు రండి మాలో ఒకరిగా మారండి, మీ సాంకేతిక నైపుణ్యానికి పూర్తి స్వేచ్చ ఉంటుంది ఇక్కడ నిజమైన స్నేహితులు ఉన్నారంటూ ఎక్స్‌లు చేశారు. ఎవరెన్ని మాట్లాడినా ఒక డాలరు విలువ చేయవు అన్నది ట్రంప్, మస్క్ తీరు. ఈ మొత్తం ఉదంతంలో అంతిమంగా ట్రంప్‌దే పైచేయి అన్నది స్పష్టం. ఎందుకంటే అపరిమితమైన అధికారం ఉన్నందున ఎలన్ మస్క్ ఆర్థిక సామ్రాజ్యాన్ని కుప్పకూల్చివేసే అవకాశం ఉంది. అందుకే మస్క్ దారికి వచ్చినట్లు కనిపిస్తోంది. కొస మెరుపు ఏమంటే మంగళవారం నాడు ఎలన్ మస్క్ డ్రైవర్‌తో పనిలేని తన తొలి కారును ప్రయోగించి చూపాడు. దాంతో రోబోటాక్సీ రంగంలో అతగాడి కంపెనీ ఉందన్న భరోసాతో స్టాక్‌మార్కెట్‌లో వాటాల ధరలు పెరిగాయి.
