ఎం కోటేశ్వరరావు
ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. జగతిని నడిపించేది ధనమే. పూర్వకాలపు మన, ఇతర దేశాల తత్వవేత్తలు ప్రవచించినా ఆధునిక కాలంలో కమ్యూనిస్టు సిద్దాంతకర్తలు కారల్‌మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ చెప్పినా వాస్తవం అదే. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు మానవ సంబంధాలన్నీ ఆర్థికమైనవే అని కూడా కమ్యూనిస్టులు చెప్పారు. ఇద్దరూ చెప్పింది ఒకటే కదా మనవారు ఎన్నడో చెప్పారు, వామపక్ష వాదుల ప్రత్యేకత ఏమిటని ఎవరికైనా సందేహం వచ్చిందంటే వారి బుర్రపని చేస్తున్నదని అర్ధం. నిజమే, సర్వేజనా సుఖినో భవంతు, వసుధైక కుటుంబం అని లేదా ఇతర దేశాలలో తత్సమాన అర్ధంతో ఎవరు చెప్పినా వారంతా మంచి జరగాలని ఆకాంక్షించారు, సుబోధ చేశారు. కానీ విన్నవారు, పాటించినవారెవరూ లేరు, సుభాషితాలను దాటి అమలుకోసం ఎవరైనా ముందుకు పోతే విప్లవకారులంటూ అణచివేతలే అన్నది యావత్‌ప్రపంచ చరిత్ర. ఆ సారాన్ని గ్రహించిన మార్క్సిస్టు పెద్దలు చెప్పిందేమంటే మంచిమాటలతో సమాజం మారదు, మార్చేందుకు జనమే పూనుకోవాలి, వారిలో కూడా దోపిడీకి గురయ్యేవారే ముందుండాలి. అడ్డుకొనేవారు మామూలుగా వినకపోతే చివరికి బడితెలు పట్టుకొని మార్చటం తప్ప మరొక మార్గం లేదని కర్తవ్యబోధ చేశారు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇటీవలి కాలంలో సంపదల అసమానత విపరీతంగా పెరుగుతున్నదని, సంపదల పున:పంపిణీ జరగకపోతే సామాజిక సంక్షోభానికి దారితీస్తుందని అనేక మంది చెబుతున్నారు. అయితే ఈ మాటలు చెప్పేవారిలో సంపన్నుల బాగు కోరుకొనే వారే ఎక్కువగా ఉన్నారు. వారి ఉద్దేశ్యం ఏమిటంటే కొంత మంది దగ్గరే అపార సంపద పోగుపడితే మొదటికే మోసం వస్తుందన్నది వారి ఉద్దేశ్యం. అయితే నిజంగా మంచి కోరుకుంటున్నవారు లేరా అంటే ఉన్నారు.
2026 ప్రపంచ అసమానతల నివేదిక డిసెంబరులో విడుదలైంది.2018, 22 తరువాత ఇది మూడవది.ప్రపంచంలో, మనదేశంలో కూడా అసమానత తీవ్ర స్థాయిలో ఉందని హెచ్చరించింది. ఈ నివేదికను రూపొందించిన వారు ల్యూకాస్ ఛాన్సెల్, రికార్డో గోమెజ్ కరేరా, రొవాయిడా మోషిరిఫ్, థామస్ పికెటి. ఆ నివేదికకు మన దేశానికి చెందిన జయతి ఘోష్,జోసెఫ్ స్టిగ్లిజ్ ముందు మాటరాశారు. సంపాదకుల్లో చివరి వ్యక్తి ఫ్రెంచి ఆర్థికవేత్త థామస్ పికెటి గురించి తెలుగువారికి కొంతమేరకు తెలుసు,ఎందుకంటే ఆర్థిక అసమానతల గురించి ఆయన హెచ్చరించిన అంశాలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. అసమానతలు అంటే కేవలం సంపదకే పరిమితం కాదు, వాతావరణ, లింగపరమైన, అవకాశాలు అందరికీ అందుబాటులో లేకపోవటం, చివరికి ఎన్నికల కోసం నియోజకవర్గాల విభజనలో వివక్షతో సహా ఇతర అంశాలు ఉన్నాయి. ప్రపంచ అసమానతల సమాచార సంస్థకు అనుబంధంగా ఉన్న రెండువందల మందికి పైగా పరిశోధకులు అనేక కోణాల్లో చేసిన విశ్లేషణల సారమే ప్రపంచ అసమానతల నివేదిక. అన్ని అంశాలను ఇక్కడ సృజించటం సాధ్యం కాదు గనుక సంపదల పున:పంపిణీ గురించి చర్చిద్దాం.ప్రపంచాన్ని ” కమ్యూనిస్టు భూతం ” ఆవహించకుండా జనం దానివైపు మరలకుండా చూసేందుకు పెట్టుబడిదారీ ఆర్థిక, సామాజికవేత్తలు అనేక అంశాలను ముందుకు తెచ్చారు.వాటిలో ఊట సిద్దాంతం ఒకటి.
ప్రభుత్వాలు కేవలం పాలనకే పరిమితమై అన్ని రంగాలను ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకే అప్పగిస్తే వారు సృష్టించే సంపదల మూట నుంచి ఊట యావత్ సమాజానికి దిగుతుందన్నది ఊట సిద్దాంతం. దానికి సంస్కరణలు, నూతన ఆర్థిక విధానాల వంటి ముద్దుపేర్లు పెట్టారు, జనం కూడా నిజమే అని నమ్మారు, తమకూ సంపదల ఊట దిగుతుందేమోనని పోరాటాలు మాని ఆశతో చెంబులు పట్టుకు ఎదురు చూశారు, ధారలేమీ కారలేదు, కేవలం కొన్ని చుక్కలు మాత్రమే పడ్డాయి.దాంతో ఫలితం లేదని అసంతృప్తి చెందటం ప్రారంభించారు. సోషలిస్టు సమాజాలం కోసం జనం చూడకుండా కొన్ని తాయిలాలు అందించి సంతృప్తిపరచేందుకు ఐరోపాలో అనేక ప్రయోగాలు చేశారు. సంక్షేమ పథకాలు అమలు జరిపి సోషలిజంలో ఇంతకంటే పెద్దగా ఒరిగేదేమిటని జనాన్ని కొంతకాలం మభ్యపెట్టారు. ప్రధమ సోషలిస్టు రాజ్యం సోవియట్ యూనియన్ కూలిపోవటంతో కమ్యూనిజం, సోషలిజాలపై విజయం సాధించామని, ఆ ప్రయోగం విఫలమైందని ప్రచారం చేశారు. అంతేనా పోటీ లేకపోవటంతో అప్పటి వరకు అమలు జరిపిన అనేక సంక్షేమాలకు కోత పెట్టటం ప్రారంభించారు. అసమానతలు అప్పటి నుంచి మరింత పెరగటంతో జనాన్ని తప్పుదారి పట్టించేందుకు సంపదల పున:పంపిణీ అవసరమంటూ మరో పల్లవి అందుకున్నారు.సూత్రరీత్యా దీన్ని ఎవరూ వ్యతిరేకించరు, అయితే అది ఎలా అన్న అంశంమీదే తేడా వస్తున్నది. సంపదలు పంచినంత మాత్రాన వేగంగా దారిద్య్రం తగ్గుతుంది తప్ప ఆర్థిక వృద్ధి జరగదని, జనాలను సోమరులుగా మారుస్తాయని కొందరు చెబుతున్నారు. కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు ఈ మంచి సంస్కరణ అంశాన్ని ప్రచారం చేసి జనాన్ని సమీకరించేందుకు చూస్తున్నాయి. అసలేమీ లేనిదానికంటే ఏదో ఒకటి మంచిదే.అయితే భ్రమలు పెట్టుకోనవసరం లేదని చెప్పక తప్పదు.
అసమానతల గురించి తాజా నివేదకలో పేర్కొన్న అంశాలను క్లుప్తంగా చూద్దాం.మచ్చుకు ఒకటి, సబ్ సహారా ప్రాంతంలో ఒక బిడ్డ మీద పిపిపి పద్దతిలో 200యూరోలు ఖర్చు చేస్తుండగా ఐరోపాలో 7,400, ఉత్తర అమెరికా, ఓషియానా దేశాల్లో 9,000 యూరోలు వెచ్చిస్తున్నారు. ప్రపంచంలో 0.001శాతం అంటే అరవైవేల మందికంటే తక్కువ ఉన్న కోటీశ్వరులు దిగువన ఉన్న 50శాతం జనాభా మొత్తం సంపదల కంటే మూడు రెట్లు ఎక్కువ కలిగి ఉన్నారు. ప్రతి ఏటా ప్రపంచ జిడిపిలో ఒకశాతం ధనికదేశాలకు తరలుతున్నది.ఇది ప్రపంచ వృద్ధికి ఇస్తున్నట్లు చెబుతున్న సాయానికి మూడు రెట్లు ఎక్కువ. స్త్రీ, పురుష వేతన తేడా అన్ని చోట్లా ఉంది. గంటకు ఒక పురుషుడు పొందే వేతనంలో మహిళకు వస్తున్నది 61శాతమే, వేతన చెల్లింపులేని పనిగంటలను కూడా లెక్కిస్తే ఈ తేడా 32శాతానికి దిగజారుతుంది.
సంపదల పున:పంపిణీ ఎలా అన్నదాని మీద పూర్తి ఏకాభిప్రాయం ఉందా అంటే లేదు అని చెప్పవచ్చు, దోపిడీ విధానాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయకుండా తీసుకొనే ఏ చర్య అయినా అది ఉపశమనం తప్ప మరొకటి కాదు.లాటిన్ అమెరికా దేశాల్లో, దక్షిణాఫ్రికా, నేపాల్ వంటి చోట్ల పురోగామివాదులు, కమ్యూనిస్టులు ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చారు.దోపిడీ వర్గ పునాదిని దెబ్బతీయకుండా దాని మీదే కొన్ని సంస్కరణలు మాత్రమే అమలు చేయటంతో ఒకదశ దాటిన తరువాత కార్మికవర్గంలో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది.లాటిన్ అమెరికా దేశాల అనుభవం ఇదే.కొన్ని చోట్ల ఒకసారి గెలిచిన వామపక్ష శక్తులు తరువాత ఓడిపోవటానికి కారణాలు ఇవే. అసమానతలు ఎక్కువగా ఉంటే సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయి.ఈ కారణంగానే రాజకీయ పార్టీలు ప్రజాకర్షక నినాదాలు, చర్యలతో ముందుకు రావటం పెరిగింది. ఓట్ల కోసం అలాంటి చర్యలకు పాల్పడను, ఆ సంస్కృతికి దూరం అని కొండంత రాగం తీసిన నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి అదే చేస్తున్నది. అయితే ఇతర పార్టీలు చేస్తే జనాకర్షక పథకాలు, తాము చేసేవి సాధికారత కలిగించేవంటూ వంచనకు పాల్పడుతోంది. ఇవి దీర్ఘకాలంలో అభివృద్ధిని దెబ్బతీస్తాయని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆశ్రితులకు దేశ సంపదలను దోచిపెట్టి మరింతగా పెంచటమే గాక, సంపదలను సమంగా పంపిణీ చేయటాన్ని వ్యతిరేకించేవారే ఇలాంటి జనాకర్షక పథకాలను తీసుకువస్తారన్నది ఒక వాస్తవం. స్వాతంత్య్రం గురించి కన్న కలలు విఫలమై 1967లో కాంగ్రెస్ అనేక రాష్ట్రాలలో ఓడిపోవటం, తనకు పార్టీలో సవాలు ఎదురైనపుడు గరీబీ హటావో పేరుతో ఇందిరా గాంధీ వాటికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. అయితే మనవంటి సమాజాలాలలో అవి అవసరం. ఉదాహరణకు ఎన్‌టి రామారావు ప్రవేశపెట్టిన సబ్సిడీ బియ్యపు పధకం, వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లు ఏ విధంగా సాయపడుతున్నాయో చూస్తున్నాం. ఇతర నగదు బదిలీ పథకాలు కూడా అలాంటివే.నిజానికి ఆ మొత్తాలు వస్తు,సేవల కొనుగోళ్ల రూపంలో తిరిగి ఆర్థిక వ్యవస్థలోకే వస్తున్నాయి. అందువలన ఈ మొత్తాలను ఇంకా పెంచటం సంపద పంపిణీలో భాగంగానే పరిగణించవచ్చు.అభివృద్ధి రేటుకు తగిన విధంగా పేదల ఆదాయాలు పెరగకపోతే ఫలాలు ధనికులకే చేరుతున్నట్లు లెక్క.మనదేశంలో అదే జరుగుతున్నది, శతకోటీశ్వరులు మరింతగా పెరుగుతున్నారు.
ప్రపంచ అసమానతల సమాచార కేంద్ర వివరాల ప్రకారం దిగువ విధంగా మనదేశంలో అసమానత పెరిగింది.దీన్ని రెండుగా విభజించి చూడాలి.1990 దశకంలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టక ముందు, తరువాత సమాజంలోని మూడు తరగతుల సంపదలు ఎలా పెరిగాయో చూడవచ్చు.
సంవత్సరాలు××× దిగువ 50శాతం××ఎగువ 10శాతం××× ఎగువ ఒకశాతం
1961-1970×× 12.29 ×× 43.18 ××11.87
1971-1980×× 11.75 ×× 42.25 ×× 11.23
1981-1990×× 10.91 ×× 45.00 ×× 12.50
1991-2000×× 8.36 ×× 54.57 ××× 23.31
2001-2010×× 8.10 ×× 56.60 ××× 25.70
2010-2020×× 6.12 ×× 63.68 ××× 31.55
దీన్ని ముందే చెప్పుకున్నట్లుగా రెండు భాగాలుగా చేస్తే 1961 నుంచి 1990 వరకు సగటు దిగువ 50శాతం జనాభా వాటా 11.65శాతం కాగా ఎగువ పదిశాతం 43.47,ఎగువ ఒకశాతం 11.86శాతం కలిగి ఉన్నారు. ఇదే 1990 నుంచి 2020 వరకు వరుసగా 7.52-58.28-26.85శాతం ఉన్నారు. నూతన ఆర్ధిక విధానాలు అమలు జరిగిన మూడుదశాబ్దాలలో ఎగువ ఒకశాతం వాటా 226,పదిశాతం మంది వాటా 134శాతం పెరగ్గా దిగువ 50శాతం వాటా 63శాతం తగ్గింది. తాజా అంచనా ప్రకారం ఒకశాతం ధనికుల సంపద 40శాతానికి చేరింది.మంచి రోజులు తీసుకువస్తానని చెప్పిన నరేంద్రమోడీ సంస్కరణలను మరింత వేగంగా అమలు జరుపుతానని కూడా చెప్పారు. దాని ఫలితం ఏమిటో చూశాము. కార్పొరేట్ పన్ను గణనీయంగా తగ్గించిన కారణంగా ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖజానా కోల్పోతున్నది. పోనీ ఆ మేరకు ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తున్నాయా అంటే అదీ లేదు. పర్మనెంటు ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతున్నది.మన దేశ కార్పొరేట్ సంస్థలకు పన్ను తగ్గించిన కారణంగా వాటిలో పెట్టుబడులు పెడితే లాభసాటిగా ఉండటంతో విదేశీ కంపెనీ నేరుగా పరిశ్రమల స్థాపనకు బదులు ఉన్న కంపెనీల వాటాలను స్టాక్‌మార్కెట్‌లో కొనుగోలు, విక్రయాలు చేస్తూ లాభాలను తమ దేశాలకు తరలించుకుపోతున్నాయి.
ఆదాయాన్ని బట్టి పన్ను విధించి, ఆ మేరకు అల్పాదాయవర్గాలకు రాయితీల రూపంలో సంపదల పంపిణీ ఒక పద్దతి. లాటిన్ అమెరికాలోని బ్రెజిల్‌లో అసమానతలు, దారిద్య్ర నిర్మూలన పథకాల్లో భాగంగా షరతులతో కూడిన నగదు బదిలీ పథకాలను అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న అమ్మవడి, తల్లిదీవెన పథకాలు వాటికి నకలే. తమ బుర్రలో పుట్టినవే అని ఎవరైనా చెప్పుకుంటే బడాయి తప్ప మరొకటి కాదు. 2003లో వామపక్ష నేత లూలా డ సిల్వా అధికారానికి వచ్చినపుడు అంతకు ముందున్న కొన్ని పథకాల అనుభవాలను చూసి మరింత లబ్ది చేకూరేవిధంగా అల్పాదాయ వర్గాలకు ఈ పథకాన్ని అమలు చేశారు. పిల్లలను బడికి పంపటం, టీకాలు వేయించిన వారికి నగదు బదిలీ జరిగింది.దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు దీనికి అర్హులు. అంతర్జాతీయంగా అది ప్రశంసలు పొందింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది,సంపదల పంపిణీ వలన దారిద్య్ర తీవ్రత తగ్గుతుంది తప్ప అసమానత తొలగదు. గమనించాల్సిందేమంటే రెండు దశాబ్దాల తరువాత చూస్తే అసమానతలు ఎక్కువగా ఉన్న పది ప్రపంచ దేశాల్లో బ్రెజిల్ ఒకటిగా ఉంది.రెండు తెలుగు రాష్ట్రాలలో అమలు చేస్తున్న రైతు బంధు, భరోసా మరో పేరుతో అందచేస్తున్న నిధులు, పిఎం కిసాన్ మొత్తాలు కూడా సంపద పున:పంపిణీలో భాగమే. అయితే అవి వ్యవసాయ రంగ సంక్షోభాన్ని ఆర్చేవి తీర్చేవి కాదు.కనీస వేతనాల పెంపుదల కూడా సంపదల పంపిణీలో ఒక అంశమే. గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు, అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అవకాశాలను పెంచుతాయి. అందువలన సంపదల పంపిణీ గురించి మరింత నిర్దిష్టంగా మధనం జరగాల్సి ఉంది. తమ ప్రత్యేక లక్షణాలతో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించిన చైనాలో కూడా ఆర్థిక అసమానతలు ఉన్నాయి, అయితే వాటిని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది.
ఈ నివేదిక ప్రకారం సమాజంలో ప్రపంచంలో ఎగువన ఉన్న పదిశాతం మంది వద్ద సంపద 58శాతం ఉంది (2022లో 57శాతం) దిగువన ఉన్న 50శాతం మందికి 15శాతం(2022లో 13శాతం). ఇంతకు ముందు పట్టికలో సంపదల పెరుగుదల రేటు చూశాము, ఉన్న సంపదల మొత్తం వేరు,పెరుగుదల రేటు వేరు. భారత్ మరియు చైనా గురించి చెప్పిందేమంటే ప్రపంచ మధ్యతరగతిలోకి చైనా జనాభా ఎక్కువ మంది చేరారని, అదే భారత్‌లో 1980లో మధ్య తరగతిలో ఉన్న 40శాతంలో ఎక్కువ మంది ఇప్పుడు దిగువ 50శాతంలోకి దిగజారినట్లు పేర్కొన్నది. కార్పొరేట్లకు పన్ను తగ్గించిన కారణంగా సంపదలు పోగుపడటం ఒకటైతే రాష్ట్రాలకు రావాల్సిన పన్నురాబడి తగ్గుతున్నది, అది సంక్షేమ పథకాల మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ఉదాహరణకు వెనుకబడిన తరగతుల వారికి 50 ఏండ్లకే పెన్షన్ ఇస్తామని చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ మాదిరి సామాజిక పెన్షన్లు నాలుగువేలకు పెంచుతామని చెప్పిన తెలంగాణా కాంగ్రెస్ వాగ్దానం అమలుకు నిధులు లేవు, బిజెపి పాలిత రాష్ట్రాలలో పరిస్థితి మరీ అధ్వానం, వారికి అసలు ఆ ఉద్దేశ్యమే లేదు అని వేరే చెప్పనవసరం లేదు. యుపిఏ ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన పెన్షన్ మొత్తాలనే మోడీ సర్కార్ ఇప్పటికీ అందిస్తున్నది తప్ప పైసా పెంచలేదు. దాని మానవత్వ ముఖం అలా ఉంది. అందువలన మరో విధంగా చెప్పాలంటే సంపదల పున:పంపిణీని దెబ్బతీస్తున్నది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ రూపొందించిన ఆర్థిక చట్రంలోనే మన పాలకులు విధానాలను రూపొందిస్తున్నారు. అందుకే గొర్రె తోక మాదిరి జనజీవితాలు పెద్దగా పెరగటం లేదు. సంపదల పున:పంపిణీ నినాదం సంస్కరణ మాదిరి ఉన్నప్పటికీ అది కూడా వర్గపోరాట ప్రాధమిక రూపమే అని చెప్పవచ్చు. ఈ మాత్రపు సంస్కరణనే వ్యతిరేకించేవారు, సంపదలను సమాజపరం చేస్తే ఊరుకుంటారా ? దేశంలో కార్పొరేట్లు, ధనికుల పెత్తనం ఉన్నందున వారి మీద పన్ను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దానికి విరుద్దంగా పన్ను మొత్తాలను పెంచి పేదలకు పంచాలని ఇతరులు కోరుతున్నారు. పన్నులు పెంచుకుంటూ పోతే ఎగువన ఉన్నవారు కుప్పకూలుతారని వారి సమర్ధకులు అంటే పెంచకపోతే మరింతగా దిగజారతామని దిగువన ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు.ఈ వైరుధ్యం మరింత ముదిరితే విప్లవానికే దారితీస్తుంది.ప్రస్తుతం మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు.
‘ చెడుగా మారేంత వరకు అసమానత మౌనంగానే ఉంటుంది.ఈ నివేదిక అసమానతకు మరియు నేటి అసమాన సామాజిక, ఆర్థిక నిర్మాణాలతో అవకాశాల నిరాకరణకు గురైన వందల కోట్ల మందికి గళాన్ని ఇస్తుంది” అని ప్రపంచ అసమానతల నివేదిక సంపాదకుల్లో ఒకరైన రికార్డో గోమెజ్ కరేరా వ్యాఖ్యానించాడు. ముందుమాట రాసిన వారిలో ఒకరైన జోసెఫ్ స్టిగ్లిజ్ ఇలా చెప్పారు.” నేటి విపరీత అసమానత అనివార్యమైనదేమీ కాదని చరిత్ర, అన్ని దేశాల అనుభవాలు, సిద్దాంతం కూడా చెబుతున్నది.పురోగామి పన్ను విధానం( సంపద పెరిగే కొద్దీ పన్నుల పెంపు), పెద్దమొత్తంలో సామాజిక పెట్టుబడి,న్యాయమైన కార్మిక ప్రమాణాలు, ప్రజాస్వామిక వ్యవస్థలు గతంలో తేడాలను తగ్గించాయి. ఇదే మరోసారి చేయగలవు ” సంపదల పున:పంపిణీ జరగాలని కోరుకొనే వారు ప్రచారానికి మాత్రమే పరిమితం కారాదు, కార్యాచరణకూ పూనుకోవాలి !హొ
