Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన జమ్మూ -కాశ్మీరు రాష్ట్రంలో మాతా విష్ణుదేవి పేరుతో కొత్తగా ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటయింది.నేషనల్‌ ఎలిజబులిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ ) ప్రతిభ ఆధారంగా ఆ రాష్ట్రంలోని వారికి సీట్లు కేటాయిస్తారు. ఇటీవలనే జమ్మూ ప్రాంతంలో ప్రారంభమైన ఆ కాలేజీలో 2025-26 సంవత్సరానికి తొలి బ్యాచ్‌ సీట్ల కేటాయింపు జరిగింది. యాభై సీట్లకు గాను 42 మంది ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు సీట్లు పొందారు. దాని అనుబంధ ఆసుపత్రిలో వైద్యులు కూడా ముస్లింలే ఎక్కువగా ఉన్నారట. ఇంకేముంది అక్కడి హిందూత్వ వాదులు గుండెలు బాదుకుంటూ సీట్ల కేటాయింపు విధానాన్ని తాము అంగీకరించటం లేదని, మార్చాల్సిందే అని ఆందోళనకు దిగారు. షరా మామూలుగా బిజెపి వారు కూడా వారితో చేరారు. వారి వాదన ఏమిటి ? సీట్ల కేటాయింపు మత సమతూకం ప్రకారం లేదట. ఆ కాలేజీ నిర్వహణ మాత వైష్ణదేవి ఆలయానికి చెందిన బోర్డుది గనుక హిందూ భక్తులు ఇచ్చిన నిధులతో ఏర్పాటు చేసినందున మెజారిటీ సీట్లు, సిబ్బంది హిందువులతోనే నింపాలని రభస చేస్తున్నారు. మత ప్రాతిపదికన సీట్లు కేటాయించాలంటున్నారు. చిత్రం ఏమిటంటే దేశంలోని ఇతర ప్రాంతాల్లో వీరు మరోవిధంగా రెచ్చగొడుతున్నారు. వెనుకబాటు తనం ఆధారంగా ముస్లింలను ఓబిసి, బిసి జాబితాలో చేర్చి విద్య,ఉపాధి రంగాలలో రిజర్వేషన్లను కల్పించాలంటే ఇదే హిందూత్వ శక్తులు బరాబర్‌ వ్యతిరేకిస్తూ మత ప్రాతికన రిజర్వేషన్లు ఉండకూడదని రచ్చ చేస్తున్నాయి. ఏ రోటి దగ్గర ఆ పాట పాడుతున్నారు. వీరికి రాజ్యాంగం, చట్టాలు, నిబంధనల పట్ల నిబద్దత లేదు, వారు చెప్పిందే అమలు జరగాలి. ఈ అడ్డగోలు వాదన ఒక్క మాత వైష్ణదేవి సంస్థకే, ముస్లింలకే పరిమితం అవుతుందా ? దేశంలో పన్నులు చెల్లిస్తున్నవారిని మత, కుల ప్రాతిపదికన లెక్కించి అన్నీ ఆ ప్రకారమే చేయాలని కూడా రోడ్లెక్కరన్న గ్యారంటీ ఏముంది ?

ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనారిటీ మతాలకు చెందిన వారు నిర్వహించే సంస్థలలో ఆ మతాలకు చెందినవారికే పెద్ద పీట వేస్తారని, అలాంటిది హిందువులు నిర్వహించే సంస్థలకు ఎందుకు వర్తించదని అమాయకత్వాన్ని నటిస్తున్నారు. మన రాజ్యాంగం మైనారిటీ సంస్థల నిర్వహణకు అలాంటి వెసులుబాటు కల్పించింది. వాటికీ నిబంధనలు ఉన్నాయి తప్ప అడ్డగోలు తనం కుదరదు. దేశంలో హిందువులు మైనారిటీలు కాదు.వైష్టదేవి ఆలయ బోర్డు తన విధానాలను మార్చుకొని మతానికే మాత్రమే పరిమితం కావాలని, హిందువులకు మాత్రమే సీట్లు, ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్లను కూడా కొందరు ముందుకు తెచ్చారు. మరికొందరైతే దేవాలయాలకు వెళ్లని వారిని ఆ కాలేజీలో పనిచేయనివ్వకూడదని కూడా డిమాండ్‌ చేశారు. వైద్యసేవలు అందించటానికి-దేవాలయాల సందర్శనకు అసలు సంబంధం ఏమిటి ? ఈ ఉన్మాదం అంతటితో ఆగుతుందా ? అడ్డబొట్లు, నిలువు బొట్ల వివాదాన్ని, చివరకు మనువాద చాతుర్వర్ణ వ్యవస్థను కూడా ముందుకు తీసుకువస్తుంది. మొగ్గగా ఉన్నపుడే మహిళలు, వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు ఈ ప్రమాదకర ధోరణుల గురించి ఆలోచించాలి. ముస్లింలే కదా మనకెందుకులే అనుకుంటే చివరికి ఈ తరగతుల వరకు వచ్చినపుడు అయ్యో అనేవారు ఉండరు. ఎందుకంటే చరిత్రలో మనువాద బాధితులు వీరే. హిందూత్వ శక్తుల ఆరాధ్య దైవం హిట్లర్‌ జర్మనీలో చేసింది అదే. ముందుగా కమ్యూనిస్టులను అణచివేస్తే, యూదులను ఊచకోత కోస్తే జనం పట్టించుకోలేదు, చివరికి తమదాకా వచ్చిన తరువాత ఎవరూ మిగల్లేదు.

మన రాజ్యాంగం దేశం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి మైనారిటీలను గుర్తించింది తప్ప రాష్ట్రాల్లో ఉన్న జనాభాను బట్టి కాదు. జమ్మూ కాశ్మీరులో మొత్తంగా చూసినపుడు మెజారిటీ ముస్లింలు, ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువ చోట్ల మెజారిటీ క్రైస్తవులు. అలాంటి చోట్ల ఇప్పుడు ఉనికిలో ఉన్న మన రాజ్యాంగం ప్రకారం హిందువులను మైనారిటీలుగా గుర్తించే అవకాశం లేదు. అందుబాటులో ఉన్న తాజా జనాభా జనాభా లెక్కలు 2011 ప్రకారం దేశ జనాభాలో 14.2శాతం మంది ముస్లిం మతానికి చెందిన వారు ఉన్నారు. విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ వంటి హిందూత్వ సంస్థలు కాశ్మీరులో డిమాండ్‌ చేస్తున్నట్లు మతప్రాతిపదికను తీసుకుంటే దేశమంతటా విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 14.2శాతం ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి ఏమిటి ? ఉన్నత విద్య గురించి 2020-21 సంవత్సరానికి సంబంధించి జరిపిన అఖిలభారత సర్వే(ఎఐఎస్‌హెచ్‌ఇ) ప్రకారం 4.326 కోట్ల మంది ఉన్నత విద్యలో చేరినట్లు నమోదు కాగా వారిలో ముస్లింలు కేవలం 4.87శాతమే(21,08,033) ఉన్నారు. ఇది హిందూ వ్యతిరేకులో కమ్యూనిస్టులో జరిపిన సర్వే కాదు. అంటే జనాభాకు అనుగుణంగా వారి శాతం ఉండాలంటే ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించాల్సి ఉంది. మన రాజ్యాంగాన్ని రాసుకున్న సమయంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్న కారణంగానే మైనారిటీ విద్యా సంస్థలద్వారా వారి స్థాయిని పెంచేందుకు సాధారణ రిజర్వేషన్లకు భిన్నంగా వారికి ఎక్కువ అవకాశం కల్పించారు. అయితే వాటిని దుర్వినియోగం చేసి ఆ సంస్థలను కొంత మంది వ్యాపారంగా మార్చివేశారన్నది వేరే అంశం.ఈ సర్వే ప్రకారం కొన్ని వివరాలను చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూ-కాశ్మీరు జనాభాలో ముస్లింలు 68.8, హిందువులు 28.8శాతం ఉన్నారు. అన్ని రంగాలలో ఆ దామాషా ప్రతిబింబించాలి. కానీ సర్వే ప్రకారం అక్కడ నమోదైన విద్యార్ధుల్లో 34.5శాతమే ముస్లింలు ఉన్నారు. మరి జమ్మూలోని హిందూత్వ వాదులు, దేశంలో వారిని సమర్ధించేవారు దీనికి ఏం చెబుతారు ? లడఖ్‌ ప్రాంతంలో 25.8శాతం ముస్లింలు ఉన్నారు. రాష్ట్రాల వారీ ఉన్నత విద్యారంగంలో ముస్లింల శాతం దిగువ విధంగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభాకు అనుగుణంగా ఎక్కడా ప్రాతినిధ్యం లేదు. బ్రాకెట్లలోని అంకెలు 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లిం శాతాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2014లో విడిపోయిన కారణంగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రస్తుత ముస్లిం జనాభా శాతం అంచనాలుగా గమనించాలి)

ఆంధ్రప్రదేశ్‌ × 2.92(9.56), అరుణాచల్‌ ప్రదేశ్‌××0.16(1.95), అసోం ××12.5(34.22),బీహార్‌ ×× 6.58(16.87),చండీఘర్‌ ×× 0.62(1.95), చత్తీస్‌ఘర్‌ ×× 0.78(2.02),జమ్ము-కాశ్మీర్‌ ×× 34.50(68.31)ఢిల్లీ ×× 2.47(12.86), గోవా ×× 4.72(8.33),గుజరాత్‌ ×× 2(9.67), హర్యానా×× 0.99(7.03),హిమచల్‌ ప్రదేశ్‌×× 0.41(2.18)ఝార్ఖండ్‌×× 4.34(14.53)కర్ణాటక×× 6.05(2.18)కేరళ ×× 14.36(26.56)మధ్య ప్రదేశ్‌ ×× 1.4 (6.57)మహారాష్ట్ర ×× 3.38(11.54)మణిపూర్‌×× 1.5(8.40)మేఘాలయ××.2(4.40)మిజోరామ్‌ ×× 0.28(1.35)నాగాలాండ్‌ ×× 0.49(2.47)ఒడిషా ×× 0.79(2.17)పుదుచ్చేరి ×× 3.45(6.05)పంజాబ్‌ ×× 2.32(1.93)రాజస్థాన్‌ ×× 1.73(9.07)సిక్కిం ×× 0.48(1.62)తమిళనాడు ××3.50(5.86)తెలంగాణా ×× 7.60(12.56)త్రిపుర ×× 2.98(8.60)ఉత్తర ప్రదేశ్‌ ×× 4.68(19.26)ఉత్తరాఖండ్‌ ×× 2.96(13.95)పశ్చిమబెంగాల్‌×× 12.33(27.01)

పైన పేర్కొన్న వివరాల ప్రకారం విద్యా సంస్థలలో చేరిన వారు రెండంకెలు దాటిన రాష్ట్రాలు జమ్ము-కాశ్మీరు, కేరళ, పశ్చిమబెంగాల్‌, అసోం మాత్రమే.వీటిలో జనాభా రీత్యా ముస్లింలు మెజారిటీగా ఒక్క జమ్ము-కాశ్మీరు, కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌ మాత్రమే ఉన్నాయి. గణనీయ సంఖ్యలో ఉన్న వాటిలో 34 నుంచి 16.87శాతం వరకు ఉన్న రాష్ట్రాలు అసోం, పశ్చిమబెంగాల్‌, కేరళ,ఉత్తర ప్రదేశ్‌,బీహార్‌, మైనారిటీలుగా 14.53 నుంచి 5.86 శాతం మధ్య ఉన్న రాష్ట్రాలు ఝార్కండ్‌,ఉత్తరాఖండ్‌, కర్ణాటక,ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌,తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌,రాజస్తాన్‌,త్రిపుర,మణిపూర్‌, గోవా, హర్యానా,మధ్య ప్రదేశ్‌, పుదుచ్చేరి, తమిళనాడు ఉండగా మిగిలిన రాష్ట్రాలు 4.87 శాతం కంటే తక్కువగా ఉండి పెద్దగా లేనివిగా ఉన్నాయి. ఈ లెక్కలను గమనించినపుడు ముస్లింలు ఉన్నత విద్యలో ఎంత వెనుకబడి ఉన్నదీ కనిపిస్తున్నది. ముస్లింలను సంతుష్టీకరించేందుకు కాంగ్రెస్‌ పాలనలో వారికి అంతా దోచిపెట్టారన్న ప్రచారాన్ని చూసినపుడు అదంతా తప్పుడు ప్రచారం తప్ప వాస్తవం కాదని తేలుతున్నది. ఓట్ల కోసం మెజారిటీ ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ఎత్తుగడలో ఇది భాగం తప్ప వేరు కాదు. జమ్మూలో ఒక మెడికల్‌ కాలేజీలో అత్యధికులు ముస్లిం విద్యార్ధులు ఉన్నందుకే అదీ ప్రతిభ ఆధారంగా పొందినందుకే అంతగా యాగీ చేస్తున్న పెద్దలు దేశమంతటా నెలకొన్న పరిస్థితి గురించి ఏమంటారు ? సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ కేవలం మాటలకేనా ? పోనీ హిందువులను వీరు ఉద్దరించారా ? ఏం చేశారో చెప్పమనండి !