Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

చైనాకు ఏడు నెలల్లో 25శాతం పెరిగిన భారత ఎగుమతులు. మీడియాలో కొద్ది రోజుల క్రితం వచ్చిన శీర్షిక ఇది. ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు వరుసగా ఏడు నెలల నుంచీ పెరుగుతూనే ఉన్నాయి.మంచిదే, మన ఎగుమతులు ఏమాత్రం పెరిగినా సంతోషించాల్సిందే. అయితే అసలు కథేమిటంటే నరేంద్రమోడీకి భజన చేసేందుకు అలవాటు పడిన వారు చేసిన జిమ్మిక్కు లేదా తిమ్మిని బమ్మిని ఇది. నిజంగా జరిగిందేమిటి ? గతేడాదితో పోలిస్తే ఎగుమతులు పెరిగిన మాట నిజం. ఇదే సమయంలో చైనా నుంచి దిగుమతులు అంతకంటే ఎక్కువగా పెరిగిన సంగతి, పదేండ్ల స్థాయికి ఎగుమతులు పడిపోయిన నిజాన్ని జనాలకు చెప్పరేం ! నరేంద్రమోడీ ఏలుబడి పదకొండు సంవత్సరాలను మూడు భాగాలుగా విభజిద్దాం. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో చైనాకు మన ఎగుమతులు 11.96 నుంచి 16.75 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. తరువాత మూడు సంవత్సరాలలో 21.56 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అప్పటి నుంచి 2024-25లో 14.25 బిలియన్‌ డాలర్లకు పతనమయ్యాయి. గత ఏడాది తొలి ఏడు నెలలతో పోల్చి చూపి వర్తమాన సంవత్సరంలో 10.03 బిలియన్‌ డాలర్లకు 25శాతం పెరిగినట్లు చిత్రించారు. మిగిలిన ఐదు నెలల కాలంలో గత ఏడాది మొత్తాలకు చేరవచ్చు, స్వల్పంగా పెరగవచ్చు తప్ప గతంలోని 21.56 బిలియన్‌ డాలర్లకు చేరే స్థితి ఉందా ? చైనాకు మన ఎగుమతులు పెరగటం వెనుక అంతర్జాతీయ రాజకీయాలు కూడా లేకపోలేదు. అమెరికా వైపు మొగ్గుచూపుతున్న నరేంద్రమోడీకి పన్నుల రూపంలో ట్రంప్‌ తీసుకున్న వైఖరి మింగుడు పడలేదు.ఈ స్థితిలో ఎత్తుగడగా అవసరం ఉన్నా లేకున్నా చైనా ఏప్రిల్‌ నుంచి మన దేశం నుంచి దిగుమతులను పెంచింది, దీని కొనసాగింపు రానున్న రోజుల్లో మనదేశం అనుసరించే వైఖరిని బట్టి ఉంటుంది.చైనాకు మన మార్కెట్‌ను ఎంతగా తెరిస్తే దానికి ప్రతిగా మనకూ మేలు చేకూరే విధంగా బీజింగ్‌ వ్యవహరిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. చైనా పెట్టుబడులను స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. మన దేశం నుంచి విమానాలను నడిపేందుకు రెండు చైనా కంపెనీలు దరఖాస్తు చేసినట్లు తాజా వార్తలు వెల్లడించాయి.

చైనా మీద ఆధారపడకూడదు, దాన్ని పక్కకు నెట్టేసి అసలు మనమే ప్రపంచానికి వస్తువులను ఎగుమతులు చేద్దాం అంటూ పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అలాంటి సూచనలు లేవు.తొలి ఏడు నెలల్లో ఎగుమతులు పెరిగాయని చెప్పిన వారు అదే సమయంలో చైనా నుంచి దిగుమతులు 57.65 నుంచి 64బిలియన్‌ డాలర్లకు పెరిగాయని చెబితే నిజాయితీగా ఉంటుంది. గత సంవత్సరం చైనాతో మన వాణిజ్య లోటు 99.12 బిలియన్‌ డాలర్లు. దీన్నే మరోవిధంగా చెప్పాలంటే నరేంద్రమోడీ సర్కార్‌ అసమర్ధతకు బీజింగ్‌కు మనం చెల్లించిన మూల్యం.ఇంకా చెప్పాలంటే గత పదకొండు సంవత్సరాల్లో 701.95 బిలియన్‌ డాలర్లు సమర్పించుకున్నాం. మోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది మన వాణిజ్య లోటు 48.45 బిలియన్‌ డాలర్లు కాగా పదకొండేండ్లలో రెట్టింపై 99.21 బి.డాలర్లకు చేరింది, ఎందుకని ? గత ఐదు సంవత్సరాల్లో చైనాకు మన ఎగుమతులు 33శాతం పడిపోగా దిగుమతులు 74శాతం పెరిగాయి. ఆత్మనిర్భరత ఏమైనట్లు, ప్రపంచంలో పెరిగినట్లు చెబుతున్న మోడీ పలుకుబడి సంగతేమిటి ? కాంగ్రెస్‌ యాభై ఏండ్లలోచేయలేని వాటిని తాను తొలి ఐదేండ్లలోనే చేసినట్లు గతంలో చెప్పుకున్నారు. సంతోషం. వర్తమాన అవసరాలకు అనుగుణంగా వస్తూత్పత్తిని ఎందుకు చేయలేకపోయినట్లు ? రెండింజన్ల పాలనే కదా ఉన్నది. యాపిల్‌ ఐఫోన్లను తయారు చేస్తున్నాం, ఎగుమతి చేస్తున్నాం చూడండహౌ అంటూ ప్రచారం చేస్తున్నారు. మిగతా ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సంగతేమిటి ? గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(జిటిఆర్‌ఐ-ఇండియా) చెప్పినదాని ప్రకారం కీలకమైన ఎనిమిది పారిశ్రామిక ఉత్పత్తుల విషయంలో చైనా ప్రధాన సరఫరాదారుగా ఉంది. చైనా నుంచి దిగుమతుల వలన రెండు రకాల నష్టాలు, ఒకటి స్థానిక మన పరిశ్రమలు గిడసబారిపోతున్నాయి, కార్మికులకు ఉపాధి దొరకటం లేదు.విలువైన విదేశీమారక ద్రవ్యాన్ని చైనాకు సమర్పించుకుంటున్నట్లు ముందే చెప్పుకున్నాం. గత కాంగ్రెస్‌ పాలనకూ మోడీ ఏలుబడికి తేడా ఏమిటి ? చైనా నుంచి దిగుమతుల్లో మన్మోహన్‌ సింగ్‌ రికార్డులనే కాదు, తన రికార్డులను కూడా తానే మోడీ బద్దలు కొట్టుకున్నారు. చైనాతో తిరిగి సత్సంబంధాలను నెలకొల్పుకొనటం మంచిదే. కానీ అనేక వస్తువుల దిగుమతులపై ఆంక్షలను సడలించిన కారణంగా గత రికార్డులను అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించి గత పదినెలలుగా చెబుతూనే ఉన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేతతో సహా అన్నీ డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్నట్లే జరుగుతున్నందున అనేక అనుమానాలు. ఇంతవరకు ఏం జరుగుతోందో జనానికి తెలియదు. ట్రంప్‌ చెబితే తప్ప మనకు తెలిసేట్లు లేదు, మన మార్కెట్‌ను వారి వస్తువులకు బార్లా తెరవాలని అమెరికా వత్తిడి తెస్తోంది. అదే జరిగితే స్థానిక పరిశ్రమలు, వాణిజ్యాలను మూసుకోవాల్సిందే అని మన కార్పొరేట్లు హెచ్చరిస్తున్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఏడునెలల్లో మన ఎగుమతులు ఎక్కువగా అమెరికాకు జరిగితే దిగుమతులు చైనా నుంచి జరిగాయి. ఇదేం కుదరదు అన్నీ మానుంచే దిగుమతి చేసుకోవాలని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. అసలు సంగతేమిటంటే చైనా నుంచి తక్కువ ధరలకు వస్తున్నాయి గనుక దిగుమతి చేసుకుంటున్నాం తప్ప షీ జింపింగ్‌ మీద ప్రేమతో కాదు. అమెరికాకు చోటిస్తే ఎడారి వ్యాపారి, ఒంటె కథ మాదిరి దేశీయ సంస్థలను బయటకు నెట్టేయటం లేదా మింగివేస్తుంది. అందుకనే రెండు దేశాలతో సమన్వయం చేసుకోవటం మోడీకి కత్తిమీద సాములా ఉంది. రానున్న రోజుల్లో మనకు మేలు జరిగే విధంగా విదేశాంగ విధానం ఉండాలని ఇప్పటికే కార్పొరేట్ల లాబీ మాట్లాడుతోంది. కరవమంటే కప్పకు విడవమంటే పాముకు కోపం ! మన దేశ వస్తు ఎగుమతులను చూస్తే 2024లో 434.44 బిలియన్‌ డాలర్లు కాగా దిగుమతులు 698-702 బి. డాలర్ల మధ్య ఉన్నాయి. నిఖర వాణిజ్యలోటు 263.31బిలియన్‌ డాలర్లు. ఎగుమతుల్లో అమెరికా 18.3, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 8.5, నెదర్లాండ్స్‌ 5.6, సింగపూర్‌ 3.6, చైనా 3.4,బ్రిటన్‌ 3.2, సౌదీ అరేబియా 2.8, బంగ్లాదేశ్‌ 2.6, జర్మనీ 2.4, ఇటలీ 1.92శాతాల చొప్పున ఉన్నాయి. 2024 జనవరి నుంచి జూన్‌ వరకు వివరాలు చూస్తే మన దేశం 151దేశాలతో వాణిజ్య మిగులు, 75దేశాలతో తరుగులో ఉంది. మోడీ భక్తులు చూశారా మానేత పలుకుబడి అని డబ్బా కొట్టుకోవటానికి ఈ అంకెలు తప్ప వాస్తవ పరిస్థితి ఏమిటోపైన చెప్పుకున్నాం. అమెరికాను వదులుకొనేందుకు భయపడటానికి, డోనాల్డ్‌ ట్రంప్‌ ఎంతగా అవమానించినా మౌనంగా ఉండటానికి అక్కడికి మన ఎగుమతులు ఎక్కువగా ఉండటమే.మరోవైపు ఐదేండ్లపాటు చైనాతో వైరంతో గడిపిన తరువాత సాధారణ సంబంధాలు ఏర్పరుచుకోవటానికి కారణం దాని మీద ఆధారపడాల్సి రావటమే. పదకొండు సంవత్సరాల్లో పరాధీనతను తగ్గించటానికి మోడీ చేసిందేమీ లేదు. అందుకే రాజీపడ్డాం. మన దిగుమతులను చూస్తే 2024లో చైనా నుంచి 15.5,రష్యా 9.1, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 8.6, అమెరికా 6.1, సౌదీ అరేబియా 4.3, ఇరాక్‌ 4.2, ఇండోనేషియా 3.4,స్విడ్జర్లాండ్‌ 3.1,దక్షిణ కొరియా 3, సింగపూర్‌ 2.9శాతం చొప్పున ఉన్నాయి. గాల్వన్‌ లోయ ఉదంతాల సమయంలో కాషాయ దళాలు చైనా నుంచి దిగుమతుల నిలిపివేస్తే డ్రాగన్‌ మన కాళ్ల దగ్గరకు వస్తుందంటూ ఊగిపోయారు.నిజానికి మనకు అంత సీన్‌ లేదు, 2024లో చైనా నుంచి దిగుమతులు చేసుకున్న మొదటి పది దేశాలలో మనం కేవలం 3.4శాతంతో ఆరవ స్థానంలో ఉన్నాం.

మన ఎగుమతులు, దిగుమతులు రెండు రకాలు. ఒకటి వస్తువులు, రెండవది సేవలు. వస్తు లావాదేవీల్లో 2014-15లో లోటు 137 బిలియన్‌ డాలర్ల నుంచి 2024-25 నాటికి 283బి.డాలర్లకు పెరిగింది. సేవల విషయంలో ఇదే కాలంలో మిగులు 74 నుంచి 189 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. రెండింటినీ కలిపి చూసినపుడు నిఖర లోటు 63 నుంచి 94 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.ప్రపంచంలో 2024లో మొత్తం 24.5లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తు ఎగుమతులు జరగ్గా ఎగువన ఉన్న 30దేశాల వాటా 20.3లక్షల కోట్ల డాలర్లు.మొదటి స్థానంలో ఉన్న చైనా వాటా 14.6 శాతం కలిగి మొదటి స్థానంలో ఉండగా పద్దెనిమిదవదిగా మనదేశ వాటా కేవలం 1.8శాతమే, రష్యా, స్విడ్జర్లాండ్‌ కూడా ఇదే వాటాను కలిగి ఉన్నాయి. చైనాను వెనక్కు నెట్టేయాలన్న సంకల్పాన్ని ఎవరూ కాదనరు, పోటీ పడాల్సిందే. కానీ ఒక్కసారిగా ఈ పరిస్థితి మారాలన్నా, 2047 నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోవాలన్నా నరేంద్రమోడీ అల్లావుద్దీన్‌ అద్భుత దీపాన్ని సంపాదించాల్సిందే. అల్లావుద్దీన్‌ ముస్లిం మేం బరాబర్‌ హిందువులం పొడగిట్టదు అని అంటారా, మనోభావాలను ముందుకు తెస్తే మన వేదాల్లో ఉన్నవాటిని వెలికి తీయాలి మరి, దగ్గరిదారి లేదు, చేస్తారా !