Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

కేవలం విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటనతో సరిపెడదామని చూసిన పాలక కూటమి యత్నంతో సోమవారం నాడు పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. పశ్చిమాసియాలో పరిస్థితి గురించి ప్రకటన కాదు, చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. గల్ఫ్‌లో చిక్కుకు పోయిన భారతీయుల గురించి ఆందోళన చెందుతున్నట్లు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి మంత్రి చెప్పారు.యుద్ధం, దాని పర్యవసానాల గురించి కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో చర్చించాలని ప్రతిపక్షం పట్టుబట్టటంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే సమావేశాలు వాయిదా పడ్డాయి, పశ్చిమాసియా పరిస్థితి గురించి ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ స్థానం అనుమతించలేదు. యుద్ధాలు, ప్రపంచాన్ని కుదిపివేసే ఇతర సంక్షోభాలు అప్పటి వరకు ఉదాసీనంగా ఉన్నవారిలో, కొందరు నేతల మీద ఉన్న భ్రమలు పటాపంచలు అవుతాయి, అయితే కొందరు వాటిని బహిరంగంగా అంగీకరించటానికి ముందుకు రారు. ఫర్లేదు, ఒకసారి బుర్ర ఆలోచించటం ప్రారంభించిన తరువాత ఎంతకాలం బిడియపడతారు ! ఎన్‌డిఏ ప్రభుత్వం, నరేంద్రమోడీ అనుసరించే లొంగుబాటు విధానాల గురించి వామపక్షాలు, ఇతర పార్టీలు ఎంతగా మొత్తుకున్నా చెవికి ఎక్కని వారికి గూబగుయ్యి మనిపించేలా వినిపించినందుకు నిజంగా డోనాల్డ్‌ ట్రంప్‌కు ” అభినందనలు ” చెప్పక తప్పదు.ప్రతి తరంలోనూ ఒక మహానుభావుడు అవతరిస్తాడు మరి ! జీవ పరిణామ క్రమంలో కొన్ని జీవుల మెదళ్లు ఎదగలేదు, మనుషుల్లో కూడా అలాంటి వారు ఉంటే వారి పట్ల జాలి చూపుదాం !!

నెల రోజుల పాటు రష్యన్‌ ముడిచమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు అనుమతి ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించగానే నరేంద్రమోడీ భక్తి మైకంలో ఉన్నవారికి చెర్నాకోల దెబ్బలా తగిలి మత్తువదిలింది. ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు అన్న శ్రీశ్రీ పాట చాలా మందికి డోనాల్డ్‌ ట్రంప్‌ను గుర్తుకు తెచ్చింది. అది కూడా కొత్తగా రష్యాలో కొనుగోలు చేసేందుకు కాదు. అమెరికా ఆంక్షల కారణంగా రష్యన్‌ రేవుల నుంచి బయలుదేరి, ఏ దేశానికి వెళ్లాలో తెలియక సముద్రంలో లంగరు వేసిన చమురు టాంకర్లలో ఉన్న సరకు మాత్రమే కొనుగోలు చేసుకోవాలి.ఈ ఉదంతాన్ని చూస్తే బందీగా ఉన్న బానిసకు రెండు నిమిషాల్లో కాలకృత్యాలు తీర్చుకురా అన్న యజమాని ఉదారత్వం కనిపించింది. ఇంతకీ మనం అసలైన దేశభక్తులం అని చెప్పుకొనే కాషాయదళాల పాలనలో ఉన్న స్వేచ్చా జీవులమా, అమెరికా యజమానులకు బానిసలమా ? ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే ! యావత్‌ దేశంలో ఆత్మగౌరవం గలవారందరూ అమెరికా ప్రకటనపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే బిజెపి మాత్రం నరేంద్రమోడీ దౌత్య విజయం అంటూ భజన చేస్తున్నది. మొత్తం మీద ఈ పరిణామం ఆ పార్టీ నిజస్వరూపాన్ని వెల్లడించింది. నిజంగా విజయమే అయితే 30 రోజులే గడువు ఎందుకు ? నీ ఆంక్షలను మేము ఖాతరు చేయం, ఇప్పటి వరకు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురు ఇది, ముందు ముందు కూడా కొనసాగిస్తాం అని మోడీ సర్కార్‌ ఎందుకు చెప్పలేకపోయింది ? మధ్యలో రష్యా నుంచి దిగుమతులను ఎందుకు తగ్గించినట్లు ? పిల్లి పాలుతాగుతూ తనను ఎవరూ చూడలేదు అనుకుంటుందట. అమెరికా బెదిరింపులకు లొంగి మాస్కో నుంచి దిగుమతులు ఎలా తగ్గించారో లోకం కోడై కూస్తున్నది.చైనా అలా తగ్గించినట్లు వార్తలు లేవు. మన ఛాతీ 56 నుంచి 6 అంగుళాలకు తగ్గిపోయిందా ! ఇంతా చేసి ఇంటా బయటా పరువుపోయినా భారత్‌ సాధించింది కేవలం 30రోజుల పాటు దిగుమతులకు అనుమతా, సిగ్గుచేటు !ఈ చమురు గురించి మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ప్రామాణిక బ్రెంట్‌ రకం ముడి చమురు ధర కంటే నాలుగైదు డాలర్లు ఎక్కువగా ఉంటుందట, గతంలో రష్యా మనకు ఇచ్చిన 13 డాలర్ల రాయితీ పోయి ఇది అదనం. అవసరం మనదైపుడు వ్యాపారులు కొండెక్కుతారని తెలిసిందే.

నియంత జూలియస్‌ సీజర్‌ చరిత్రలో అతగాడి నమ్మినబంటు బ్రూటస్‌ వెన్నుపోటు పొడుస్తాడు, అప్పుడు బ్రూటస్‌ నువ్వు కూడానా ( యూ టూ బ్రూటస్‌) అంటాడు సీజర్‌.ఇది ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే అధికారమే పరమావధిగా ఉన్నవారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ముఖ్యంగా పరీక్షా సమయం వచ్చినపుడు అసలు రంగు బయటపడుతుంది. బ్రిక్స్‌ కూటమిలో స్థాపక సభ్యులైన బ్రెజిల్‌,రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు ఇరాన్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇండోనేషియా, ఈజిప్టు,ఇథియోపియా ఉన్నాయి.ఒక సభ్యురాలైన ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు జరుపుతున్నాయి, వాటిని ఇరాన్‌ ప్రతిఘటిస్తున్నది.ఈ క్రమంలో కూటమిలోని సౌదీ అరేబియా,యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్న అమెరికా సైనిక కేంద్రాలు, ఎంబసీల మీద ఇరాన్‌ దాడులు చేస్తున్నది.ఈ పరిణామంపై కూటమికి ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో నాయకత్వం వహిస్తున్న భారత్‌ నోరుమెదపలేదు. ఇది మన గురించి ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇస్తున్నది ? గతేడాది ఇదే అమెరికా, ఇజ్రాయెల్‌ పన్నెండు రోజుల పాటు ఇరాన్‌పై దాడులు చేసినపుడు బ్రిక్స్‌ అధ్యక్ష స్థానంలో ఉన్న బ్రెజిల్‌ వెంటనే ఆ చర్య అంతర్జాతీయ న్యాయాన్ని ఉల్లంఘించటమే అని ఖండించింది. అప్పుడు అది తన ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. గత డిసెంబరు నుంచి భారత్‌ అధ్యక్ష స్థానంలోకి వచ్చింది. కూటమి కంటే తన ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నదని, అమెరికా-ఇజ్రాయెల్‌కు దగ్గర ఉన్నట్లు సంకేతాలు పంపినట్లు అల్‌ జజీరా పత్రిక, సండే గార్డియన్‌ వ్యాఖ్యానించాయి. సరిగ్డా యుద్ధ ప్రారంభానికి ముందు నరేంద్రమోడి ఇజ్రాయెల్‌ పర్యటన, ఇతర అంశాల గురించి పేర్కొన్నాయి. పారిశ్రామిక దేశాలతో కూడిన జి 7 కూటమికి ప్రత్యామ్నాయంగా పేద దేశాల ప్రయోజనాల కోసం ఏర్పడిందే బ్రిక్స్‌, దాని అజెండాల్లో ఇప్పుడు సభ్య దేశాల భద్రత అంశం కూడా ఉంది. అందువలన ఇరాన్‌ భద్రతకు ముప్పు తెచ్చిన వారి గురించి మౌనంగా ఉంటే కుదరదు, మనకు మన ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోవాలి. బ్రిక్స్‌ అమెరికా వ్యతిరేక కూటమి అని ట్రంప్‌ ఆరోపించాడు. సభ్య దేశాల సంగతి తేలుస్తాం అని మాట్లాడాడు. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన మిలిటరీ విన్యాసాలకు భారత్‌ దూరంగా ఉంది.అమెరికాకు ఆగ్రహం కలిగించే చర్యలేవీ చేపట్టబోమని చెప్పకనే చెప్పింది. విశాఖపట్టణంలో మనదేశం మిలన్‌ 2026 విన్యాసాల్లో ఇరాన్‌ పాల్గొనగా అమెరికా మొఖం చాటేసింది.

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని ధర్మంగా చెప్పాలి అన్న లోకోక్తులు తెలిసిందే. అమెరికాతో అన్ని దేశాలూ వాణిజ్యం చేస్తున్నాయి, అయినా ఒక పరిణామం జరిగినపుడు వాటి గురించి పట్టించుకోకుండా స్పందిస్తున్నాయి. అమెరికా దాడులను ఒక్క మనదేశం తప్ప బ్రిక్స్‌ స్థాపకసభ్యులైన నాలుగు దేశాలూ విడివిగా ఖండించాయి. మూడు రోజులు ఆలశ్యంగా ఈ ఉన్మాదానికి స్వస్థి పలకాలని దక్షిణాఫ్రికా స్పందించింది. ముందుగా పాలక ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఖండిస్తూ ఒక ప్రకటన చేసింది. అవసరమైతే మధ్యవర్తి పాత్రపోషిస్తామని కూడా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా ప్రకటించాడు. ఇదే దక్షిణాఫ్రికా జనవరి నెలలో నిర్వహించిన బ్రిక్స్‌ నౌకాదళ విన్యాసాలలో ఇరాన్‌ భాగస్వామిగా ఉండటానికి అంగీకరించినందుకు దక్షిణాఫ్రికాపై ట్రంప్‌ తీవ్రంగా విమర్శించాడు. తొలి దాడి, ఖమేనీ హత్య జరిగిన మూడు రోజుల తరువాత భారత విదేశాంగశాఖ ఒక ప్రకటన చేస్తూ చర్చలు, దౌత్యాన్ని కోరుతున్నామని, వివాదం త్వరగా ముగియాలని పేర్కొన్నది. ఇరాన్‌ నేతలతో ఎలాంటి మాటలు లేకపోగా దాని పేరు ఎత్తకుండా గల్ఫ్‌ దేశాల నేతలతో మాట్లాడుతూ వాటి భూభాగాలపై జరుగుతున్న దాడులను నరేంద్రమోడీ విమర్శించారు. గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండ, వెస్ట్‌బాంక్‌ ప్రాంతంలో పాలస్తీనియన్లపై కొనసాగుతున్న మారణకాండను ప్రపంచ దేశాలు ఖండిస్తుండగా ఫిబ్రవరి 25,25 తేదీలలో పర్యటన జరిపి పార్లమెంట్‌ నెసెట్‌లో మాట్లాడుతూ వర్తమానంలో, తరువాత కూడా తాము ఇజ్రాయెల్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు.హమస్‌ దాడులను ఖండించారు గానీ వారిని అణచేపేరుతో గాజాలో టెల్‌అవీవ్‌ జరిపిన మారణకాండ గురించి పల్లెత్తుమాట అనలేదు. గాజాలో యుద్ద నేరాల కేసులో తమ ముందు హాజరు కావాలని అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు కోరిన నెతన్యాహును ఆలింగనాలు చేసుకున్నారు. రెండు దేశాల సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని కూడా మోడీ చెప్పారు. ఆ మాటలు చెబుతున్న సమాయానికే అమెరికా, ఇజ్రాయెల్‌ అన్ని యుద్ధ సన్నాహాలు చేసుకున్నాయి.ఒక రోజు తేడాతో దాడులను ప్రారంభించాయంటే మోడీకి ఆ విషయం తెలియకుండా ఎలా ఉంటుందని విమర్శకులు అంటున్నారు. నిజంగా తెలియదంటే మన వేగుల వ్యవస్థ ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించాల్సి ఉంటుంది. తెలుసు అంటే ఎరుకలో ఉండి కూడా మోడీ వెళ్లారంటే ఇజ్రాయెల్‌కు సమర్ధనే అన్నది స్పష్టం. దీని గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. గల్ఫ్‌లో ఉన్న భారతీయుల గురించే మా తపన అని జైశంకర్‌ చెప్పారు. ఇరాన్‌లో కూడా ఉన్నారుగా, అయినా తమ మీద దాడి చేస్తే ఎక్కడ అమెరికా మిలిటరీ స్థావరాలు ఉన్నా వాటి మీద దాడి చేస్తామని ముందే ఇరాన్‌ ప్రకటించింది. దాని అర్ధం తెలియనంత అమాయకంగా కేంద్ర ప్రభుత్వం ఉందని నమ్మటానికి ఎవరూ చెవుల్లో పూలు పెట్టుకొని లేరు. గతంలో ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన భారతీయులను తీసుకు వచ్చేందుకు తన పలుకుబడిని ఉపయోగించి యుద్ధాన్ని కొద్ది రోజులు ఆపారని మోడీ గురించి పెద్ద ప్రచారం చేశారు కదా, ఆ పని ఇప్పుడెందుకు చేయలేదు ?

పశ్చిమాసియా సంక్షోభ సమయంలో భ్రమల్లో ఉన్న అనేక మంది భారతీయులను మరో అంశంలో కూడా అమెరికా కళ్లు తెరిపించింది. మన స్వేచ్చా మీడియా దాని గురించి పెద్దగా వార్తలు ఇవ్వటానికి చర్చిందేందుకు భయపడింది. తమను దెబ్బతీసేందుకు భారత్‌ను అనుమతించనివ్వం, ఇరవై ఏండ్ల క్రితం చైనా వ్యవహారంలో చేసిన తప్పిదాన్ని పునరావృతం కానివ్వం, ఇది భారత్‌కు అర్ధమైంది, మాకు పోటీగా మరొక అర్ధిక వ్యవస్థ ఎదగటం మా పౌరుల ప్రయోజనాలకు విరుద్దం అని న్యూఢిల్లీ గడ్డమీద రైసినా 2026 చర్చల్లో అమెరికా విదేశాంగశాఖ ఉపమంత్రి క్రిస్టోఫర్‌ లాండవ్‌ తెగేసి చెప్పినా మనం గొణగటం తప్ప గట్టిగా మాట్లాడలేకపోయాం. దీని అర్ధం ఏమిటి ? గత పన్నెండు సంవత్సరాలుగా చైనాను పక్కకు నెట్టి మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా పథకాలతో భారత్‌ను ప్రపంచ ఫ్యాక్టరీగా మారుస్తాని మోడీ అండ్‌కో చెబుతున్నది.దానికి మేం అనుమతించం అని అమెరికా చెప్పింది. అంతే కాదు భారత్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం కూడా తొలుత తమ ప్రయోజనాలకే పెద్ద పీటవేసిందని కూడా క్రిస్టోఫర్‌ ఎలాంటి శషభిషలు లేకుండా చెప్పాడు. ముందే చెప్పినట్లుగా సంచలనాత్మక పరిణామాలు జరిగినపుడు జనంలో అనేక ఆలోచనలకు నాంది పడుతుంది. భారత్‌ను విశ్వగురువుగా మారుస్తానని చెప్పిన నరేంద్రమోడీ అమెరికా తోకగా మారుస్తున్నారని పశ్చిమాసియా సంక్షోభం వెల్లడించింది. గతంలో వామపక్షాలు, ఇతర పార్టీలు, ఎందరో మేథావులు చెప్పినా పట్టించుకోని వారు ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీరుతో ఆలోచించకతప్పటం లేదు !