Tags
BJP, China, China’s space tech boom, Narendra Modi Failures, Orbital arms race, Space War, Star Wars, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
ఆర్థిక రంగంలోనే కాదు, అంతరిక్షంలోనూ సోషలిస్టు చైనా ప్రస్తుతం అమెరికాను హడలెత్తిస్తున్నదా ? అంటే వాషింగ్టన్ స్పందన చూస్తే అలాగే ఉంది, అయితే వక్రీకరణ షరా మామూలే అని చెప్పనవసరం లేదు. అమెరికా అంతరిక్ష దళాల(యుఎస్‌ఎస్‌ఎఫ్) జనరల్ కమాండర్ స్టీఫెన్ వైటింగ్ మనదేశంతో పాటు ప్రపంచాన్ని భయపెట్టేందుకు పూనుకున్నాడు. చైనా గురించి అనేక కుట్ర సిద్దాంతాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అందువలన ఈ పూర్వరంగంలోనే అతగాడు ఇటీవల ‘‘ బ్రేకింగ్ డిఫెన్స్ ’’ అనే వెబ్‌సైట్‌తో మాట్లాడిన అంశాలను చూడాల్సి ఉంది.ప్రపంచ వ్యాపితంగా 80దేశాలలో 750 చిన్నా, పెద్ద మిలిటరీ కేంద్రాలను నిర్వహిస్తున్న అమెరికా ఇతర దేశాల నుంచి ముప్పు ఉన్నట్లు స్వంత జనాలను నిరంతర భయపెడుతున్నది. దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమంటే స్వంత పౌరులు భారీ మిలిటరీ బడ్జెట్‌ను ప్రశ్నించకుండా ఉండేందుకు, ఇతర దేశాలను మిలిటరీ శక్తిని చూపి భయపెట్టేందుకు, దాడులు చేసేందుకు చేసేందుకు తప్ప వేరుకాదు. ఆశ్చర్యకరమైన వేగంతో చైనా ఉపగ్రహాల ప్రయోగం ఇండోపసిఫిక్ ప్రాంతానికి ప్రమాదకరంగా మారటం అత్యంత ముఖ్యమైన సమస్యల్లో ఒకటని వైటింగ్ చెప్పాడు. దొంగే దొంగని అరచినట్లుగా 2019లో డోనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నపుడు అమెరికా అంతరిక్ష దళం పేరుతో మిలిటరీ విభాగాన్ని ఏర్పాటు చేశాడు. అది మినహా మరోదేశమేదీ ఇప్పటి వరకు అలాంటి విభాగాలను ఏర్పాటు చేసినట్లు వార్తలు లేవు.
అంతరిక్షంలో ఎన్ని ఉపగ్రహాలు లేదా అలాంటివి ఉన్నాయన్నది ఒక అంచనా తప్ప నిర్దిష్ట సంఖ్య చెప్పటం కష్టం. వాటిలో పనిచేసేవాటితో పాటు చేయనివీ ఉన్నాయి. గడువు మీరిన తరువాత కూడా అవి పరిభ్రమిస్తూనే ఉంటాయి. తొలి ఉపగ్రహం స్పుత్నిక్ నాటి సోవియట్ యూనియన్‌లో 1957 అక్టోబరు నాలుగున నింగిలో ప్రవేశించింది. ఈ ఏడాది మార్చి నెల నాటికి 20,985 ప్రయోగించగా భూకక్ష్యలో 14,904 ఉన్నట్లు తేల్చారు. కొన్ని భూ కక్ష్యలో ఉండగా మరికొన్ని అంతకు మించి ఎగువన ఉన్నాయి. అయితే ఇవన్నీ పనిచేస్తున్నట్లు చెప్పటానికి లేదు. కొన్ని అదుపుతప్పినవి, మరికొన్ని ఇంథనం అయిపోయి పనిచేయనివి, మరికొన్ని కాలం చెల్లినవి, ఇలా రకరకాలుగా దాదాపు నాలుగువేలు మన తలల మీద గంటకు 28వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి.1972లో నాటి సోవియట్ యూనియన్ ప్రయోగించిన కాస్మోస్ 482 ఉపగ్రహం ఈ ఏడాది భూఉపరితలంలో నాలుగు ముక్కలై హిందూమహా సముద్రంలో గుర్తు తెలియని చోట కూలిపోయింది. అందువలన ఇలాంటివి ఏదో రూపంలో తిరిగి రావటానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చని భావిస్తున్నారు. అమెరికా తొలిసారిగా 1958 మార్చి 17న వాన్‌గార్డ్ ఒకటి ఉపగ్రహాన్ని పంపింది.గడచిన ఐదు సంవత్సరాల్లో(63 నెలల్లో) 11,951 ప్రయోగించగా అంతకు ముందు 9,034 మాత్రమే ప్రయోగించారంటే ఇటీవలి కాలంలో అంతరిక్ష ప్రయోగాలు, మార్కెట్ ఎంతవేగంగా విస్తరించిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 639 ప్రయోగాలు జరిగాయి. ఈ స్థితిలో ఫలానా దేశం ముందుందని ఏడ్చి పెడబొబ్బలు పెడుతూ సమయాన్ని వృధాచేసుకోవటంకంటే వెనుకబడి ఎందుకున్నామని ప్రతిదేశం ఆలోచించుకోవటం ఆరోగ్యకరం. తొలి స్పుత్నిక్ బరువు 83.4కిలోలు కాగా అతిపెద్ద ఎన్విశాట్ 8211 కిలోలు ఉంది. డబుల్ డెక్కర్ బస్సంత పరిమాణంలో ఉంది. 2003లో ప్రయోగించిన తొలి అతిచిన్న క్యూబ్‌ఉపగ్రహం బరువు కేవలం రెండు కిలోలు మాత్రమే.తరువాత ఒక కిలో, కొన్ని గ్రాములు మాత్రమే ఉన్నవాటిని కూడ నింగిలోకి పంపారు. ఇలాంటి వాటిని జతచేసి పంపేవి కొన్ని కాగా కేవలం ఒకటి మాత్రమే నింగిలో తిరిగేవి కూడా ఉన్నాయి. ఉదహరణకు ఎలన్‌మస్క్ స్టార్‌లింక్ ఏడువేలు ఉండగా, ప్లానెట్ ఇవో 150 కలిగి ఉంది. క్యూబ్ ఉపగ్రహాల తయారీకి చాలా తక్కువ ఖర్చు కావటంతో అనేక దేశాలు ఇతర దేశాల్లో ఉన్న కేంద్రాల నుంచి వాటిని ప్రయోగించటానికి దోహదం చేసింది. ఇది వాణిజ్యంగా మారింది. అంతే కాదు, పరస్పర అనుమానాలతో రక్షణ చర్యల్లో భాగంగా అనేక దేశాలు నింగితో పాటు ఉపగ్రహాలను కూడా మిలిటరీ అవసరాలకు వినియోగిస్తున్నాయి. ఈ పోటీలో ఎవరు వెనుకబడితే వారికి అదొక లోపంగా మారుతుంది.
ఇటీవల ఇరాన్‌పై ఇజ్రాయల్ జరిపినదాడుల వెనుక తాము గూఢచర్యంతో సమాచారం సేకరించామని ఎంతగా చెప్పుకున్నప్పటికీ మిలిటరీ ఉపగ్రహాల సమాచారం ఎంతో దోహదం చేసింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కూడా అదే జరిగినట్లు కొందరు చెప్పిన అంశం తెలిసిందే. అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు ఈ రంగంలో ముందుండటమే కాదు, తన చుట్టూ కుట్రలు జరుపుతున్నపుడు చైనా దూరంగా ఉండజాలదు.తనపై కుట్ర చేస్తున్న దేశాలకు సంబంధించిన మిలిటరీ కదలికలు, స్థావరాలు,అంతరిక్షంలో మిలిటరీ ఉపగ్రహాలు వాటి కార్యకలాపాలపై నిఘావేసేందుకు తనదైన జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నది.ప్రత్యర్థి కదలికలు,లక్ష్యాలను గుర్తించటం, వాటి మీద నిర్దిష్టంగా దాడులు ఎలా జరపాల్సిందీ సంబంధిత అంశాలు ఒక్క యుద్దం లేదా ఉద్రిక్తతలు తలెత్తినపుడు మాత్రమే చేసేవి కాదు. నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మిలిటరీ పరిభాషలో కిల్ చైన్ అంటున్నారు. చైనా పెద్ద ఎత్తున అలాంటివాటిలో నిమగ్నమైందని అమెరికా ఆరోపిస్తోంది. ఉదాహరణకు రష్యాలో కొన్ని వందల కిలోమీటర్ల లోపలికి వెళ్లి సైనిక కేంద్రాల మీద డ్రోన్లతో ఒకరోజు దాడులు చేసేందుకు పద్దెనిమిది నెలల పాటు పని చేశామని ఉక్రెయిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా పథకాలు సిద్దం చేసుకుంటే అవసరమైనపుడు వాటిని అమలు చేస్తారు, లేదా మార్పులకు అనుగుణంగా సవరిస్తారు.మనదేశానికి తగినన్ని మిలిటరీ ఉపగ్రహాలు లేని కారణంగా అమెరికా, ఇతర దేశాల ప్రయివేటు ఉపగ్రహాల నిఘా సమాచారాన్ని మన మిలిటరీ తీసుకుంటున్నది.మన మీడియా కూడా వాటిని కథనాలుగా ముందుకు తెస్తున్నది. మనం ఇతరుల నుంచి తీసుకున్నట్లే పాకిస్తాన్ కూడా ఇటీవల అదేపని చేసి మన విమానాలను కూల్చినట్లు చెబుతున్నారు. ఇండోపసిఫిక్ ప్రాంతంలో ఉన్న తమ, మిత్రదేశాల మిలిటరీ కేంద్రాలను గుర్తించేందుకు, వెంబడిరచేందుకు, లక్ష్యాలుగా చేసుకొనేందుకు చైనా మెరుపువేగంతో పని చేస్తున్నదని అమెరికా అధికారి వైటింగ్ ఆరోపించాడు.
నిజంగా చైనా అలాంటి సాంకేతిక పరిజ్ఞానం సంపాదించిందా లేదా అన్నది నిర్ధారణ కాలేదు, అమెరికా అనుమానిస్తున్నది.తమ, మిత్రదేశాల విమానవాహక నౌకలతో సహా ఎక్కడ ఎలాంటి మిలిటరీ కార్యకలాపాలు జరుగుతున్నదీ కచ్చితత్వంతో కనిపెట్టగల సత్తాను చైనా సంపాదించిందని, దాని ఆయుధ వ్యవస్థలుసుదూరంగా ఉన్న లక్ష్యాల మధ్య అంతరం తగ్గిపోయిందని వైటింగ్ చెబుతున్నాడు. ఉపగ్రహ వ్యతిరేక ఆయుధాల మోహరింపు,అంటే సైబర్ దాడులు, ఉపగ్రహాలు, జిపిఎస్ పనిచేయకుండా స్థంభింపచేయటం, లేజర్ కిరణాల ద్వారా ధ్వంసం చేయటం వంటివి చేయగలదన్నాడు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని మిలిటరీతో అనుసంధానం చేయటం కూడా అమెరికా ఊహించని పరిణామం. ఇరాన్‌పై ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ పేరుతో అమెరికా జరిపిన దాడిలో ఇలాంటి మిలిటరీ ఉపగ్రహాలు నిర్దేశిత లక్ష్యాలను గుర్తించటం, వాటిపై బాంబులు వేయటంలో ఎంతో కీలకపాత్ర పోషించటాన్ని చూసిన తరువాత అమెరికా అధికారి ఈ విషయాలను మీడియాతో చెప్పాడు. రానున్న రోజుల్లో చైనా తమను మించిపోతుందేమో అన్న భయం అమెరికాను వెన్నాడుతున్నదంటే అతిశయోక్తి కాదు.2008లో పని చేయని తన ఉపగ్రహాలలో ఒకదానిని భూమి మీద నుంచి ప్రయోగించిన క్షిపణితో చైనా కూల్చివేసిందని, అయినప్పటికీ అమెరికా దాన్ని పట్టించుకోలేదని కొందరు చెబుతున్నారు. మిలిటరీ ఉపగ్రహాలు అందచేసే సమాచారాన్ని త్రివిధ దళాలతో అనుసంధానించటంలో గతంలో అమెరికా, చైనాల మధ్య అంతరం ఎంతో ఎక్కువగా ఉండదని, ఇటీవల క్రమంగా తగ్గిందని అంచనా వేస్తున్నారు.చైనా ఉపగ్రహ కెమెరాలు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని మిల్లీ మీటర్ల వరకు ఫొటోలు తీయగలవని చెబుతున్నారు. 2024లో యుఎస్‌ఎస్‌ఎఫ్ నివేదిక ప్రకారం చైనా మిలిటరీ అవసరాల కోసం 500 ఉపగ్రహాలను వినియోగిస్తున్నది, వాటిలో గత ఒక్క ఏడాదిలోనే 67 ప్రయోగించింది. దాదాపు ఎనిమిదివేల ఉపగ్రహాలను నిర్వహిస్తున్న అమెరికా కేవలం వెయ్యి ఉన్న చైనా గురించి ఇలాంటి భయాలను రెచ్చగొడుతున్నది. చైనా వద్ద డ్రోన్ల దిశను మార్చగల, క్షిపణులు పని చేయకుండా చేయగల, కీలకమైన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయగల పరిజ్ఞానం ఉందని యుఎస్‌ఎస్‌ఎఫ్ ఇండోపసిఫిక్ కమాండర్ జనరల్ ఆంథోనీ మాస్టలర్ చెప్పాడు.
అమెరికా తన గగనతల రక్షణతో పాటు ఇజ్రాయెల్, మరికొన్ని చోట్ల క్షిపణులను అడ్డుకోగల రక్షణ వ్యవస్థలను డోమ్ పేరుతో ఏర్పాటు చేసింది.చైనా, ఉత్తర కొరియా, రష్యా నుంచి ఎదురవుతున్న సవాళ్ల పూర్వరంగంలో డోనాల్డ్ ట్రంప్ గతంలోనే ముందుకు తెచ్చిన గోల్డెన్ డోమ్(అంతరిక్షంలో ఆయుధాలు) పధకాన్ని ఇప్పటికే అమలు జరపాల్సిందని విమర్శకులు తప్పుపడుతున్నారు. అలాంటి పథకాలతో అంతరిక్షం పోరుకేంద్రంగా మారుతుందని చైనా గతంలోనే హెచ్చరించింది. సాయుధ సంఘర్షణకు అంతరిక్షాన్ని కేంద్రంగా మారుస్తున్నట్లు చైనా, రష్యా కొద్ది వారాల క్రితం అమెరికాను విమర్శించాయి. తమ నుంచి ముప్పు ఉందనే ప్రచారాన్ని అమెరికా చేస్తున్నదని తమ ఉపగ్రహాలు వాతావరణ మార్పుల పరిశీలన, తదితర ప్రజోపయోగ అవసరాలకు మాత్రమే పని చేస్తున్నాయని చైనా పదే పదే చెబుతున్నది. స్టాటిస్టా సంస్థ సేకరించి విశ్లేషించిన సమాచారం మేరకు అనేక దేశాలు గగనతల కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాయి, ఏటేటా బడ్జెట్‌లను పెంచుతున్నాయి. ఈ విషయంలో అమెరికా మిగతా దేశాలకు ఎంతో ఎత్తున ఉంది. 2021 నుంచి 2024 మధ్య 51బిలియన్ డాలర్ల నుంచి 80కి పెంచగా ఇదే కాలంలో చైనా పది నుంచి 20, జపాన్ 4నుంచి ఏడు బిలియన్ డాలర్లకు పెంచాయి. తరువాత స్థానాలలో ఉన్న రష్యా, ఫ్రాన్స్, ఐరోపా యూనియన్, జర్మనీ, ఇటలీ బడ్జెట్‌లలో స్వల్ప మార్పులు తప్ప భారీ పెరుగుదల లేదు. తొమ్మిదవ స్థానంలో ఉన్న మనదేశం 1.96 నుంచి 1.89 బిలియన్ డాలర్లకు తగ్గించింది.మన తరువాత స్థానంలో ఉన్న బ్రిటన్ కేటాయింపులో పెద్ద మార్పులేదు. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ ప్రధాన భూభాగంలో విలీనం కాకుండా చూసేందుకు అమెరికా చేయని యత్నం లేదు. ఒక వేళ మిలిటరీ చర్య ద్వారా అందుకు పూనుకుంటే తైవాన్‌లో ఉన్న ఆధునిక చిప్స్ తయారీ కేంద్రాలను పేల్చివేస్తామని గతంలో అమెరికా బెదిరించింది. ఏటేటా తైవాన్ ప్రభుత్వానికి ఆధునిక ఆయుధాలను అందచేస్తున్నది. విలీనాన్ని వ్యతిరేకించే శక్తులకు మద్దతు ఇస్తూ ఎన్నికలలో జోక్యం చేసుకుంటున్నది. తైవాన్ పేరుతో తూర్పు ఆసియాలో అవసరమైతే మరో యుద్ద రంగాన్ని తెరిచేందుకు పావులు కదుపుతున్నది, ఆ దిశగా కొత్త కూటములను ఏర్పాటు చేస్తున్నది. ఈ నేపధ్యంలో తన రక్షణకు తగిన చర్యలు తీసుకోవటంలో చైనా తప్పు కనిపించటం లేదు, అదే స్థానంలో మనదేశం ఉన్నప్పటికీ చేసేది అదే కదా !
