Tags
Anti-science politics, Attack on Scientific Temperament, Donald trump, Hitler’s Gift, India pseudoscience, Narendra Modi Failures, RSS, Trump assault on science
ఎం కోటేశ్వరరావు
అమెరికాలో రెండవసారి అధికారానికి వచ్చి ఇంకా ఏడాది కూడా పూర్తికాకుండానే డోనాల్డ్ ట్రంప్ సైన్సు, సంబంధిత అంశాలపై దాడులు చేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా సైన్సు రక్షణకు అక్కడి శాస్త్రవేత్తలు నడుంకట్టారు. గత పదకొండు నెలల కాలంలోనే ట్రంప్ వేగవంతంగా, తీవ్రమైన దాడులు ఐదువందలసార్లు చేశాడని ఆ రంగం తీరుతెన్నులను పరిశీలిస్తున్న విశ్లేషకులు చెబుతున్నారు. అనేక సంస్థలలో అశాస్త్రీయ భావాలు కలవారితో నింపుతున్నాడు. పొమ్మనకుండానే పొగబెట్టినట్లుగా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు నిధుల కోత పెడుతున్నాడు. ఈ వైఖరి సైన్సుపై నిరంకుశత్వంగా వర్ణిస్తూ దాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధులు కావాలని, వచ్చే ఏడాది చేపట్టే కార్యాచరణకు గాను డిసెంబరు 31లోగా విరాళాలు ఇవ్వాలని ” తాపత్రయపడే సైంటిస్టుల యూనియన్ ” పిలుపునిచ్చింది. మనతో సహా ప్రపంచంలో అనేక దేశాల్లో ఆశాస్త్రీయ కుహనా సైన్సును జనం మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం జరుగుతున్నది.
డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సైన్సు మీద జరుపుతున్నదాడి వలన అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అది స్వయంగా చేసుకొనే తీవ్రహాని అని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలలో విద్యార్ధులు పాలస్తీనాకు అనుకూలంగా ఇజ్రాయెల్ దుర్మార్గాలను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి రావటాన్ని సహించలేని ట్రంప్ వాటికి నిధులు కోతపెడతానని బెదిరించిన సంగతి తెలిసిందే.వాటితో నిమిత్తం లేకుండానే శాస్త్రపరిశోధనలను నిరుత్సాహపరిచేందుకు బిలియన్లకొద్దీ నిధులకోత ప్రారంభించాడు. ప్రధాన పరిశోధనా సంస్థల బడ్జెట్‌లో 50శాతం కోత పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.దీంతో అనేక మంది శాస్త్రవేత్తలు అమెరికా వీడటం ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీలో హిట్లర్ యూదులపై జరిపిన ఊచకోత నుంచి తప్పించుకొనేందుకు ఆ సామాజిక తరగతికి చెందిన అనేక మంది విద్యావంతులు, శాస్త్రవేత్తలు అమెరికా, ఇతర ఐరోపా దేశాలకు వలసలు పోయారు.ఆ దేశాల్లో అనేక నవకల్పనలకు ఆద్యులయ్యారు. దీంతో ఇతర దేశాలకు ” హిట్లర్ ఇచ్చిన బహుమతి ” అని ఈ పరిణామాన్ని వర్ణించారు. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ కూడా అదే చేస్తున్నారని చెబుతున్నారు. ఈ చర్యలతో చైనాతో సహా ఐరోపా ధనికదేశాలన్నీ లబ్దిపొందుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ దేశాల్లో ప్రతిభావంతులకు పట్టం కట్టేందుకు పెద్ద మొత్తాలలో నిధులు కేటాయించారు. ట్రంప్ శాస్త్ర సలహాదారైన మైఖేల్ క్రాటిసియోస్ మాట్లాడుతూ సైన్సు అసమర్ధంగానూ, కనపడకుండా కంటిమీద గట్టి పొరలా మారిందని, ప్రత్యామ్నాయాలను చూడనిరాకరించేవారి బందీగా మారినందున అంతటినీ మార్చివేయాలని చెప్పాడు. ఇలాంటి వారి మాటలను విన్నతరువాత 80ఏండ్ల ట్రంప్‌కు బుర్రపని చేస్తుందని ఎలా అనుకోగలం.
శాస్త్ర పరిశోధనలకు గత కొన్ని దశబ్దాలుగా అమెరికా కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే, వివిధ రంగాలలో నోబెల్ బహుమతి గ్రహీతల్లో సగం మంది అక్కడి నుంచే ఉన్నారు.అలాంటి చోట శాస్త్రంపై కత్తికట్టటం అంటే అది ఒక్క అమెరికాకే కాదు, యావత్ ప్రపంచానికి నష్టం.ఇప్పటికీ అనేక వ్యాధులకు కారణాలు, చికిత్సలు సవాలుగానే ఉన్నాయి. ట్రంప్ తీసుకున్న మతిమాలిన చర్యల కారణంగా అనేక పరిశోధనలు అర్ధంతరంగా ఆగటం లేదా ఆలశ్యానికి దారితీస్తాయి.అన్ని దేశాల్లో ఉన్నట్లే బ్యూరోక్రసీ అమెరికాలో కూడా తక్కువేమీ కాదు.ఐదు రోజుల పనివారంలో రెండు రోజులు ప్రయోగశాలలకు బదులు ప్రభుత్వ యంత్రాంగ కాగితాలు నింపటానికే రెండు రోజులు పోతున్నదని అనేక మంది శాస్త్రవేత్తలు విమర్శిస్తున్నమాట నిజం. నివారణకు మార్గాలు వెతకాలి తప్ప అసలు పరిశోధకులనే తొలగిస్తే ఎలా ? అమెరికా అనుసరిస్తున్న ప్రతికూల విధానాల ఫలితంగా అక్కడ ఉండేవారి సంఖ్య తగ్గుతోంది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలకు విదేశాలకు వెళ్లాలని దరఖాస్తుచేసుకున్నవారు 2024 మొదటి మూడునెలలతో పోలిస్తే మూడో వంతు పెరిగింది.అమెరికాకు రావాలనుకొనే వారు నాలుగోవంతు తగ్గారు.ఒకసారి ఉన్న పేరుపోతే తిరిగి తెచ్చుకోవటం కష్టమని అనేక మంది చెబుతున్నా ట్రంప్ చెవికి ఎక్కటం లేదు. అమెరికా మిలిటరీ, సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నతంగా ఉండటానికి శాస్త్రపరిశోధనలే కారణమని, అలాంటివి లేకపోతే ఆ స్థానాన్ని చైనా ఆక్రమిస్తుందని ఆందోళన చెందేవారు మరోవైపు ఉన్నారు. శాస్త్రవిజ్ఞానాన్ని మానవాళి సౌభాగ్యానికి వినియోగించాలి. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు ఎక్కడ జరిగినా కాస్త వెనుకా ముందూ ప్రపంచంలోని వారందరికీ అందుబాటులోకి వస్తాయి. అలాంటి పరిశోధనా రంగంలో ముందున్న అమెరికా ఒక్కసారిగా జెండా ఎత్తేస్తే లోకమంతా అలాగే ఉంటుందని కాదు గానీ, పరిశోధనలు ఆలశ్యమౌతాయి.
శాస్త్రపరిశోధనలు ప్రస్తుతం కొన్ని దేశాలకే పరిమితం అవుతున్నందున వాటిని ఆయుధాలుగా చేసుకొని వెనుకబడిన దేశాలను దోపిడీ చేయటం కూడా ఒక వాస్తవం. ఉదాహరణకు అధిక దిగుబడి వంగడాలను తయారు చేసిన దేశాలకు చెందిన సంస్థలు పేటెంట్ హక్కుల పేరుతో ఎంత అధిక ధరలకు వాటిని ఎలా విక్రయిస్తున్నారో చూస్తున్నాం. వర్షాలు, వరదలు, దుర్భిక్షం వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగానే పసిగట్టే పరిజ్ఞానాన్ని మరింత నిర్ధిష్టం కావించాలి. అది అమెరికాకూ అవసరమే అక్కడి కొన్ని రాష్ట్రాలలో సంభవించిన ప్రమాదకర వరదలు, తుఫాన్లను సకాలంలో పసిగట్టగలిగి ఉంటే నష్టాలు తగ్గి ఉండేవి. జలుబుకు కారణమౌతున్న వైరస్‌లు అమెరికాలో ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉన్నాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో దోమకాటు వలన డెంగీ ఎంత ప్రమాదకరంగా ఉందో తెలిసిందే. రాజకీయాలలో ప్రపంచమంతటా మితవాద శక్తులు పెరిగిపోతున్నట్లుగానే ప్రపంచంలో శాస్త్రవిజ్ఞానాన్ని వ్యతిరేకించే మూఢత్వం కూడా పెరుగుతున్నది. కరోనా సమయంలో మనదేశంతో సహా ప్రపంచమంతటా అలాంటి శక్తులు ఎలా రెచ్చిపోయాయో చూశాము. శాస్త్రవేత్తలు, వైద్యుల సలహాలను పక్కన పెట్టి, వాక్సిన్‌ను వ్యతిరేకంచే శక్తుల మాటలు నమ్మి లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ సందర్భంగా లాక్‌డౌన్లు విధించినందుకు పెట్రోలు, డీజిలు వ్యాపారుల లాబీ రంగంలోకి దిగి లాక్‌డౌన్ల వలన ఆర్థిక వ్యవస్థలకు నష్టం అని ప్రచారం చేయించటాన్ని కూడా చూశాము. కరోనా లేకుండానే సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభాల వలన కలిగిన నష్టం ఎంతో, ఎందుకు సంభవించిందో వారు చెప్పారా ? కరోనా గురించి మీడియా సంస్థలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశాయో కూడా చూశాము.కరోనా, వాతావరణమార్పులు వాస్తవం కాదని, వాక్సిన్ల వలన ప్రయోజనం లేదని అమెరికా, ఐరోపాలోని ప్రముఖ మీడియా సంస్థలు చేసిన తప్పుడు ప్రచారం తెలిసిందే.
పర్యావరణానికి కలుగుతున్న హాని, వివిధ వ్యాధుల నివారణకు అవసరమైన వాక్సిన్లపై జరిపే పరిశోధనలకు ట్రంప్ సర్కార్ నిధుల కోత పెడుతున్నది, సిబ్బందిని తగ్గిస్తున్నది. వాతావరణ మార్పులపై పరిశోధన చేస్తున్న ఎన్‌సిఏఆర్ వంటి సంస్థలను ఎత్తివేయాలని చూస్తున్నది. వచ్చే ఏడాది ఎలాంటి దాడులను చేస్తుందో తెలియదు, 2025లో పరిశోధనా ప్రయత్నాలు, కీలకమైన శాస్త్రీయ సమాచారంతో పౌరులందరికీ అందుబాటులో వెబ్‌సైట్లను మూసివేసింది.ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే లేదా వ్యతిరేకించేవారి మీద దాడులకు ఉసిగొల్పుతున్నది, పదవుల నుంచి తొలగిస్తున్నది. ప్రజారోగ్య రక్షణలో ముందున్న డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సిడిసి) అధిపతిగా సుసాన్ మోనారెజ్ బాధ్యతలు స్వీకరించినపుడు అనేక మంది పరిశోధకులు ఊపిరి పీల్చుకున్నారు. ఆమెకు రాజీపడని మైక్రోబయాలజిస్ట్ మరియు ఇమ్యునాలజిస్ట్ శాస్త్రవేత్తగా పేరుంది. ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాలుగా పని చేస్తున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోనే ఆగస్టులో ట్రంప్ ఆమెను బయటకు పంపాడు. ఒక శాస్త్రవేత్తగా రాజీపడని కారణంగానే తనను తొలగించారని ఆమె చెప్పారు.సిడిసిలో కొంత మంది శాస్త్రవేత్తలను తొలగించాలని,ఎలాంటి శాస్త్రీయ సమాచారం లేకపోయినప్పటికీ కొన్ని వాక్సిన్లకు ఆమోద ముద్ర వేయాలని ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ తనపై తెచ్చిన వత్తిడికి లొంగని కారణంగా తప్పుడు ఆరోపణలతో తొలగించినట్లు ఆమె చెప్పారు. ఈ మంత్రి గతంలో అమెరికాలో అత్యంత అవినీతి సంస్థగా సిడిసిని వర్ణించాడు. వాక్సిన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కెనడీ వాక్సిన్ల విషయంలోనే ఆమెను వత్తిడి చేయటం అంటే సదరు కంపెనీల లాబీ ఎంతటి శక్తివంతమైనదో అర్ధం చేసుకోవచ్చు. బహిరంగంగా వాక్సిన్లను విమర్శించిన వారిని ఆ సంస్థలో చేర్చాడు. నాలుగో వంతు సిబ్బందిని తగ్గించాడు. డోనాల్డ్ ట్రంప్ విధానాలు ప్రజారోగ్యానికి ముప్పు తెస్తాయని మోనారెజ్ హెచ్చరించారు.నిబద్దత, ఆత్మగౌరవం ఉన్న శాస్త్రవేత్త ఎవరూ తగిన శాస్త్రీయ సమాచారం లేకుండా వాక్సిన్ లేదా ఔషధాలను అంగీకరించరని సుసాన్ కూడా అదే చేశారని అనేక మంది ప్రశంసించారు. ఆమెకు మద్దతుగా ఒక వైద్యాధికారి, ముగ్గురు సీనియర్ సిడిసి శాస్త్రవేత్తలు ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు.
శాస్త్రీయ భావనలు, వైఖరుల మీద ఒక్క అమెరికాలోనే కాదు అనేక దేశాల్లో మితవాదశక్తులు దాడులు చేస్తున్నాయి. గత పదకొండు సంవత్సరాల్లో మనదేశంలో కూడా అదే జరిగింది.ఊహాజనితమైన ఆశాస్త్రీయ సాంకేతికపరమైన అంశాలను అధికారంలో ఉన్న పెద్దలే ప్రచారం చేస్తున్నారు. సైన్సును కాపాడాలంటూ గత ఏడాది ఆగస్టులో అనేక పట్టణాల్లో ప్రదర్శనలు చేసిన శాస్త్రవేత్తలను చూశాము. శాస్త్రీయ భావజాలంపై దాడి, పరిశోధనలకు నిధుల కోత పెట్టటాన్ని, కుహనా సైన్సును ముందుకు తేవటాన్ని నిరసించారు. హిందూత్వ భావజాలానికి అనుగుణంగా విద్యావిధానం, సిలబస్‌లో మార్పులు తెస్తున్నారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయని, ఇతర నాగరికతల కంటే వేదకాలమే గొప్పదనే ప్రచారం చేస్తూ జనాలను నమ్మించేందుకు చూస్తున్నారు. పురాతన కాలంలోనే మన దేశంలో ప్లాస్టిక్ సర్జరీ తెలుసని దానికి నిదర్శనం గణేషుడేనని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే పురాతన కాలంలోనే దేశంలో ఇంటర్నెట్, ఉపగ్రహాలు ఉన్నాయని త్రిపుర ముఖ్యమంత్రిగా పని చేసిన బిజెపినేత విప్లవదేవ్ చెప్పారు.అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు మహాభారతంలో విదురుడు కూడా ఆ పరిజ్ఞానంతోనే యుద్దంలో జరుగుతున్నదాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడని చెప్పేవారున్న సంగతి తెలిసిందే. పురాతన భారతీయ విజ్ఞానం పేరుతో అనేక కోర్సులను ఐఐటిలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెడుతున్నారు. హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడటానికి మాంసాహారం తినటమే కారణమని హిమచల్ ప్రదేశ్‌లోని మండి ఐఐటి డైరెక్టర్ లక్ష్మీధర్ బెహరా సెలవిచ్చారు. ఇలాంటి అంశాలకు ప్రయోగశాలగా ఐఐటిని మార్చారు. భారతీయ విజ్ఞాన కేంద్రం (ఐకెఎస్) పేరుతో ఖరగ్‌పూర్ ఐఐటి అనేక అశాస్త్రీయ అంశాలను ప్రచురించింది. ఈ పేరుతో జ్యోతిష్యం వంటి వాటిని నూతన విద్యావిధానంలో చొప్పించేందుకు పూనుకున్నారు. డార్విన్ సిద్దాంతాన్ని సిలబస్‌నుంచి తొలగించారు. పురాతన కాలంలో అనేక ఇతర నాగరికతల మాదిరి మనదేశంలో కూడా శాస్త్రవిజ్ఞానం వర్ధిల్లిన మాట నిజం, దానికి అనేక దృష్టాంతాలున్నాయి. వాటిని చూపి నాడు లేనివాటిని కూడా ఉన్నాయని చెప్పటం జనాలను తప్పుదారి పట్టించటమే.పురాణాల్లో ఉన్న పుష్పక విమానాలను చూసే మన సంస్కృత గ్రంధాల్లో ఉన్న సమాచారాన్ని తస్కరించి నేటి విమానాలను పశ్చిమదేశాల్లో తయారు చేశారని చెబుతారు. ఆ గ్రంధాలు మన దగ్గర ఉన్నపుడు మనవారెందుకు చేయలేకపోయారంటే సమాధానం ఉండదు.ఈ పూర్వరంగంలో డోనాల్డ్ ట్రంప్ సైన్సు వ్యతిరేకచర్యలకు పాల్పడటం ఆశ్చర్యం కలిగించటం లేదు. అతగాడి విధానాలను కార్మికవర్గం ఎలా ప్రతిఘటిస్తున్నదో అదే విధంగా అమెరికా శాస్త్రవేత్తలు ప్రారంభించిన ఉద్యమం కూడా ముందుకు పోయి తగిన ప్రభావం చూపటం అనివార్యం. మనదేశంలో కూడా శాస్త్రవేత్తలు, పురోగామివాదులు ముందుకు వచ్చి అలాంటి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టకపోతే రానున్న తరాలు సైన్సు -జ్యోతిష్యాలలో దేన్ని నమ్మాలో తెలియని అయోమయానికి లోనవుతాయి !
