Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

వ్యవసాయంలో మొత్తం విలువ జోడింపు(గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌-జివిఏ) మార్చినెలతో ముగిసే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పెరుగుదల రేటు కేవలం 0.8శాతమే అని గతేడాది 10.4శాతం ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం తగ్గటమే అని చెబుతున్నారు. దేశమంతటా దాదాపు అన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు పడి పంటల ఉత్పత్తులు పెరిగినప్పటికీ జివిఏ తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. రైతాంగ ఆదాయాల రెట్టింపు, కనీస మద్దతు ధరల పెంపుదల, ఎగుమతి అవకాశాల కల్పన వంటి ఎన్నికబుర్లు చెప్పినా నరేంద్రమోడీ పాలనలో పరిస్థితి దిగజారింది.రైతాంగం మీద కక్షగట్టినట్లుగా అనుసరిస్తున్న విధానాల ఫలితంగా మొత్తంగా రైతుల ఆదాయాలు పడిపోయాయి, కనీస మద్దతు ధరల నిర్ణయమే లోపభూయిష్టమైతే ఈ ఏడాది ప్రతి పంటనూ అంతకంటే తక్కువ ధరలకే రైతులు అమ్ముకోవాల్సి వచ్చింది.వివిధ రంగాల జివిఏల తీరు తెన్నులు చూసినపుడు యుపిఏ పాలనలో 2011-12లో వ్యవసాయ రంగ వాటా 18.53 శాతం ఉండగా 2019-20 నుంచి 2023-24 మధ్య కాలంలో ఐదేండ్ల సగటు 18.57 శాతం ఉంది, తరువాత ఇంకా పడిపోయిందనే అంచనాలు వెలువడుతున్నాయి.మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత అన్నప్పటికీ ీ పారిశ్రామిక రంగ జివిఏ ఐదేండ్ల సగటు 27.56శాతం ఉంది, అదే 2011-12లో 32.5 శాతం ఉంది. సేవారంగంలో ఐదేండ్ల సగటు 53.85కాగా 2011-12లో 48.97శాతం ఉంది, ఒక్క సేవారంగంలో మాత్రమే పెరుగుదల ఉంది. అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించే వ్యవసాయ, పారిశ్రామిక రంగాల దిగజారుడు కారణంగానే ఏటా రెండు కోట్ల కొత్త ఉద్యోగాల గురించి మోడీ మౌనంగా ఉంటున్నారు.

2025 డిసెంబరు 26వరకు ఉన్న వ్యవసాయ మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం ప్రధాన పంటలైన మొక్కజొన్న,వేరుసెనగ, సోయా, పత్తి, కందులు, పెసలు, మినుముల వంటి వాటి ధరలు కనీస మద్దతు కంటే 5.30శాతం తక్కువ ఉన్నట్లు నమోదైంది.వివిధ పంటలకు కనీసంగా వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు రైతులు నష్టపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల రేటుతో పోలిస్తే వ్యవసాయ రంగం తక్కువగా ఉండటం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కొనసాగుతుండటానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల భారతీయ పరిశోధనా మండలి (ఐసిఆర్‌ఐఇఆర్‌) ఇటీవలి విధాన పత్రంలో పేర్కొన్న అంశాల ప్రకారం ఒక వ్యవసాయ కుటుంబ సగటు ఆర్జన 2012-13లో రు.6,426 ఉంటే 2024-25లో రు.19,696గా ఉంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరిస్తే నిజ పెరుగుదల రు.12,173గా తేలింది. దేశంలో 2014-15 నుంచి 2024-25 వరకు జిడిపి వార్షిక వృద్ధి రేటు ఆరుశాతంపైగా ఉండగా వ్యవసాయం 4శాతమే ఉంది. జనాభాలో 46శాతం మందికి జీవనాధారంగా ఉన్న ఈ రంగంలో ఇంత తక్కువ వృద్ధి సహజంగానే గ్రామీణ భారతంలో వినియోగ వృద్ధి మీద ప్రభావం చూపుతుంది. పట్టణ ప్రాంతాలు-గ్రామీణ ప్రాంతాల మధ్య వినియోగంలో తీవ్ర అంతరం ఉండగా గ్రామీణంలో వ్యవసాయ కుటుంబాల వినియోగం తక్కువగా ఉన్నట్లు వివిధ సర్వేలు వెల్లడించాయి. అనేక పథకాలతో ఉద్దరిస్తున్నామని చెప్పిన తరువాత కూడా ఉన్న పరిస్థితి ఇది.అవేవీ పారిశ్రామిక వస్తువులకు గిరాకీని పెంచలేకపోయాయి.

పంటల ద్వారా వచ్చే రాబడి కంటే పశుపోషణ ద్వారా ఎక్కువగా ఉన్నట్లు కూడా సర్వేలు చెబుతున్నాయి. అందుకే సాగు గిట్టుబాటు కావటం లేదంటూ అనేక మంది విముఖత చూపుతున్నారు, ఇతర జీవనోపాధివైపు మరలుతున్నారు. 2000 సంవత్సరంలో కేవలం నాలుగుశాతంగా ఉన్న పశుపోషణ రాబడి 2018-19 నాటికి 16శాతానికి పెరిగింది. పంటల రాబడి వాటా 40శాతం దిగువకు పడిపోయింది.ఉద్యానవన పంటల సాగు మెరుగ్గా ఉండటంతో సాగు భూమి పెరుగుతున్నది.వ్యవసాయం, అనుబంధ రంగాలపై కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల్లో కేవలం రెండుశాతమే ఉద్యానవన పంటలకు ఉంది. ఈ పంటల రైతాంగానికి అవసరమైన శీతల గిడ్డంగుల వంటి మౌలిక సదుపాయాలను కలిగిస్తేనే వారికి ఉపయోగం. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని కూడా ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు పూనుకున్నందున పెట్టుబడులను నిర్లక్ష్యం చేస్తున్నాయి.మౌలిక సదుపాయాలు, రోడ్లు,పంటల ప్రాసెసింగ్‌ సదుపాయాలు లేని కారణంగా టమాటా, ఉల్లి, పండ్లు, బంగాళాదుంపల వంటి ఉత్పత్తుల్లో ఐదోవంతు వృధా అవుతున్నాయి, ఆ మేరకు నష్టాలను రైతులే భరిస్తున్నారు. బీమా కూడా లేదు.

ప్రభుత్వ విధానాలు అటు వినియోగదారులు, ఇటు ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడేవిగా ఉండాలి.మొత్తంగా చూసినపుడు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు అనుసరిస్తున్న పద్దతుల మీద ఏకాభిప్రాయం లేదు. ఇదే సమయంలో తగ్గుదల రైతాంగాన్ని, యావత్‌ గ్రామీణ ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నది, వ్యవసాయదారులను ఫణంగా పెడుతున్నది. ప్రపంచంలో బియ్యాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న చైనా(14.5 కోట్ల టన్నులు)ను వెనక్కు నెట్టి మనదేశం(15 కోట్ల టన్నులు) ప్రధమ స్థానానికి చేరటం తమ ఘనతే అని కేంద్ర ప్రభుత్వం, అధికార బిజెపి స్వంతడబ్బా కొట్టుకుంటున్నాయి. రైతులకు దక్కిందేమిటన్నది ప్రశ్న. విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే కంపెనీలు కిలో రు.33కు అటూ ఇటూగా ధరల ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వార్తలు. నిజంగా కనీస మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తే ఈ ధర గిట్టుబాటు అవుతుందా ? ఎగుమతులకు గ్రేడ్‌ ఏ రకాలే ఉంటాయన్న సంగతి తెలిసిందే, వర్తమాన సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాలు కనీస మద్దతు ధర రు.2,389గా ఉంది. మరోవైపు వినియోగదారులు 45 నుంచి 55 రూపాయలకు కిలోబియ్యం కొంటున్నారు. అంటే అటు రైతులను ముంచి ఇటు వినియోగదారుల జేబులు కొట్టి విదేశాలకు చౌకగా బియ్యం ఎగుమతి చేస్తున్నాం.

పప్పు, నూనె గింజల్లో స్వయం పోషకత్వం సాధించాలని సంకల్పాలు చెప్పుకోవటం తప్ప తగిన ప్రోత్సాహం, అధిక దిగుబడి వంగడాల మీద పరిశోధనా లేదు. మూడు దశాబ్దాల క్రితం నామమాత్రంగా ఖాద్య తైలాలను దిగుమతి చేసుకోనే వారం, ఇప్పుడు 60 శాతం అవసరాలు విదేశాల నుంచే తీర్చుకుంటున్నాం. అదానీ వంటి దిగుమతి కంపెనీల లాభాలను కాపాడటానికే ఈ రంగంపై మోడీ సర్కార్‌ శ్రద్ద చూపటం లేదు. నూనెగింజల ఉత్పత్తి పెంచాలంటూ 2024లో జాతీయ పథకాన్ని ప్రారంభించారు, కళ్లు తెరవటానికి పదేండ్లు పట్టింది.మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియాల మాదిరే ఇది కూడా మారనుందా ? 2021 ఆగస్టులో ఖాద్య తైలాలు- పామాయిల్‌ ఉత్పత్తి పెంపు పథకాన్ని ప్రకటించి 2025-26 నాటికి అదనంగా పామాయిల్‌ 6.64లక్షల హెక్టార్ల సాగు చేయిస్తామని చెప్పారు, కానీ 1.89లక్షలే పెరిగింది, ఇదే కాలంలో ఆవనూనె సాగు, ఉత్పత్తి రెండూ తగ్గాయి. దీనికి కూడా జవహర్‌ లాల్‌ నెహ్రూ, కాంగ్రెస్‌ నేతలే కారణమని చెప్పినా నమ్మే జనాలున్నారు మరి ! మరోవైపు ముడి పామాయిల్‌ దిగుమతులపై పన్ను మొత్తాన్ని 20 నుంచి పది శాతానికి తగ్గించారు. కొనుగోలు శక్తి లేక తలసరి ఖాద్యతైల వినియోగం తక్కువగా ఉండబట్టి గానీ లేకుంటే దిగుమతులు మరింతగా పెరిగి ఉండేవి.

వేరుసెనగ దేశం మొత్తంలో మూడోవంతుకు పైగా గుజరాత్‌లో సాగు చేస్తారు. మొత్తం నూనె గింజల సాగులో మూడు దశాబ్దాల క్రితం 38శాతంగా ఉన్న వేరుశనగ ఇప్పుడు 28శాతానికి పడిపోయింది. పొద్దుతిరుగుడు ఆరు నుంచి 0.5శాతానికి దిగజారింది. సోయాబీన్‌, ఆవ నూనె సాగు పెరిగింది.వేరుశనగలో నూనె 48-50శాతం వరకు ఉంటుంది, అదే సోయాలో 18-20శాతమే, అందువలన సోయా పెరిగినా పెద్దగా ప్రయోజనం లేదు. ఆవు పేడ, మూత్రాల్లో ఏముందని పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యత రైతాంగానికి మేలు చేసే నూనె గింజల దిగుబడిని పెంచే రకాల అభివృద్ధి పట్ల లేదు. వేరుశనగ దిగుబడి హెక్టారుకు మన దేశంలో 2.08టన్నులు(2023) కాగా చైనాలో 3.98, అమెరికాలో 4.19 టన్నులు ఉంది. ఇటు ధరలు లేక అటు అధిక దిగుబడి వంగడాలు లేకుండా దేశం కోసం ధర్మం కోసం పాలన అంటే ప్రయోజనం ఏముంది ! గుజరాత్‌ వేరుశన సాగులో ఒక నిలకడ లేదు. గడచిన రెండు దశాబ్దాలలో అక్కడ కూడా వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి.ఎందుకు రైతులు వేరే పంటలకు వెళతారంటే వేరుశెనగ గిట్టుబాటు కాకపోవటమే. నిజానికి నరేంద్రమోడీకి గుజరాత్‌ రైతుల మీద అయినా శ్రద్ద, రైతాంగానికి గిట్టుబాటయ్యే చర్యలు తీసుకొని ఉంటే మొత్తంగా సాగు ఇంకా పెరిగి ఉండేది, దిగుమతుల భారాన్ని తగ్గించి ఉండేది, అధిక దిగుబడి వంగడాల అభివృద్ధి జరిగి ఉండేది. ఇటీవలి కాలంలో బిజెపి రెండింజన్ల పాలిత రాష్ట్రాలతో సహా అన్ని చోట్లా రైతాంగం యూరియా కొరతను ఎదుర్కొన్నది. దేశీయంగా ఉత్పత్తిని పెంచటంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా దిగుమతులు నిలిపివేయటమే దీనికి కారణం.పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వటంలో ఉన్న శ్రద్ద రైతాంగం మీద లేదు. ఇతర ఎరువుల ధరలు ఎక్కువగా ఉండటం, యూరియా సబ్సిడీకి లభిస్తుండటంతో రైతాంగం దాని మీద మొగ్గు చూపుతున్నారు, దానికి తోడు గతేడాది వర్షాలు బాగాపడటం కూడా డిమాండ్‌ను పెంచింది.

అంతర్గత పరిస్థితి ఇలా ఉంటే అమెరికా కత్తి మన రైతాంగం మీద వేలాడుతున్నది.2030 నాటికి ఇరుదేశాల వాణిజ్యాన్ని 128 బిలియన్‌ డాలర్ల నుంచి 500బి.డాలర్లకు తీసుకుపోతామని మన నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు గాను తమ దేశంలో వినియోగించని కోడికాళ్లు, మిగులుగా ఉన్న వెన్న, జున్ను వంటి పాడి ఉత్పత్తులను, సోయా, మొక్కజొన్నలు, పత్తి తదితర ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు అనుమతితో పాటు పన్ను భారాన్ని తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తున్నది.ఏటా 20 బిలియన్‌ డాలర్ల మేర అక్కడి రైతాంగానికి అమెరికా సబ్సిడీలు ఇస్తున్నది. షరతులను అంగీకరిస్తే ఆ వస్తువులన్నింటినీ మన దేశంలో కుమ్మరిస్తారు,మనకు వ్యవసాయం వాణిజ్యం కంటే జీవనాధారంగా ప్రాధాన్యత కలిగి ఉంది.అమెరికా వస్తువులకు మార్కెట్‌ను తెరిస్తే నరేంద్రమోడీతో పాటు బిజెపి రాజకీయ పతనానికి నాంది పలికినట్లే.ట్రంప్‌ను సంతుష్టీకరించటానికి సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు పత్తి దిగుమతి పన్ను రద్దు చేశారు. దాని ప్రభావం మన పత్తిమార్కెట్‌పై పడి కనీస మద్దతు ధరలకంటే తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మన దేశ వ్యవసాయ మార్కెట్‌ విలువ 452 బిలియన్‌ డాలర్లని, 2030నాటికి 563బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా,146 కోట్ల జనాభా ఉన్నందున మన మార్కెట్‌ ఎవరికైనా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ పూర్వరంగంలో కనీస మద్దతు ధరలను పెంచటంతో పాటు వాటికి చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్‌ సరైనదే అని తేలుతున్నది.ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం 2022జూలైలో ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటి వరకు 45 సార్లు సమావేశం జరపటం తప్ప చేసిందేమీ లేదు, దానికి ఎలాంటి వ్యవధి నిర్ణయించలేదు గనుక అలా సాగదీస్తూనే ఉంటారు. ఈలోగా రైతులు మరచిపోతారు.ఏడాది క్రితమే, 2024లో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించాలని సిఫార్సు చేసింది. అంతే కాదు పిఎం కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఏటా ఇప్పుడు ఇస్తున్న ఆరువేల రూపాయలను పన్నెండు వేలకు పెంచాలని కూడా చెప్పింది. అయినా మోడీ సర్కార్‌ ఏమీ తెలియనట్లుగా నటిస్తోంది. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.గ్రామీణ ఆదాయ పెరుగుదల 57.6, ఖర్చు పెరుగుదల 69.4శాతాల చొప్పున ఉంది.ఈ కారణంగా రుణ భారం పెరిగినందున రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలను మాఫీ చేయాలి.2016-17లో రుణ భారం ఉన్న గ్రామీణ కుటుంబాలు 47.4శాతం కాగా 2021-22 నాటికి 52శాతానికి చేరినట్లు నాబార్డు సర్వే తెలిపింది.వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు 2020-21లో 3.53శాతం ఉండగా 2024-25లో 2.54శాతానికి తగ్గాయి.వ్యవసాయ వృద్ధి రేటు 2023-24లో 1.4శాతానికి తగ్గింది, ఇది ఏడు సంవత్సరాల్లో కనిష్టం. రెండు ఎకరాలలోపు రైతాంగానికి విధిగా అందిరికీ పంటల బీమా చేయించాలి. వ్యవసాయ కార్మికులకు జాతీయ కమిషన్‌ ఏర్పాటు చేయాలి. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖగా ఉన్న పేరును వ్యవసాయం, రైతులు, వ్యవసాయ కార్మిక సంక్షేమ శాఖగా మార్చాలి. పంటల సేకరణ పరిమితంగానే ఉన్నందున కనీస మద్దతు ధరలను కేవలం ఆరుశాతం మంది రైతులు మాత్రమే 2021-22లో లబ్ది పొందినట్లు తేలింది.చట్టబద్ద హామీ ఉంటే ఎక్కువ మంది లబ్ది పొందుతారు. స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఎంఎస్‌పి నిర్ణయించాలి.బలహీనమైన మార్కెట్‌ సంబంధాలు ఉన్న రాష్ట్రాలలో రైతులు ఎంఎస్‌పి కంటే తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తే ప్రభుత్వం మీద భారం పెరుగుతుంది. మొత్తం 23 పంటలకు అమలు జరపాలంటే ఏడాదికి ఆరులక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడి కావాలి. కనీస మద్దతు ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, వినియోగదారులకు ధరలు పెరుగుతాయి. గోధుమలు, బియ్యానికి ఒక శాతం కనీస మద్దతు ధర పెంచితే చిల్లర ధరలు 0.22శాతం పెరుగుతాయి.రాష్ట్రాలలో ఉన్న పరిస్థితిని బట్టి ప్రత్యేక విధానాలను రూపొందించాలి.చట్టబద్దత కల్పిస్తే ప్రైవేటు వ్యాపారులు ఆధరలకు కొనేందుకు ముందుకు రారు, ప్రభుత్వమే కొనాల్సి ఉంటుంది. నీరు ఎక్కువగా అవసరయ్యే వరి, గోధుమ, చెరకు వంటి పంటల ధరలకు చట్టబద్దత కల్పిస్తే భూగర్భ జలాల వాడకం ఎక్కువ అవుతుంది, భూసారం దిగజారుతుంది. చట్టబద్దత కల్పించటం ప్రపంచవాణిజ్య సంస్థ నిబంధనకు విరుద్దం, మొత్తం వ్యవసాయ ఉత్పత్తి విలువలో పదిశాతానికి మించి సబ్సిడీలు ఇవ్వటానికి ఉండదు. బియ్యం ఎగుమతులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నీటి అవసరం తక్కువగా ఉండే పంటలను మద్దతు ధరలతో ప్రోత్సహించాలి. పార్లమెంటరీ కమిటీ చేసిన ఈ సిఫార్సులలో అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా ఉన్నాయి, కానీ ప్రతికూలంగా ఉన్న అంశాలను మాత్రమే పట్టించుకొని అనుకూలంగా ఉన్నవాటిని విస్మరించటం రైతాంగం మీద ఉన్న కక్ష, వివక్షగాక మరేమిటి ?